2013 : ఒక రాజకీయ అవలోకనం

గతం గుర్తుంచుకోని వాడికి అసలు భవిష్యత్తే ఉండదు. అందుకే జరిగిపోయిన పరిణామాల క్రమాన్ని నెమరువేసుకుంటూ ఉండడం అనేది… భవిష్యత్తుకు మార్గదర్శనం చేస్తుంది. రాజకీయరంగం ఈ సిద్ధాంతానికి అతీతమైనది ఎంతమాత్రమూ కాదు. అందుకే గతించిపోయిన సంవత్సరం…

గతం గుర్తుంచుకోని వాడికి అసలు భవిష్యత్తే ఉండదు. అందుకే జరిగిపోయిన పరిణామాల క్రమాన్ని నెమరువేసుకుంటూ ఉండడం అనేది… భవిష్యత్తుకు మార్గదర్శనం చేస్తుంది. రాజకీయరంగం ఈ సిద్ధాంతానికి అతీతమైనది ఎంతమాత్రమూ కాదు. అందుకే గతించిపోయిన సంవత్సరం 2013లో ముఖ్యాంశాలను నెమరు వేసుకోవడం అనేది… 2014 రాజకీయ పరిణామాలను నిర్దేశిస్తుంది. 

ఇంతకూ 2013లో కీలక రాజకీయ పరిణామాలు ఏమిటి? మొత్తం ఏడాదిని గుర్తు చేసుకున్నప్పుడు మనకు ఏం గుర్తుకు వస్తుంది. తాజాగా, వేడివేడిగా గుర్తొచ్చేది తెలంగాణ సమస్య. దాని తర్వాత ఈ ఏడాదిలో ప్రధానమైన వ్యవహారం జగన్‌ చుట్టూ అల్లుకుంటున్న రాజకీయం. అందుకే ఈ రెండు అంశాలను నెమరు వేసుకోవడం అనేది.. యావత్‌ 2013 సంవత్సరాన్నే అవలోకించినట్లు అవుతుంది. ఆ పరిశీలనదిశగా గ్రేటాంధ్ర చేస్తున్న ప్రయత్నం ఇది.

భవిష్యత్తు కేంద్రబిందువు… జగన్‌!

మన రాష్ట్రంలో భవిష్యత్‌ రాజకీయాలు అన్నీ ఇప్పుడు ‘జగన్‌’ అనే కేంద్రబిందువు చుట్టూ అల్లుకుంటున్నాయి. సరిగ్గా ఈ వ్యాసం రాస్తున్న సమయానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంపీగా ఉన్న రోజుల నుంచి ఆయనకు సన్నిహితుడుగా ఉన్న రాష్ట్ర మంత్రి శత్రుచర్ల విజయరామారాజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి ప్రవేశించడానికి తన సన్నిహితులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఆయన సుదీర్ఘకాలంగా రాష్ట్రమంత్రి. వివాదరహితుడైన సీనియర్‌ నాయకుడు. తన ప్రాంతంలో బాగానే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారని.. ఒకటిరెండు నియోజకవర్గాల పరిధిలో ఏ పార్టీ తరఫున పోటీచేసినా ఆయన గెలుస్తారని స్థానికులు కొందరు అంటుంటారు. కానీ ఆయన కాంగ్రెసునుంచి వైకాపాలోకి ఫిరాయించడానికి తీసుకుంటున్న నిర్ణయం అనేది ఒకటి-రెండు అంశాలను తెలియజెబుతుంది. దీనికి కేవలం ఒక ఉదాహరణగా పరిగణిస్తే.. యావత్తు రాష్ట్ర రాజకీయ గమనాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తాయి అవి. 1) మంత్రి శత్రుచర్లకు తాను గెలుస్తాననే నమ్మకం ఉంది. కానీ, అదే సమయంలో వ్యక్తిగా తాను ప్రజల వద్ద సంపాదించుకున్న మంచిపేరును యావత్తూ ఒక దుష్టశక్తి తన పార్టీ కాంగ్రెస్‌ కబళించేస్తుందని.. ఎంత పేరున్నా ఆ ముద్రతో ప్రజల ముందుకు వెళితే ఛీకొట్టి పంపేస్తారని ఆయన చాలా బలంగా విశ్వసిస్తున్నారు. 2) రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న పార్టీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌  మాత్రమే అంత సీనియర్‌ నాయకుడికి కూడా కనిపిస్తున్నది. 

ఈ విషయాలే యావత్తు రాజకీయ పరిణామాలకు సంకేతాలు. జగన్‌- ఇవాళ రాజకీయాలకు కేంద్ర బిందువు. ఈ సంవత్సంరం 2013 ఆరంభంనుంచి పరిశీలించి చూసినప్పుడు.. ఆయన ప్రాభవం.. ప్రభావం అన్నీ మధ్యాహ్నకాలపు నీడలాగా క్రమంగా పెరుగుతూ వచ్చాయి. గ్రహణం విడిచిన తర్వాత.. ఇనుమడించిన వెలుగులతో ప్రకాశించే సూర్యుడిలాగా (అతిశయోక్తి అనిపించినా) ఉన్నది జగన్‌ పరిస్థితి. సంవత్సరాదిలో ఆయన నిండుగ్రహణంలో మునిగి ఉన్నారు. జైల్లో ఉన్నారు. చాలా పరిమితమైన ములాఖత్‌లు. కుటుంబసభ్యులు, పార్టీలోని కొందరు కీలక వ్యక్తులు మాత్రమే ఆయనను కలిసే పరిస్థితి ఉండేది. పార్టీకి సరైన దిశానిర్దేశం లేదు. జగన్‌ అసలు సార్వత్రిక ఎన్నికల్లోగా జైల్లోంచి బయటకు వస్తాడో లేదోనని కార్యకర్తల్లో అనుమానాలు. ఒక రకమైన నిర్వేదం పొగమంచులాగా రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీని అంటిపెట్టుకున్నది ఉన్నది. 

అయితే వ్యూహాత్మకంగా జగన్‌ మాత్రం పార్టీని అలాంటి సందేహావస్థలోంచి జడత్వంలోకి కుంగిపోయే పరిస్థితిని కల్పించలేదు. లోలోన ఈ అనుమానాల ముసురు ఉన్నప్పటికీ.. అప్పటికే రాష్ట్రంలో సాగుతున్న షర్మిల పాదయాత్ర అనేది.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనే స్ఫూర్తి ప్రజల్లో సజీవంగా ఉండడానికి ఎంతో దోహదం చేసిందని చెప్పాలి. పైగా పార్టీ పరంగా చాలా కీలకమైన తరుణంలో షర్మిల బాధ్యతను భుజానమోస్తూ రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. పార్టీ కి ఉన్న కేడర్‌ కట్టుతప్పిపోకుండా కాపాడడంలో ఆమె కృతకృత్యులయ్యారు. 

ఈ పరిణామాలు నడుస్తున్న సమయానికి కేంద్రం తెలంగాణ మీద ఒక నిర్ణయానికి రావడం అనేది చాలా కీలకం. ఈ విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ దోబూచులాట ఆడింది. తెలంగాణలో కూడా తమకు ఆదరణ ఉన్నప్పుడు.. ఎందుకు వదులుకోవాలి అనే ఉద్దేశంతో.. తొలుత రాష్ట్రాన్ని చీల్చడం అనేది పూర్తిగా కేంద్రం ఇచ్ఛానుసారం జరిగే వ్యవహారం అయినప్పుడు మమ్మల్ని అభిప్రాయం అడగడం ఎందుకు అనే సవాలుతో.. కేంద్ర సర్కారులో లేని ఆలోచనల్ని (బహుశా) రగిలించింది. పైకి ‘మీకు నచ్చితే చీల్చేసుకోండి’ అని అన్నప్పటికీ, సంక్లిష్టమైన ఈ విభజన విషయంలో కేంద్రం ముందడుగు వేయగలదని వైకాపా ఊహించలేదు. వారు అడుగు ముందుకుపెట్టి, ఇక మడమ తిప్పం అని ప్రకటించేసరికి.. వీరు తత్తరపడ్డారు. ఆ తత్తరపాటు కొంత విమర్శలకు, పార్టీ ఒక ప్రాంతంలో విధ్వంసం అయిపోవడానికి కారణమైంది. చిత్తంలో సమైక్యం అనే వాంఛను ఉంచుకుని, బయటకు మాత్రం సమన్యాయం పాట పాడారు గానీ.. జగన్‌ బృందం తెలంగాణ ప్రాంతంలో పార్టీ అస్తిత్వాన్ని కాపాడలేకపోయింది. తాము చెప్పే మాటలతో వలసల్ని అడ్డుకోలేకపోయింది. దక్కుతుందేమైనా ఉందనిపించే ఆశ ఉన్నంత వరకే దోబూచులాట ఉంటుంది. ఖచ్చితంగా దక్కదని తేలిపోయాక ఇక తెగింపు పెరుగుతుంది. అందుకే వైకాపా కూడా తెలంగాణ విషయంలో ఒక తెగింపునకు వచ్చేసింది. సమన్యాయం కాస్తా పక్కన పెట్టేసి.. ఏకంగా.. సమైక్యాంధ్ర వాదాన్నే భుజానికెత్తుకుంది. 

నిజానికి ఇది చాలా కీలక పరిణామం అని చెప్పాలి. వైకాపా సమైక్య వాదానికి స్థిరంగా కట్టుబడడం అనేది ఆ పార్టీకి చాలా గొప్ప ఎడ్వాంటేజీగా మారింది. రాష్ట్రం మొత్తం సమైక్య నినాదాలతో హోరెత్తిపోతున్న వేళ.. ఒక ప్రధాన రాజకీయ పార్టీ పూర్తిస్థాయిలో దీనికి కట్టుబడడం అనేది వారి ఇమేజిని అమాంతం పెంచుతుందనడంలో సందేహం లేదు. సరిగ్గా ఇలాంటి ఎడ్వాంటేజీలను పార్టీ మూటగట్టుకుంటున్న సమయంలోనే.. చంచల్‌గూడ జైలు తలుపులు తెరచుకున్నాయి. 

జగన్‌ బయటకు వచ్చారు. ఆయనేమీ ఒలింపిక్స్‌లో పతకం సాధించి, లేదా క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ను గెలిచిన జట్టుకు సారథ్యం వహించి తిరిగి రావడం లేదు. కానీ ఆయన జైలునుంచి ఇంటికి వస్తున్న సందర్భంగా జరిగిన సంరంభం, హడావిడి చూసిన వారికి మాత్రం.. జగన్‌ రాష్ట్ర రాజకీయాలను ఒక కొత్త దిక్కుకు తీసుకువెళుతున్నారని అర్థమైంది. ఆ తర్వాతి పరిణామాలన్నీ దానికి అనుగుణంగానే జరుగుతున్నాయి. 

స్పష్టమైన సమైక్య వాదంతో జగన్‌ తన పార్టీని సీమాంధ్ర ప్రాంతంలో తన ప్రత్యర్థులు ఇప్పట్లో అందుకోలేనంత ఎడ్వాంటేజీ పొజిషన్‌లోకి తీసుకువెళ్లిపోయారు. పైగా ఆ సమైక్య ఇమేజి భంగపడకుండా కాపాడేందుకు సకలయత్నాలు చేస్తున్నారు. 

2014లో జగన్‌ : ముఖ్యపదవిని అందుకోగలిగిన నేతగా జగన్‌ ఆవిష్కృతులు కావొచ్చు. నిజానికి జగన్‌ ముఖ్యమంత్రి కావడానికి రాష్ట్ర విభజనకు కూడా లంకె ఉంది. విభజన ఎన్నికల ముందే జరిగితే ఆయనకు ముఖ్యమంత్రిత్వం దక్కడంపై ఎవ్వరికీ సందేహాలు లేవు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పటికీ కూడా సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించి గద్దెనెక్కే అవకాశం ఆయనకే ఉంటుందని కూడా కొందరికి అంచనాలు ఉన్నాయి. ఢిల్లీమ్యాజిక్‌ మళ్లీ ఇక్కడ రిపీటైనా ఆశ్చర్యం లేదని అంటున్న వారున్నారు. 

తక్షణ, కీలక నిర్ణాయక శక్తి… తెలంగాణ!

2013 సంవత్సరానికి పుష్కరం ముందు పునరుజ్జీవనానికి నోచుకుని.. సగం సంవత్సరం గడచిన తర్వాత.. ఒక్కసారిగా విరాట్‌ రూపానికి చేరుకున్న సమస్య తెలంగాణ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అంశం గత 12 ఏళ్లుగా ఎలాంటి స్వరూపంలో ఉన్నదో.. ఈ ఏడాదిలో కూడా అలాంటి రూపంలోనే ప్రారంభం అయింది. తెలంగాణ కు సహకరించని నాయకులను తరచూ తిట్టిపోయడం, అడపా దడపా ఉద్యమాలు… ఇంతే! అయితే ఒక కోణంలోంచి కేసీఆర్‌ మంత్రాంగం ఈ తెలంగాణ అంశంలో చోదకశక్తిని పెంచిందని చెప్పాలి. గతంలో.. నిరాహార దీక్ష చేసి.. ప్రాణాల మీదికి తెచ్చుకుని.. ఏం ఉపద్రవం ముంచుకొస్తుందో ఏమో అనే భయాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రేకెత్తించి.. చీకట్లు ముసురుకున్న తరువాత వారితో హడావిడిగా.. తెలంగాణ అనుకూల  ప్రకటన చేయించిన కేసీఆర్‌.. చాణక్య రాజకీయ దురంధరుడు తాను అని ఈ ఏడాదిలో మరో మారు నిరూపించుకున్నారు. 

ఏ ఎంపీ సీట్లకోసం కాంగ్రెస్‌ నిత్యం వెంపర్లాడుతూ ఉంటుందో, ఏ రీతిగా అయితే బలంగా ఉండే, రూపుదాల్చగల పార్టీలను కబళించి.. తమ బలంగా మురిసిపోవాలని కాంగ్రెస్‌ ఉబలాటపడుతూ ఉంటుందో.. అలాంటి వారి దురాశను సరిగ్గా గుర్తించి కేసీఆర్‌ తన అస్త్రాన్ని ప్రయోగించారు. తెలంగాణ కలను సాకారం చేస్తే.. తన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెసులో విలీనం చేస్తానంటూ ఆయన ‘ఓపెన్‌ ఆఫర్‌’ ఇచ్చారు. ఢిల్లీలో కొన్ని రోజుల తరబడి తిష్టవేసి కీలక నాయకులందరి ఇళ్లకు వెళ్లి.. విలీన మంతనాలు సాగించి, ఆ తర్వాత బహిరంగ వేదికపైనుంచి కూడా ‘ఇలా జరిగిందంటూ’ ప్రకటన కూడా చేసిన కేసీఆర్‌.. కాంగ్రెసులో తెలంగాణ అనుకూల కదలిక తీసుకురావడానికి చాలాకాలమే నిరీక్షించారు. ఎట్టకేలకు జులై 30న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. 

ఆ తర్వాత రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులు. ఊపందుకున్న సమైక్యాంధ్ర ఉద్యమం, ఉద్యమాన్ని వంచించడంలో పోటీ పడిన సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులు… సమైక్య రాష్ట్రమే  మా అందరి సమష్టి వాంఛ అంటూ ప్రజల్ని వంచించి.. సోనియాగాంధీ పాదాల వద్ద వారు రాష్ట్ర ఏకత్వ స్ఫూర్తిని తాకట్టు పెట్టిన తీరు ఇవన్నీ కూడా.. పాఠకులకు తెలుసు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేంద్రమంత్రులు ఒక్కొక్కరు మహావంచకులుగా నిగ్గుతేలారు. రాష్ట్రమంత్రుల చేతగానితనం కూడా అచ్చంగా బట్టబయలైంది. తెలంగాణ అనే పది జిల్లాల ప్రజల కల సాకారం అయ్యే దిశగా బిల్లు కేంద్ర కేబినెట్‌ ఆమోదం పొంది బిల్లు రూపాన్ని సంతరించుకుని, ప్రస్తుతం అసెంబ్లీలో చర్చకు నిరీక్షిస్తున్నది. 

ఈమధ్యలో గుర్తు చేసుకోవలసినవి చాలా పరిణామాలే ఉన్నాయి. సీమాంధ్రలో ఎంతో బలంగా ఉన్న వైఎస్సార్‌సీపీ కేంద్ర నిర్ణయానికి ముందున్న తటస్థ వైఖరిని విడనాడి స్పష్టంగా సమైక్యాంధ్ర కు జై కొట్టడం ఒక కీలక పరిణామం. అటు కాంగ్రెస్‌, ఇటు తెలుగుదేశం పార్టీల్లో సీమాంధ్ర నాయకులు స్పష్టంగా పార్టీల విధానాలతో విభేదించి చీలిపోవడం మరో కీలకాంశం. పార్టీ విధానాల్ని మెజారిటీ నాయకులు ఈసడిస్తే.. అది తమ పార్టీల్లో ఉన్న ప్రజాస్వామ్య పోకడలకు చిహ్నంగా ఆయా పార్టీలు మాట్లాడడం వారి ఆత్మవంచనకు పరాకాష్ట. పైగా మెజారిటీ నాయకులు పార్టీ విధానంతో వ్యతిరేకిస్తూ కూడా.. సదరు పార్టీ విధానంలో మార్పు తీసుకురాలేకపోవడం అనేది.. సమైక్యం పాట పాడుతున్న తెదేపా, కాంగ్రెస్‌  నాయకుల చేతకాని తనానికి మహా నిదర్శనం. ఇన్ని అంశాలు ఈ మధ్య పరిణామాల్లో నిబిడీకృతమై ఉన్నాయి. 

వీటి నడుమ ఒక్క విషయాన్ని మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి .. అచ్చమైన సీల్డుకవర్‌ ముఖ్యమంత్రిగానే అందరికీ తెలుసు. ఆయన కూడా ఆ ఇమేజిని మార్చుకోడానికి గతంలో ఎన్నడూ ప్రయత్నించలేదు. అలాగే రోజులు నెట్టుకుంటూ వచ్చారు. అయితే రాష్ట్ర విభజన వ్యవహారంలో ఏదో పూనకం వచ్చినట్లుగా ఆయన అధిష్ఠానం వైఖరిని ధిక్కరిస్తూ.. హఠాత్తుగా సీమాంధ్ర ప్రాంతంలో తనకు ఒక హీరో ఇమేజిని తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆయనకు అలాంటి ఇమేజి రావడానికి పార్టీ నాయకులు కూడా అనేకమంది తమ వంతు చేయందించారు. అయితే స్వతహాగా ఉన్న పిరికితనం ఆయన దూకుడు నిర్ణయాల వైపు వెళ్లకుండా నిలువరించినట్లు కనిపిస్తోంది. ‘జనవరి 23 తర్వాత ఆలోచిద్దాం’ అని ఆయన చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి గానీ.. నిజానికి కొన్ని పుకార్లను నిజం చేస్తూ ఆయన పార్టీ పెడతారనుకోవడం భ్రమ. ఆయనలో అంత ధైర్యం లేదని తేలిపోయింది. ఆయన నీడను ఆశ్రయిస్తే.. సమైక్య ఓట్లు పడి భవిష్యత్తు కాస్త ఉంటుందేమోనని అనుకున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ అనేది అనివార్యమైన పరిస్థితిలో కనిపిస్తోంది. జనవరి నెల వచ్చినా.. సీఎం చెబుతున్న 23వ తేదీ వచ్చినా.. తెలంగాణ ఆగేలా లేదు. అదే జరిగితే.. సీఎం కిరణ్‌కు సమైక్య హీరోగా ఎంత త్వరగా పేరు వచ్చిందో అంత త్వరగానూ అది మసకబారిపోతుంది. నడమంత్రపు సిరిలాగానే, సరైన పునాదులు లేని నడమంత్రపు ఇమేజి కూడా కలకాలం ఉండదని తేలుతుంది. తాటాకుమంటలాగా ఉంటుంది. 

తెలంగాణ కల సాకారం అవుతున్న సందర్భంలో ఛిద్రం అయిపోయిన మరో పార్టీ తెలుగుదేశం. రాష్ట్రానికి సంబంధించిన ఒక అత్యంత కీలకమైన అంశంపై స్పష్టంగా ఒక అభిప్రాయం చెప్పలేని స్థితిలో సుదీర్ఘకాలం ఆ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పాలించిన నాయకుడు నాటకాలు ఆడడం అనే దౌర్భాగ్యం బహుశా మరెక్కడా ఉండకపోవచ్చు. చంద్రబాబునాయుడు అదే పనిచేస్తున్నారు. ఇలాంటి వైఖరికి ఆయన ఫలితం కూడా అనుభవిస్తున్నారు. ఆయన పార్టీ రెండు ప్రాంతాల్లోనూ అతి భయంకరమైన అపనమ్మకాన్ని మూటగట్టుకుని.. వచ్చే ఎన్నికల్లో దెబ్బతినడానికి సిద్ధంగా ఉన్నది. ఎవరొచ్చి తమను ఆదుకుంటారా? భాజపా చేయిందించి.. కాస్త నిలబడేలా దన్ను ఇస్తుందా అని ఎదురుచూసే స్థితికి తెలుగుదేశం దిగజారిపోవడం వైచిత్రి. కొన్ని పుకార్లు నిజమైతే గనుక.. అది తెదేపా దీనావస్థకు పరాకాష్ట. చంద్రబాబునాయుడు రాష్ట్ర రాజకీయాలనుంచి పలాయన మంత్రం పఠించి 2014 లో జాతీయ రాజకీయాలకు ‘షిఫ్ట్‌’ అవుతారని అనగా పారిపోబోతున్నారని కూడా వినిపిస్తోంది. 

ఈ రెండింటికీ ‘లంకె’ ఉంది!

ఒక కోణంలోంచి చూసినప్పుడు 2013 సంవత్సరంలో కీలక రాజకీయ పరిణామాలు అయిన జగన్‌- తెలంగాణ అంశాలకు లంకె ఉంది. వైఎస్‌ జగన్‌ జైలునుంచి బయటకు రాకుండా ఉంటే.. ఆ ప్రభావం తెలంగాణ అంశం మీద కూడా మరో రకంగా ఉండేది. ఇప్పటిలా ఈ అంశంపై, ఆర్టికల్‌ 3 ఆధారంగా కేంద్రం విచ్చలవిడితనంపై  ఆయన జాతీయ పార్టీల దృష్టిని ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నం, ఆయన పరోక్షంలో నామమాత్రంగా కూడా సాధ్యమయ్యేది కాదు. 

అయితే, కీలకంగా గుర్తించాల్సిన అంశం ఏంటంటే.. ఎన్నికల్లోగా విభజన జరిగితే సరి. జరక్కపోతే.. భవిష్యత్తులో ఆ కల నెరవేరడం భయావహంగా మారవచ్చు. సీమాంధ్రలో తన స్పష్టమైన సమైక్యవాదంతో  ప్రజల ఆదరణను పొందిన జగన్‌ అక్కడ ఏకపక్షంగా సీట్లను గెలుచుకుని, రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పటికీ.. తనే ప్రభుత్వం ఏర్పాటు చేసాడంటే గనుక.. ఇక తెలంగాణ ఎప్పటికీ ఏర్పడకపోయినా ఆశ్చర్యం లేదు. 

2013 సంవత్సరం యొక్క మ్యాజిక్‌ ఏంటంటే.. 

ఈ సంవత్సరంలో రెండు కీలక రాజకీయ పరిణామాలు ఉన్నాయి. ఆ పరిణామాలకు , పార్టీలకు, ప్రాంతాలకు ఒకదానితో మరొకదానికి పొంతన లేదు. కానీ ఈ రెండింటి మధ్య క్లిష్టమైన ఒక అల్లిక ఉంది. మరి భవిష్యత్తు ఎలా సాగుతుందో.. ఏ పరిణామాలు ఎలా కార్యరూపం దాలుస్తాయో తెలుసుకోవడానికి నిరీక్షిస్తూ.. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడదాం. 

నూతన సంవత్సర శుభాకాంక్షలు. 

-కపిలముని

[email protected]