నెల్సన్ మండేలా చనిపోయిన తర్వాత ఆయన గురించి రాయమని చాలామంది పాఠకులు అడిగారు. ఆయన గొప్పవాడే కానీ ఆయన పోయిన దగ్గర్నుంచి అంత్యక్రియలు అంతమయ్యేదాకా మన పేపర్లు, టీవీలు ‘నల్ల సూరీడు’ అంటూ ఆయన జీవితవిశేషాలతో చావగొట్టేశారు. వినివిని నాకైతే చికాకు వేసింది. నా తరఫున కూడా పాఠకులను వేధించడం దేనికని వూరుకుని మండేలా జీవితంలో ముఖ్యపాత్ర వహించిన విన్నీ గురించి నేను 1998లో రాసిన వ్యాసాన్ని కింద యిస్తున్నాను. అప్పట్లో నేను ఆంధ్రజ్యోతి ఆదివారంకు ప్రత్యేకవ్యాసాలు (కవర్ స్టోరీ) రాస్తూండేవాణ్ని. విన్నీ మండేలాపై విచారణ ప్రారంభమైనపుడు అప్పట్లో ఆదివారం ఎడిటర్ ఉమామహేశ్వరరావు నన్ను అడిగి రాయించుకున్నారు. స్వాతంత్య్ర పోరాటాలు అవీ పుస్తకాల్లో చదివినపుడు ఆదర్శవంతంగా కనబడి బాగానే వుంటాయి. కానీ దానిలో పాల్గనే వ్యక్తులు రాగద్వేషాలకు అతీతంగా వుండరు. మన స్వాతంత్య్రోద్యమం గురించి పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘‘రామరాజ్యానికి రహదారి’’ అసంపూర్ణ నవలలో యిలాటి వ్యక్తుల గురించి రాశారు. ఒకాయన స్వాతంత్య్రం కోసం జైలుకి కూడా వెళ్లి వస్తూంటాడు. వివాహితుడైన ఆయనకు వదినగారితో అక్రమ సంబంధం ఏర్పడుతుంది. అదేమిటి అంటే అంతే..! మన దేశనాయకులలో చాలామందికి వ్యక్తిగతమైన దౌర్బల్యాలుంటాయి. వాటిని హైలైట్ చేయవలసిన అవసరం లేదు, అదే సమయంలో వాటిని చూపించి వారి ఆశయాన్ని కించపరచనూ కూడదు.
నెల్సన్ మండేలా గృహనిర్బంధంలో దాదాపు మూడు దశాబ్దాల పాటు వుండి పేరు తెచ్చుకున్నాడు. బాగానే వుంది. కానీ అతని విముక్తి గురించి బయటి పోరాటం సాగించినది విన్నీ. ‘గాంధీగారిది చాలా సింపుల్ లైఫ్‌స్టయిల్’ అని మెచ్చుకుంటే సరోజినీ నాయుడు చమత్కరించింది – ‘ఆయన్ను పేదగా వుంచడానికి మేమెంత ఖర్చు పెడుతున్నామో తెలుసా?’ అని. గాంధీగారు రైల్లో మూడో తరగతిలో ప్రయాణిస్తానని పట్టుబట్టేవారు. మామూలు మూడో తరగతి పెట్టెలో ఎక్కనిస్తే కూర్చోడానికి కూడా చోటుండదు. పైగా జనాలంతా ఆయనకు షేక్‌హ్యాండ్ లిచ్చి, కాళ్ల మీద పడిపోయి నిద్రాహారాలు లేకుండా చేస్తారు. అందుకని ఆయన అనుయాయులు ఆ పెట్టెలో టిక్కెట్లన్నీ కొనేసి, కాంగ్రెసు కార్యకర్తలను కూర్చోబెట్టేవారట. మరి దానికి ఖర్చెంత అయి వుంటుంది? అలా చూస్తే ఫస్ట్‌క్లాసులో వెళ్లడం చవక కదా. మండేలా ఖైదులో కూర్చున్నాడు. బయట పోరాటం చేస్తున్నపుడు విన్నీ కొన్ని మంచి పనులూ చేసింది, కొన్ని చెడ్డపనులూ చేసింది. వ్యక్తిగతమైన బలహీనతలు ప్రదర్శించింది. జాతి వివక్షత రాజ్యం చేస్తున్నపుడు వీధి పోరాటాల్లో అన్నీ న్యాయబద్ధంగానే నడపాలంటే కుదరదు మరి. ఆమె విధానాలను అంగీకరించాలన్నా, అలా అని తప్పుపట్టాలన్నా – రెండూ కష్టమే. ఆ సందిగ్ధతే, ఆ వైరుధ్యమే నాకు ఆసక్తి కలిగించి, యీ వ్యాసం రాయడానికి పురికొల్పింది. దీనికి కాప్షన్ పెట్టినది, ఇటాలిక్స్లోని ముందు మాటలు రాసినది ఉమామహేశ్వరరావే!
నిప్పుకొలనులో ఉక్కుకలువ – విన్నీ మండేలా
బిగుసుకున్న జాత్యాహంకారపు ఉక్కు సంకెళ్లకేసి ఆమె కన్నెర్ర చేసినపుడు జాతి జాతంతా ఆ నిప్పులో కాగడాల్ని వెలిగించుకుంది. ఆ కాగడాలతో తెల్ల చీకటిని మట్టుబెట్టేసింతర్వాత కూడా… ఇప్పుడూ ఈ క్షణమూ ఆమె కన్నెర్రనైంది. ఆ కంటికి నెత్తుటి కాటుకను దిద్ది ఇప్పుడందరూ ఆమెను ‘రక్తపిపాసి’ అంటూ నిందిస్తున్నారు. స్వేచ్ఛా విహీనమైన జాతికోసం, చెరజిక్కిన భర్తకోసం ఆమె తెగబడ్డపుడు ఆమెను వీరవనిత వన్నారు. తన కోసం, తనలోని ఒంటరితనాన్ని తరిమికొట్టడం కోసం ఆమె తెగబడ్డపుడు ఆమెను తెగించిన ఆడదన్నారు. అందరికీ ఉపకరించిన ఆ తెగువే ఇప్పుడందరి కళ్లకీ తెంపరితనంగా కనిపిస్తోంది. తిరస్కరించడం ఇవాళ ఆమెకు కొత్తకాదు. నెల్సన్ మండేలా కోసం తండ్రిని తిరస్కరించింది. స్వజాతీయుల కోసం శ్వేత ప్రభుత్వాన్ని తిరస్కరించింది. పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరై రిక్తహస్తాల్తో నిలబడాల్సచ్చినప్పుడు భర్తను తిరస్కరించింది. అతని ప్రభుతను తిరస్కరించింది. ఇప్పుడిక… తనవైపు ఎక్కుపెట్టిన చూపుడు వేళ్లని తిరస్కరిస్తోంది.
మొన్నటివరకు ఆమె ఒక వీరవనిత. దక్షిణాఫ్రికాకు ‘జాతిమాత’. 28 ఏళ్లు చెరలో మగ్గిన భర్తను సంరక్షించుకోడానికి, వెలుపలికి తీసుకువచ్చి గద్దెనెక్కించడానికి అహరహం శ్రమించిన సాహసి. ఆమె భర్త దేశాధినేతగా విరాజిల్లుతున్న ఈనాడు, ఆమె – భర్తచే పరిత్యక్తయన, ప్రభుత్వం నుండి బహిష్కృతయన, పార్టీ వ్యవహారాల్లో అభిశంసితయన, చర్చనీయాంశమై బోనెక్కవలసి వచ్చింది. ఎందుకిలా జరిగింది? ఈ పరిస్థితి రావడానికి ఆమె ఎంతవరకు బాధ్యురాలు?
ఆర్చ్ బిషప్ డెస్మాండ్ టుటు అధ్యక్షతన ఏర్పడిన సత్యనిర్థారక సమితికి శిక్షలు విధించే శక్తి లేదు. ట్రూత్ అండ్ రికన్సిలేషన్ కమిషన్ పేరిట 1995లో ఏర్పడిన ఆ సమితి ఏర్పాటే విలక్షణమైనది. దక్షిణాఫ్రికాలో ఉన్న ఆఫ్రికన్లను తమ వలస పాలనలో అణగదొక్కిన శ్వేతజాతీయులు అతి క్రూరులు. తెల్లవాడు కాదన్న కారణంగా మహాత్మాగాంధీని టిక్కెట్ వున్నా రైలులో నుంచి బయటకు తోసిపారేసింది ఆ సీమలోనే. ఆయన తన సత్యాగ్రహ శంఖాన్ని పూరించినది ఆ గడ్డలోనే. అక్కడ నుండి గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చి, ఆంగ్లేయులను ఈ దేశాన్నుండి వెడలనంపారు కానీ దక్షిణాఫ్రికాలో వారి పాలన అలాగే సాగింది. ఆ అల్పసంఖ్యాకుల ప్రభుత్వాన్ని నడపడానికి అనేకమంది సహకరించారు. ఆ ప్రభుత్వ ఛత్రచ్ఛాయల్లో అనేకమంది భారతీయులు కూడా వర్ధిల్లారు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ తన దీర్ఘ పోరాటానంతరం శ్వేతజాతి ప్రభుత్వాన్ని గద్దె దింపింది. అయితే ప్రభుత్వం చేతులు మారడం అంత సులభమైన వ్యవహారం కాదు. ఇన్నాళ్లూ తెల్లవారి అక్రమాలకు గురైన నల్లవారు ప్రతీకారానికై ఉవ్విళ్లూరకుండా వుంటారా? (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2013)