Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : దేవయాని అరెస్టు - 3

ఇప్పటిదాకా అందిన సమాచారం బట్టి, నాకు అర్థమై కాస్త వూహించిన దాన్ని బట్టి, దేవయాని తప్పుడు డిక్లరేషన్‌ యిచ్చింది. సంగీత దాన్ని ఉపయోగించుకుని అమెరికా ప్రభుత్వం సహాయంతో దేవయానిని ఒక ఆట ఆడిస్తోంది. దేవయాని, సంగీత యిద్దరూ భారతీయులే. అమెరికా ప్రభుత్వం ఒకరిపై మరొకరిని ప్రయోగించి భారతీయరాయబార కార్యాలయ ఉద్యోగులు నీతి తప్పిన నేరస్తులని ప్రపంచానికి చూపించి, పరువు తీయదలచింది. మన దేశస్తులం దేవయానిని చూసి జాలిపడతాం. ఏదో చిన్న తప్పుకై అంత భారీ శిక్ష విధించాలా? అంటాం. ఎందుకంటే మనలో చాలామంది అదే రకం. గవర్నమెంటుకి యిచ్చే సర్టిఫికెట్లు, డిక్లరేషన్లు అన్నీ చాలా లైట్‌గా తీసుకుంటాం. ఇన్సూరెన్సు పాలసీయే కాదు, ఇంటర్నెట్‌లో ఏదైనా సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు కాదు, 'ఐ ఎగ్రీ విత్‌ ఆల్‌ ద రూల్స్‌' అనే బాక్స్‌ను ఏ రూలూ చదవకుండానే టిక్కు పెట్టేస్తాం. కాగితంపై యింటూ మార్కు పెట్టిన చోట టపటపా సంతకాలు పెట్టేస్తాం. ఆదాయం తక్కువని సర్టిఫికెట్‌ పట్టుకుని వస్తే ఆరోగ్యశ్రీ సదుపాయం కలుగుతుందనో, రిజర్వేషన్‌ సౌకర్యం యిస్తారనో, స్కాలర్‌షిప్‌ దక్కుతుందనో అంటే వెంటనే పట్టుకుని వచ్చేస్తాం. కులం గురించి కూడా తప్పుడు సర్టిఫికెట్లు తెచ్చేవాళ్లు కోకొల్లలు. ఉద్యోగాలకు అప్లయి చేసేటప్పుడు ఆ ఫీల్డులో ఎక్స్‌పీరియన్సు వుందని అబద్ధం రాయడం, వీసాకు అప్లయి చేసినపుడు బ్యాంక్‌ ఎక్కవుంటులో డబ్బులున్నాయని చూపించడం (వీసా రాగానే విత్‌డ్రా చేసేస్తారు) సర్వసహజం. ఏ కంపెనీలో హ్యూమన్‌ రిసోర్సెస్‌ వాళ్లను అడిగినా చెప్తారు - తొంభై శాతం అభ్యర్థులు యిచ్చే రెజ్యూమేలన్నీ బోగస్సేననీ, వాళ్లను వడపోయడమే తమ పని అనీ!

ఎందుకిలా చేస్తాం? ఎందుకంటే మనకు శిక్ష పడదన్న ధీమా. పట్టుబడితే సారీ చెప్పేస్తే చాలు, వదిలేస్తారు. తప్పు చేసేవాళ్లపై మన భారతీయులం ప్రత్యేకమైన కరుణ కనబరుస్తాం. జేబుదొంగ పట్టుబడినా పోలీసులకు అప్పగించం. రెండు దెబ్బలేసి వదిలేస్తాం. 'వదిలేయ్‌ గురూ, వాడి పాపాన వాడే పోతాడు' అన్నదే మన ఫిలాసఫీ. రైల్లో మన పక్కన కూర్చున్న ప్రయాణీకుడు టిక్కెట్టు లేకుండా ప్రయాణిస్తున్నాడని తెలిసినా వూరుకుంటాం. పట్టుకోవడం మన పని కాదు, టిటిఇది. పట్టుకోకపోతే వాడి తప్పు. ట్రాఫిక్‌ పోలీసు లేకపోతే రెడ్‌ లైట్‌ పడినా ఎవడూ ఆగడు. అడ్డగోలుగా బతకడానికి మనం అలవాటు పడ్డాం. ఎంత యిదిగా అంటే ఏదైనా డాక్యుమెంటు చదివి సంతకం పెడతానంటే అవతలివాడికి చెడ్డ చికాకు వస్తుంది. 'ఇలా అయితే పనులు జరిగినట్టే' అనేస్తాడు మొహం మీద.

ఇప్పుడు దేవయాని సగటు భారతీయురాలిలాగ తప్పుడు డిక్లరేషన్‌ యిచ్చి వుంటారని అనుకుందాం. అది చట్టరీత్యా తప్పే కదా. మనం ఎలా సమర్థించగలం?  కానీ మనవాళ్లు సమర్థించడానికి పూనుకున్నారు. అమెరికన్‌ చట్టాల ప్రకారం పనిమనిషికి జీతాలివ్వాలంటే ఆవిడ జీతం సరిపోదట. సరిపోకపోతే పనిమనిషిని పెట్టుకోనే పెట్టుకోకూడదు. సగటు అమెరికన్లలా అన్ని పనులూ తనే చేసుకోవాలి.  రైల్వే స్టేషన్‌లో పోర్టర్లు వుంటారు, ఎయిర్‌పోర్టులో మన సామాను మనమే మోసుకోవాలి. లేదు నాకు కుదరదు అనుకుంటే ఎవర్నైనా బతిమాలుకోవాలి, లేదా విమానప్రయాణం మానేయాలి. అబ్బే నాకు అది అలవాటు లేదు, అలా అని జీతం యిచ్చుకోలేను అనుకుంటే న్యూయార్కు పోస్టింగు వద్దని చెప్పుకోవాలి. మా బ్యాంకులో బాంబే, బెంగుళూరు వంటి చోట్లకు పోస్టింగులు వేస్తే భయపడేవాళ్లం. మా కిచ్చే అలవెన్సులతో యిళ్లు దొరకవని! ప్రమోషన్లు వద్దని కొందరంటే, మరి కొందరు కుటుంబాన్ని వున్న వూళ్లో వుంచి, అక్కడ పని చేసేవారు. అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే కుదరదు. అయినా దేవయాని మధ్యతరగతి మహిళ కాదు. ఆదర్శ్‌ కాంప్లెక్సులో ఫ్లాట్‌ వుందని కూడా పేపర్లో వచ్చింది. ఆవిడ దళిత మహిళ కాబట్టి శిక్షించకూడదని మాయావతి అన్నారు కానీ అవన్నీ మన దేశంలో చెల్లుతాయి. దళిత, మైనారిటీ.. అంటే ఎవరూ వాళ్ల జోలికి వెళ్లరు. ఓట్లు పోతాయని భయం. అమెరికా వాడికి అవేమీ జాన్తా నై. దేవయాని సంఘటన బయటకు రాగానే, గతంలో మన దేశాధిపతులు బట్టలు కూడా విప్పించారు అంటూ గుర్తు చేసుకుని సంపాదకీయాలు రాశారిక్కడ. అంత జాగ్రత్తగా వున్నారు కాబట్టే అమెరికాలో మళ్లీ దాడులు జరగలేదు. మనకు రోజుకో దాడి. పూటకో యాక్సిడెంటు. విచారణ జరుపుతారు. తప్పు చేసినవాళ్లకు శిక్ష వేయరు. కాలేజీ ప్రమాణాలు సరిగ్గా లేవని గుర్తింపు కాన్సిల్‌ అంటారు. బాగానే వుంది కానీ సరిగ్గా వుందని సర్టిఫికెట్టు యిచ్చినవాణ్ని పట్టుకుని సస్పెండ్‌ చేయాలిగా. చేయరు. అందుకే మన జీవనప్రమాణాలు యింత ఘోరంగా వున్నాయి. అమెరికాలో కూడా యిలాగే వుండాలని ఆశించడం అన్యాయం. 

మనం ఏదైనా ట్రాఫిక్‌  అఫెన్సు చేస్తే కానిస్టేబుల్‌ వదిలేయవచ్చు లేదా వాయించవచ్చు. వాయించకూడదు అనడానికి మనమెవరం? తప్పుకు ఎంత శిక్ష వేయాలి అన్నదానిపై కూడా మన దృక్కోణం వేరు, వాళ్లది వేరు.  మనం తప్పులు చేస్తాం, తప్పు చేసినవాణ్ని వెనకేసుకుని వస్తాం. క్రమేపీ తప్పు చేసిన వాడికి అదొక హక్కుగా అయిపోతుంది. సారీ చెపితే వదిలేసి తీరాలి అని మనవాళ్ల గట్టి నమ్మకం. రాంగ్‌ సైడ్‌ వచ్చి మీ కారును గుద్దేసినవాణ్ని కూడా సారీ అంటే మీరు వదిలేయాలి, లేకపోతే చుట్టూ మూగినవాళ్లు మీకు వ్యతిరేకం అయిపోతారు. 'సారీ చెప్పాడుగా, యింకా ఏమిటండీ సాగదీస్తారు?' అని మీమీదే మండిపడతారు. మనం యిలా వున్నాం కదాని అమెరికావాణ్ని కూడా అలా వుండమంటే ఎలా? ఆ మధ్య కొందరు తెలుగు విద్యార్థులు ఓ బోగస్‌ యూనివర్శిటీలో చేరి చదవడం మానేసి చట్టవ్యతిరేకంగా యితర రాష్ట్రాలలో పని చేస్తూ వుంటే అమెరికన్‌ ప్రభుత్వం పట్టుకుంది. ట్రాక్‌ చేయడానికి కడియాలు తొడిగారు. అది అవమానం, మన తెలుగువాళ్లు యింత దారుణానికి గురవుతూ వుంటే అక్కడి తెలుగు సంఘాలు ఏం చేస్తున్నాయి అని యిక్కడ మీడియా రెచ్చిపోయింది. వర్క్‌ పెర్మిట్‌ లేకుండా చట్టవిరుద్ధంగా విద్యార్థులు ఉద్యోగం చేయడంలో మనకు తప్పు కనబడలేదు. మనం ఏం చేసినా అవతలివాళ్లు వూరుకోవాలి. 

దేవయాని దౌత్యాధికారిణి కాబట్టి తప్పు చేసినా శిక్ష పడకూడదు అనో ఆవిడ అరెస్టులకు అతీతం అనో వాదించేవారిని ఒక్కటే అడుగుతాను - మరి అంతటి ఉన్నతస్థానంలో వున్నావిడ తప్పు చేయవచ్చా? తప్పుడు డిక్లరేషన్లు యివ్వవచ్చా? మన రాయబారి అంటే భారత సంస్కృతిని ప్రతిబింబించాలి. ఆవిడ మొత్తం మన దేశానికి ప్రాతినిథ్యం వహిస్తోంది. ఆవిడ ఏదైనా చేస్తే 'ఈ ఇండియన్సంతా యింతేరా!' అనేస్తారు చటుక్కున. అంతటి బాధ్యత ఆవిడపై వుంది కాబట్టే అంతంత జీతాలు, సౌకర్యాలు యిస్తోంది ప్రభుత్వం. మరి అలాటావిడ డిప్లోమాటిక్‌ యిమ్యూనిటీ వుంది కదాని తప్పుడు పనులు చేయవచ్చా? ఆవిడ హోదాకు తగినట్టుగా వ్యవహరించక లేదని తేలితే అమెరికా అధికారులు చివరకు సారీ చెప్తారు. ఇండియా ప్రభుత్వం దేవయానికి పరిహారం యిస్తుంది, లేదా ప్రమోషన్‌ యిస్తుంది.  దాని గురించి నేను వర్రీ అవను. ఒక పెద్ద దేశంలో భారతదేశపు ప్రతినిథిగా వ్యవహరిస్తూ దేవయాని నేరం చేసినట్లు, నాలుగు రూకలు మిగుల్చుకోవడానికి తప్పుడు డిక్లరేషన్‌ యిచ్చినట్టు తేలితే మాత్రం చాలా ఫీలవుతాను. ఆవిడకు  శిక్షో, జరిమానావో, మరోటో పడితే చింతించను. (సమాప్తం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2013)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?