Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : యూరోప్‌ గాథలు- 31

సీజరు హత్య గురించి తలచుకోగానే బ్రూటస్‌ పేరు వెంటనే తడుతుంది. చనిపోతూ సీజరు అన్న మాట 'యూ టూ బ్రూటస్‌' కూడా గుర్తుకు వస్తుంది. మార్కస్‌ జూనియస్‌ బ్రూటస్‌ గురించి కాస్త తెలుసుకుందాం. అతను క్రీ.పూ.85లో పుట్టాడు. అతను సీజరుకు అత్యంత ఆత్మీయుడు, పుత్రసమానుడు. సమానుడేమిటి, అక్రమంగా పుట్టిన పుత్రుడే అంటారు కొందరు - సీజరుకు, అతనికి 15 ఏళ్లు మాత్రమే తేడా వున్నా! బ్రూటస్‌ తండ్రిని పాంపే అన్యాయంగా చంపాడు. బాబాయి యితన్ని 16 వ యేట దత్తతకు తీసుకుని రాజకీయాల్లో, వాగ్ధాటిలో తర్ఫీదు యిచ్చాడు. ఇది అతను సైప్రస్‌ గవర్నరు కాటోకు అసిస్టెంటు కావడానికి ఉపయోగపడింది. ఆ ఉద్యోగంలో వుండగా అతను హెచ్చువడ్డీకి అప్పులిచ్చి డబ్బులు బాగా సంపాదించాడు. రోముకు తిరిగివచ్చి క్లాడియా అనే అమ్మాయిని పెళ్లాడి సెనేట్‌లో సభ్యుడిగా ఎన్నికయ్యాడు. క్రాసస్‌, పాంపే, సీజరులు ఏర్పరచిన మొదటి త్రయంకు వ్యతిరేకంగా ఏర్పడిన ఆప్టిమేట్స్‌ అనే కన్జర్వేటివ్‌ బృందంలో చేరాడు. 

క్రీ.పూ. 49లో అంతర్యుద్ధం సమయంలో పాంపే ఆప్టిమేట్స్‌కు నాయకుడయ్యాడు, బ్రూటస్‌ అతని అనుచరుడిగా మారాడు. ఫార్సలస్‌ యుద్ధంలో పాంపే, సీజరు తలపడినప్పుడు బ్రూటస్‌ పట్ల కఠినంగా వ్యవహరించవద్దని సీజరు తన సైన్యాధికారులను ఆదేశించాడు. ఆ యుద్ధంలో పాంపే ఓడిపోయాడు. బ్రూటస్‌ సీజరుకు క్షమాపణ చెప్పుకుని అతనికి ఆంతరంగికుడిగా మారాడు. సీజరు అతన్ని గాల్‌కు గవర్నరుగా నియమించాడు. క్రీ.పూ.45లో అర్బన్‌ ప్రియేటర్‌గా నామినేట్‌ చేశాడు. అదే ఏడాది సరైన కారణం చెప్పకుండా మొదటి భార్యకు విడాకులిచ్చి, పోర్షియా అనే యువతిని రెండో పెళ్లి చేసుకోవడం వివాదాస్పదం అయింది. 

సీజరు పాంపే కొడుకుల్ని చంపి ఆఫ్రికా యుద్ధం నుంచి విజేతగా తిరిగి వచ్చినపుడు రోమ్‌ ప్రజలు ఘనస్వాగతం పలికారు. అతన్ని యావజ్జీవ నియంతగా నియమించే ప్రతిపాదనకు జేజేధ్వానాలు పలికారు. ఈ రకమైన వ్యక్తి ఆరాధనతో రోము ప్రజలు ప్రజాస్వామ్యాన్ని, తమ స్వేచ్ఛాస్వాతంత్రాలు పోగొట్టుకుని సీజరుకు అమితమైన అధికారాలు దఖలు పరచి రాజుగా అభిషేకిస్తారని బ్రూటసు కలవరపడ్డాడు. ఒక ఉత్సవసందర్భంగా ఆంటోనీ సీజరుకు బహిరంగంగా కిరీటం ఆఫర్‌ చేశాడు. కానీ సీజరు తిరస్కరించాడు. ఇలా మూడుసార్లు జరిగింది. అయినా ఎప్పుడో ఒకప్పుడు సీజరు కిరీటాన్ని ఆమోదించి రాజయిపోతాడని బ్రూటసుకు భయం వేసింది. క్రీ.పూ. 46లో క్లియోపాత్రా తనకు, సీజరుకు పుట్టిన సీజరియన్‌ (చిన్న సీజరు) పిల్లవాణ్ని వెంటపెట్టుకుని చాలా అట్టహాసంగా రోమ్‌కు వచ్చింది. (క్లియోపాత్రా సినిమాలో ఆ ఘట్టాల ఫోటోలు చూడవచ్చు). సీజరు వివాహితుడు కాబట్టి క్లియోపాత్రాతో అతని సంబంధం గురించి ప్రజలు తప్పుపడతారన్న బెరుకు లేకుండా సీజరు ఆమెను తన రోముకి బయట వున్న తన భవంతిలో బస చేయించాడు. విదేశీయురాలు కాబట్టి ఆమెను రోము నగరంలోకి ప్రత్యక్షంగా తీసుకురావడానికి నియమాలు అడ్డు వస్తాయి కాబట్టి ఆమె బంగారు ప్రతిమను నగరమధ్యంలో వున్న వీనస్‌ దేవాలయంలో ప్రతిష్టాపించాడు. రోము ప్రజలు దీనికి అభ్యంతర పెట్టకపోగా క్లియోపాత్రాను చూసి ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. క్లియోపాత్రా తమ కొడుకును వారసుడిగా గుర్తించమని సీజరును కోరింది. సీజరు విని వూరుకున్నాడు. ఇప్పుడు సీజరు  క్లియోపాత్రాను రాణిగా చేసుకుని రోమ్‌, ఈజిప్టులను సంయుక్తంగా పాలిస్తూ  తన తదనంతరం తన సింహాసనాన్ని సిజేరియన్‌కు అప్పగిస్తాడని బ్రూటసుతో సహా సెనేటర్లందరూ సందేహించారు. 

వీళ్లను బాగా ఎగదోసినవాడు కేషియస్‌ (పూర్తిపేరు గియాస్‌ కేషియస్‌ లాంగినస్‌). బ్రూటసు సవతి సోదరిని పెళ్లాడి అతనికి  బావమరిది అయ్యాడు. గ్రీకు భాషలో కూడా మంచి వక్త. సీజరుకు, పాంపేకు మధ్య అంతర్యుద్ధం జరిగే రోజుల్లో రోముకు తిరిగి వచ్చాడు. క్రీ.పూ. 49లో సెనేటరుగా ఎన్నికై సీజరుకు వ్యతిరేకంగా ఆప్టిమేట్స్‌ గ్రూపును సమర్థించాడు. తర్వాత పాంపే పక్షాన  అతని సైన్యంలో చేరి, సీజరు నావలను సిసిలీలో దగ్ధం చేశాడు. పాంపే ఓటమి తర్వాత సీజరుకు బందీగా చిక్కాడు. సీజరు అతన్ని యుద్ధానికి పంపబోతే 'అక్కరలేదు, నేను రిటైరై పోయి రోములో వుంటా'నన్నాడు. రెండేళ్లపాటు ఏ పదవీ లేకుండా వుండి ప్రఖ్యాత సెనేటరు సిసెరోతో సఖ్యం నెరపాడు. అతని విశ్వాసాన్ని చూరగొన్నాడు. తన కంటె జూనియరైన బ్రూటసుకు పదవి రావడంతో అసూయపడి,  అతనికి మద్దతిస్తున్న సీజరును మట్టుపెట్టే ప్రయత్నాలు చేయసాగాడు. కుట్రదారుల్లో సగం మందిని కేషియసే మార్చాడని చెప్పవచ్చు. కానీ బ్రూటసును తన వైపు మళ్లించడంతో అతను అనుకున్నది సాధించాడు. బ్రూటసు కుట్రదారులకు నాయకుడయ్యాడు. 

సీజరంటే అభిమానం, ప్రేమ వున్నా అంతకంటె రోము అంటే బ్రూటసుకు అభిమానం మిన్న. సీజరుకు అడ్డుకట్ట వేయాలంటే బహిరంగంగా అతనితో తలపడలేమని, అతన్ని వంచించి, హత్య చేయడమొకటే మార్గమని టక్కరి అయిన కేషియస్‌ కొందరు సెనేటర్లను ఒప్పించాడు. గతంలో సీజరు జనరల్స్‌లో ఒకడు ఆంటోనిని కుట్రలో భాగస్వామిని చేద్దామనుకుంటే అతను ఒప్పుకోలేదు. అందువలన సీజరును చంపాక ఆంటోనీని కూడా చంపేద్దామని కేషియస్‌ అన్నాడు. బ్రూటసు విభేదించాడు - 'తల నరికాక కాళ్లు, చేతులు నరకడం దేనికి, సాధారణ ప్రజలు మనల్ని రాజకీయప్రక్షాళన చేసిన సంస్కారులుగా చూడాలి తప్ప హంతకులుగా కాదు' అంటూ. 

క్రీ.పూ. 44 మార్చి నెలాఖరులో సీజరు పార్థియాకు వెళ్లబోతున్నాడని తెలిసి మార్చి 15 నాటికే సెనేట్‌ భవనంలో హత్య చేయడానికి నిశ్చయించుకున్నారు. సీజరు భార్యకు యీ విషయం తెలుసో ఏమో 'మిమ్మల్ని హత్య చేస్తున్నట్లు నాకు పీడకల వచ్చింది, యివాళ సెనేట్‌కు వెళ్లవద్ద'ని ప్రాధేయపడింది. కానీ వెళ్లకపోతే పిరికివాడ నుకుంటారని చెప్పి సీజరు సెనేట్‌కు వచ్చేసరికి ఆలస్యమైంది. కొందరు సెనేటర్లు ఏవో విజ్ఞాపన పత్రాలు యిచ్చే మిషతో సీజరు చుట్టూ మూగి, ఒక్కుమ్మడిగా మీద పడ్డారు. కొందరు కత్తులతో పొడిచారు. చివరగా బ్రూటసు పొడుస్తూంటే సీజరు ''ఎట్‌ టూ బ్రూట్‌' (నువ్వూనా? బ్రూటస్‌!?)'' అన్నాడట. (కాదు, గ్రీకు భాషలో ''కై సూ టెక్నాన్‌? (యూ టూ, మై చైల్డ్‌) అన్నాడని చరిత్రకారులు చెప్తారు) బ్రూటస్‌ యింత విశ్వాసఘాతుకానికి తలపడతాడని సీజరు వూహించలేదు. అప్పణ్నుంచి తీవ్రమైన నమ్మకద్రోహం చేసినవారిని బ్రూటస్‌ అనడం పరిపాటయింది. (ఫోటో - ''క్లియోపాత్రా'' సినిమాలో రోము పర్యటన దృశ్యం) 

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2016)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?