ఇదీ – ఆంధ్రజ్యోతి ఆదివారం 4 జనవరి 1998 సంచికలో ప్రచురించబడిన వ్యాసం. దీనికి తాజాపరిణామాలు చేరిస్తే విన్నీ స్వరూపం బోధపడుతుంది. సత్యనిర్ధారక సమితి 2003 నాటి తీర్పు ప్రకారం 43 ఫ్రాడ్ కేసుల్లో, 25 దొంగతనం కేసుల్లో ఆమె శిక్షార్హురాలు. ఆమె నేరాన్ని ఒప్పుకోలేదు. ఐదేళ్ల జైలు శిక్ష వేశారు. ఆమె తన పార్టీలో అన్ని పదవులకు, పార్లమెంటు సీటుకు రాజీనామా చేసి ప్రెటోరియా హై కోర్టుకి అపీలు చేసుకుంది. 'నేరాలు ఆమె వ్యక్తిగత లాభానికి చేసినవి కావు' అనే కోణంలో ఆలోచించి ఈ కోర్టు జులై 2004లో మూడున్నర సంవత్సరాల జైలుశిక్ష వేసింది. ఇది కూడా ఆమె తన ఉద్యోగస్తులకోసం తీసుకున్న బ్యాంకు ఋణాలు ఎగ్గొట్టినందుకు. విన్నీ ఈ తీర్పుపై కూడా అపీలు కెళ్లింది. ఆమె జీవితంపై ఒక అపేరా తయారైంది. పేరు 'ద పేషన్ ఆఫ్ విన్నీ' దాని ప్రీమియర్ షోకై కెనడా వెళదామంటే కెనడియన్ హై కమిషన్ వాళ్లు వీసా యివ్వలేదు. ఈ విషయాలు ఎలా వున్నా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెసులో ఆమె హవా తగ్గలేదు. 2009 ఎన్నికల్లో ప్రాధాన్యతా క్రమంలో ఆమె ఐదవ స్థానాన్ని పొందింది. పేదల్లో, అతివాదుల్లో ఆమె స్థానం పదిలంగానే వుందన్న విషయం స్పష్టమైంది.
ఆమె తన తీవ్రభావాలను వదలుకోలేదని అనుకోవడానికి మరో ఉదాహరణ – 2010లో నదీరా నైపాల్‌కు ఆమె యిచ్చిన యింటర్వ్యూ. దానిలో ఆమె నెల్సన్ మండేలాను తిట్టిపోసింది. అంతర్జాతీయ ఖ్యాతికోసం నల్లవాళ్ల హక్కులను బలి యిచ్చాడని, డబ్బు పోగేసుకున్నాడని నిందించింది. ఒక తెల్లవాడు (డి క్లర్క్) తో కలిసి నోబెల్ ప్రైజ్ పంచుకున్నందుకు తప్పుపట్టింది. కుటుంబపరంగా చూసినా తామిద్దరికి కలిపి పుట్టిన కూతుళ్లకు అందుబాటులో లేడని, తండ్రిగా కూడా విఫలమయ్యాడని అంది. ఈ ఇంటర్వ్యూ పార్టీలో కలకలం రేపింది. చివరకు ఆ యింటర్వ్యూ అంతా ఉత్తిదేనని ఆమె తరఫు ప్రతినిథి ప్రకటన విడుదల చేశారు. ఏది ఏమైనా విన్నీ మండేలా రగులుతూనే వుంది. ఇప్పుడు మండేలా మరణించాక ఆమె మళ్లీ తెరమీదకు వచ్చింది. మండేలా ఆస్తికి, రాజకీయాలకు వారసులెవరు అనే వివాదానికి ఆజ్యం పోస్తోంది.
మండేలాకు మూడుసార్లు వివాహమైంది. 6గురు పిల్లలు, 17 మంది మనవళ్లు, మనవరాళ్లు. 80 వ యేట చేసుకున్న మూడో భార్య ద్వారా పిల్లలు లేరు. రెండో భార్య విన్నీ ద్వారా యిద్దరు కూతుళ్లు. మొదటి భార్య ఎవిలీన్‌తో 13 ఏళ్లు కాపురం చేశాడు. వాళ్లకు యిద్దరు కొడుకులు, యిద్దరు కూతుళ్లు. కొడుకులిద్దరూ మండేలా బతికుండగానే పోయారు – ఒకడు 24 ఏళ్ల వయసులో కారు యాక్సిడెంటులో, మరొకడు 55 ఏళ్ల వయసులో, ఎయిడ్స్‌తో! మొదటి కూతురు తొమ్మిది నెలలకే పోయింది. రెండో కూతురు 59 ఏళ్లది. పేరు 'మాకీ' (అసలు పేరు మకాజివే). ఆమె మసాచుసెట్స్‌లో ఆంత్రపాలజీలో డాక్టరేటు తీసుకుని, యూనివర్శిటీలలో, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ సంస్థల్లో ఉన్నతోద్యోగాలు చేసింది. ఘనా దేశస్తుణ్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మండేలా వారసురాలిగా ఆమెను ముందుకు తెచ్చింది విన్నీ! మండేలా పిల్లల్లో తనే పెద్దది కాబట్టి, ఆమెయే కుటుంబ పెద్ద అని, తన కూతుళ్లు జెనానీ, జింద్జీ ఆమెను అనుసరిస్తారని ప్రకటించింది. తన కూతుళ్లకోసం పోరాడకుండా సవతి కూతుర్ని నాయకురాలిగా చూపుతోంది కాబట్టి నిస్వార్థంగా వ్యవహరించినట్టు కనబడుతుంది. అయితే దీనిలో ఓ రాజకీయం వుంది.
మండేలా రెండో కొడుకు మకగతో కొడుకు మాండ్లా మండేలా అంటే మండేలాకు యిష్టం. తన తెగ (మ్వేజో)కు నాయకత్వం వదలుకుని తన బదులు మనవణ్ని ఎన్నుకోమని వాళ్లకు చెప్పాడు. మాండ్లాకు 39 ఏళ్లు. పొలిటికల్ సైన్సులో గ్రాజువేటు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. వివాదాస్పదమైన వ్యక్తి. కానీ మండేలాకు అభిమాన పౌత్రుడు కాబట్టి రాజకీయవారసత్వం అతనికి దక్కుతుందనే భయంతో విన్నీ అతన్ని దూరంగా నెట్టేసింది. కునూలో మండేలా ఫ్యామిలీ ఎస్టేటులోంచి అతన్ని బయటకు నెట్టేసి తాళాలు వేసేశారట. నీళ్లు, కరంటు కట్ చేశారట. ఇదంతా మీడియా కల్పనే అంటోంది విన్నీ. మండేలా కుటుంబం యొక్క పరువు కాపాడడానికి మాకీ ప్రయత్నిస్తోందని, మీడియా రచ్చకీడుస్తోందని మండిపడింది.
''మండేలా కుటుంబం గురించి చింత నీకేల? మేం చూసుకుంటాం. పెళ్లయ్యింది కాబట్టి మీ అత్తవారి కుటుంబ పరువు చూసుకో.'' అని మాండ్లా మాకీపై మండిపడుతున్నాడు. 'కుటుంబంలో ఏదైనా గొడవలు వస్తే యింటి ఆడపడుచుగా ఆమె మధ్యవర్తిగా వుండాలి. కానీ మా మేనత్త తనే గొడవలు తెచ్చిపెడుతోంది. మా తాత చనిపోయిన వారం రోజులకు వచ్చింది.' అని ఆరోపించాడు మాండ్లా. ప్రజలు దర్శించుకోవడానికి వీలుగా శవపేటికను యూనియన్ బిల్డింగ్స్‌లో పెట్టినపుడు దాని పక్కన మూడు రోజులపాటు అతనే వున్నాడు.
శాంతిదూతగా పేరు పొందిన నెల్సన్ మండేలా వారసత్వం నాదంటే నాదని వివాహితురాలైన అతని పెద్దకూతురు, పెద్ద మనుమడు పోరాడుకుంటున్నారు. అదీ చిత్రం! (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2013)