Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ కథ: ఎవరా గర్ల్‌ఫ్రెండ్?

ఎమ్బీయస్ కథ: ఎవరా గర్ల్‌ఫ్రెండ్?

రాగిణికి మోహన్ మీద చికాకేసింది. అతని తాగుడు అలవాటు మీద కోపం వచ్చింది. దాని కారణంగా లక్ష్మణరావుకి చేరువ కాలేకపోతున్నందుకు బాధేసింది. తమ కాంపౌండు వాటాల్లో ఒకదానిలో లక్ష్మణరావు చేరిననాడే ఈ అందగాడితో పెళ్లయితే బాగుండునని అనుకొంది. కట్నం బొత్తిగా ఇవ్వలేని తన తల్లిదండ్రుల స్థితి గుర్తు తెచ్చుకుని నిరుత్సాహపడినా తన ఉద్యోగం అండ చూసుకొని ఆశ పడింది. తన అందం తలచుకొని ఆశలు పెంచుకొంది. కానీ తన జీతంపైన ఆధారపడిన తల్లిదండ్రులు తన పెళ్లి ప్రయత్నాలు అస్సలు చేయకపోవడం గుర్తుకు తెచ్చుకొని నిరాశపడింది. ఈ ఆశనిరాశల మధ్య ఊగిసలాడుతుండగానే లక్ష్మణరావు తల్లి ‘మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా..’ అని తల్లిని ఆడగడం జరిగింది.

తల్లి తనకా విషయం చెప్పగానే “ఆయితే నాన్నగార్ని వెళ్లి మాట్లాడమనమ్మా' అని తను బతిమాలింది. ‘ఇదిగో, ఈ శూన్యమాసం పోయాక వెళ్లి కదలేస్తారట’ అంది తల్లి. తండ్రి ఎప్పుడూ అంతే. పనిచెయ్యకుండా ఉండడానికి కారణాలు పోగేయగలడు. రిటైరవ్వగానే హాయిగా ఇంట్లో కూచున్నాడు. ట్యూషన్లు చెప్పచ్చుగా? ఓపికలేదట. తన తర్వాత ముగ్గురు పిల్లల్ని కనడానికి ఉన్న ఓపిక యిప్పుడేమైందో! కట్నం అడిగేవాడి కాళ్లు కడగనని ప్రతిజ్ఞ చేశాడు. మరి తన టైములో ఆయనెందుకు కట్నం తీసుకొన్నాడో! ఈ ప్రతిజ్ఞ కారణంగా తన పెళ్లి సంబంధాలు చూడవలసిన భారం తప్పిపోయింది. ఇప్పుడు లక్ష్మణరావు తల్లి తనే చెప్పేసింది ‘మాకు కట్నకానుకలు అక్కర్లేదు. పిల్ల బుద్ధిమంతురాలై, ఉద్యోగం చేస్తుంటే చాలు’ అని. మరి పరిగెట్టుకెళ్లి పెళ్లిమాటలు మాట్లాడక ఇంకా సాకులు దేనికి? పెళ్లి చేస్తే తన జీతం అనుభవించడానికి ఉండదనా?

ఈ లోపున లక్ష్మణరావు బస్‌స్టాప్‌లో కనబడి పలకరించాడు ‘మీరెక్కడ పనిచేస్తున్నారు..?’ అంటూ. చెప్తే ‘ఓహో అదా, అమ్మ నడిగితే ఏదో ప్రైవేటు కంపెనీ అంది. ఇది మంచిదే!’ అన్నాడు. కాసేపటికి ఏదో గుర్తుకొచ్చినట్లు కళ్లు చికిలించి ‘మోహనరావు మీకు తెలుసా?’ అన్నాడు. ‘ఎవరు? విశ్వతేజా ఏజన్సీస్ మోహన్రావా? ఆయన మాకు మెటీరియల్ సప్లయి చేస్తారు’ అంది తను.  ‘అదే, అతను నా ఫ్రెండు. మీ కంపెనీలో అతని ఫ్రెండు ఒకమ్మాయి పనిచేస్తోందన్నాడు. మీరేనా?’ అన్నాడు. తను తబ్బిబ్బుపడి మాటల కోసం తడుముకొంటూంటే బస్సు వచ్చేసింది. బస్సులో కూచుని పరిస్థితి సమీక్షించుకొంది.

తమ పరిచయం గురించి మోహన్ చెప్పేసాడా? నిజం చెప్పాడా? కల్పించి ఎక్కువగా చెప్పాడా? తను మాత్రం ఏంచేస్తుంది? జీతం అంతా ఇంట్లోకి తీసేసుకొని మూడు వందల రూపాయలు పాకెట్ మనీ ఇస్తారు. తన సరదాలు ఏం తీరతాయి? పోనీ పెళ్లయిన తర్వాతైనా తీరతాయన్న ఆశలేదు. స్వర్ణకమలంలో భానుప్రియ చెప్పినట్టు గంతకు తగ్గ బొంత సంబంధమే వస్తుంది. పెళ్లి కావల్సిన చెల్లెళ్లు, రోగిష్టి తలిదండ్రులు, చాలీచాలని జీతం.. ఇలాంటివాడే దొరుకుతాడు. గట్టిగా మంచి హోటల్ కెళ్లగలదా? సెంటు రాసుకోగలదా? లెదర్ హేండ్‌బ్యాగ్ కొనుక్కోగలదా? తన అందం చూసి లొట్టలు వేయడమే కానీ ఏ మొగాడు వచ్చి నిన్ను పెళ్లాడతానని చెప్పలేదు. తన పరిస్థితిలో వేరెవరైనా ఉంటే పైడబ్బు కోసం వ్యభిచరించి ఉండేవాళ్లు. తను కాబట్టి తనను తాను కంట్రోలు చేసుకోగలిగింది.

నిజానికి మోహన్ పరిచయ మయ్యేదాకా తనెవరితోనూ హోటల్‌క్కూడా వెళ్లలేదు. అవేళ ఆఫీసులో ఆలస్యం అయింది. అతని బిల్సు సెటిల్ చెయ్యడం చాలా సేపు పట్టింది. “నావల్ల, మీకు ఆలస్యం అయింది. పాపం. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళతాను రండి" అన్నాడు మోహన్. కార్లో తీసుకెళుతూ పెద్ద హోటల్ ముందు ఆపి ‘కాఫీ తీసుకుపోదాం రండి’ అన్నాడు. తను వద్దన్నా వినలేదు. కారు కాబట్టి తను అతనితో రావడం ఎవరూ చూడలేదు. కానీ హోటల్లో ఎవరి కంటైనా పడితే? వద్దంది. అతను ఇంకా బతిమాలడంతో మరీ బతిమాలించుకుంటోంది అనుకొంటాడనుకుని సరేనంది. గుండెలు పీచుపీచు మంటూండగానే వెళ్లింది. లోపలికి వెళ్లాక ‘హమ్మయ్య’ అనుకొంది. డిమ్ లైటింగు. మొహంలో మొహం పెట్టి చూస్తే తప్ప గుర్తు పట్టలేరు. ఉన్న మనుష్యులే తక్కువ. అదీ దూరదూరంగా కూర్చున్నారు. తనకి తెలుసున్న వాళ్లెవరూ ఇంత ఖరీదైన హోటల్ దరిదాపుల్లో క్కూడా రారు.

కాఫీ మాత్రమే తెప్పిస్తాడేమో ననుకొంది. చికెన్ సూప్‌తో మొదలు పెట్టి ఐస్‌క్రీమ్ దాకా అన్నీ తినిపించాడు. మొహమాటపడుతూనే అన్నీ శుబ్బరంగా తినేసింది. నూడుల్స్ తినడం ఎలాగో తెలీక అవస్థ పడుతుంటే 'హాయిగా చేత్తో తినండి' అంటూ తనూ చేత్తో తిన్నాడు. వీధి చివర దిగేటప్పుడు ‘థ్యాంక్స్ ఫర్ ది కంపెనీ’ అంటూ అతను షేక్‌హేండ్ ఇచ్చినప్పుడు మాత్రమే అతని స్పర్శ అనుభవించింది. రెండోసారి మాత్రం హోటల్లో ‘ఇంకా ఆకలేస్తోందా?' అంటూ పొట్ట నొక్కి చూసేడు. తను కంగారు పడింది కానీ అడ్డు చెప్పలేదు. తనకింత విలువ ఇస్తున్న మనిషిని విదిలించి పారేయడం ఎలా? పైగా తనను మోహన్రావు అనవద్దనీ, ‘మోహన్’ అంటే చాలనీ, ఫ్రెండ్‌షిప్‌కి స్టేటస్ అడ్డు రాదనీ ఎన్నో చెప్పాక తను ‘నన్ను ముట్టుకోవద్దు’ అంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. పైగా తనూ మొగాడి స్పర్శను ఎంజాయ్ చేస్తోంది.

తర్వాత అతను ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు ఖరీదైన బ్రా తెచ్చి పెట్టాడు. ‘సైజు సరిగ్గా తెలియలేదు. ఇప్పుడైనా చూడనీ’ అంటూ జబర్దస్తీగా చెయ్యి వేసేసాడు. కొన్ని రోజులు పోయాక ‘‘ఎప్పుడో ఈ బేరరే మనమీద కంప్లెయింట్ ఇస్తాడు. పబ్లిక్ న్యూసెన్సు కేసు కింద ఇద్దర్నీ జైల్లో పెట్టేస్తారు’’ అంటే “వాడికంత టిప్పు ఎందుకనుకొన్నావు? చూసింది మర్చిపోడానికే!’’ అన్నాడతను. ‘‘మొన్న ముద్దు పెట్టినపుడు ఎంత చప్పుడు చేశావో తెలుసా? వాడు తల తిప్పి చూశాడు.’’ అంటే “ఆ టైములో కళ్లు మూసుకొని పరవశించడం మానేసి దిక్కులు చూస్తే ఇలాటివే కనబడతాయి. అందుకే.." అంటూ గాఢంగా హత్తుకున్నాడు. అదే అదనుగా శ్రుతి మించబోతే తను చెయ్యి తోసేసింది. “నీ కెప్పుడో చెప్పాను, ఆ ఒక్కటీ అడగవద్దని..’’ అంటూ నెత్తిమీద చిన్నగా మొట్టికాయ వేసింది.

సమస్తం కావాలన్న పట్టింపు మోహన్‌కు లేడు. అతనికి అందమైన భార్య ఉంది. పిల్లలున్నారు. అండదండలందించే పలుకుబడి, డబ్బు ఉన్న మావగారున్నారు. ఏదైనా ఎఫైర్‌లో సీరియస్‌గా ఇరుక్కుని మావగారి ఆగ్రహానికి గురయ్యే ఉద్దేశం ఎంతమాత్రమూ లేదతనికి. ఏదో లైట్‌లైట్‌గా సమోసాతో పాటు సాస్‌లా, పెరుగులో ఊరగాయలా తనను నంజుకొంటాడు. ఇంటిదగ్గర భోజనం దారి భోజనందే. తనకీ ఇది బాగానే ఉంది. పైన పైన వ్యవహారం కాబట్టి తప్పు లేదని తన అభిప్రాయం. అనుకోకుండా బస్సులో, క్యూలో ఎవరో ఒకరు చేతులు వేస్తూనే ఉంటారు. డాక్టరు ఒళ్లంతా నొక్కి చూస్తూనే ఉంటాడు. ఇక్కడ ఇతని దగ్గరా అంతే. కానీ దీనివల్ల లాభం కలుగుతోంది. పౌడర్లు, శాండల్స్, సెంట్లు.. ఎన్నో కొని పెడతాడు. డబ్బు రూపేణా ఇచ్చి అవమానించడు. ఇవన్నీ ఎక్కడివని ఓసారి తల్లి అడిగింది. కస్టమర్లు ఇచ్చిన కాంప్లిమెంటరీలు అని సర్దిచెప్పింది.

మోహన్‌తో ఎఫైర్ వల్ల తన పెళ్లి ప్రయత్నాలకు ఎన్నడూ అడ్డు రాలేదు. నిజానికి అతనే ఇద్దరుముగ్గుర్ని సజెస్టు చేశాడు కూడా. పెళ్లయ్యేక నిన్ను అస్సలు కలవను సుమా అని చెప్పేసింది కూడా. అయినా అతను నిస్వార్థంగా తన పెళ్లయ్యేందుకు ఎన్నో విధాల సాయం చేస్తున్నాడు. పెళ్లికి ఓ నగ కొనిపెడతానన్నాడు కూడా. మరి అలాంటప్పుడు మోహన్ తన గురించి లక్ష్మణరావుకి ఏం చెప్పి ఉంటాడు. ’ఫ్రెండు’ అంటే ఏ అర్థంలో చెప్పాడు? అసలు చెప్పే సందర్భం ఎలా వచ్చిందట?’

ఆఫీసు కెళ్లగానే మోహన్‌కి ఫోన్ చేసింది రాగిణి. సాయంత్రం తప్పకుండా కలవమంది. ఫోన్లోనే అడగాలనిపించింది. కానీ ఎలా అడుగుతుంది? సాయంత్రం హోటల్ బయట వెయిట్ చేస్తూ మోహన్ కనబడగానే గబగబా ‘నిన్నో విషయం అడగాలి...’ అంటూ మొదలెట్టబోయింది. “ముందు లోపలికి రా' అంటూ తీసుకెళ్లి కుర్చీలో కూలవేసి, వెయిటరు వచ్చే లోపున దగ్గరకు లాక్కుని, ‘ఏమిటి గిరాకీ? ఇవాళ నువ్వే రమ్మన్నావ్?’ అన్నాడు మోహన్ హుషారుగా. రాగిణి అతన్ని నెట్టేస్తూ ‘లక్ష్మణరావుతో నా గురించి ఏం చెప్పావు?’ అంది. ‘ఏ లక్ష్మణరావు?’ అంటూ తెల్లబోయేడు మోహన్. రాగిణి గుర్తులు చెప్పాక ‘వాడా? నీకెలా తెలుసు?’ అన్నాడు. “మా కాంపౌండులో కొత్తగా చేరిన అబ్బాయి, పెళ్లి సంబంధం కోసం అడిగేరని చెప్పలేదూ, అతనే..’’ అంది రాగిణి విసుగ్గా, “అసలు నా గురించి అతనికి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది?’’

“నీ గురించా? నేనెప్పుడు చెప్పాను?"

“మా ఆఫీసులో పని చేసేవాళ్లలో నీకు ఓ ఫ్రెండ్ ఉందని చెప్పావటగా! నీ స్థాయి వాడికి మాతో ఫ్రెండ్‌షిప్ అంటే అలాటిదే అనుకోరూ!?’’

మోహన్ కనుబొమలు ముడివేసి కాస్సేపు ఆలోచించి “అదా! దానికా ఇంత హడావుడి! భలేదానివే. నీ గురించి అని స్పెసిఫిక్‌గా ఏం చెప్పలేదు. ఓసారి డ్రింక్స్ తీసుకొంటూంటే ఏవో డిస్కషన్స్ వచ్చాయి. ఉద్యోగం చేసే అమ్మాయిల్ని నమ్మడానికి లేదు అని లక్ష్మణరావు వాదిస్తే అప్పుడు నేను చెప్పాను – ‘ఫలానా కంపెనీలో నాకో అమ్మాయి తెలుసు. పైపైన టిఫెస్ తప్ప లక్షలిచ్చినా భోజనానికి ఒప్పుకోదు’ అని వాదించాను. నీ గురించి చెడ్డగా ఏమీ చెప్పలేదే! విల్‌పవర్ చాలా స్ట్రాంగ్ అనీ, పెళ్లయిన వాడికే తనను తాను పూర్తిగా అర్పించుకొంటానని ఖచ్చితంగా చెప్పిందనీ కూడా అన్నానే!’’

“ఏడిసినట్టుంది. అది తప్ప మిగతా అన్నిటికి ఒప్పుకొంటుంది.. అంటే చాలా గుణవంతురాలని అర్థమా?"

“ఓహో, నువ్వు అలా అర్థం తీస్తున్నావా? అయినా నీ పేరు చెప్పలేదు కదా!’’

‘‘పేరెందుకు? మా ఆఫీసుకొచ్చి ఎవర్నడిగినా చెప్తారు, మోహన్రావుగారితో ఎక్కువగా డీల్ చేసేదెవరండీ అంటే నా పేరే చెప్తారు. వాళ్లకు ఇవన్నీ తెలీకపోయినా లక్ష్మణరావుకి నువ్వు ముందే చెప్పేశావు నేనెలాంటి దాన్నో’’ అంది రోషంగా.

“అలాగా? మరి ఇప్పుడేం చేయడం?’’

“కట్టకట్టుకొని గంగలోకి దిగాలి. అసలిలాటి మాటలు ఎందుకు మాట్లాడాలి?’’

‘‘ఏదో, డ్రింక్స్ పడేసరికి ఏం మాట్లాడుతున్నామో తెలిసి చావదు”

“నువ్వు ముందు డ్రింక్స్ మానెయ్! వద్దులే, నేనే నీ స్నేహం మానేస్తాను. కట్నం లేకుండా ఇన్నాళ్లకు ఒక మంచి సంబంధం వస్తోందంటే నీవల్ల పోతోంది." అంది రాగిణి కసిగా.

మోహన్ మొహం మాడిపోయింది. తింటున్నంతసేపూ ‘సారీ, సారీ’ అంటూనే ఉన్నాడు కానీ రాగిణి ఒంటిమీద చెయ్యి వేసే సాహసం చేయలేదు. తింటున్నంత సేపూ రాగిణి ఆలోచిస్తూనే ఉంది, మోహన్ మీదా, అతని తాగుడు మీదా చికాకు పడుతూనే! అతనితో సంబంధాలు తెంపుకోవడం తర్వాతిమాట. మొదట చేయవలసినది ఈ సమస్య లోంచి బయటపడడం. కాఫీ తాగుతుంటే అయిడియా తట్టింది. ‘పద్మ మంచిదే. తన స్వార్థం కోసం ఆమెను ఉపయోగించుకోవడం తప్పే. అలాగని తను మంచి సంబంధం ఒదులుకోగలదా? అందునా కట్నం అడగని సంబంధం! అయినా పద్మ మంచిదని గారంటీ ఏముంది? తనలాగే ఎవరికి తెలీకుండా మరోడితో తిరుగుతోందేమో? తనకయితే కంట్రోలుంది. దానికి ఉండి ఉండదు. ఒళ్లంతా అప్పగించేసి ఉంటుంది. అయినా తను ఆఫీసులో ఎవరికీ చెప్పటం లేదు. జస్ట్ లక్ష్మణరావు వరకే కదా!’

“మా ఆఫీసులో పద్మ ఉంది కదా, అదే నీ గర్ల్‌ఫ్రెండు అని చెప్పేయి" అంది రాగిణి పథకాన్ని వివరిస్తూ.  లక్ష్మణరావుకి మోహన్ గర్ల్‌ఫ్రెండు పేరు తెలీదు; మొహం తెలీదు. అందమైన ఆవివాహిత అని మాత్రం తెలుసు. పద్మ ఆ క్వాలిఫికేషన్‌కు తగినదే. లక్ష్మణరావుని ఆఫీసుకి తీసుకుని  పద్మను చూపించి ‘ఆమే నా గర్ల్‌ఫ్రెండ్’ అని మోహన్ చెప్పేస్తే చాలు. అతను నమ్మేస్తాడు. క్రాస్‌చెక్ చేసుకోడానికి ఎవరూ లేరు. మోహన్ మాట ఒక్కటే సాక్ష్యం.

“కానీ ప్రత్యేకంగా తీసుకొచ్చి చూపిస్తే అనుమానం రాదూ?" అన్నాడు మోహన్.

“అయితే తన కోసం ఉద్యోగప్రయత్నం అని చెప్పి పిలిచి, యథాలాపంగా దారిలో వచ్చినట్టు మా ఆఫీసుకు రా. అతన్ని కాస్త దూరంగా కూచోబెట్టి, అతని ఎదురుగానే పద్మతో నవ్వుతూ మాట్లాడి నాకిమ్మని కాగితాలేవైనా ఇయ్యి, నేను సరిగ్గా ఆ టైముకు పక్క సెక్షన్‌కి వెళతానులే. తర్వాత సాయంత్రం కలిసినప్పుడు ఆ కాగితాలు నీకిచ్చేస్తా.’’

మోహన్ ఫోన్ చేసినపుడు లక్ష్మణరావు ఆశ్చర్యపడ్డాడు. ఈ మధ్య పెద్దగా టచ్‌లో లేడు. ‘మా ఫ్రెండొకడు కొత్త కంపెనీ పెడుతున్నాడు. జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఏదైనా లాభం ఉంటుందేమో, మేనేజరు పోస్టుకి మనుషుల్ని వెతుకుతున్నాడు. లెటజ్ ట్రై’ అంటూ తన ఆఫీసుకు రమ్మన్నాడు. వెళితే నష్టం లేదని లక్ష్మణరావు వెళ్లాడు. ఫ్రెండు ఇంటికెళ్లే దారిలో మోహన్ రాగిణి ఆఫీసు దగ్గర కారాపేడు. లోపలికి వెళదామన్నాడు. రాగిణి ఎక్కడా కనబడలేదు. మోహన్ ఎవరో అందమైన అమ్మాయిని చూసి పలకరించాడు. ఆ అమ్మాయి నవ్వుతూ సమాధానమిచ్చింది. ఆమె చేతికి ఏవో కాగితాలిచ్చేడు. కాస్సేపు మాట్లాడి టాటా చెప్పి వచ్చేశాడు. లక్ష్మణరావుకి ఏదో గుర్తొచ్చి, “నువ్వు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయేనా?" అని అడిగేడు.

“ఎవరూ? ఏ అమ్మాయి?"

“అదేరా, మీ గర్ల్ ఫ్రెండు; టిఫెన్ సెక్షన్.’’

‘‘నీకెలా తెలుసురోయ్?’’

“మర్చిపోయావా? అవేళ వాసూగాడి పార్టీలో నువ్వు వాదించలేదూ....’’

‘‘., యా, గుర్తొచ్చింది. నీకు బాగానే గుర్తుంది, అవన్నీ తెల్లారితే మర్చిపోవాల్రా"

‘‘సరే లేవోయ్. కానీ, అమ్మాయి మాత్రం అందంగా ఉందిరా"

“నువ్వు మొహం మాత్రమే చూసేవ్!’’

“పోనీ నాకు పరిచయం చేయకూడదూ?’’

మోహన్ కంగారుపడ్డాడు. “ఒరేయ్, అలాటి అయిడియాలు పెట్టుకొని వెళ్లి అడక్కురోయ్! చెప్పలేదూ? తనకి చాలా ప్రిన్సిపుల్స్ ఉన్నాయి. తనమీద తనకి ఫుల్ కంట్రోలుంది. నా ఒక్కడితోనే యిది.  లిమిటు దాటనివ్వడు, ఏవో ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ వల్లనే అదైనా ఎలౌ చేస్తోంది. నువ్వు వెళ్లి బేరాలాడితే చెప్పుచ్చుక్కొడుతుంది తెలుసా.’’ అన్నాడు. సర్లే అడగనులే అంటూ లక్ష్మణరావు హామీ ఇచ్చేడు. ‘కానీ వెళ్లి పలకరిస్తే తప్పులేదుగా’ అనుకున్నాడు.

మర్నాడు సాయంత్రం రాగిణి మహా హుషారుగా ఉంది. హోటల్లో మోహన్ చెప్పాడు. ‘‘లక్ష్మణరావుకి నీ మీద సందేహం లేకుండా చేశా. ఇవేళ పొద్దున్న ఏదో వంక పెట్టి అతని ఇంటికెళ్లాను. నా కారు సీటు మీద పడి ఉన్న కాగితాలు చూసి, నిన్న మధ్యాహ్నం నువ్వా అమ్మాయి కిచ్చిన కాగితాలు పొద్దున్నే నీ దగ్గరకెలా వచ్చాయిరా? అన్నాడు. నేను మిస్చువస్‌గా నవ్వి, నిన్న సాయంత్రం హోటల్లో కలిసినప్పుడు వెనక్కి ఇచ్చేసిందిలే అన్నాను.’’

‘‘దానికి అతనేమన్నాడు?’’

‘‘ఓహో అని ఊరుకున్నాడు. తర్వాత నీ గురించి ఏమైనా తెలుసా? అడిగాడు. ఆ అమ్మాయి పేరు తప్ప ఇంకేమీ తెలీదు. ఆ అమ్మాయి గురించి మన దగ్గర ఏ ఇన్ఫర్మేషనూ లేదు, కావాలంటే కనుక్కుందాం అని నమ్మబలికేను’’. ఈ విషయం చెబుతూ రాగిణి బొడ్లో వేలు పెట్టి గుండ్రంగా తిప్పుతూ “నీ నడుం కొలత 28 అని కూడా తెలీదన్నాను’’ అన్నాడు కొంటెగా. రాగిణి నవ్వుతూ “ఇంకా ఏమేమి తెలీదని చెప్పావ్?" అంటూ అతని బుగ్గలు సాగదీసింది. “అవి చెవిలో చెప్పాల్సిన విషయాలు." అన్నాడు మోహన్.

రాగిణి నవ్వింది- హాయిగా, నిశ్చింతగా! లక్ష్మణరావుకి ఇక తనపై ఎటువంటి సందేహమూ లేదని తెలియగానే హేపీగా ఫీలయ్యింది. ‘తను మోహన్ని అనవసరంగా తిట్టిపోసింది. పాపం నొచ్చుకోకుండా కష్టపడి తన పొరబాటుని తనే దిద్దుకున్నాడు. ప్రత్యుపకారం చెయ్యాలి. ఎలా? ఆరోజు తను విదిలించి కొట్టింది. చెయ్యి కూడా వెయ్యనివ్వలేదు. తనూ పొరబాటు దిద్దుకోవాలి. క్షమించానని అతనికి చెప్పాలంటే మామూలు ట్రీట్ కంటే ఎక్కువగా అతన్ని ఆనందపరచాలి. తనకు లక్ష్మణరావుతో పెళ్లయిపోతోంది. పెళ్లయిపోయేక మోహన్‌కు ఎలాగూ దూరం అయిపోతుంది.’ మోహన్ చేతిని తన చేతిలో తీసుకొని “ఆకలి పూర్తిగా తీర్చాలా అబ్బాయిగారి కివాళ?’’ అంది. మోహన్ కళ్లు పెద్దవయ్యేయి. మారు మాట్లాడకుండా దగ్గరగా పొదువుకున్నాడు. సాయంత్రం అతని కంపెనీ గెస్ట్‌హౌస్‌లో తనను పూర్తిగా అర్పించుకొని, అతన్ని గెలుచుకొని కూనిరాగాలు తీస్తూ ఇంటికి చేరితే అమ్మ చివాట్లు రాగిణిని బాధించలేదు.

కథ ఇక్కడ ఆగిపోతే బాగుండేది. కానీ ఆగలేదు.

మూడు వారాలు తిరక్కుండా లక్ష్మణరావు పెళ్లి కార్డు పట్టుకొచ్చి రాగిణి కిచ్చాడు. పెళ్లికూతురు పద్మ! తను కావాలని అప్రతిష్ఠపాలు చేసిన పద్మ తన లక్ష్మణ రావుని ఎగరేసుకుపోవడమా? ఇదెలా సాధ్యం? “పద్మ సంగతి మీకు బాగా తెలుసా?" అంది రాగిణి కోపంగా.

లక్ష్మణరావు సమాధానం విపులంగానే ఇచ్చాడు. “మీరనేది నాకు తెలుసండి. మోహన్రావు సంగతే కదా! నిజానికి డబ్బు అవసరంకొద్దీ ఎంప్లాయిడ్ వైఫ్ కోసం చూస్తున్నాను తప్ప ఉద్యోగం చేసే ఆడవాళ్ల గురించి నా సందేహాలు నాకున్నాయండి. అందుకే ఇన్నాళ్లూ పెళ్లి చేసుకోలేదు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. చాలామంది మా ఫ్రెండ్సుకి జాబ్ చేసే అమ్మాయిలతో సంబంధాలున్నాయి. వాళ్లంతా డబ్బుకోసం దేనికైనా రెడీ. కానీ మోహన్ చెప్పాడు. పద్మ అలాటిది కాదుట. ఒక లిమిటు దాటనివ్వదుట. అంటే ఆ అమ్మాయి విషయం మనకు పక్కాగా తెలిసినట్టే కదండి. మిగిలిన వాళ్లంటారా? ఆమె కంటే అందంగా ఉన్నా వాళ్ల గుణం మనకెలా తెలుస్తుంది? సమాచారం ఎప్పటికి తెలుస్తుందో, తెలిసినది కరక్టవునో కాదో చెప్పలేం. నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దేన్ అన్నోన్ ఏంజెల్ అన్నారు. పద్మ విల్‌పవర్ నాకు నచ్చిందండి. మనిషి కూడా బావుంటుంది. నాలుగైదు సార్లు కలిసి మాట్లాడేసరికి స్నేహం కుదిరింది. చేసుకొందామనుకొన్నాం. ఇంట్లో వాళ్లూ సరేనన్నారు. పెళ్లయ్యేక తనతో స్నేహం మానేస్తానని మోహన్‌కి ఎప్పుడో చెప్పిందట. నేను పద్మ దగ్గిర ఆ విషయం ఎత్తలేదనుకోండి. ఎప్పటికీ ఎత్తను కూడా. కానీ మోహన్ని దూరంగా ఉంచుతుందనే నమ్మకం. ఐ ట్రస్ట్ హెర్ విజ్డమ్.’’

వ్యథావనితాయణంలో మరో కథ వచ్చే నెల మొదటి బుధవారం నాడు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2022)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?