జవాబులు – కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చడం నెహ్రూ ఘోర తప్పిదం. ఇందిర పేరు చెప్పినా నిర్ణయం ప్రధానిగా అతనిదే. 2) ఈ సీరీస్ 1977 ఎన్నికల ఫలితాలతో ముగుస్తుంది. అందువలన పదవులు వచ్చాక జనతా పార్టీ నాయకులు జెపి మార్గదర్శకత్వాన్ని, నాయకత్వాన్ని ఎలా తీసిపారేశారో, ఏ అనుయాయి కనబడక, ఏ నాయకుడూ తొంగి చూడక మరణానికి ముందు ఆయన నిరాశలో ఎలా మునిగాడో – అవేమీ ప్రస్తావించలేను. విడిగా చదువుకో ప్రార్థన. జెపి ఉద్యమం ప్రధానంగా బిహార్ ఉద్యమమే నంటూ అది కూడా ఎంత పరిమితంగా సాగిందో గణాంకాలతో సహా యిస్తున్నాను కాబట్టి రెండూ కలిపి చదివి ఎవరికి వారే ఆయన లీడర్‌షిప్ క్వాలిటీస్‌ను అంచనా వేసుకోవచ్చు.
1974 ఏప్రిల్‌లో ప్రారంభమైన జెపి ఉద్యమం ఆర్నెల్లలో అక్టోబరు నాటికి చల్లబడిపోయింది. ఇందిరను తొలగించడం మాట అలా వుంచి, కనీసం బిహార్ ముఖ్యమంత్రిని కూడా కదల్చలేకపోయారు. సమాజంలో అనేక వర్గాలు ఉద్యమానికి దూరంగా వుండిపోయాయి. ఆ దశలో జెపి అంటే వ్యక్తిగతంగా గౌరవం వున్న కొందరు ప్రముఖులు ఆయన పరువు కాపాడడానికి సమకట్టారు. జెపి సర్వోదయ నాయకుడు. సర్వోదయలో ఆయన కంటె పై స్థానంలో వున్న వినోబా భావే జెపి ఉద్యమం మొదలుపెట్టగానే 'నువ్వు రాజకీయపరమైన డిమాండ్లు చేస్తున్నావు. ఇది సర్వోదయ స్ఫూర్తికి విరుద్ధం.' అని వారించాడు. వినోబాకు ఇందిర అంటే మమకారం వుంది. ఎమర్జన్సీ విధించినప్పుడు ఆయన 'ఇది అనుశాసనపర్వం' అని వ్యాఖ్యానించి దాన్ని సమర్థించాడు. ఇందిర ఆ సూక్తిని విపరీతంగా ప్రచారం చేయించింది. ఇందిరను తొలగించి అరాచకం సృష్టించడాన్ని వినోబా వ్యతిరేకించారు. సర్వోదయలో కొందరు జెపి మార్గం మంచిదేనన్నారు. అవసరమైనప్పుడు రాజకీయాల బాట పట్టినా తప్పులేదని వాదించారు. దీనిపై చర్చలు జరిగి చివరకు సర్వోదయ కార్యకర్తలకు స్వేచ్ఛ యిచ్చారు – కావాలంటే జెపి మార్గం పట్టవచ్చు అని. జెపి వుద్యమం చివరకు ప్రతిపక్షాల ఉద్యమంగా మారిపోయాక సర్వోదయ వాళ్లు వెనకబడ్డారు. జెపి వెనక నడిచిన ప్రతిపక్షాలు ఏదో ఒక రూపంలో కొంతకాలం బతికాయి కానీ, సర్వోదయ ఉద్యమం మాత్రం సంపూర్ణ క్రాంతి పుణ్యమాని కనుమరుగై పోయింది.
జెపి కొన్ని దశాబ్దాల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవడం చేత స్వాతంత్య్రానంతరం నాయకుల్లో వచ్చిన మార్పును గమనించ లేకపోయారు. మనుషులను అంచనా వేయలేకపోయారు. తన వద్దకు వచ్చి ఆహాఓహో అనేవాళ్లను చూసి వాళ్లకు సర్టిఫికెట్లు యిచ్చేసి, వీళ్లందరూ తన వెంట వుండగా తను సాధించలేనిది ఏముంది అనే వూహల్లో తేలారు. తను పిలుపు యిస్తే కాంగ్రెసు పార్టీ చీలిపోతుందని ఆశపడ్డారు. ఇందిరకు అండగా నిలిచిన జగ్జీవన్ రామ్, వైబి చవాన్ వంటి సీనియర్లకు ఎన్నోసార్లు బహిరంగంగా పిలుపు యిచ్చారు – ఫాసిస్టు ఇందిరను వదిలి బయటకు వచ్చి దేశాన్ని కాపాడండి అని. వాళ్లు, వాళ్ల అనుయాయులు బయటకు వచ్చేస్తే కాంగ్రెసు రెండుగా విడిపోయి ఇందిర సర్కారు కూలిపోతుందని, అప్పుడు తన మార్గదర్శనంలో జాతీయ ప్రభుత్వం ఏర్పడుతుందని విశ్వసించారు. అలాటిది ఏదీ జరగకపోవడంతో ఆయనకు ఏం చేయాలో పాలుపోలేదు. కాంగ్రెసులోంచి ఎవరూ బయటకు రాలేదు. ఆయనను బయటకు పడేయడానికి ఆయనంటే గౌరవం వున్న కొందరు కాంగ్రెసు నాయకులు ఇందిర, ఆయన కలిసి మాట్లాడుకుంటే సమస్యలు తీరిపోతాయి అనసాగారు.
నవంబరు మధ్యలో నరోడాలో జరిగిన మూడు రోజుల ఎఐసిసి క్యాంపులో యిలాటి సూచన వచ్చినపుడు ఇందిర మాట్లాడుతూ ''ఏం చర్చలు జరపాలి? ప్రజాస్వామ్యాన్ని ఎలా నాశనం చేయాలి అనా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను బంద్‌లు చేసి ఎలా కూల్చాలి అనా? దానిపై చర్చ చేపట్టగలమా? ఇంకో పాయింటేమిటి – ''ఇందిరా గాంధీని గద్దె దింపాలి''! అలాటి చర్చలో నేనెలా పాలు పంచుకుంటాను? ఇది కాక మూడో పాయింటు ఆయన వద్ద వుందా చెప్పమనండి.'' అని విరుచుకుపడింది. ''గుజరాత్‌లో అసెంబ్లీ రద్దు చేసి యిప్పటికే పొరపాటు చేశాను. ఇప్పుడు బిహార్ అసెంబ్లీని రద్దు చేయమంటున్నారు. ఎన్నికలలో ఓడిపోయినవారందరూ యిలా డిమాండ్లు చేస్తూ పోతే యిక ఎన్నికలెందుకు? ప్రజాభిప్రాయం మాకు వ్యతిరేకంగా మారిందంటున్నారు. అది నిరూపించాల్సింది సార్వత్రిక ఎన్నికలలో. వచ్చే ఎన్నికలు 1976 ఫిబ్రవరిలో! అప్పటిదాకా ఆగమనండి. తమ తడాఖా చూపించమనండి.'' అని ఛాలెంజ్ చేసింది.
జెపి యీ ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఎందుకంటే నవంబరు నాటికి బిహారులో విద్యార్థులు కూడా ఉద్యమం నుంచి తప్పుకున్నారు. ఏం చేయాలో, ఎటు కదలాలో తెలియని పరిస్థితి వుంది. అందువలన దేశం మొత్తం మీద ఎన్నికలు వచ్చినపుడు అంటే చాలా టైముంది. ఇప్పణ్నుంచి ప్రతిపక్షాలను ఐక్యం చేసే ప్రయత్నాల్లో మునిగి తేలవచ్చు. అందువలన నవంబరు 18న పట్నాలో జరిగిన సభలో ''ఇప్పుడు ఉద్యమం మలిదశలోకి వచ్చింది. మేం తొందరపడటం లేదు. వచ్చే ఎన్నికలలోనే మా సత్తా చాటుతాం. ఉద్యమాన్ని సమర్థించే వారి మధ్య, వ్యతిరేకించేవారి మధ్య జరిగే పోటీలో నేను అభ్యర్థిగా నిలబడను. నాయకుడిగానే వుంటాను!'' అని ప్రకటించారు. ఇక అప్పణ్నుంచి సమాజ పునర్నిర్మాణం, గ్రామవికాసం, యువత భాగస్వామ్యం వంటి పెద్ద మాటలు పోయాయి. సంపూర్ణ విప్లవం అసంపూర్ణం అయిపోయి కాంగ్రెసును ఓడించడం అనే ఏకైక లక్ష్యం మిగిలింది. అయితే తాము నెగ్గితే పార్టీలకు వచ్చిన ఓట్ల శాతానికి అనుగుణంగా సీట్లు యిస్తామనే వాగ్దానం చేశారు. ఈ మాట నా చిన్నప్పటినుంచి వింటున్నాను. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం మొత్తం ఓట్లలో 30% వచ్చిన పార్టీ కూడా అధికారంలోకి రాగలుగుతోంది. దానికి బదులుగా 30% వచ్చిన పార్టీకి పార్లమెంటులో 30% సీట్లు, 29% ఓట్లు వచ్చిన పార్టీకి 29% సీట్లు యిలా యివ్వడం న్యాయం. ఆ విధంగా చట్టాన్ని సవరించాలి అని వేదికలపై మేధావులు చెప్తూ వుంటారు. ఇప్పటిదాకా పంచాయితీ స్థాయిలో కూడా దాన్ని అమలు చేయలేదు. జెపి సంపూర్ణ క్రాంతి ఉద్యమం పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ కూడా రాజ్యాంగాన్ని యీ మేరకు సవరించలేదు.
నవంబరు 20 న జెపి కొందరు కాంగ్రెసు ఎంపీలను పిలిపించి ''ఇందిర ఫాసిస్టు, కాంగ్రెసు అధ్యక్షుడిగా వున్న బరువా ఆవిడ ఆస్థాన విదూషకుడు. ఆమెను వదిలేసి రండి.'' అంటూ మాట్లాడారు. నవంబరు 25 న ఢిల్లీలో కమ్యూనిస్టేతర పార్టీ నాయకులు 50 మందిని, సంఘంలో ప్రముఖ వ్యక్తులు కొందరిని పిలిచి గుజరాత్‌లో లాగానే బిహార్‌లో కూడా అసెంబ్లీ రద్దు చేసి గుజరాత్‌తో బాటు ఎన్నికలు నిర్వహించాలి అంటూ మాట్లాడారు. జెపి చైర్మన్‌గా 21 మంది సభ్యులతో నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పడింది. దానిలో జనసంఘ్, పాత కాంగ్రెసు, బిఎల్‌డి, ఎస్‌ఎస్‌పి, అకాలీదళ్ సభ్యులుగా వున్నారు. ఎన్నికలు వచ్చేలోగానే తమకు బలం వున్న రాష్ట్రాలలో బిహార్ తరహా ఆందోళనలు చేపట్టి ప్రజాగ్రహానికి ఒక రూపు యివ్వాలని నిశ్చయించుకున్నారు. మార్చి 6 పార్లమెంటు సమావేశం కాబోతోంది కాబట్టి ఆ రోజున పార్లమెంటును ఘొరావ్ చేద్దామనుకున్నారు. చివరకు ఇది 1971 నాటి గ్రాండ్ ఎలయన్స్‌లా తయారైంది. ఇందిరను గద్దె దింపడమే ఏకైక ఆశయం అయిపోయింది. జెపి దేశమంతా పర్యటిస్తూ ప్రసంగించసాగారు. కొన్ని సందర్భాల్లో ఆయన సంయమనం కోల్పోయారు. పోలీసులను ఉద్దేశించి ''ఉద్యమకారులపై లాఠీ చార్జి చేయమని పై అధికారులు చెప్పినా చేయకండి. మీ అత్మప్రబోధాన్ని విని ఆజ్ఞలు ధిక్కరించండి.'' అన్నారు. ఆర్మీని ఉద్దేశించి ''ఆందోళనలు అణచడానికి మిమ్మల్ని తీసుకుని వచ్చిన సందర్భాల్లో పై అధికారులపై తిరుగుబాటు చేయండి.'' అని పిలుపు నిచ్చారు. ఇది విని మేధావులందరూ ముక్కున వేలేసుకున్నారు. ఒక నాయకుడికి యిలా మాట్లాడడం తగునా? అని విస్తుపోయారు. ఇందిర యీ పాయింటును బాగా వాడుకుంది. జెపి ఎంత అరాచకవాదో చూపడానికి యీ వ్యాఖ్యను తరచు ప్రస్తావించేది. దురదృష్టమేమిటంటే జెపి ఆ మాటను వెనక్కి తీసుకోలేదు. తమకు నచ్చనివాళ్లు ఎన్నికైతే పన్నులు కట్టనక్కరలేదనడం, పోలీసులను, ఆర్మీని తిరగబడమనడమంటే ప్రజస్వామ్యవాదికి హద్దు మీరి మాట్లాడినట్లే లెక్క!
జెపి ప్రభావం ఉత్తరభారతంలోనే కాస్త కనిపించింది. దక్షిణ భారతం, తూర్పుభారతం, పశ్చిమంలో మహారాష్ట్ర ఉద్యమానికి దూరంగానే వున్నాయి. గ్రాండ్ ఎలయన్సులో భాగస్వాములైన పార్టీలే తమ ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసేవి. మీడియా మాత్రం ఉద్యమానికి మద్దతు యిచ్చేది. ఈ పరిస్థితుల్లో జెపి కాంగ్రెసులో సోషలిస్టు వర్గంగా పనిచేస్తున్న యంగ్ టర్కులకు సందేశాలు పంపసాగారు. 'ఇందిర చేతిలో కాంగ్రెసు నాశనమై పోతోంది. మీరు బయటకు వచ్చేసి కాంగ్రెసును, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి' అని. వారికి జెపిపై గౌరవం. ఇందిరపై అభిమానం. ఇద్దర్నీ కలిపి కూర్చోబెడదామని ప్రయత్నించారు. అయితే అది పొసగలేదు. జెపికి ఇందిరపై చిన్నచూపు. 'వాళ్ల నాన్న నా స్నేహితుడు. చిన్నప్పుడు గౌన్లు వేసుకునే వయసు నుంచి ఆమె నాకు తెలుసు. తనకేం తెలుసని నేను మాట్లాడాలి?' అనేవారు. ఇందిర 'పదవులు వద్దని అంటూ వచ్చినా యీయనకు లోపల ఎక్కడో ఆశ చావలేదు. ఇన్నాళ్లకు బయటపడింది. నన్ను మూర్తీభవించిన అవినీతిగా వర్ణిస్తూన్న పెద్దమనిషితో మాట్లాడడం ఎలా? ఆయన ప్రవచించేది ఏమిటి? అరాచకం! నన్ను మట్టుపెట్టాలని చూస్తున్న ప్రతిపక్షాలతో చేతులు కలిపి ఫాసిస్టు మార్గంలో సాగుతున్నాయనతో ఎలా రాజీ పడగలను?' అనేది. ఇందిరను ఒప్పించలేక యంగ్ టర్కుల్లో ఒకడైన కేంద్రమంత్రి మోహన్ ధారియా మార్చి 1న ఒక బహిరంగసభలో మాట్లాడుతూ ఇందిర ప్రతిపక్ష నాయకులతో కూర్చుని చర్చలు జరపాలని సూచించాడు. కాంగ్రెసును బలహీనపరచి, తనపై ఆధారపడేట్లా చేయడానికి సిపిఐ ప్రయత్నిస్తోందని ఆరోపించాడు. వెంటనే ఇందిర అతన్ని మంత్రి పదవి నుంచి తొలగించింది. మార్చి 6 న పార్లమెంటుకి ప్రతిపక్షాలన్నీ కలిసి మార్చ్ నిర్వహించాయి. జూన్‌లో జరగబోయే గుజరాత్ ఎన్నికలలో కలిసి పోటీ చేయాలని నిశ్చయించాయి. – (సశేషం) (ఫోటో – జెపి )
ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2016)