ఎమ్బీయస్‌ : మండేలా భార్య విన్నీ…4

ద్లామినీ కేసు – ద్లామినీ నల్లజాతి యువతి. ఫుట్‌బాల్‌ క్లబ్‌లో సభ్యుడైన షేక్స్‌ ఆమె ప్రియుడు. విన్నీ తనంటే పడిఛస్తుంది కనుక తమ ప్రేమ వ్యవహారం ఆమెకు తెలియకుండా వుంచమని అతను చెప్పాడు. కానీ…

ద్లామినీ కేసు – ద్లామినీ నల్లజాతి యువతి. ఫుట్‌బాల్‌ క్లబ్‌లో సభ్యుడైన షేక్స్‌ ఆమె ప్రియుడు. విన్నీ తనంటే పడిఛస్తుంది కనుక తమ ప్రేమ వ్యవహారం ఆమెకు తెలియకుండా వుంచమని అతను చెప్పాడు. కానీ ద్లామిని గర్భవతి కావడంతో రహస్యం దాగలేదు. అసూయతో విన్నీ తన మనుషులను పంపి ఆమెను ఇంటికి రప్పించుకుంది. తను నాలుగు దెబ్బలేసి 'చూడండ్రా, ఎంతడిగినా ఇది నిజం చెప్పడం లేదు. మరేం చేస్తారో చేయండి' అంది తన అనుచరులతో. వాళ్లామెను తీసుకెళ్లి కొడుతూ వుంటే విన్నీ కూతురు బయటకు వచ్చి ఏమిటీ గొడవ అని వాకబు చేసింది కూడా. 

ఈ దెబ్బల కారణంగా ద్లామిని బిడ్డకు ఇప్పుడు తొమ్మిదేళ్లు వచ్చినా పెరుగుదల బాగాలేదు. ద్లామిని సోదరుడు ట్లోలి కూడా క్లబ్‌ సభ్యుడే. అతన్ని సాటి సభ్యుడైన సిథోల్‌ తుపాకీతో కాల్చి చంపేశాడు. తర్వాత సిథోల్‌ పోలీసు లాకప్‌లో చచ్చిపోయాడు. దీనికంతటికీ కారణం విన్నీకి కలిగిన అసూయే అని ఆరోపణ.

స్టాంపీ కేసు – స్టాంపీ సెపీ అనే పధ్నాలుగేళ్ల కుర్రాడు చాకులాంటివాడు. భయమనేది ఎరుగనివాడు. ట్యుమాహోల్‌లో నివసించే 14 ఏళ్లలోపు పిల్లలను చేరదీసి, వాళ్లకు జనరల్‌గా తనను తానే నియమించుకుని విప్లవంలో అద్భుతాలనెన్నో సాధించాడు. శ్వేతజాతి ప్రభుత్వంలోని ఒక యువ మంత్రిని బాలురపై లైంగిక అకృత్యాలు జరిపేవాడిగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందుదామని చూసింది విన్నీ. ఆ పథకంలో భాగంగానే స్టాంపీని, మరో ముగ్గురు బాలురను పట్టి తీసుకొచ్చారు. ఒక మత గురువు సంరక్షణలో వున్న ఆ కుర్రాళ్లను ఆయన లైంగిక అకృత్యాలకు గురికాకుండా రక్షిస్తున్నామనే మిషతో వాళ్లని 1989 జనవరి 1న విన్నీ ఇంటికి తీసుకువచ్చి, ఆ శ్వేత మంత్రిపై ఆరోపణలు చేయమని అడిగారు.

వాళ్లు నిరాకరించడంతో పట్టుకుని తీవ్రంగా కొట్టారు. చిత్ర హింసల పాలు చేశారు. పిల్లలు అదృశ్యం కావడంపై ప్రజలు గగ్గోలు పెట్టడంతో చివరికి ముగ్గురు పిల్లలను విడుదల చేయడం జరిగింది. నాలుగోవాడైన స్టాంపీ శవం సొనేటో పెంటదిబ్బలో దొరికింది. దానితో చాలా గొడవ జరిగింది. కేసులు పెట్టారు. చివరికి ఫుట్‌బాల్‌ క్లబ్‌ కోచ్‌ అయిన జెర్రీ రిచడ్‌సన్‌ను దోషిగా నిలబెట్టి అతనికి మరణశిక్ష వేశారు. తర్వాత దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. సహ నిందితుడైన కటీజా సెబెఖులుల్‌ విచారణ సమయంలో మాయమైపోయాడు.

సత్యనిర్ధారక సమితి ముందు ఆ క్లబ్‌ సభ్యులు తాము చేసిన తప్పులు ఒప్పుకున్నారు. చావకుండా మిగిలిన బాలురు విన్నీ తమను కొరడాతో కొట్టిందని చెప్పారు. కానీ విన్నీ అదంతా అబద్ధం పొమ్మంది. డిసెంబరు 4న సాక్షి బోనెక్కిన కోచ్‌ జెర్రీ చెప్పిన విషయాలు తలతిరిగేలా చేశాయి. ''నేను ఆ క్లబ్‌కి 1986 నుంచి కోచ్‌గా వున్నాను. పోలీసువాళ్లు చూపిన ఆశలకు లొంగి 1987 మార్చినుంచి వారి ఏజెంటుగా మారాను. మామి (విన్నీని అలాగ పిలిచేవాళ్లు) స్టాంపీని గూఢచారి అని అనుమానించింది. వాళ్ల ఇంట్లో వెనుక గది (పార్లమెంటు అని పిలిచేవాళ్లు) కి తీసుకువచ్చి బంధించాము. మామీయే స్టాంపీని కత్తితో పొడిచిందని కటీజా చెప్పిన సాక్ష్యం తప్పు. ఆమె ఎవర్నీ తన చేతులతో చంపేది కాదు. స్టాంపీని మెడమీద కత్తితో పొడిచింది నేను…''అంటే ఏమిటి – విన్నీ ఉద్యమంలోనే పోలీసు ఏజెంట్లు వున్నారన్నమాట, అందునా క్లబ్‌ కోచ్‌ వంటి ముఖ్యమైన పదవులలో అసలే సందేహమనస్కురాలైన ఆమెకు తన సహచరుల గురించి లేనిపోనివి చెప్పి విషం నూరిపోసేరన్నమాట. ఆమె వాటిని నమ్మి, ఈ అఘాయిత్యాలకు పాల్పడిందన్నమాట. జెర్రీ తక్కిన విషయాల గురించి కూడా చెప్పాడు – ''విన్నీ చెప్పిన మీదట ఇద్దరు ఎం.కె. గెరిల్లాలను మా ఇంట్లో దాచాను. వాళ్ల గురించి పోలీసులకు నేనే ఉప్పందించాను. పోలీసులు వచ్చాక ఆ గెరిల్లాలను నేనే చంపేశాను. వాళ్లతోపాటు నా విషయం బయట పెట్టకుండా వుండడానికి ఆ పోలీసులను కూడా చంపేశాను. గెరిల్లాలు, పోలీసులు ఒకర్నొకరు చంపుకున్నారని అనుకున్నారందరూ. పోలీసులకు గెరిల్లాల సమాచారం అందించినవారెవరని విన్నీ అడిగితే లోలో సోవో, సిబోనిసో తషబలాల పేర్లు చెప్పాను. అయితే వాళ్లను చంపేయమంది. నేను చంపేశాను…'' 

ఇదంతా విన్న సమితివారు ఆశ్చర్యపడి ''పోలీసు ఏజెంటుగా వుండడానికి నువ్వు సిగ్గుపడలేదా'' అని అడిగారు. ''సిగ్గేముంది. ఆ మాటకొస్తే విన్నీయే పెద్ద పోలీసు ఏజెంటు. ఇద్దరు పోలీసు ప్రముఖులతో ఆమెకు లైంగిక సంబంధాలుండేవి'' అన్నాడు జెర్రీ!

భారతీయ డాక్టర్‌ హత్య – జాతి వివక్షకు వ్యతిరేకంగా, మానవహక్కుల కోసం పోరాడే డాక్టర్‌ అబూ బకర్‌ ఆస్వాత్‌ దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డ భారతీయ సంతతికి చెందినవాడు. నల్లజాతీయుల పోరాటానికి మద్దతిచ్చినవాడు. అతన్ని విన్నీ చంపించిందన్న ఆరోపణ అతి తీవ్రమైనది. ఇద్దరికి ఘర్షణ రావడానికి కారణం, విన్నీ అడిగిన దొంగ సర్టిఫికెట్‌ అతనివ్వకపోవడం. నల్లజాతి యువకు లనేకులకు ఆశ్రయం కల్పించిన రెవరెండ్‌ పాల్‌ వెరైన్‌, కటీజా (స్టాంపీ కేసులో సహ నిందితుడు) అనే తన అనుచరుడిపై లైంగిక అకృత్యం జరిపాడనే సర్టిఫికెట్‌ కావాలని విన్నీ డిసెంబరు 1989లో ఆస్వాత్‌ను కోరింది.

ఫుట్‌బాల్‌ క్లబ్‌లో జరుగుతున్న ఘోరాల గురించి బాగా తెలిసివున్న డాక్టర్‌ సర్టిఫికెట్‌ ఇవ్వనన్నాడు. వారిద్దరి మధ్యా వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాతే డాక్టర్‌ను ఆయన హాస్పిటల్‌లో ఎవరో హత్య చేశారు. విన్నీ ఆ టైముకి తను ఊళ్లో లేనని ఎలిబయ్‌ చూపింది కానీ అప్పట్లోనే దానిని ఎవరూ నమ్మలేదు. డాక్టర్‌ సోదరుడు ఇబ్రహీం విచారణ జరగాలని పట్టుబట్టారు. కానీ పోలీసులు విన్నీని దోషిగా నిలబెట్టలేదు.

ఇటీవల సమితి ఎదుట ఇబ్రహీం సాక్ష్యమిస్తూ – ''ఆ కేసులో ముద్దాయిగా నిలబెట్టి తులానీ  హత్య చేయడానికి విన్నీ తనకు డబ్బిచ్చిందని రాసి ఇచ్చాడు. అయినా పోలీసులు అతని మాటలను ఖాతరు చేయలేదు. ఆ సమయంలో మండేలాను జైలునుండి విడుదల చేసే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. అటువంటి సున్నితమైన సమయంలో మండేలా భార్యపై కేసు పెడితే బాగుండదని పోలీసులు భావించారు. కానీ ఆ స్టేట్‌మెంట్‌ కాపీ ప్రాసిక్యూటరు నాకిచ్చి ఎప్పుడో ఒకప్పుడు పనికివస్తుందని దాచమని సలహా ఇచ్చేరు'' అన్నాడు. 

నిజానికి అప్పటికి, ఇప్పటికి మధ్య చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్టాంపీ కేసులో సహ నిందితుడైన కటీజా జాంబియాకు తప్పించుకుని పారిపోయి, చివరికి బ్రిటన్‌కి చేరాడు. ఫ్రెడ్‌ బ్రిడ్‌గ్లాండ్‌ 'కటీజాస్‌ జర్నీ' అనే పుస్తకం కూడా రాసి అతను చెప్పినవి రాసుకొచ్చాడు. బిబిసి వారు ఆ విషయాలపై డాక్యుమెంటరీ కూడా తీశారు. తులానీకి,  సిరిల్‌ మబాతాకు డాక్టర్‌ ఆస్వాత్‌ హాస్పిటల్‌ ఎక్కడుందో చూపించమని విన్నీయే తనను ఆదేశించిందని కటీజా చెప్పాడు. ఆ హాస్పిటల్లో రిసెప్షనిస్టుగా వున్న సిసులు సాక్ష్యంపై కొంత గందరగోళమున్నా విన్నీయే ఆస్వాత్‌ హత్యకు కారకురాలని అందరూ భావించారు. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2013)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3