సర్వహితం, సకల శుభం ప్రాప్తిరస్తు

‘ఆశ’ జీవితానికి చుక్కాని. ‘భవిష్యత్తు’ అనేది మనలోని ఈ ‘ఆశ’కు, ఆశావహ దృక్పథానికి, ఆనందాత్మకమైన జీవితవాంఛకు ప్రాణవాయువు. ‘భవిష్యత్తు’- ‘ఆశ’… వెరసి భవిష్యత్తు మీద ఆశ! ఈ రెండూ  కలిసే మనం అడుగు ముందుకు…

‘ఆశ’ జీవితానికి చుక్కాని. ‘భవిష్యత్తు’ అనేది మనలోని ఈ ‘ఆశ’కు, ఆశావహ దృక్పథానికి, ఆనందాత్మకమైన జీవితవాంఛకు ప్రాణవాయువు. ‘భవిష్యత్తు’- ‘ఆశ’… వెరసి భవిష్యత్తు మీద ఆశ! ఈ రెండూ  కలిసే మనం అడుగు ముందుకు వేయడానికి ఉపకరించే ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. మనల్ని రేపటివైపు నడిపిస్తాయి. పురోగమనాభిలాషులుగా మన మనస్సును ఉత్సాహంగా ఉంచుతాయి. అందుకే కోటి ఆశల సమన్వితంగా.. కొత్త సంవత్సరం 2014లోకి అడుగుపెడదాం. 

బహుశా మన చుట్టూ ఉన్న సమాజం, ప్రస్తుతం ఉన్నంతటి సంక్షుభితమైన క్లిష్ట పరిస్థితుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం అనేది గతంలో ఎన్నడూ జరిగి ఉండలేదు. ఈ సమాజం  ప్రస్తుతం ఉన్న స్థితిగతుల్లోనే కొనసాగబోతున్నదా.. లేదా మరిన్ని కష్టనష్టాల్లోకి, మరింత క్లిష్టతలోకి కూరుకోబోతున్నదా అనే సంశయాత్మకమైన అనుమానాలు నిండిన మనసులతో మనం ఈసారి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. రాష్ట్రం సమైక్యంగా ఉండబోతున్నదా… రెండు ముక్కలు కాబోతున్నదా అనేది రాష్ట్ర ప్రజలందరి ముందు కీలకంగా ఉన్న సమస్య. అందరూ తమ తమ జీవితాలకు తలపోస్తున్న భవిష్యత్తు ఈ కీలకమైన అంశంతో ముడిపడి ఉన్నది. 

మదిలో ఇలాంటి వందల వేల భయాలు దోబూచులాడుతుండగానే.. వాటన్నింటినీ మింగేసే… భవిష్యత్తు గురించిన కోటి ఆశలు అందించే స్ఫూర్తితో మనం బింకంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. నమ్మకమైన ఆశతో అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాం. ప్రత్యేకించి మన రాష్ట్ర ప్రజల ముందు నిల్చున్న ప్రధాన అంశాల్లో రాష్ట్ర సమైక్యత అంశం ఒక్కటే.. అందరి ఆశలతోనూ ముడిపడి ఉంది. సమైక్యాన్ని కోరుకుంటున్న వారు, విభజనను ఆశిస్తున్న వారు.. రెండు పరస్పర భిన్నమైన ఆశలకు ప్రతీకలుగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. 

ఇలాంటి సంక్లిష్ట సమయంలో గ్రేటాంధ్ర రాష్ట్రప్రజలందరికీ నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తోంది. రాష్ట్రం విషయంలో నిర్ణయం ఎలాంటిది వచ్చినా అది కొందరికి మోదం మరికొందరికి ఖేదం కలిగించకుండా మానదు. అయితే మోద ఖేదాలను ఆమోదిస్తూ ముందుకు సాగడమే జీవితం అనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. ఎవరికి చేదు, ఎవరికి తీపి ఫలితాలైనా రావొచ్చు గాక.. కానీ మనం అందరమూ అన్నదమ్ములమే అనే సంఘజీవనంలోని అంతస్సూత్రాన్ని మనం విస్మరించకూడదు. రాజకీయ ప్రేరేపిత నిర్ణయాలు.. సమాజంలో ఎలాంటి సంక్షోభానికి, కలతలకు బీజం వేయాలని చూస్తున్నప్పటికీ.. ప్రజల్లో ఉండే ఐక్యతా స్ఫూర్తి సజీవంగా ఉండాలి. రాష్ట్రం విడిపోయే వరకు మెజారిటీ జనాభిప్రాయం సమైక్యాన్నే అభిలషించవచ్చు గాక.. కానీ ఒకవేళ విడిపోయినా కూడా.. సదరు సమైక్య భావదీప్తి.. ప్రజల జీవితాలలో అలాగే నిత్యమై నిలవాలి. రాష్ట్రంగా విడిపోయినా మనుషులుగా మనం ఒక్కటే అనేదే అసలైన సమైక్య వాదం. అలాగే.. ఒకవేళ రాష్ట్రం విడిపోకుండా సమైక్యంగా ఉండవలసి వచ్చినా కూడా తెలంగాణ సోదరులు అలాంటి స్ఫూర్తినే స్వీకరించాలి. ఇరుప్రాంతాల మధ్య ముడిపడిన బంధం అవిభాజ్యమైనదిగా చరిత్ర నిరూపించిందనే వాస్తవాన్ని స్వీకరించి.. అందుకు అనుగుణంగా.. రాష్ట్రంగా కలిసి ఉంటూ.. ప్రగతి, పురోగమనం పరంగా.. తమ ప్రాంత వికాసానికి వేరుగా ఏం కావాలో నేరుగా ప్రణాళికా రచన చేసుకోవాలి. 

ఉద్యమాలు, రాజకీయ ప్రేరేపిత కుట్రలు, కూహకాలు ఇవనీసీ సమాజంలో బతుకుతున్నంత కాలమూ నిత్యం మనతో సహజీవనం చేస్తూనే ఉంటాయి. వాటికి అనుగుణ్యమైన, అధిగమించగల జీవన శైలిని అలవరచుకోవడమే మన సఫలత, కార్యకుశలతగా నిగ్గుతేలుతుంది. అందుకే ఈ 2014 కొత్త సంవత్సరం సందర్భంగా.. యావత్తు రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు చేకూరాలని గ్రేటాంధ్ర ఆకాంక్షిస్తోంది. సర్వజన హిత ప్రదీప్తమై నవవత్సరం ఆనందోత్సాహాలు వెల్లివిరిసేలా చూడాలని.. సర్వాంతర్యామి అయిన భగవంతుని ప్రార్థిస్తూ…

మీ…

వెంకట్‌, ఎడిటర్‌