‘‘పెద్దమనుష్యులు’’ సినిమాలో కొసరాజుగారి ఓ రాజకీయ వ్యంగ్యగీతం వుంది. ‘శివశివమూర్తివి గణనాథా’ అని. ‘మంత్రీ పదవి చెయ్ గణనాథా, నువ్వు ఓడకుంటే ఒట్టు పెట్టు గణనాథా..’ అని. మంత్రి పదవే కాదు, ఏ పదవి ఎక్కినా అన్‌పాప్యులర్ కావడం తథ్యం. అరవింద్‌కు యీనాటి పాప్యులారిటీ ఆర్నెల్ల తర్వాత వుంటుందన్న నమ్మకం ఎవరికీ లేదు. పదవి అంటేనే పెద్ద గొయ్యి లాటిది. ఇప్పుడు ఆప్ ఆ గోతిలోకి దిగింది. ఎంత సంశయిస్తూ దిగిందన్నది ప్రశ్న కాదు, దిగిందా లేదా అన్నది పాయింటు. ఆప్ సర్కారు ఆయుష్షు ఎంతకాలం అన్నదే యిప్పుడు అందరికీ ఆసక్తి కలిగిస్తున్న అంశం. ఈ అనుమానం దేనికి? ఆప్ ప్లస్ కాంగ్రెసుకి వచ్చిన సీట్లతో ప్రభుత్వానికి సింపుల్ మెజారిటీ వచ్చినట్లే కదా అనవచ్చు. కానీ బయటినుండి మద్దతు యిస్తున్నది కాంగ్రెసు! అసలే దాని హిస్టరీ అంతంతమాత్రం! బిజెపికూడా బయటనుండి మద్దతు యిచ్చినపుడు కాంగ్రెసు పోకడలే పోయింది. విపి సింగ్ కథ చూస్తే తెలుస్తుంది.
చరణ్ సింగ్ బోల్తా పడిన వైనం
కానీ కాంగ్రెసు యీ విద్యలో నిష్ణాతురాలు. అవతలివాళ్లకు ఆశ పెట్టడంలో, ముగ్గులో దింపడంలో, అదను చూసి కాళ్ల కింద చాప లాగేయడంలో దాన్ని మించిన ఘనులు లేరు. 1977లో ఇందిరా గాంధీని ఓడించి జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచింది. అందరూ సమర్థులే. కానీ కలిసి పనిచేయలేకపోయారు. వ్యక్తిగతమైన అహంభావాల కోసం ప్రభుత్వాన్ని బలి యిచ్చారు. ప్రధాని మొరార్జీ, ఉపప్రధాని చరణ్ సింగ్ సమావేశమైతే పేపర్లో ఒక న్యూస్‌గా వచ్చే రోజులవి. అలాటి టైములో ప్రతిపక్షంలో వున్న కాంగ్రెసు చరణ్ సింగ్‌ను లోబరచుకుంది. దాన్ని సంధానపరచిన దెవరో తెలుసా? ఇందిరా కుమారుడు సంజయ్ గాంధీ, చరణ్ అనుంగు శిష్యుడు రాజ్ నారాయణ్. రాజ్ నారాయణ్ ఇందిరా గాంధీని మొదట కోర్టులో, తర్వాత ఎన్నికలలో ఓడించాడు. ఇందిర గురించి పబ్లిక్ సమావేశాల్లో కూడా చెత్తగా మాట్లాడేవాడు. ఇక సంజయ్ గురించి అయితే చెప్పనే అక్కరలేదు. విషం కక్కేవాడు. అలాటివాడు సంజయ్ ఓ పాత్రికేయుడి ద్వారా కబురంపాడనగానే పరిగెట్టుకుని వచ్చాడు. మొరార్జీ ప్రభుత్వం కూలదోస్తే మేం బయటనుండి మద్దతు యిచ్చి చరణ్ సింగ్‌ను ప్రధాని చేస్తాం అని ఆశపెట్టారు. దాన్ని రాజ్ నారాయణ్ తను నమ్మి, చరణ్ సింగ్‌ను నమ్మించాడు. ప్రధాని కావడమే తన జీవితలక్ష్యం అని చాటుకున్న చరణ్ దాని కోసం యీ పనికి ఒడంబడ్డాడు. మొరార్జీని పడగొట్టాడు. రాష్ట్రపతి చరణ్‌ను పిలిచి పార్లమెంటు విశ్వాసాన్ని చూరగొనమని సమయం యిచ్చాడు.
ఆ సమయంలో కాంగ్రెసు చరణ్‌కు మొండిచెయ్యి చూపించింది. ఇక చరణ్ పార్లమెంటుకు మొహం చాటేశాడు. ఉపప్రధాని లెవెల్లో ఉత్తరాదిలో టాలెస్ట్ లీడరుగా వున్న చరణ్‌ను రాత్రికి రాత్రి ఓ బఫూన్‌గా చూపించింది కాంగ్రెస్. ఇక అప్పణ్నుంచి ఏడెనిమిది నెలలపాటు ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడింది. పరిపాలన నాశనమైంది. ప్రజలు కష్టాలపాలయ్యారు. రెండేళ్ల జనతా పార్టీ సుపరిపాలనను అందరూ మర్చిపోయి, దీన్నే గుర్తు పెట్టుకున్నారు. ఇలా కొట్టుకుని చచ్చేవారి కంటె, నియంత అయినా ఇందిరా గాంధీయే బెటర్ అనుకున్నారు. పబ్లిక్ మూడ్ చూసుకుని ఇందిర ‘పనిచేసే ప్రభుత్వం’ (ద గవర్నమెంట్ దట్ వర్క్‌స్’) అనే నినాదంతో 1980 ఎన్నికలకు వెళ్లి అఖండ విజయం సాధించింది. చరణ్ సింగ్, రాజ్ నారాయణ్ కాలగర్భంలో కలిసిపోయారు. ఇందిర మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఆవిడ వంశమే యింకా మనల్ని పాలిస్తోంది. చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని, దేవెగౌడ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌వాళ్లు ó ఎలా ఆడించారో తెలుసు. అదను చూసి పడగొట్టి కాంగ్రెసు తప్ప యీ దేశానికి సుస్థిరప్రభుత్వాన్ని వేరెవరూ అందించలేరు అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా పంపారు.
మద్దతు యిచ్చేందుకు కాంగ్రెసుకు గల కారణాలు
ఇప్పుడు ఆప్‌తో కూడా కాంగ్రెసు అదే ట్రిక్కు ప్లే చేస్తోందా? అని అనుమానం. అసలు తమను అంత తిట్టిపోసిన ఆప్‌కు మద్దతు ఎందుకు యివ్వాలి? ఇవ్వకపోతే మళ్లీ ఎన్నికలు జరగక మానవు. ఆప్ నెగ్గుతుందో లేదో అన్న అనుమానంతో యీసారి వాళ్లకు ఓటేయని ఓటర్లు వచ్చేసారి వేస్తారు. దాంతో ఆప్ సీట్లు పెరుగుతాయి. ఎవరివి తరుగుతాయి? బిజెపివా, కాంగ్రెసువా? నెగ్గేవాడికే తమ ఓటూ వేస్తేనే తమ ఓటు సద్వినియోగం అవుతుందని భావించే మనస్తత్వం ఓటర్లలో వుంటుంది. అందుకే ఎన్నికల ముందు సర్వేలు నిషేధించాలని అధికార పార్టీలు అంటూ వుంటాయి. ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు జరిగితే ఓడిపోయే కాంగ్రెసుకు ఓటేస్తే ఓటు మురిగిపోయినట్లే అనుకున్న కాంగ్రెసు ఓటర్లు కూడా బిజెపికో, ఆప్‌కో వేసేస్తారు. దేశరాజధానిలో ఇప్పటికన్నా దిగజారే పరిస్థితిని కొని తెచ్చుకుని పరువు యింకా పోగొట్టుకోవడం కంటె ఎన్నికలను ఎలాగైనా ఆపితే చాలని కాంగ్రెసు భావించింది. ఈ పొత్తు పార్లమెంటు ఎన్నికల వరకు కొనసాగితే ఆప్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకుని తమ పార్టీ తరఫున కొందరు కాండిడేట్లను గెలిపించుకోవచ్చు. ఢిల్లీ నుండి ఎన్నికయ్యే కాంగ్రెసు ఎంపీలలో చాలామంది ప్రముఖులున్నారు. వారు సాఫీగా ఎన్నికవాలంటే యిప్పుడు దిగి రావాలి.
ఇప్పుడు మద్దతు తీసుకున్నంత మాత్రాన, పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెసుతో ఆప్ పొత్తు కుదుర్చుకుంటుందన్న గ్యారంటీ ఏముంది? అది ఒక మర్యాద తప్ప నిబంధన కాదు. అయినా కాంగ్రెసు రిస్కు తీసుకుంటోంది. ఎందుకు? ఆప్‌ని యిలాగే వదిలేస్తే అది చెలరేగిపోయి పార్లమెంటు ఎన్నికలలో తమ పార్టీకి మరింతగా గండి కొట్టవచ్చు. కార్యాచరణ అంటే కబుర్లు చెప్పినంత సులభం కాదని ఢిల్లీ ఓటర్లకు నిరూపించడానికి ఆప్‌కు ఒక అవకాశం యిస్తోంది కాంగ్రెసు. బయట వుండగా ఎన్ని నీతులైనా చెప్పవచ్చు. అధికారంలోకి వచ్చాక ఎన్ని రకాలుగా రాజీ పడతారో కళ్లకు కట్టినట్టు చూపాలంటే ఆప్ సర్కారు ఏర్పడి తీరాలి.
పదవి యిచ్చి చూడు
జాతక కథల్లో ఓ కథ వుంది – ‘ఓ బౌద్ధ భిక్షువు ఓ కుక్కను అన్యాయంగా కొట్టాడు. కుక్క రాజైన బ్రహ్మదత్తుడి వద్దకు వచ్చి ఫిర్యాదు చేసింది. ‘భిక్షువుకి శిక్షేం వేయాలో నువ్వే చెప్పు’ అన్నాడు బ్రహ్మదత్తుడు కుక్కతో. ‘ఇతన్ని రాజుగారి సత్రపు గుమాస్తాగా వేయండి’ అంది కుక్క. అందరూ ఆశ్చర్యపడితే అప్పుడు చెప్పింది – ‘సత్రం గుమాస్తాగా వున్నవాడు సత్రంలోని భాండాగారం, భోజనశాల, పశుదాణా శాల, యాత్రికులు దాచుకునే వస్తువుల గది (క్లోక్ రూమ్) వంటి వాటిపై అజమాయిషీ చేయాలి. యాత్రికుల నుండి రుసుము సరిగ్గా వసూలు చేయాలి. యాత్రికుల వస్తువులు దొంగిలించే దొంగలను పట్టుకుని శిక్షించాలి. ఒక్కోప్పుడు సాక్ష్యాలు దొరకవు. అయినా సొంత తెలివి, వివేకం వుపయోగించాలి. తెలిసో, తెలియకో ఏదో ఒక తప్పు చేయకమానడు. ఆ పాపం వచ్చే జన్మదాకా కూడా వేధిస్తుంది. గతం జన్మలో నేను సత్రం గుమాస్తానే. చిన్న తప్పు జరిగి యీ జన్మలో కుక్కగా పుట్టాను. పుణ్యం చాలా వుంది కాబట్టి పూర్వజన్మజ్ఞానం నశించలేదు.’ అంది కుక్క. సాధారణ ప్రభుత్వోద్యోగం చేస్తేనే పాపం తప్పదంటే, యిక పై పదవిలో వున్నవాడు ఎన్ని పొరబాట్లు చేస్తాడో ఊహించండి.
అరవింద్ కేజ్రీవాల్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌లో పనిచేశారు కానీ మానిఫెస్టో తయారు చేసేముందు ఆర్థికంగా లెక్కలు వేశారో లేదో నాకు డౌటు. విద్యుత్ చార్జీలు సగానికి సగం తగ్గిస్తామని, ఇంటికి 700 లీటర్లు నీళ్లు యిస్తామని, యిలా ఎడాపెడా వాగ్దానాలు గుప్పించాడు. ఇప్పుడు అవి పీకకు చుట్టుకున్నాయి. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినవాళ్లు యిలాటి వాగ్దానాలు ధారాళంగా చేస్తారు. నిధులు ఎక్కణ్నుంచి వస్తాయని అడిగితే అవినీతి అరికడితే అవే వస్తాయని సమాధానమిస్తారు. పదవిలోకి వచ్చాక అర్థమవుతుంది – అవినీతి మాట ఎలా వున్నా డబ్బులు సరిపోవని. అప్పణ్నుంచి కేంద్రం నిధులు యివ్వాలి అని గొడవ మొదలుపెడతారు. స్కీములు వీళ్లవి, పేరు వచ్చేది వీళ్లకు, నిధులు మాత్రం కేంద్రం యివ్వాలిట..! ఎందుకు యిస్తుంది? అప్పణ్నుంచి యాగీ. అన్ని రాష్ట్రాలూ యిలాగే అడిగితే కేంద్రం ఎక్కణ్నుంచి తెస్తుంది?
ఆంధ్ర, అసోం, తమిళనాడు.. ఎక్కడ చూసినా యిదే కథ
ఎన్టీయార్ దగ్గర్నుంచి యిదే కథ. ఆయనా బోల్డు పథకాలు ప్రకటించాడు, అవినీతి రూపుమాపుతానన్నాడు. ఎక్కడైనా అవినీతి జరుగుతూంటే ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, వచ్చి వాలతాను. అని వాగ్దానాలు గుప్పించారు. జరిగిందేమిటి? ఎన్టీయార్ అవినీతిరాహిత్యాన్ని ఆయన తమ్ముళ్లే భరించలేకపోయారు. ‘మీకేం సార్, షష్టిపూర్తి వరకు సినిమాల్లో నటించి బోల్డు వెనకేశారు. మేం మా ఖర్చులతో నెగ్గి వచ్చాం. కాస్త చూసీచూడనట్టు వదిలేయాలి’ అని మొత్తుకున్నారు. ఆయన వినలేదు. ఇలాటి అసంతృప్త ద్రావణాలను నాదెండ్ల పోగేశారు. కాంగ్రెసు మద్దతు యిచ్చింది. గద్దె కెక్కిన ఏడాదిన్నరకే ఎన్టీయార్‌ను దింపేశారు. ప్రజాందోళన మరీ ఎక్కువగా వుండడంతో ఆయన పదవి ఆయనకు దక్కింది. పుష్కరం తర్వాత మళ్లీ చంద్రబాబు అదే సాహసం చేసి సక్సెస్ అయ్యారు. ఎందుకంటే అప్పటికే తెలుగు తమ్ముళ్లు తెలివి మీరారు. ఎన్టీయార్ అంటే ఎన్నికలలో గెలిపించడానికే పనికి వస్తారు కానీ తర్వాత మేత మేయనిచ్చే రకం కాదని గ్రహించారు. అందుకే తెలుగుదేశంలో ఎన్టీయార్ శకం అంతరించి కాంగ్రెసుకు డూప్లికేటు అయిన చంద్రబాబు శకం అవతరించింది. కాంగ్రెసు రాజకీయవారసత్వాన్ని నిరసిస్తూ ప్రభవించిన టిడిపి యీనాడు అవే వారసత్వపు గొడవల్లో కొట్టుమిట్టులాడుతోంది.
ఆదర్శాలతో ప్రారంభించిన పార్టీలెన్నో యీ విధంగా తయారయ్యాయి. తమిళనాడులో కాంగ్రెసు ముఖ్యమంత్రి భక్తవత్సలం పదిలక్షల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణతో డిఎంకె – ‘బక్తవచ్చలం-పత్తులచ్చం’ అనే నినాదంతో 1967 ఎన్నికలలో పోటీ చేసింది. తర్వాత ఏర్పడిన డిఎంకె ప్రభుత్వం అణ్నా కాలంలో సంగతి ఏమో కానీ కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాక లంచగొండితనానికి, అవినీతికి ఆలవాలంగా మారింది. అసోం గణపరిషత్ పార్టీగా మారి ఎన్నికలు గెలిచినపుడు దేశంలో కొత్తగాలి వీచిందని అందరూ ఆనందించారు. ప్రఫుల్ల మొహంతా అనే విద్యార్థి నాయకుడు కాలేజీ నుండి డైరక్టుగా సెక్రటేరియట్‌కు వచ్చేసి, ముఖ్యమంత్రి అయిపోయాడు. భృగు ఫూకన్ అనే అతని సహచర విద్యార్థి నాయకుడు ఉపముఖ్యమంత్రి. అతి కొద్ది రోజుల్లోనే యిద్దరూ కొట్టుకున్నారు. మొహంతాపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇద్దరు భార్యల గొడవ కూడా వచ్చింది. తర్వాతి ఎన్నికలలో ఓడిపోయారు. ఇవన్నీ చూసిన పరిశీలకులు ఆప్ కూడా యిదే దారిలో పోతుందని అనుమానిస్తున్నారు. కాబినెట్ ప్రకటన రాగానే వినోద్ బన్నీ అసంతృప్తి చెందాడని వార్తలు వచ్చాయి. ఇది ఆరంభం మాత్రమే. లోకరీతి అదేమిటో గాని మేధావులు, మంచివాళ్లు, ప్రజాస్వామ్యవాదులు ఎప్పుడూ కలిసి వుండలేరు. అహంభావం చేత కలహించుకుంటారు. మధ్యలో సైన్యమో, నియంతో, దుర్మార్గుడో విజయం సాధిస్తాడు. అతని అనుచరులు అతనంటే ప్రాణం పెట్టేట్టు వుంటారు. మేధావులతో కుతకుతలాడి పోతున్న ఆప్ ఐదేళ్లపాటు ఢిల్లీని పాలిస్తుందని ఎంతటి ఆశాభావీ ఊహించలేడు.
మద్దతు తీసుకోవడానికి ఆప్‌కు గల కారణాలు
ఈ విషయం ఆప్‌కీ తెలుసు. తాము పరిపాలన చేయలేక పడిపోతే ఆ నెపాన్ని కాంగ్రెసుపై నెట్టివేయవచ్చని దాని ప్లాను. కాంగ్రెసు అవినీతిపై చర్యలు తీసుకోవడం వలన వాళ్లకు కోపం వచ్చి తమలో విభేదాలు సృష్టించి పరిపాలన సాగకుండా చేస్తోందని ప్రచారం చేసుకోవచ్చు. శిలువ నెక్కిన వాళ్లను ప్రపంచమంతా ఆరాధిస్తుంది. నమ్మిన సిద్ధాంతాల కోసం, నీతికోసం ప్రభుత్వాన్ని కూలదోసుకున్న తమకు మరింత గ్లామర్ పెరుగుతుందని ఆప్ అనుకుంటూండవచ్చు. (ఇలాటివాళ్లపై చేతకానివాళ్లు అనే ముద్ర వేసి ప్రజలు సంప్రదాయ పార్టీలను ఎన్నుకున్న సందర్భాలు అనేకం. అయినా ఎవరి ఆశ వారిది) ఇదంతా ఎందుకొచ్చిన రొష్టు. కాంగ్రెసుకు ‘నో’ చెప్పేసి, హాయిగా మళ్లీ ఎన్నికలకు వెళితే మంచిది కదాని అని మీరూ నేనూ అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం బిజెపికి అందరికంటె అధికంగా సీట్లు వచ్చాయని మర్చిపోవద్దు. మళ్లీ ఎన్నికలు జరిగితే బిజెపి కార్యకర్తలు, సానుభూతిపరులు ఉత్సాహంగా పనిచేసి 36 సీట్లు తెచ్చేసుకునే అవకాశం కూడా వుంది కదాని ఆప్‌కి భయం. బిజెపి విజయావకాశాలపై అనుమానం కొద్దీ యీ సారి ఓట్లేయని ఓటర్లు అది అతి పెద్ద పార్టీగా అవతరించడంతో దానికి గతంలో కంటె ఎక్కువ ఓట్లు వేస్తారు. అదే జరిగితే ఆప్ కార్యకర్తలకు యిప్పుడున్న ఉత్సాహం చల్లారుతుంది. తప్పుడు విధానంతో, లేనిపోని భయాలతో చేతికి వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారని నాయకత్వం నిందపడే ప్రమాదం వుంది. ఢిల్లీలో ఆప్ నెగ్గింది కాబట్టి బంబాయి, పూనా వంటి యితర నగరాలలో కూడా ఆప్ శాఖలు ఉత్తేజంగా పనిచేయవచ్చు. ఢిల్లీ ఉపయెన్నికలలో బిజెపి నెగ్గితే అక్కడ కూడా ఆప్ డల్ అయిపోతుంది. అందుకే రిస్కు తీసుకుని, కాంగ్రెసు మద్దతు తీసుకుంది.
ఈనాటి యీ బంధం ఏనాటి వరకు?
అయితే పార్లమెంటు ఎన్నికల వరకు ఆప్-కాంగ్రెసు బంధం కొనసాగుతుందా లేదా? అనేది ఆప్ ప్రవర్తనపై ఆధారపడుతుంది. కాంగ్రెసు ఎన్నో గమ్మత్తులు చేయగలదు. తెలంగాణ విషయంలో చూస్తున్నాం కదా – కొందరి చేత విభజన అనిపిస్తారు. మరి కొందరి చేత సమైక్యం అనిపిస్తారు. హై కమాండ్ నిర్ణయాన్ని ధిక్కరిస్తా అని ప్రకటించిన ముఖ్యమంత్రిని అలాగే కంటిన్యూ చేస్తూ విభజన బిల్లు పాస్ చేయిస్తామంటారు. వాళ్లతో డీల్ చేసేవాళ్లు కన్‌ఫ్యూజ్ అయి ఛస్తారు. ఇప్పుడు ఆప్ విషయంలో షరతులు లేవని ఒక ప్రకటన వచ్చింది. షరతులు లేకుండా మద్దతు ఎలా వుంటుంది అని షీలా దీక్షిత్ అంటారు. మద్దతుపై మా పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయి అని జనార్దన్ ద్వివేది అంటారు. పార్టీ ఆఫీసు ముందు నిరసన ప్రదర్శనలు నడుస్తూనే వుంటాయి. అవేం పట్టించుకోకండి, మేం మీతోనే వున్నాం అంటూ అరవింద్‌కు హామీ యిస్తారు. అరవింద్ మనకు హామీ యిస్తారు – కాంగ్రెసు మద్దతు తీసుకుంటూనే కాంగ్రెసు నాయకుల అవినీతిపై విచారణ జరుపుతాం అంటూ.
ఇలాటి కబుర్లు జనతావాళ్లు, ఎన్టీయార్, బోల్డు పార్టీలు చేశాయి. కానీ తర్వాత చూస్తే ఫైళ్లు కనబడలేదంటారు. సాక్షాత్తూ ప్రధాని కార్యాలయంలోనే ఫైళ్లు మాయమైనపుడు యిలాటి ఫైళ్లు మాయం కావడం ఏమంత వింత? ఎందుకంటే కాంగ్రెసు మంత్రుల అవినీతితో బాటు వారికి సాయపడిన అధికారుల అవినీతి కూడా బయటపడే ప్రమాదం వుంది. కాంగ్రెసువారు గద్దె దిగారు కానీ, అధికారగణం కొనసాగుతుంది కదా. స్వీయరక్షణకోసం వాళ్లు ఫైళ్లు గల్లంతు చేస్తారు. లేదా తప్పుడు సమాచారం అందించి, ఆప్ చేత తప్పుడు నిర్ణయాలు చేయించి, కోర్టుచేత అక్షింతలు వేయిస్తారు. అక్కడకి ఆప్ చల్లబడుతుంది.
ప్రస్తుతం ఆప్ రెగ్యులర్ పార్టీ కాదు. వినోద్ బిన్నీ ఉదంతంతో రెగ్యులర్ పార్టీగా మారే సూచనలు బయటపడ్డాయి. ఓ నెలా రెండు నెలలు గడిచేసరికి అది కూడా రాజీపడడాలు, సర్దుకుపోవడాలు నేర్చుకుంటుంది. మామూలుగానే ప్రభుత్వం నడపడం చాలా కష్టమైన పని. ఎన్నో సమీకరణాలు చూసుకోవాలి. బయటి మద్దతుతో నడిచే ప్రభుత్వం మరింతగా రాజీపడాలి. పడలేకపోతే యీ లోపునే కూలిపోయి, కాంగ్రెసుపై నింద వేస్తూ ఓటర్ల ముందుకు వస్తుంది. కానీ ప్రజలు ఏ మేరకు విశ్వసిస్తారో తెలియదు. అలా కాకుండా రాజీపడితే పార్లమెంటు ఎన్నికల వరకు మనగలుగుతుంది. కానీ అప్పుడు తన ప్రత్యేకత కోల్పోతుంది. సంప్రదాయ పార్టీల్లో యిదీ ఒకటిగా మిగులుతుంది. ఇలాటి పరిస్థితుల్లో ఆప్‌కు ఆప్షన్లు లేవు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2013)