Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినీమూలం- రాజూ పేద- 1

ఒక పేదవాడు వుంటాడు, ఓ గొప్పవాడుంటాడు. ఇద్దరూ ఒకే పోలికల్లో వుంటారు. అనుకోని పరిస్థితుల్లో ఒకరి కొకరు తారసిల్లుతారు. వాళ్ల స్థానాలు మారిపోతాయి. దానివలన పరిస్థితుల్లో మంచి మార్పు వస్తుంది. ఈ థీమ్‌ ఆధారంగా అనేక సినిమాలు వచ్చాయి కదా. వీటన్నిటికీ మూలం మార్క్‌ ట్వేన్‌ రాసిన ''ప్రిన్స్‌ అండ్‌ ది పాపర్‌'' అనే  ఓ ఇంగ్లీషు నవల. మూలరచన ఆధారంగా ఇంగ్లీషులో చాలా సినిమాలు వచ్చాయి.  ఆ నవలను కొద్దిగా మార్చి తెలుగులో ''రాజూ పేద'' సినిమాను బియే సుబ్బారావుగారు స్వీయదర్శకత్వంలో 1954లో తీశారు. ఈ తెలుగు సినిమా ఆధారంగా ఎల్వీ ప్రసాద్‌గారు తర్వాత ప్రత్యగాత్మ దర్శకత్వంలో ''రాజా ఔర్‌ రంక్‌'' అని హిందీలో తీసి చాలా పెద్ద హిట్‌ చేశారు.

సినిమా ప్రారంభంలో ఒక చిన్న పిల్ల పరుగు పెట్టుకుంటూ వస్తోంది. కొద్ది సేపట్లో ఒకే పోలికతో యిద్దరు పిల్లలు పుట్టబోతున్నారు. వాళ్లు కవలలు కారు. ఒకే తల్లికి పుట్టినవారు కారు. ఒకరు రాజప్రసాదంలో పుడుతుంటే మరొకరు పూరిగుడిసెలో! మహారాజుకు లేకలేక పిల్లవాడు పుడుతున్నాడని యువరాజు పుట్టుకకై దేశమంతా ఆత్రంగా ఎదురుచూస్తోంది. మరి పేదవాడి కోసం తండ్రికూడా ఎదురు చూడటం లేదు. పేదవాడి అక్క అయిన యీ పిల్ల జూదమాడుతున్న తండ్రి వద్దకు పరుగుపరుగున వెళ్లి తల్లి నొప్పులు పడుతోందని చెప్పింది. అతనో చిల్లరదొంగ. జూదరి. పిల్లలు పుడితే అనవసర ఖర్చు అని భయం. భార్యను, పుట్టబోయేవాణ్నీ తిట్టుకుంటూ యింటికి వెళ్లాడు. పుట్టినవాణ్ని చూసి రాజుగారి యింట్లో పుట్టకూడదూ అని తిట్టాడు. రాజుగారింట పుట్టినవాడికీ కష్టాలుంటాయి. పుట్టగానే అతని తల్లి పోయింది. సింహాసనంపై కన్నేసిన మేనమామ విక్రమ్‌ (విలన్‌ ఆర్‌.నాగేశ్వరరావు) వీడెందుకు పుట్టాడా? అని లోపల బాధపడుతూ పైకి తల్లిగండాన పుట్ట్డాడు అని నింద వేశాడు. అతని వక్రబుద్ధి తెలిసిన రాజు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే వుంటాడు.

పన్నెండు ఏళ్లు గడిచాయి. పేదవాడికి తండ్రి బుద్ధులు రాలేదు. అతను చెప్పినా బిచ్చమడుక్కోనంటున్నాడు. అతనికి తెలియకుండా చదువుకుంటున్నాడు. యువరాజు తన తండ్రి రక్షణలో పెరుగుతున్నాడు. ఆయన పేదలను ఉద్ధరించవద్దని కొడుక్కి హితోపదేశం చేస్తూంటాడు. పుట్టిన రోజు సందర్భంగా అతని చేతిలో రాజముద్ర పెట్టాడు. ఈ రాజముద్రకు కథలో చాలా ప్రాధాన్యం వుంది. ఆ రోజు ఒక వింత సంఘటన జరిగింది.  చదువుకుంటానన్నందుకు పేదవాడిని తండ్రి చావగొట్టాడు. వాడు తప్పించుకుని పారిపోతూ పోతూ కోటలోకి దూరాడు. కోట రక్షణాధికారి సుబేదారు అడ్డుపడి కొట్టబోయాడు. అది యువరాజు కంటపడింది. సుబేదారును ఆగమని చెప్పి పేదవాణ్ని లోపలకి తీసుకెళ్లాడు, కూర్చోబెట్టి నువ్వెవరు, నీ జీవితం ఎటువంటిది అని అన్నీ అడిగి కబుర్లు చెప్పించుకున్నాడు. యువరాజుకి పేదవాడి జీవితం గురించి వింటే హుషారు కలిగింది. అతని బట్టలు వేసుకోవాలని ముచ్చటపడ్డాడు. తన బట్టలు అతన్ని వేసుకోమన్నాడు. వేసుకున్నాక అద్దం ముందు నిలబడి యిద్దరూ ఒకేలా వుండడం చూసి ఆశ్చర్యపడ్డాడు. పేదను తనలా నటించమని చెప్పి దాసీవాళ్లను ఏమార్చి ఆనందించాడు. సుబేదారు గుర్తుపడతాడో లేదో చూద్దామని బయటకు వస్తూండగానే ఓ తమాషా జరిగింది. యువరాజు చేత తనను తిట్టించినందుకు పేదవాడిపై సుబేదారుకి కోపం వుంది. ఇప్పుడు పేదవాడి వేషంలో యువరాజను చూడగానే 'ఏరా నన్ను తిట్టిస్తావా?' అంటూ బయటకు యీడ్చుకువచ్చి గేటులోంచి తరిమేశాడు. 'నేను యువరాజును రా మూర్ఖుడా' అంటే 'కాస్సేపు లోపల కూర్చోగానే పిచ్చెక్కిందా? నువ్వే యువరాజువి అయిపోతావా?' అని సుబేదారు తిట్టాడు. గేటు బయట వున్న అలగా జనం వెక్కిరించి, తమతోబాటు యీడ్చుకుపోయారు. 

ఇక్కడదాకా పుస్తకాన్నే ఫాలో అయ్యారు. పుస్తకంలో కథాకాలం 1537 వ సంవత్సరం. ఇంగ్లండును ఎనిమిదవ హెన్రీ క్రూరంగా పాలిస్తున్నాడు. అతని కొడుకే యువరాజు. అతని మేనమామ విలన్‌ కాదు. ఇవతల పేదవాడు రాజమహల్‌లో యువరాజుగా చలామణీ కావడానికి నేపథ్యం ఎలా సమకూరిందో చెప్పాడు రచయిత. పేదవాడికి తండ్రితో బాటు దుర్మార్గుడైన నాయనమ్మ కూడా వుంది. అమ్మతో బాటు మంచివాళ్లయిన అక్కలు యిద్దరున్నారు. వీరందరితో బాటు ఫాదర్‌ ఆండ్రూ అనే ఆయన రహస్యంగా చదువు చెపుతూంటాడు. కులీనుల భాష అయిన లాటిన్‌ నేర్పుతాడు. రాజుల కథలు చెప్పి, వాళ్లు మాట్లాడే భాష ఎలా వుంటుందో చెప్తాడు. ఈ పేదవాడు అవన్నీ వంటబట్టించుకుంటాడు. పైగా రాజభవనంలోకి అతనికి దెబ్బలబ్బాయి అనే అతను పరిచయమై అక్కడి విషయాలన్నీ చెపుతాడు.

యువరాజు అనుకోని పరిస్థితుల్లో పేదల్లోకి వచ్చి పడ్డాక అతనికి అనేక విషయాలు తెలిసివస్తాయి. ప్రభుత్వనిధులతో పనిచేసే సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో, ప్రభుత్వం వేసే పన్నుల వలన జనాలు ఎలా కష్టపడుతున్నారో, న్యాయవ్యవస్థ ఎంత అధ్వాన్నంగా నడుస్తోందో - అన్నీ తెలుస్తాయి. మార్క్‌ ట్వేన్‌ యీ నవల ద్వారా రాజరిక వ్యవస్థలోని లోపాలను చూపించాడు. ప్రభువులు ఎన్ని చట్టాలైనా చేయవచ్చు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఎంత గొప్పగా అమలు అవుతున్నాయో తెలియాలంటే పాలకులకు యిటువంటి అనుభవాలు చాలా అవసరం. రాజభవనంలోకి బయటకు రాగానే తండ్రి నడిపే అనాథ శరణాలయానికి వెళితే అక్కడ పిల్లలు హేళన చేశారు. 'వీళ్లకు మా నాన్న తిండి ఏర్పాటు చేశాడు కానీ చదువు, సంస్కారం నేర్పించలేదు. నేను రాజ్యానికి వచ్చాక ఆ పని చేయాలి' అనుకున్నాడు యువరాజు. తెలుగు సినిమాలో యివన్నీ పెద్దగా చూపలేదు. 

యువరాజు స్థానంలో వచ్చిన పేదవాడు తాను యువరాజును కానని చెప్పుకున్నా ఎవరూ నమ్మలేదు. తన శత్రువులు అతనికి విషప్రయోగం చేసి మతిభ్రష్టుణ్ని చేశారని రాజు నమ్మాడు. మతి చలించినా అతని మాటల్లో వివేకం మిగిలి వుందని అనుకున్నాడు. వైద్యులచే రాజు కషాయం తాగించి వైద్యం చేయించబోయాడు కానీ ఫలితం యివ్వలేదు. రాజు వైద్యం మాన్పించాడు.

పేదవాడి స్థానంలో వున్న యువరాజును అందరూ వెక్కిరిస్తూ వుంటే ఒక మంచి మిత్రుడు దొరికాడు. అతను రేలంగి. తెలుగులో పేరు సుధీర్‌. ఇంగ్లీషు నవలలో పేరు మైల్స్‌ హెండన్‌. ఇతనికి ఒక్కడికే యీ కుర్రాడు మంచివంశం వాడేమోనన్న అనుమానం వస్తుంది. అతను ఓ జమీందారు కుటుంబం వాడు. పేదవాడి కుటుంబంతో పరిచయం వుండదు. కానీ తెలుగు సినిమాలో అతన్ని అదే బస్తీలో వుంటున్నట్టు చూపించారు. పేదవాడి అక్కను ప్రేమిస్తాడు కూడా. జేబులో ధైర్యం బొమ్మ వుంటేనే పోట్లాడగలిగే సెంటిమెంటు కూడా పెట్టి కాస్త కామెడీ చూపించారు.

రేలంగి యువరాజును ఇంటికి పిలిచి అన్నం పెట్టి పరిశీలించాడు. భోజనం పెడుతూ మధ్యలో కూచోబోతే నా ఎదురుగా కూర్చుంటావా అని అతను గద్దించాడు. అది చూసి యీ కుర్రాడి ధోరణి వింతగా వుందే అనిపించింది అతనికి. తనకు తెలిసినవాడికి, యితనికి ఏదో తేడా కనబడుతోంది అదేమిటో తెలియటం లేదు. తల్లీ, అక్కా అతన్ని విసిగిస్తే బయటకు తీసుకువచ్చి కన్విన్స్‌ చేశాడు కూడా. ఇంతలో అతను ఎక్కడికో వెళ్లవలసి వచ్చింది. తిరిగి వచ్చేసరికి యువరాజు మిస్సింగ్‌! 

పుస్తకంలో ఎలా వుంటుందంటే యువరాజు రోడ్డుమీద తిరుగుతూ వుంటే పేదవాడి తండ్రి అతన్ని యింటికి యీడ్చుకెళతాడు. ఇంటిపక్కన వుండే ఫాదర్‌ ఆండ్రూ అడ్డుపెడితే అతన్ని ఓ బడితెతో కొడతాడు. అతని చచ్చిపోతాడు. దాంతో హత్యానేరంపై వురి తీస్తారని భయపడి వూరు వదిలి కుటుంబంతో పారిపోతాడు. ఆ అడావుడిలో ఇతను తప్పించుకుని తనే యువరాజునని చెప్పుకుంటూ వుంటే అందరూ గేలి చేస్తారు. అప్పుడు మైల్స్‌ హెండన్‌ ఆదుకుంటాడు. మైల్స్‌ ఓ జమీందారు కొడుకు. అతని తమ్ముడు దుర్మార్గుడు. ఇతనిమీద చాడీలు చెప్పి దేశబహిష్కార శిక్ష విధింపజేశాడు. ఇతను సైన్యంలో చేరి యుద్ధఖైదీగా పదేళ్లు గడిపి బయటపడ్డాడు. ఇంటికి వెళ్లి జమీందారీ తీసుకుని, తనను ప్రేమించిన కజిన్‌ను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాడు. యువరాజును చూసి జాలిపడి చేరదీశాడు. కానీ అతన్ని పేదవాడి తండ్రి తన కొడుకని అనుకుని ఎత్తుకుపోయాడు. (సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?