ఈ ఆరోపణలన్నిటికీ విన్నీ ఒకటే జవాబిచ్చింది. ''నేనే పొరబాటు చేయలేదు. వాళ్లందరూ అబద్ధాలు చెబుతున్నారు'' అని. అంతకంటే వివరణ ఆమె ఇవ్వలేదు. ఏది నిజమో మనకు నిర్ధారణగా తెలియకపోవచ్చు. కానీ విషయాలు అర్థం కావాలంటే గతంలోకి వెళ్లి విన్నీ కుటుంబ చరిత్ర, నెల్సన్ మండేలాతో ఆమె సంబంధ బాంధవ్యాలు, దక్షిణాఫ్రికా విముక్తి పోరాటంలో ఆమె పాత్ర, ఆమె విలక్షణ వ్యక్తిత్వం అన్నీ తెలుసుకోవాలి.
విన్నీ మండేలా అసలు పేరు వామ్‌జామో (దీని అర్థం శోషిత అని) వినిఫ్రెడ్. ఆమె తెంబు జాతికి చెందింది. వారు మాట్లాడే జోసా భాషలో ఆమె పేరు చెప్పాలంటే నోరుతిరగదు. ట్రాన్‌స్కీ జిల్లా పోండాలన్‌లో 1934లో పుట్టింది. తండ్రి కొలంబస్ హిస్టరీ టీచర్. తన జాతి ప్రజల ఘనత గురించి కూతురికి నూరిపోసి, ఆమెను యోధురాలిగా తీర్చిదిద్దాడు. తల్లి సెర్‌ట్రూడ్ దైవభక్తి పరాయణురాలు. శుభ్రత గురించి మహావెర్రి కలది. శుభ్రతలో విన్నీకి ఆమె పోలిక వచ్చింది. ఈ అలవాటు విషయంలో విన్నీని లేడీ మాక్‌బెత్‌తో పోలుస్తారు. రాజ్యకాంక్షతో లేడీ మాక్‌బెత్ హత్యలు చేయిస్తుంది. తర్వాత ఆ రక్తం తన చేతికి శాశ్వతంగా అంటుకుపోయిందనే భ్రమతో ఎప్పుడూ చేతులు కడుక్కుంటూ ఉంటుంది. హైస్కూల్ చదువు తర్వాత విన్నీ 1953లో జోహానస్‌బర్గ్‌లో సోషల్ వర్క్ గురించి పై చదువులు చదివింది. 1958లో నెల్సన్ మండేలాతో పరిచయమైంది.
నెల్సన్ మండేలా కూడా తెంబుజాతికి చెందినవారే. ట్రాన్స్‌కీ జిల్లాకు చెందినవారే. 1942లో చట్టశాస్త్రంలో పట్టభద్రుడైనాక 1944లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఎ.ఎస్.సి.)లో జేరారు. 1948లో ఉల్లంఘనోద్యమంలో చేరి దేశద్రోహ నేరం కింద 1956లో విచారించబడ్డారు. 1961 వరకు విచారణ సాగాక ఆయనను విడుదల చేసారు. ఈ సమయంలోనే ఆయన మొదటి భార్య ఎవిలీన్‌కు విడాకులివ్వడం, విన్నీని వివాహమాడడం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె జెనానికు స్వాజీ రాకుమారునితో వివాహమైంది. 36 ఏళ్ల చిన్న కుమార్తె జన్‌డ్జీకి ఇంకా వివాహం కాలేదు. విన్నీతో బాటు సమితి విచారణకు ఇద్దరూ హాజరయ్యారు. 1960లో షార్ప్‌లో నిరాయుధులైన ఆఫ్రికన్లపై ప్రభుత్వం దమనకాండ జరిపించి, ఎ.ఎస్.సి.ను నిషేధించడంతో మండిపడ్డ మండేలా తన అహింసావాదాన్ని విడిచి సాయుధ పోరాటానికి సిద్ధపడ్డారు. దరిమిలా 1962లో ఐదేళ్ల శిక్ష వేసి ఆయనను జైలులో పెట్టింది ప్రభుత్వం. 1963లో రివోనియా కుట్ర కేసు విచారణ జరిపి, 1964 జూలైలో యావజ్జీవ కారాగార శిక్ష వేసారు.
విప్లవ పోరాటంలో పాలుపంచుకుంటున్న విన్నీని కూడా ప్రభుత్వం విడిచిపెట్టలేదు. ఆమె పౌరహక్కులు హరించి, సాంఘిక కార్యకలాపాలలో పాల్గొనరాదని ఆంక్షలు విధించారు. 17 నెలల పాటు ఏకాంత శిక్ష అనుభవించిందామె. విడుదల అవుతూనే గృహనిర్భంధం, ఆంక్షలు. 1974 నుంచి 75 వరకు తిరిగి కారాగారవాసం. అప్పటికే ఆమెను జాతిమాతగా కొనియాడడం మొదలుపెట్టారు సాధారణ ప్రజలు. కానీ ఎ.ఎస్.సి.లో ఆమెపై వ్యతిరేక భావాలు అప్పట్లోనే ఉండేవి. ఆమె అహంభావం, స్వార్థం, వింత పోకడలు – వీటివల్ల ఆమెను దూరదృష్టి గల నాయకురాలిగా వారు ఆమోదించలేకపోయారు. 1976లో సోవేటో నుండి కూడా ఆమెను బహిష్కరించారు.
1977 నుండి 8 ఏళ్ల పాటు గృహ నిర్భంధంలో ఆమె కనీస సౌకర్యాలు లేని ఇంట్లో ఏకాంత జీవితం గడపవలసి వచ్చింది. ఈ థలోనే ఆమె స్వభావంలో చాలా మార్పులు వచ్చాయి. మద్యపానం అలవాటయింది. ద్వేషభావం ఇనుమడించింది. కొట్టొచ్చేలా కనిపించే రంగురంగుల దుస్తులు వేసుకోసాగింది. బయట నల్లజాతి ప్రజలు ఆమెను ఆరాధిస్తున్నారు. కానీ ఆమె మానసికంగా ఒంటరిదయిపోయింది. భర్త విడుదల కోసం ఉద్యమిస్తూనే ఉంది. ప్రపంచ ప్రజలందరికీ ఆయన తరఫున విజ్ఞప్తులు పంపుతూ, దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అత్యాచారాలను వెలుగులోకి తెస్తూ పోరాటాన్ని సాగిస్తోంది. కానీ వ్యక్తిగతంగా చాలా మార్పులకు గురయింది.
అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడికి తట్టుకోలేక ప్రభుత్వం ఆమెను 1985లో విడుదల చేయగానే ఆమె సొవేటోలో నివాసం ఏర్పరచుకుంది. ఆనాటి సొవేటో-ప్రభుత్వానికి, నల్లజాతి యువకులకు మధ్య పోరు సాగుతున్న కురుక్షేత్రం. నిరాశ్రయులై, నిరుద్యోగులై ఉన్న నల్లజాతి యువకులను వెంట పెట్టుకుని ఆమె ప్రభుత్వాన్నే కాదు, ప్రజలను కూడా గడగడలాడించింది. హింసారాణి (క్వీన్ ఆఫ్ టెర్రర్) అని పిలువసాగారామెను. ప్రభుత్వ నిషేధానికి గురవకుండా ఉండడానికి వేరువేరు పేర్లతో అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి.
వాటిలో విన్నీ స్థాపించి, నడిపిన 'మండేలా యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్' ఒకటి. ఆ క్లబ్ సభ్యులు పోలీసులపై, రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు సాగించారు. పోలీసు ఏజంట్లు కొంతమంది క్లబ్‌లో సభ్యులుగా దూరి మరిన్ని ఘాతుకాలు చేసి, క్లబ్‌కు కళంకం తెచ్చారు. నల్లజాతి వారిపై కూడా సాగే ఈ దుశ్చర్యలు ఎక్కువవడంతో కొంతమంది స్కూలు పిల్లలు కలిసి మండేలా ఇంటిని తగలబెట్టారు. దాంతో ''మండేలా క్రైసిస్ కమిటీ'' అనే పేరుతో ఒక సంస్థ వెలసి మండేలా వద్దకు రాయబారం వెళ్లి ఆయన భార్య, ఆమె గూండాలు చేస్తున్న చేష్టల గురించి ఫిర్యాదు చేసారు. 1988లో క్షయ రావడం వల్ల మండేలాను జైలు నుండి తరలించి గృహనిర్భంధంలో ఉంచారు.
భార్య ఈ విధంగా మారుతూండడం గురించి ఆయన వింటూనే వున్నాడు. కానీ తను బయటపడిన తర్వాత నచ్చచెప్పి ఆమెను మార్చగలనని ఆశించాడాయన. వ్యవహారం ఇంతదాకా వచ్చిందని విని ఆ క్లబ్ మూసేయమని ఈ కమిటీవాళ్ల ద్వారానే ఆమెకు కబురంపాడు. కానీ విన్నీ ఆయన మాటను ఖాతరు చేయలేదు. ఆమె గూండాలు ఇతర నల్లజాతి కుర్రవాళ్లను చావుదెబ్బలు కొట్టడంలో స్టాంపీ అనే కుర్రవాడు చనిపోయాడు. దానిపై చాలా గొడవ అయింది. మాస్ డెమొక్రాటిక్ మూవ్‌మెంట్ అనే సంస్థ విన్నీతో సంబంధ బాంధవ్యాలు తెంపుకుంటూ ఒక ప్రకటన చేసింది. ఆమెను సాంఘికంగా బహిష్కరించమంటూ సొవెటో ప్రజలకు పిలుపునిచ్చింది కూడా. కానీ ఆ పిలుపేమీ పని చేయలేదు. ఆరోపణలు ఎక్కువవడంతో మండేలా క్లబ్‌ను తక్షణం మూసేయమని మళ్లీ కబురంపేడు. అయిష్టంగానే విన్నీ క్లబ్ మూసివేసింది. కానీ ఆ కాలం నాటి కేసులు మాత్రం ఆమెను వదిలిపెట్టలేదు. వాటిలో కొన్ని యిప్పుడు విచారణకు వచ్చాయి -(సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2013)