యువీ శకం ముగిసినట్టేనా.?

యువరాజ్‌సింగ్‌.. ఒకప్పుడు భారత క్రికెట్‌లో తిరుగులేని ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడుగానీ, ఇప్పుడు అతని పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. మొన్నీమధ్యనే టీమిండియాకి వన్డే వరల్డ్‌ కప్‌ వచ్చిందన్నా, అంతకు ముందు తొలి టీ20 వరల్డ్‌కప్‌…

యువరాజ్‌సింగ్‌.. ఒకప్పుడు భారత క్రికెట్‌లో తిరుగులేని ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడుగానీ, ఇప్పుడు అతని పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. మొన్నీమధ్యనే టీమిండియాకి వన్డే వరల్డ్‌ కప్‌ వచ్చిందన్నా, అంతకు ముందు తొలి టీ20 వరల్డ్‌కప్‌ టీమిండియా సొంతమైందన్నా అది యువరాజ్‌సింగ్‌ పుణ్యమే.

యువరాజ్‌సింగ్‌ క్రీజ్‌లో వుంటే, బంతి బౌండరీ దాటడం చాలా తేలిక. మైదానంలో మెరుపు ఫీల్డింగ్‌, అవసరమైనప్పుడు బౌలర్‌గానూ నమ్మదగ్గ వ్యక్తి. కానీ, ఏం లాభం.? రోజులెప్పుడూ ఒకేలా వుండవ్‌ కదా. క్యాన్సర్‌ అతని కెరీర్‌ని మార్చేసింది. క్యాన్సర్‌ నుంచి కోలుకున్నాడుగానీ, మునుపటి ఫామ్‌ అందుకోలేకపోయాడు. వరుస వైఫల్యాలతో జట్టులో స్థానమే గగనమైపోతోంది.

మైదానంలో ఎంత కష్టపడ్తున్నా లక్‌ కలిసి రావట్లేదు. అతని బ్యాటింగ్‌లో పదును తగ్గిపోయిందన్న విమర్శలకూ కొదవ లేదు. ఫలితంగా యువీ కెరీర్‌ అటకెక్కిపోయే ప్రమాదమేర్పడిరది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి టీమిండియా సెలక్షన్‌ ఈ రోజు జరిగితే, అందులో యువీ స్థానం కోల్పోయాడు.

బహుశా ఇకపై యువీని టీమిండియాలో చూడలేమేమో.. అన్న అభిప్రాయాలు అతని అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. ఏమో, క్రికెట్‌లో అద్భుతాలు ఎప్పుడైనా జరగొచ్చు. పూర్తి ఫిట్‌నెస్‌తో.. మునుపటి ఫామ్‌ సంపాదించుకోగలిగితే యువీ.. టీమిండియాలో చోటు దక్కించుకుని, మళ్ళీ తనదైన ఆట తీరుతో భళా అన్పించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.