బస్సెక్కినా, రైలెక్కినా.. సొంత వాహనాల్ని ఆశ్రయించినా.. ప్రయాణంలో మృత్యువు పొంచి వుంటోంది. తప్పెవరిది.? అన్న ప్రశ్నకు ప్రతిసారీ సరైన సమాధానం దొరకడంలేదు, దొరికినా ఆ తప్పుని సరిదిద్దే ప్రయత్నాలు జరగడంలేదు.
మొన్న వాల్వో బస్సు బుగ్గిపాలైతే, ఈ రోజు రైలు బోగీ మంటల్లో కాలిపోయింది. అక్కడా ఇక్కడా భారీ స్థాయిలో ప్రాణ నష్టం సంభవించింది. నాందేడ్ ` బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ బోగీ కాలిపోయిన ఘటన పొద్దున్నే టీవీ సెట్లను ఆన్ చేసినవారికి షాకిచ్చింది. మంటల్లో 23 మంది కాలి బూడిదైపోయారు. వారిలో ఇద్దరు చిన్నారులూ వున్నారు.
వాల్వో బస్సులైనా, రైలు బోగీలు అయినా.. తగలబడిపోవడానికి ఒకటే కారణం.. అదే నిర్లక్ష్యం. బస్సు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమవుతోంటే, రైలు ప్రమాదాల్లో అధికారుల నిర్లక్ష్యమే ప్రయాణీకుల ప్రాణాల్ని తీస్తోంది. చాన్నాళ్ళ క్రితం గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో రెండు బోగీలు తగలబడిపోయిన ఘటన అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడ్తాం.. అని రైల్వే అధికారులు చెప్పడం తప్ప, ఆ దిశగా భద్రతా ప్రమాణాలు పెంచిన దాఖలాల్లేవు.
ఒక్క ప్రాణమైనా ఎంతో విలువైనది.. అన్న ఆలోచన పాలకుల్లో వుంటే.. ఇలాంటి ప్రమాదాలు ఇంకోసారి జరగవు. కానీ, పాలకుల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం.. వెరసి, ప్రయాణీకుల్ని నిలువునా తగలబెట్టేస్తున్నాయి. అప్పుడప్పుడూ జరుగుతుంటాయ్.. అవి అనివార్యం.. అనడానికి వీల్లేని ప్రమాదాలివి.
కారులో వెళితే రోడ్డు ప్రమాదాలు.. బస్సుల్లో వెళితే తగలబడిపోతున్నాయి.. రైళ్ళలో వెళితే కాల్చేస్తున్నాయ్.. ఇంకెలా ప్రయాణం చేయాలి.? అంటూ బాధితులు వాపోతున్నా, వారి ఆవేదనకు పాలకుల వద్దా, అధికారుల వద్దా సమాధానం దొరకదు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా, ప్రయాణాలు ఆగవు.. చావులూ ఆగవు.. పాలకుల తీరూ మారదు.
బతికితే అదృష్టం.. ఆ అదృష్టం ప్రతిసారీ వెన్నంటే వుండాలి దేవుడా.. అని ప్రయాణం చేయడం తప్ప.. ఏమీ చేయలేని దయనీయ స్థితి సామాన్యులది. దారుణం, అత్యంత హేయం. పాలకుల బాధ్యతా రాహిత్యం సామాన్యుల ప్రాణాల్ని తీసేస్తోంది. ఈ మారణహోమానికి అంతమెప్పుడు.? ఇవి ప్రభుత్వ హత్యలు.. అని పాలెం బస్సు దుర్ఘటన బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయంటే, అందులో నిజం లేదని ఎలా అనగలం.?