ఎమ్బీయస్‌: మండేలా భార్య విన్నీ…5

ఈ గొడవలు జరుగుతున్న సమయంలోనే దేశపరిస్థితి చేజారుతుండడం గమనించి శ్వేతప్రభుత్వం మండేలాను విడుదల చేయడానికి చర్చలు ఆరంభించింది. జాతి వివక్షను రద్దు చేసింది. 1990 ఫిబ్రవరిలో మండేలా విడుదల అయ్యేడు. విన్నీ సుదీర్ఘ పోరాటానికి…

ఈ గొడవలు జరుగుతున్న సమయంలోనే దేశపరిస్థితి చేజారుతుండడం గమనించి శ్వేతప్రభుత్వం మండేలాను విడుదల చేయడానికి చర్చలు ఆరంభించింది. జాతి వివక్షను రద్దు చేసింది. 1990 ఫిబ్రవరిలో మండేలా విడుదల అయ్యేడు. విన్నీ సుదీర్ఘ పోరాటానికి విజయం సిద్ధించిన క్షణం అది. వెలుపలి నుండి ఆమె విప్లవాన్ని కొనసాగించి ఉండకపోతే ఆయన ఎన్నటికైనా బయటపడేవారా అన్నంతగా ఆమె పోరాటంలో నిమగ్నమయింది. మండేలా బయటకు వచ్చాక అప్పటి అధ్యకక్షుడు డి క్లర్క్‌తో, రాజకీయ ప్రత్యర్థి ఇంకాతా పార్టీతో చర్చలు జరిపి 1993 నాటికి ఒక ఒప్పందానికి వచ్చేరు. ఆ తర్వాత అన్ని జాతులకు ఓటు హక్కు ఇవ్వబడింది. 1994 ఎన్నికలలో నెగ్గి మండేలా దేశాధ్యకక్షుడయ్యేరు. ఆయన విన్నీకి తన కాబినెట్‌లో సాంస్కృతిక వ్యవహారాలు, సైన్స్‌, టెక్నాలజీ శాఖలో ఉపమంత్రిగా స్థానమిచ్చారు.

విన్నీ ఈ పదవి గెలుచుకున్నది మండేలా భార్యగా కాదు. గత వైరాలు మరవడానికి ఇష్టపడని నల్లజాతి ప్రజల నాయకురాలిగా ఆమెనెవ్వరూ విస్మరించలేని పరిస్థితి వచ్చింది. 1993లో ఎ.ఎస్‌.సి.లోని విమెన్స్‌ లీగ్‌ ప్రెసిడెంట్‌గా ఆమె అల్బర్టినా సిసులును అతి సులభంగా ఓడించింది. సిసులు కూడా మంచి నాయకురాలే. కానీ విన్నీకున్న పేరు ప్రఖ్యాతులు వేరే ఎవరికి వున్నాయి? భార్యభర్తలుగా మండేలా, విన్నీల మధ్య ఎడం పెరిగింది. జైలునుంచి బయటకు వచ్చిన కొత్తలో తన భార్యపై మోపబడిన స్టాంపీ హత్యారోపణ గురించి అడిగినపుడు మండేలా 'ఆమె నిర్దోషి అని నమ్ముతున్నాను' అన్నారు. కానీ వారి మధ్య ప్రేమ అంతరించిపోయినట్టే. 

1996లో విడాకులు తీసుకునేటప్పుడు 'జైలు నుంచి నేను విడుదల అయ్యాక కలిసివున్న రోజుల్లో కూడా నేను మేలుకుని వుండగా ఆమె నా పడక గది ప్రవేశించినది లేదు' అని బహిరంగంగా చెప్పుకున్నాడాయన. ఈ విడాకుల పర్వానికి ముందు విడిగా ఉంటామని 1992లో ప్రకటించడం, ఆ తర్వాత ఆమె ప్రేమలేఖల ఉదంతం, అన్నీ జరిగేయి. ఈ మధ్య కాలంలోనే ఆమె ప్రభుత్వంలో చేరడం జరిగింది. చేరాక కూడా మండేలాకు తలనొప్పిగా తయారయింది. చేరిన ఏడు నెలలకు ఎ.ఎస్‌.సి. పార్టీ ఎన్నికలలో నెగ్గి, తన భర్త ప్రభుత్వం నల్ల ప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదని నిందించింది. ఆమె ప్రభుత్వంలో వుంటూనే ఈ విమర్శ చేసింది. ఆమెను కలుపుకురావడం జరగని పని అని గ్రహించిన మండేలా 1995లో ఆమెను మంత్రివర్గం  నుంచి తొలగించారు.

38 ఏళ్ల విచిత్ర వైవాహిక జీవితం తర్వాత మార్చి 1996లో వారు విడాకులు తీసుకున్నారు. రోషంతో 'చేతనైతే తనను పార్టీ నుంచి బహిష్కరించమ'ని సవాలు విసిరింది విన్నీ. ఈ డిసెంబరు నెలలోనే ఎ.ఎస్‌.సి. మండేలాకు వారసుడ్ని ఎన్నుకుంది. ఆ వ్యక్తే 1999లో ప్రముఖుడవుతాడు. అన్నీ సవ్యంగా సాగితే విన్నీ ఉపాధ్యకక్షురాలై వుండేది. కానీ ఈ సత్యసమితి విచారణ కారణంగా ఆమె రాజకీయ జీవితం దెబ్బతింది. పార్టీకి కొత్త అధ్యకక్షుడిగా తాబో మబేకీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనను రాజకీయంగా అంతం చేయడానికి సమితి ఇప్పుడీ విచారణ చేపట్టిందని విన్నీ ఆరోపణ.

తనపై ఆరోపణలు విరుచుకుపడుతున్న సమయంలో వాటిని విన్నీ నిశ్చలంగా వింది. కళ్లు ఎర్రబడడం తప్పించి, ఆమె భావాలు ఏవీ బయటపడలేదు. విన్నీ కూతుళ్లిద్దరూ కూడా విచారణకు హాజరయ్యేరు. పెద్దకూతురు ముఖాన్ని చేతుల్లో దాచుకుంటే విన్నీకి అతి సన్నిహితురాలైన చిన్న కూతురు మాత్రం చూయింగ్‌ గమ్‌ నములుతూ చలించకుండా విన్నది.

ఏది ఏమైనా విన్నీకి, మేక్‌బెత్‌ వంటి షేక్‌స్పియర్‌ విషాద నాయకులకు పోలికలున్నాయి. ఒకనాడు ప్రపంచమంతటా జేజేలందుకున్న విన్నీ ఈనాడు మధ్యతరగతి మేధావుల దృష్టిలో రాజకీయంగా, వ్యక్తిగా పతనం చెందింది. దేశ నాయకులకు వుండవలసిన సంయమనం కాని, దేశ క్షేమం కోసం ప్రత్యర్థులను కలుపుకురాగల సమన్వయం కానీ లేని దుస్సాహసి అని నిందకు గురైంది.  ముందువరస ప్రేక్షకుల అభిమానం చూరగొడానికి మితిమీరి నటించే నటుడిలా నల్లజాతి నిమ్నవర్గాల మెప్పుకోసం బాధ్యతారహితంగా ఆమె ప్రవర్తిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. 

పదిగంటల పాటు సాగిన ఆమె జవాబులో సాకక్షులందరినీ అబద్ధాల కోర్లని నిందిస్తూనే ఇదంతా ఇండియన్ల పన్నాగం అని కూడా అంది. భారతీయ సంతతికి చెందినవారు దక్షిణాఫ్రికాలో స్థిరపడి వ్యాపారంలోను, ఉద్యోగాలలోను చాలా వృద్ధిలోకి వచ్చారు. ప్రభుత్వాలు మారినా వారి ప్రభ తగ్గలేదు. నల్లజాతి నిమ్నవర్గాల ప్రజలకు సహజంగా వారిపై అక్కసు వుంది. దానిని ఉపయోగించుకోవడానికే ఆమె ఈ సమితి విచారణంతా భారతీయుల కుయుక్తి ఫలితమని, కొంతమంది నల్లవారిని కూడా వారు లోబరచుకున్నారని అంది.

ఇదంతా నిజంగా దురదృష్టకరం. యుద్ధ సమయంలో అనేక సాంఘిక నియమాలు ఉల్లంఘించడం జరుగుతుందని అందరికీ తెలుసు. కానీ జరిగిపోయిననాటికి విన్నీ క్షమాపణ చెప్పి ఆ అధ్యాయానికి  దక్షిణాఫ్రికాలో స్వస్తి చెప్పి వుంటే ఎంతో హుందాగా వుండేది. విన్నీ అంటే ప్రజలకెంతో ఇష్టం. ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్న అజ్‌హర్‌ కచాలియా కూడా ఓ సమయంలో అన్నాడు – ''నా శరీరంలో ఒక భాగం వెళ్లి నిన్ను కౌగలించుకుని ఆ పీడకలల్ని మర్చిపోదాం అనబుద్ధి వేస్తోంది. కానీ మరో భాగం బాధ్యత ఎవరిదో నిర్ధారిస్తే కానీ అడుగు ముందుకు సాగదని హెచ్చరిస్తోంది'' అని. నిజానికి స్టాంపీ తల్లి తన సాక్ష్యం చెప్పిన తరువాత వైషమ్యం మరచి విన్నీని కౌగలించుకున్నది కూడా.

కానీ విన్నీలో ఈ ఔదార్యం కానరాలేదు. అది గమనించే చివరిగా టుటు అన్నారు – ''నువ్వు మహావ్యక్తివి. పొరపాటు జరిగిందని నువ్వు ఒప్పుకోవడం వల్ల నీ ఔన్నత్యం మరింత పెరుగుతుందన్న విషయం నువ్వు గుర్తించాలి'' అని. దానికి విన్నీ ''ఆ రోజుల్లో చాలా ఘోరాలు జరిగేయి. వాటికి దారితీసిన పరిస్థితులు కూడా మనకందరికీ తెలుసు. ఆ పరిస్థితులకు నేనూ చింతిస్తున్నాను'' అని అన్నది. అప్పటిదాకా నాకేం తెలియదని దబాయించిన తర్వాత ఈ వివరణ సమంజసంగా లేదని అందరికీ అనిపించడంలో ఆశ్చర్యమేముంది?(సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2013)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4