cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : దేవయాని అరెస్టు - 1

ఎమ్బీయస్‌ : దేవయాని అరెస్టు - 1

న్యూయార్క్‌లో భారత దేశం తరఫున డిప్యూటీ కాన్సల్‌ జనరల్‌గా పని చేస్తున్న దేవయాని ఖోబర్‌గాడే అరెస్టు మన దేశంలో చాలా సంచలనాన్ని కలిగించింది. అమెరికా పెద్దన్న దురహంకారంపై అందరూ మండిపడ్డారు. గతంలో వారు మన భారతదేశ నాయకుల బట్టలిప్పించినా మనవాళ్లు సహించినందుకే యీ దుర్గతి దాపురించిందని సంపాదకీయాల్లో చీల్చిచెండాడారు. మనకు సిగ్గు లేదని, వాళ్ల ముందు సాగిలబడుతున్నామనీ హుంకరించారు. భారతప్రభుత్వం తనకు చేతనైనంత తీరులో స్పందించింది. అది చాలలేదని ప్రజలందరూ భగ్గుమంటున్నారు. ఈ పరిస్థితుల్లో నిజంగా జరిగినదేమిటని లోతుగా విచారించి, నిదానంగా ఆలోచిస్తే మంచిది.

మొదటగా చెప్పుకోవలసినది - ఈ సంఘటన కారణంగా అమెరికా దేశం యావత్తు భారత్‌పై, భారతీయులపై కక్ష కట్టిందని అనలేము. ప్రతి దేశంలోనూ కొందరు వ్యక్తులు యిలాటి దుశ్చర్యలకు ఒడంబడతారు. భారతీయులందరూ పాకిస్తాన్‌లోని ప్రతి మనిషిపై కత్తులు నూరుతున్నామనీ, కనబడితే అడ్డంగా నరికేయడానికి వెనకాడమనీ పాకిస్తాన్‌లో ప్రచారం చేస్తారు. ఇక్కడి ముస్లిములకు భద్రత లేదనీ, దిక్కులేక తలవంచుకుని బానిసల్లా బతుకుతున్నారనీ జిహాదీ వర్గాలు ప్రచారం చేస్తాయి. వాస్తవం ఏమిటో మనకు తెలుసు. పాకిస్తాన్‌లో ప్రతివాడు భారతీయుడంటే మండిపడుతున్నాడని అనుకోవడమూ పొరబాటే. ఇరుదేశాల మధ్య మైత్రి కోరేవాళ్లు కొందరైతే శత్రుత్వం ఎలాగైనా కొనసాగాలని కోరేవారు కొందరుంటారు. ఏదో ఒక పేచీ తెచ్చిపెడుతూంటారు. సీమాంధ్ర, తెలంగాణ వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనంత దారుణంగా వైషమ్యాలు పెరిగిపోయాయని, యిక విడిపోక తప్పదని విభజనవాదులు అసెంబ్లీలో ఉపన్యాసం యిస్తారు. బయటకు వచ్చి చూస్తే యిరుప్రాంతాల వాళ్లూ ఛలోక్తులు వేసుకుంటారు, కలిసి వ్యాపారాలు చేస్తారు, వియ్యాలందుతారు. అమెరికాలో సాధారణ పౌరుడికి గాని, భారత్‌తో వ్యాపారబంధాలున్నవాళ్లకి గానీ యిలాటి పనులకు పాల్పడరు. కానీ కొందరికి ఏదో కసి, కక్ష వుంటాయి. కొందరు అధికారులకు నల్లవాళ్లంటే పడదు. మరి కొందరికి చైనీయులంటే పడదు. మరి కొందరికి మెక్సికన్లు.. యింకొందరికి ఇండియన్లు. వీళ్లు వచ్చి మన ఉద్యోగాలు ఎత్తుకుపోతున్నారనో మరోటో కడుపులో వుంటాయి. ఇలాటి సందర్భం ఒకటి దొరికినపుడు అటువంటి ఎలిమెంట్స్‌ అవకాశాన్ని ఉపయోగించుకుంటాయి. వాళ్లను చూపించి ఇది ఒబామా కుట్ర అనక్కరలేదు. అంకుల్‌ శామ్‌ బొమ్మలతో కార్టూన్లు వేయనక్కరలేదు.

ఇక రెండో అంశం - దౌత్యాధికారిగా దేవయాని వుండే వెసులుబాట్లను ఈ అధికారులు పట్టించుకోలేదు. అలవి మీరి ప్రవర్తించారు అనేది నిర్వివాదాంశం. అదను దొరికింది వేటు వేసేద్దాం, అంతగా వస్తే క్షమాపణ చెప్దాం అనుకుని వుంటారు. ఆ లోపం దొరికింది కాబట్టే భారతదేశం తీవ్రంగా స్పందించి అమెరికన్‌ దౌత్యాధికారులకు ఆంక్షలు విధించింది. తప్పు చేసినది వారు, అనుభవిస్తున్నది వీరు. దౌత్యాధికారులకు యిలాటి అవస్థలు తప్పవు. ఈ ముక్క చెప్పాక యింకో మాట కూడా ఒకటి చెప్పి తీరాలి. దేవయాని నేరం చేసిందా లేదా అన్న చర్చ వెనక్కి వెళుతోంది. ఆమెను అరెస్టు చేయడం సబబా, కాదా అన్న చర్చ ముందుకు వచ్చింది. ఎన్‌డి తివారిపై పితృత్వ కేసు వేశారు. గవర్నరుని కాబట్టి నాపై కేసు పెట్టడానికి వీల్లేదు అనే సాంకేతిక కారణంతో ఆయన చాలాకాలం తప్పించుకున్నాడు. అయితే గవర్నరుగా రాజ్‌భవన్‌లో రాసలీలలు సాగించారని బయటకు వచ్చి గవర్నరు పదవి పోగొట్టుకున్నాడు. హోదా కల్పించిన రక్షణ కవచం - యిమ్యూనిటీ వూడిపడిపోవడంతో కేసు ముందుకు సాగింది. ఇప్పుడు దేవయానికి దౌత్యాధికారి కవచం లేదనుకోండి, ఆవిడ నేరం చేసినా ఫర్వాలేదు అనగలమా? అసలు ఆవిడ నేరం చేసిందా? 

దాని గురించి ఆలోచించేముందు మన పత్రికల్లో వచ్చినదానిలో నిజమెంత, మసాలా ఎంత అనేది వేరు చేసి చూడాలి. మన రిపోర్టుల ప్రకారం 39 ఏళ్ల దేవయానిని ఆమె కూతురు స్కూలు ముందు, ఆ పిల్ల కళ్లెదురుగా, చేతికి బేడీలు వేసి అరెస్టు చేసి తీసుకెళ్లారు. అణువణువూ శోధించి, తీసుకెళ్లి మాదకద్రవ్యాల దొంగరవాణా చేసేవారి మధ్య, చిల్లర నేరస్తుల మధ్య పడేశారు. అలా ఆరుగంటలపాటు అవమానించి ఆ తర్వాత వదిలిపెట్టారు. ఆమె బయటకు వచ్చిన తర్వాత రెండు పేరాలలో యీ విషయం రాసి తన ఫారిన్‌ సర్వీసెస్‌ కొలీగ్స్‌కు యీమెయిల్‌ యివ్వడంతో యీ విషయం బయటకు వచ్చింది. దీనిపై సహజంగానే దేశమంతా ఉలిక్కిపడి, అభ్యంతరాలు తెలిపింది. అమెరికన్‌ అటార్నీ అయిన ప్రీత్‌ భరారా జరిగినదిది అంటూ ఓ ప్రకటన చేశారు. దాని ప్రకారం - దేవయానిపై వున్నది క్రిమినల్‌ కేసు. అలాటి కేసుల్లో అందరి పట్ల పోలీసులు ఎలా వ్యవహరిస్తారో దేవయాని పట్ల కూడా అలాగే ప్రవర్తించడమే కాదు, యింకా కాస్త ఎక్కువ మర్యాదగా కూడా వ్యవహరించారు. పిల్లల ఎదురుగా అరెస్టు చేయలేదు. చేతులకు బేడీలు వేయలేదు. ఆవిడ నుండి ఫోన్‌ కూడా లాక్కోలేదు. ఎవరి దృష్టి పడకుండా తీసుకెళ్లి ఒక కారులో కూర్చోబెట్టారు. రెండు గంటల పాటు ఆవిణ్ని అనేకమందికి ఫోన్‌ చేసుకోనిచ్చారు. కాఫీ తెచ్చి యిచ్చారు. తినడానికి ఏమైనా కావాలా అని అడిగారు. కస్టడీలోకి తీసుకున్నాక ఆమెను అణువణువునా శోధించిన మాట వాస్తవం. ఒక మహిళా ఆఫీసరే ఆ పని చేశారు. గొప్పా, బీదా భేదం లేకుండా ముద్దాయిలందరిపట్ల అమెరికన్‌ పోలీసులు యిలాగే వ్యవహరిస్తారని గమనించాలంటారు ప్రీత్‌. అరెస్టు, బేడీల విషయం దేవయాని స్వయంగా చెప్తే తప్ప నిజానిజాలు మనకు తెలియవు. ఆమె మౌనం పాటిస్తోంది. 

తనపై కేసు నడుస్తోందన్న విషయం దేవయానికి ముందే తెలుసు. ఇంట్లో పనిచేసే పనిమనిషికి జీతం తక్కువ యివ్వడమనేది చిక్కులతో కూడుకున్న వ్యవహారం అని ఆవిడకు కక్షుణ్ణంగా తెలుసు. ఆమె తండ్రి ఉత్తమ్‌ ఖోబర్‌గాడే ఐయేయస్‌ ఆఫీసరు. ఈమె డాక్టరు. దరిమిలా ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసరు. అమెరికాలో పనివాళ్లకు యివ్వవలసిన జీతభత్యాలు చాలా ఎక్కువగా వుంటాయి కాబట్టి వాళ్లెవరూ పనివాళ్లను పెట్టుకోరు. అయితే మన దేశంలో మామూలువాళ్లే యింట్లో పనివాళ్లను పెట్టుకుంటారు. ఐయేయస్‌ క్యాడర్‌ వాళ్లయితే చెప్పనక్కరలేదు. ఇద్దరు ముగ్గురు వుంటారు. మరి వీళ్లను అమెరికా తీసుకుని వెళితే అక్కడి చట్టాల ప్రకారం జీతాలు యివ్వాలంటే జేబు పేలిపోతుంది. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2013)

mbsprasad@gmail.com

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×