Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍ కథ: గోచరాగోచరం

ఎమ్బీయస్‍ కథ: గోచరాగోచరం

‘’అద్భుతరసం అంటే మనమేం చెప్తాం అనుకున్నా కానీ మా కొలీగ్ శవాలను కనిపెట్టేవాడి గురించి చెప్పాక, నాకు అంజనం వేసేవాడి గురించి గుర్తుకొచ్చింది. అతని కథ చెప్తా..’’ అంటూ మొదలెట్టాడు విక్రమ్ అనే పోలీసధికారి.

‘‘భలే టాపిక్స్ వస్తున్నాయే! నిజంగా అంజనం వేస్తే ఎవరెక్కడున్నారో తెలిసిపోతుందా? అరచేతిలో కాటుక పట్టిస్తే ఆ క్షణాన ఫలానావారు ఏం చేస్తున్నారో వీడియోలో చూసినట్లు కనబడుతుందా? డూ యూ బిలీవ్ యిట్?’’ అని ఆశ్చర్యంగా అడిగారు ముఖ్యమంత్రిణి.

‘‘మేడమ్, లెట్ మీ కన్ఫెస్. అంజనం వేస్తూండగా నేను కళ్లారా చూడలేదు. వేయించినవాళ్లు చెప్పినదాని బట్టి ఒక కేసు డీల్ చేశానంతే. ఆ అంజనం ప్రాసెస్ ఎలా జరిగిందో కథ వింటూంటే మీకే తెలుస్తుంది.’’ అన్నాడు విక్రమ్.

‘‘దీనిలో అంజనం వేసేవాడు తన అరచేతిలో చూసుకుంటే అతని భార్య శవం చూరుకు వేళ్లాడుతూ కనబడిందా?’’ అని ఉబలాటంగా అడిగారు డాక్టర్.

‘‘అన్ని కథలూ ఒకేలా ఉంటాయనుకుంటే ఎలా? దీనిలో అంజనం వేసేవాడు కథానాయకుడు కాదు. అంజనానిదీ చిన్న పాత్రే. నాయికానాయకులు సరిత, విఠల్. సరిత మా ఊళ్లో డబ్బున్న కుటుంబానికి చెందిన పిల్ల. వాళ్ల తాతగారికి దాతగా మంచి పేరుంది. తండ్రి జగపతి కర్కోటకుడు. అహంభావం జాస్తి. భూదానోద్యమ స్ఫూర్తితో తండ్రి పేదలకు, చిన్న కులాల వాళ్లకి పొలాలు పంచిపెడితే, తన హయాం వచ్చాక, వాటన్నిటినీ వెనక్కు లాక్కున్నాడు. అందువలన వాళ్లకు అతనిపై కోపం ఉంది. అలా కోపమున్న కుటుంబం నుంచి వచ్చినవాడే విఠల్. సరితతో పాటు స్కూల్లోనూ, కాలేజీలోనూ కలిసి చదివాడు. వాళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అది ప్రేమగా మారడంలో విఠల్ తాత ప్రోద్బలం ఉంది. జగపతిపై కసి తీర్చుకోవడానికి యిదే అవకాశం అనుకున్నాడు.

చదువై పోయాక విఠల్ ఉద్యోగాల వేటలో ఆ వూరూ, యీ వూరూ తిరుగుతూండగా సరితకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకుని, విఠల్ తాత అతన్ని ఊరికి వెనక్కి రప్పించి, సరిత చేజారిపోతోంది చూసుకో అన్నాడు. జగపతి అంటే భయం చేత విఠల్ వెనుకంజ వేసినా మేం ఉన్నాం కదా అని ప్రోత్సహించాడు. విఠల్ తండ్రికి యీ వ్యవహారం నచ్చలేదు. ఆ అమ్మాయిని మర్చిపోతే మంచిది. వాళ్లకూ మనకూ అంతస్తుల్లో చాలా తేడా ఉంది అన్నాడు. ఈ పెళ్లి చేసుకుంటే యింట్లోంచి తరిమి వేస్తానన్నాడు. విఠల్‌ కాస్త తమాయించాడు కానీ యింతలో తాతకు చావు ముంచుకు వచ్చింది. చచ్చిపోతూ సరితనే పెళ్లాడతానని మనవడి దగ్గర మాట తీసుకున్నాడు ముసలాయన. అది విఠల్ మనసులో బాగా నాటుకుంది. పైగా సరిత కూడా తొందర పెట్టింది. దాంతో ఒక రోజు సరిత, విఠల్ ఊళ్లోంచి మాయమై పోయారు. ఎక్కడికి వెళుతున్నారో ఎవరికీ చెప్పలేదు. సరిత సంగతి సరే, విఠల్ కూడా తండ్రికి కోపం వస్తుందని చెప్పకుండా పారిపోయాడు.

మర్నాడు జగపతి విఠల్ తండ్రికి కబురుపెట్టాడు. అతను వెళ్లి నాకేమీ తెలియదని ఒట్లు పెట్టి వచ్చాడు. అతని ఫోన్ లాక్కుని జగపతి తన దగ్గరే పెట్టుకున్నాడు. విఠల్ దగ్గర్నుంచి కానీ సరిత దగ్గర్నుంచి ఏ ఫోనూ లేదు. ఊళ్లో స్నేహితులకు కూడా చేయలేదు. జగపతి కూతురి కోసం చుట్టుపట్ల ఊళ్లన్నీ వెతికించాడు. హైదరాబాదులో కూడా గాలించాడు. ఎక్కడా దొరకలేదు. అప్పుడు అంజనం వేసేవాడు గుర్తుకు వచ్చాడు. మా పక్కూళ్లో అంజనం వేసే ముసలాయన ఒకడుండేవాడు. ముప్ఫయి ఐదేళ్ల క్రితం జగపతి గారింట్లో ఒక ఖరీదైన నగ పోతే యితన్ని పిలిపించి అంజనం వేయిస్తే, ఆ నగ ఆ క్షణానికి ఎక్కడ, ఏ దశలో ఉందో చెప్పాడట. వీళ్లకు వాళ్ల మీద అప్పటికే అనుమానం ఉండి యిల్లు సోదా చేశారట కానీ కనపడలేదు. అంజనంలో ఖాళీ గాదెలో ఉన్నట్లు తెలియడంతో దాన్ని తెరిపించి చూస్తే నగ దొరికింది. ఇప్పుడీ అమ్మాయి ఆచూకీ చెప్పమని అతన్ని పిలిచారు.

‘పళ్లూడిపోయి మంత్రాలు సరిగ్గా పలకలేక, ఆ వృత్తి వదిలేసి చాలా ఏళ్లయింది. ప్రాక్టీసు తప్పిపోయింది. చూసేవాళ్లకి సరిగ్గా కనబడుతుందో లేదో నన్ను యిబ్బంది పెట్టవద్దు.’ అని అతను మొత్తుకున్నా వినలేదు. బలవంతంగా తీసుకుని వచ్చారు. ఒక యిత్తడి గిన్నె బోర్లించి, దాని మీద కాటు, నూనె పూసి, ఓ చీకటి గదిలో చిన్న దీపం వెలిగించాడు. 12 ఏళ్ల లోపున ఉన్నవాళ్లకు మాత్రమే దానిలో కనబడుతుందట. సరిత తమ్ముడు బంటీకి 11 ఏళ్లు. వాణ్ని కూర్చోబెట్టారు. సరిత తాలూకు ఓణీని అతని భుజం మీద వేశారు. అంజనం వేసేతను మంత్రం చదువుతూ ఆ కుర్రాడి వీపు మీద చెయ్యి వేసి కూర్చున్నాడు. అంతకు ముందు రోజు నుంచి జపాలు చేస్తూ వచ్చిన వచ్చిన కలశం లోంచి నీళ్లు తీసి ఆ అబ్బాయి కళ్లు తుడిచాడు. మనసులో ఏ యితర ఆలోచనలూ పెట్టుకోకుండా తదేకంగా ఆ కాటుకను చూడమన్నాడు. చూసినది పైకి చెప్పమన్నాడు. తక్కినెవరూ అతన్ని డిస్టర్బ్ చేయకూడదన్నాడు.

ఓ పావుగంట పోయాక బంటీ ఏవో దృశ్యాలు కనబడుతున్నాయన్నాడు. అంతలోనే అంతా చీకటిగా ఉందన్నాడు. మసకమసగ్గా ఉందన్నాడు. కనబడేది అక్కో కాదో చెప్పలేనన్నాడు. ఏదో ఊళ్లో వీధులు, వాటిల్లో జనం కనబడుతున్నా రన్నాడు. అంతలోనే మబ్బులు వచ్చాయన్నాడు. ఈ తతంగం గంటన్నర సేపు సాగేటప్పటికి జగపతికి విసుగు వచ్చింది. ఇక చాల్లే అన్నాడు. అంజనం వాడి చేతిలో డబ్బు పెడుతూ ‘‘నీ శక్తి పోయినట్లుందయ్యా’’ అన్నాడు. ‘అదే చెప్పాను కదండీ’ అన్నాడు వాడు.నిజానికి బంటీకి అంజనంలో వాళ్ల అక్క కనబడింది. కానీ ఆమె దుర్భర పరిస్థితుల్లో ఉన్నట్లు, ఏడుస్తున్నట్లూ కనబడింది. చూడబోతే అది వేశ్యల వాడలా అనిపించింది కూడా. పైకి చెపితే తండ్రి బాధపడతాడని, కోపంతో విఠల్ కుటుంబంపై దాడికి వెడతాడని భయపడి మేనమామ నరహరి దగ్గరకు వెళ్లి చెప్పాడు. ఆయనకి మేనల్లుడి తెలివితేటలపై నమ్మకం ఉంది. బావ దగ్గరకు వెళ్లి నాకు వారం రోజుల పాటు హైదరాబాదు వెళ్లే పనుంది. బంటీని కూడా తీసుకుని వెళతా అంటూ నా దగ్గరకు తీసుకుని వచ్చాడు, మా ఊరి నుంచి వచ్చి హైదరాబాదులో పోలీసు శాఖలో పని చేస్తున్నవాణ్ని కనుక.

ఆయనే యీ కథంతా చెప్పాడు. కథంతా విని మీ బంటీకి రెడ్‌లైట్ ఏరియా ఎలా ఉంటుందో ఎలా తెలుసు? అని అడిగాను. సినిమాల్లో చూసి ఉంటాడు అన్నాడు. నేను నవ్వాను. సినిమాల్లో ఉన్నట్లే బయట కూడా ఉంటుందా? అని. బంటీ ముందుకు వచ్చి డాక్యుమెంటరీలు, పత్రికలలో ఫోటోలు కూడా చూశాను అన్నాడు. కావాలంటే బొమ్మలు గీసి చూపిస్తాను, అక్కడున్న మనుషులను వర్ణిస్తాను అన్నాడు. వాడు బాలమేధావి. వాడి బొమ్మలు చూశాక, వర్ణనలు విన్నాక నేనూ కన్విన్స్ అయ్యాను. ఇంట్లోంచి లేవదీసుకుని పోయాక అమ్మాయిలను వేశ్యాగృహాలకు అమ్మేసే అబ్బాయిల కేసులు అనేకం విన్నాం. ఈ అమ్మాయీ అలాగే మోసపోయిందేమో, సాయం చేయాలి, ఈ విఠల్ సంగతి తేల్చాలి అనుకున్నాను.

అనుకుని అరగంట అయిందో లేదో విఠల్ పినతండ్రి వెంకటేశం నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. జరిగిందేమిటంటే అంజనం వేసేవాడు ఊళ్లోకి వచ్చాడని తెలిసి, విఠల్ తల్లి అతన్ని పిలిపించి కొడుకు ఆచూకీ తెలుసుకోమని భర్తను కోరింది. ‘వాడు చేసిన పని వలన ఆ దుర్మార్గుడు జగపతి మనపై ఎంత పగబడతాడో ఆలోచించనివాడు చచ్చినా నేను పట్టించుకోను’ అన్నాడు భర్త. అప్పుడావిడ మరిది వెంకటేశంను బతిమాలి, అతనింట్లో అంజనం సెషన్ పెట్టించింది. ఇంటిపక్క 12 ఏళ్ల లోపు పిల్ల దొరికితే ఆమెను కూర్చోబెట్టారు. ఆ అమ్మాయికి బీచ్, దానిలో అనేక జంటలు కనబడ్డాయట. ఆ జంటల్లో విఠల్, సరిత కూడా ఉన్నారేమో నాకు సరిగ్గా తెలియలేదంది. తర్వాత పెద్ద చెక్కపెట్టె కనబడిందట. పెట్టె ఎందుకు కనబడిందో ఎవరికీ తెలియలేదు. ఆ పిల్లకు బంటీ అంత పరిశీలనాశక్తి లేదు. ప్రతీదానికీ ఏమోఏమో అంది.

ఏం చేయాలో తోచక వెంకటేశం నా దగ్గరకు వచ్చి ఎలాగైనా సాయం చేయాలన్నాడు. ఈ అంజనాల సంగతి నమ్మాలో లేదో పక్కన పెడదాం, మామూలు పోలీసు బుద్ధితో ఆలోచిద్దాం అనుకుని విఠల్ గతంలో ఎక్కడ ఉద్యోగం చేశాడు, అతని స్నేహితులెవరు అని వాకబు చేశాను. అతను బాంబేలో ఓ ఫ్యాక్టరీలో కొంతకాలం చేశాడని, అక్కడ మా కరీంనగర్ జిల్లా కుర్రాళ్లు కొందరు ఫ్రెండ్సయ్యారని వెంకటేశం చెప్పాడు. అంజనం ప్రకారం సముద్రం ఉన్న ఊరు అంశం మ్యాచ్ కావడంతో అక్కడికే వెళ్లి ఉంటారని గెస్ చేశాను. అక్కడ రెడ్‌లైట్ ఏరియా కూడా ప్రసిద్ధి. కొన్నాళ్లు బీచ్‌లకు, షికార్లకు తిప్పి రెడ్‌లైట్ ఏరియాకు అమ్మేసి ఉంటాడనిపించింది. వాడలాటివాడు కాదు, సరితంటే వాడికి చాలా యిష్టం, వాడి ప్రేమలో నిజాయితీ ఉంది అన్నాడు వెంకటేశం. అది వాడు దొరికాక తెలుస్తుందిలే అన్నాను.

ముంబయి చేరగానే అక్కడ పోలీసు ఫోర్స్‌లో ఉన్న ఒక స్నేహితుణ్ని పట్టుకుని మీ కానిస్టేబుల్ని ఒకణ్ని వీళ్లకు తోడుగా యిచ్చి రెడ్‌లైట్ ఏరియాకు పంపించు అని నరహరిని, బంటీని అటు పంపించి, నేనూ వెంకటేశం ఫ్యాక్టరీకి వెళ్లి కనుక్కున్నాం. విఠల్ పని చేసే రోజుల్లో క్లోజ్‌గా ఉన్న ముగ్గురు తెలుగు కుర్రాళ్లు తగిలారు. ముగ్గురూ ఒకే రూములో ఉంటున్నారుట. విఠల్ గురించి అడిగితే మీరెవరు? అన్నారు. సరిత తాలూకు వాళ్లం కాదని చెప్పాక, వాళ్లిద్దరు సరాసరి మా రూముకే వచ్చారు. నాలుగు రోజులుండి వెళ్లిపోయారు అని చెప్పారు. ఎందుకు వెళ్లిపోయారు అని అడిగితే సరిత తాలూకు మనుషులు వెతకడానికి వస్తారని విఠల్ తెగ భయపడేవాడు. గతంలో తను ఉద్యోగం చేసిన చోటు కాబట్టి ముంబయి రావడానికి అవకాశం ఎక్కువుంది కదాని ఊరు విడిచి వెళ్లిపోయారు అని చెప్పారు. ఎక్కడికి వెళ్లారో చెప్పారా అంటే గుజరాత్ వెళతామన్నారు అన్నారు.

రాత్రి హోటల్‌కు చేరేసరికి ఆ కానిస్టేబుల్ మొత్తుకున్నాడు. ‘ఆ బంటీ తను అంజనంలో చూసినది యిలాటి ఏరియానే కానీ యిది కాదు అంటున్నాడు. రేపు ఊళ్లో మరో రెండు మూడు చోట్లకు తీసుకెళతాను కానీ యిదంతా వృథా ప్రయాస. ఈ బ్రోతల్ హౌస్ నడిపేవాళ్లెవరూ నోరు విప్పరు. తమ దగ్గరున్న అమ్మాయిలను పిల్చుకుని వచ్చి చూపించరు. ఫోటో చూపిస్తే తెలియదని పెదవి విరుస్తారు.’ ‘నువ్వు అమ్మాయిల కొనుగోళ్లు చేసే ఏజంట్లను అడిగితే తెలిసేదేమో. సమాచారం చెప్తే చాలు ఎంత డబ్బయినా యిస్తాం, కేసు పెట్టం అని హామీ యియ్యి. నరహరి గారు డబ్బు దగ్గర వెనకాడరు.’ అన్నాను. ‘ఔనౌను’ అన్నాడు నరహరి ఆదుర్దాగా. ‘ఇంకో విషయం. విఠల్ తన ఫ్రెండ్స్‌తో గుజరాత్ వెళతామని చెప్పాడట. ఇక్కణ్నుంచి గుజరాత్‌కు అమ్మాయిలను పంపించేవాళ్ల మీద ఫోకస్ పెట్టు.’ అన్నాను.

బంటీ నోరు విప్పాడు. ‘నేను చూసిన చోటు వేరే రాష్ట్రంలో ఉన్నట్టుంది అంకుల్. కొన్ని బోర్డులు కనబడ్డాయి. అవి హిందీలో ఉన్నాయి కానీ హిందీ కాదు. ఇక్కడ బోర్డులు హిందీలో ఉన్నాయి.’ అన్నాడు. ‘అది మరాఠీలే. గుజరాతీ యిలా ఉంటుంది, చూడు. కరెన్సీ నోటు మీద గుజరాతీ స్క్రిప్టు చూపించాను. నువ్వు చూసినవి యిలా ఉన్నాయా లేదా చెప్పు అని అడిగితే అతను ‘ఇలా చెప్పడం కష్టం అంకుల్. బోర్డు మీద పెద్ద అక్షరాల్లో చూస్తే తెలుస్తుందేమో’ అన్నాడు. కానిస్టేబుల్ ‘గుజరాతన్నా చాలా ఊళ్లు, సెంటర్లున్నాయి కదా సార్. కాస్త ఐడియా యిస్తే బెటరు.’ అన్నాడు. రేపు చెప్తాలే అని అతన్ని పంపించేసి, వెంకటేశంతో ‘మనం ఆ కుర్రాళ్ల రూముకి వెళ్లి గుజరాత్‌లో ఎటువైపు వెళ్లాడో ఆరా తీద్దాం. సాధారణంగా ఫ్రెండ్సున్న చోటికే వెళతారు కదా, గతంలో వీళ్లతో పాటు పని చేసి ప్రస్తుతం గుజరాత్‌కి షిఫ్ట్ అయిపోయినవారి గురించి అడిగితే కొంత ఐడియా వస్తుంది.’ అన్నాను.

మమ్మల్ని చూసి ఆ కుర్రాళ్లు ఉలిక్కిపడ్డారు. ‘ఇంత రాత్రి వేళ వచ్చారేమిటి సార్? ఇక్కణ్నుంచి ఎక్కడికి వెళ్లాడో మాకేం తెలియదని చెప్పాం కదా’ అన్నారు. ‘కంగారు పడకండి, విఠల్ ఫ్రెండ్స్ సర్కిల్ గురించి అడుగుదామని వచ్చాను. ఫ్యాక్టరీలో మిమ్మల్ని మాటిమాటికి డిస్టర్బ్ చేయడమెందుకని రూమ్‌కి వచ్చాను’ అని నచ్చచెప్పాను. ఒక్కోరిని విడివిడిగా బయటకు తీసుకెళ్లి విఠల్‌కి ఉన్న పరిచయాల గురించి విపులంగా అడుగుతూ పోయాను. గుజరాత్‌లో ఎక్కడికి వెళ్లి ఉంటాడని మీ ఊహ అంటే తలొకరూ తలో ఊరు పేరు చెప్పారు. విసుగొచ్చింది. అలిసిపోయాను కూడా. గదిలోకి వచ్చి, అక్కడో పెద్ద చెక్కపెట్టె కనబడితే దాని మీద కూలబడ్డాను.

‘ఒక్కటే గది. అదీ చిన్నగా ఉంది. వాళ్లిద్దరూ యిక్కడెలా ఉన్నారు?’ అని అడిగాను. ‘పెళ్లింకా కాలేదు కాబట్టి హోటల్లో రూము తీసుకోవడానికి దడిశారు. అలాగే సర్దుకున్నాం. ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుందామని డేట్ బుక్ చేసుకున్నారు. అంతలోనే ప్లాను మార్చుకున్నారు.’ అన్నాడొకడు. ఆ గదిలో వాళ్లు ఎలా ఉండి ఉంటారా అన్ని ఆలోచిస్తూ ఉండగానే మగత కమ్మినట్లయింది. ఆ పెట్టె మీదే కాళ్లు ముడుచుకుని నిద్రలోకి జారాను. ఓ పదిహేను నిమిషాలు గడిచాయో లేదో, ఎవరో వీపు మీద చరిచినట్లు మెలకువ వచ్చింది. చటుక్కున ఆ పాపకు అంజనంలో కనబడిన పెట్టె యిది కాదు కదా అన్న సందేహం కలిగింది. వెంకటేశాన్ని పక్కకు పిలిచి అతనితో అంటే సెల్‌లో ఫోటో తీసి పంపిస్తాను, పాపను అడగమంటాను అన్నాడు.

పాప దగ్గర్నుంచి సమాధానం వచ్చే లోగా నేను వీళ్లని ‘ఇంత పెద్ద పెట్టె ఎందుకు?’ అన్నాను. ‘కిచెన్ షెల్ఫ్ లాటిది లేదు కదండీ, నెలకోసారి వెచ్చాలు కొని దీంట్లో పెట్టుకుంటాం. పెట్టెను పాత సామాన్ల వాడి దగ్గర అతి చౌకగా కొన్నాం.’ అన్నారు వాళ్లు. పెట్టె తెరిచి చూస్తే పప్పులు, ఉప్పులు ఉన్నాయంతే. ఇంతలో తను చూసినది ఆ పెట్టేనని పాప కన్‌ఫమ్ చేసింది. ‘విఠల్‌కు సంబంధించిన వస్తువులు, బట్టల్లాటివి దీనిలో పెట్టారా?’ అని అడిగాను. ‘వాళ్లిద్దరూ చెరో సూట్‌కేస్‌ తెచ్చుకున్నారు. బట్టలు వాటిల్లోనే ఉండేవి. దీన్ని వాడినట్లు మాకు తెలియదు. తమతో తెచ్చుకున్న డబ్బూదస్కం మాకు తెలియకుండా ఏ చింతపండు డబ్బాలోనో దాచుకున్నారేమో తెలియదు. సరితే వంట చేసేది కాబట్టి మేం ఆ రోజుల్లో దాని జోలికి పోలేదు.’ అన్నాడొకడు. కావచ్చనిపించింది.

కానీ ఆ రాత్రి నాకు ఓ కల వచ్చింది. సముద్రం, పెద్ద ఎత్తున అలలు, పిల్లా, పెద్దా, ఆడా మగా అందరూ ఉత్సాహంగా నీటితో ఆటలాడుతున్నారు. వాళ్ల వీపులు కనబడుతున్నాయి. అంతలో కెమెరా పాన్ చేసి చూపించినట్లు కాస్త దూరంగా యిసుకలో ఉన్న ఓ శవం కనపడింది. మొహం సరిగ్గా తెలియలేదు. ఒడ్డూపొడుగూ చూస్తే విఠలేమో అనిపించింది. మెలకువ వచ్చేసింది. ఈ అంజనాల కథలు విని నేనూ భ్రమలో పడిపోతున్నానా, సైంటిఫిక్‌గా యిన్వెస్టిగేషన్ చేయటం లేదా అనుకున్నాను. పొద్దున్న లేవగానే యీ మధ్య సముద్రతీరంలో దొరికిన శవాలలో క్లెయిమ్ చేయనివి ఏవైనా ఉన్నాయా కనుక్కోమని మా స్నేహితుణ్ని కోరాను.

కానిస్టేబుల్ రాగానే బాంబేలో తక్కిన రెండు ప్రదేశాలూ ఓసారి చూపించి, అక్కణ్నుంచి అటే గుజరాత్ వెళ్లిపోమన్నాను. ఈ వ్యాపారానికి ప్రసిద్ధి కెక్కిన ఊళ్లు ఒక్కోటి కవర్ చేయమన్నాను. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మా ఫ్రెండు ఫోన్ చేశాడు. మేం చెప్పిన ఒడ్డూపొడుగూతో సరిపోయే శవం ఒకటి దొరికిన మాట నిజమేట. అది ప్రస్తుతం ఎక్కడుందో కనుక్కుని చెప్తానన్నాడు. నా యింట్యూషన్ కరక్టయినందుకు అబ్బురపడుతూనే లోకల్ పోలీసును వెంటపెట్టుకుని ఫ్యాక్టరీకి వెళ్లి ఆ ముగ్గుర్నీ నిలదీశాను. కాస్సేపు మాకేం తెలియదన్నారు. పోలీసు స్టేషన్‌కు తీసుకెళతామనగానే నిజం చెప్పేస్తామంటూ భోరుమన్నారు.

వచ్చిన నాలుగో రోజున విఠల్ ‘ముంబయిలో ఉంటే మీ వాళ్లు పట్టుకోవచ్చు. గుజరాత్ వెళ్లిపోయి, అక్కడే ఏవో ఉద్యోగాలు చూసుకుందాం.’ అనడంతో సరితకు కోపం వచ్చిందట. ‘ముంబయి మహానగరంలో మనల్ని పట్టుకోవడం కష్టం, అక్కడే సేఫ్, పైగా ఉద్యోగాలు దొరకడం యీజీ అని చెప్పి, తీసుకుని వచ్చి యిప్పుడు గుజరాతు, పంజాబు అంటావేమిటి? ఇక్కడున్నన్ని ఉద్యోగాలు అక్కడుంటాయా?’ అని విరుచుకు పడింది. దాంతో పాటు నువ్వు పిరికివాడివి, నిన్ను నమ్ముకుని రావడం నా బుద్ధితక్కువ అంటూ ఏమోమో అంది. దాంతో సముద్రంలో దూకి ఛస్తా అంటూ విఠల్ వెళ్లిపోయాడు. మర్నాటికి కూడా రాకపోతే వీళ్లకు భయం పట్టుకుంది. ఆ శవం పోలీసుల కంటపడి ఎంక్వయిరీకి వస్తే తమకు ముప్పనుకున్నారు. సరితకూ భయం వేసింది. ఈ వూళ్లోనే మా క్లాస్‌మేట్ ఉంది. నేను తన యింటికి వెళ్లిపోతానంటూ తనదీ, విఠల్‌ది పెట్టెలు తీసుకుని వెళ్లిపోయింది.

వీళ్లు చెప్పిన కథ నమ్మాలనిపించలేదు. కానీ కస్టడీలో తీసుకోవాలంటే ఏ కారణం చెప్పి తీసుకోగలం అని లోకల్ పోలీసు అన్నారు. దాంతో వాళ్లెక్కడికీ పారిపోకుండా చూడడానికి నేను అవేళ రాత్రి వాళ్ల రూములోనే పడుక్కున్నాను. పొద్దున్న నరహరికి ఫోన్ చేసి ‘మిమ్మల్ని అనవసరంగా గుజరాత్ పంపించాను. సరిత యీ ఊళ్లోనే ఉందంటున్నారు యీ కుర్రాళ్లు. వెనక్కి వచ్చేయండి, యిక్కడే థరోగా వెతుకుదాం.’ అని చెప్పాను. ‘సూరత్‌లో ఉన్నాం. ఇక్కడ బోర్డులు అవీ చూసి బంటీ యిలాటి ఊళ్లోనే అక్క ఉన్నట్లు అంజనంలో కనబడింది అంటున్నాడు. ముంబయిలో తక్కిన రెండు ప్రదేశాల్లో వెతికినా లాభం లేకపోయింది. ఇక్కడే గట్టిగా వెతుకుదాం అనుకుంటున్నాం.’ అన్నాడు. నాకేమనాలో తెలియలేదు. అంజనం పిచ్చి బాగానే పట్టినట్టుంది వీళ్లకు. అంజనంలో బోర్డులూ దాని మీద అక్షరాలూ అన్నీ కనబడతాయా? ఇదేమైనా సినిమా కెమెరానా, అన్ని యాంగిల్స్‌లోంచి కవర్ చేయడానికి? అనుకుని యీ కుర్రాళ్ల మీద దృష్టి పెట్టాను.

వాళ్లలో ఒకణ్ని సెలక్ట్ చేసుకుని విడిగా మాట్లాడాను ‘సరిత వెళ్లిపోవడం గురించి మీరు చెప్పినది నమ్మేట్టుగా లేదు. తన కుటుంబం ఆమె ఎక్కడుందో కనిపెట్టడానికి శతవిథాల ప్రయత్నిస్తోంది. ఎవరో జ్యోతిష్కుడు రెడ్‌లైట్ ఏరియాలో ఉందన్నాట్ట. తెగ తిరుగుతున్నారు. నువ్వు కాస్త ఐడియా చెప్పావనుకో, వాళ్ల చేత బోల్డు డబ్బిప్పిస్తాను. తక్కినవాళ్ల కంటె నీకు డబ్బు అవసరం ఎక్కువుందని నాకు తెలుసు.’ అన్నాను. అప్పుడు వాడు ‘నిజం చెప్పాలంటే, విఠల్ మాయమై పోయిన మర్నాడే అద్దె బకాయిల కోసం మా యింటి ఓనరు వచ్చాడు. సరితను చూసి అమ్మాయిలను తెచ్చుకుంటున్నారా అంటూ గోలపెట్టాడు. విషయం చెపితే ‘ఇక్కడెందుకు, నాకు తెలిసిన విమెన్స్ హాస్టల్లో చేర్పిస్తా’ అన్నాడు. సరిత కూడా సరేనంది. అతనితో వెళ్లిపోయింది. మీరు అతన్ని అడిగితే వివరాలు తెలియవచ్చు.’ అన్నాడు.

ఆ యింటి ఓనరు మహా పొగరుగా ఉన్నాడు. ‘బకాయిలు మాఫ్ చేయడానికి వాళ్లా అమ్మాయిని అప్పగించారు. దాన్ని ఏం చేసుకోవడానికైనా నాకు హక్కు ఉంది. ఎవరికి అమ్మానో నేను చెప్పను. ఏం చేస్తారో చేసుకోండి.’ అంటూ మొండికేశాడు. వెంటనే వాణ్ని, యీ ముగ్గురు కుర్రాళ్లను హ్యూమన్ ట్రాఫికింగ్ కింద కస్టడీలోకి తీసుకున్నారు ముంబయి పోలీసులు. ఈలోగా విఠల్ శవాన్ని వెంకటేశం గుర్తు పట్టడంతో హత్య కేసు కూడా జోడించారు. కానీ నిందితులెవరూ నోరు విప్పలేదు. నోరు తెరవడానికి టైము పట్టవచ్చని అనుకుంటూండగానే సూరత్ నుంచి నరహరి ఫోన్ చేశాడు. బంటీకి అంజనంలో కనబడిన ఏరియా సూరత్‌లోనే ఉందట. వాడు కరక్టుగా ఆ యింటిని చూపించాడట. లోపలకి వెళ్లి అడిగితే కాస్త బుకాయించారు కానీ, గుజరాత్ పోలీసుల సాయంతో బెదిరిస్తే సరితను తీసుకుని వచ్చి అప్పగించారట.

సరిత చాలా విషయాలే చెప్పింది. తనకూ, విఠల్‌కు గొడవలేవీ రాలేదట. ఈ ముగ్గురూ కలిసి ఆమెపై అత్యాచారం చేయబోతే విఠల్ అడ్డుకున్నాడు. తోపులాటల్లో పెట్టె అంచు కణతలకు తగిలి విఠల్ చచ్చిపోయాడు. శవాన్ని ఆ పెట్టెలోనే పెట్టి, సముద్రం దగ్గరకు తీసుకెళ్లి శవాన్ని పడేశారు. ఇంటికి వచ్చి యీమెను ఒకరొకరుగా రేప్ చేశారు. ఊరు వదిలి వస్తూ తెచ్చిన నగలూ, డబ్బూ ఏమయ్యాయని అడిగారు. ఓ సూట్‌కేసులో పెట్టి రైల్వే స్టేషన్‌లో క్లోక్‌రూమ్‌లో పెట్టామని, చీటీ విఠల్ దగ్గరే ఉందని సరిత చెప్పింది. అయితే నువ్వెందుకు మాకు భారం అంటూ యింటి ఓనరుకి అమ్మేశారు. ఇంటి ఓనరు ఓ బ్రోకరుకి అమ్మేస్తే అతను సూరత్‌కు తీసుకుని వచ్చి అమ్మేశాడు... తర్వాత యిన్వెస్టిగేషన్ జరిగి, నేరస్తులకు శిక్షలు పడ్డాయనుకోండి. కానీ కేసు రిజాల్వ్ కావడానికి అంజనం ఎలా ఉపయోగపడిందో చూడండి.’ అని విక్రమ్ కథ ముగించాడు.

మిత్రుల దౌష్ట్యానికి బలై పోయిన జంటను తలచుకుని శ్రోతలందరూ విషాదంలో మునిగిపోవడంతో ఐదు నిమిషాలపాటు మౌనం రాజ్యమేలింది. మూడ్ మారుద్దామనుకున్న ముఖ్యమంత్రిణి ‘‘ఆ అంజనం అతనికి మనకి సెక్రటేరియట్‌లో ఉద్యోగం యిద్దాం. మిస్సింగ్ ఫైల్స్ ఎక్కడున్నాయో కనిపెడతాడు.’ అని జోక్ చేశారు. ఫైనాన్స్ సెక్రటరీ ‘‘అతనికి తోడుగా పన్నెండేళ్ల లోపు పిల్లనో, పిల్లాణ్నో కూడా పెట్టుకోవాలి. చైల్డ్ లేబరు యాక్ట్ కింద శిక్ష పడుతుంది చూసుకోండి.’’ అని చమత్కరించాడు. డాక్టరు గారు మాత్రం కాస్త ఆగి ‘‘దీనిలో అద్భుతమైన విషయం అంజనం ఒకటే కాదు, అంజనంలో కొన్ని కనబడ్డాయి, కొన్ని కనబడలేదు. దానికి తోడు రెండు మూడు విషయాలున్నాయి కాబట్టే కేసు సాల్వ్ అయింది. ఆ ముగ్గురూ గుజరాత్ అని నోటికొచ్చింది చెప్పేశారు. తీరా అదే నిజమైంది. తర్వాత ఆ పెట్టె కూడా విక్రమ్‌కు సిగ్నల్స్ యిచ్చింది. అవేళ రాత్రి శవం అతనికి కలలోకి రావడానికి కారణం మధ్యాహ్నం దాని మీద అతను పడుక్కోవడమే. వెంకటేశం తాలూకు పిల్లకు అంజనంలో సముద్రం, బహుశా విఠల్ శవం కనబడే ఉంటాయి. అయితే ఆ పిల్ల దృష్టి బీచ్‌లోని జంటల మీద ఉండడంతో మిస్‌లీడ్ అయింది. ఆ పెట్టె కారణంగానే విక్రమ్‌కు అంజనం ఎఫెక్ట్ కలిగింది.’’ అన్నాడు. అందరూ ఔనన్నట్లు తలూపారు.

అద్భుతరస యామిని సీరీస్‌లో మరో కథ వచ్చే నెల రెండో బుధవారం.

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?