cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍ కథ: మిసెస్ సేఠ్

ఎమ్బీయస్‍ కథ: మిసెస్ సేఠ్

ఇది నా ఇంగ్లీషు కథ ‘‘మిసెస్ సేఠ్’’కు స్వీయానువాదం. ‘‘ఎలైవ్’’ మాసపత్రిక 1996 డిసెంబరు సంచికలో ముద్రితమైంది. కథానేపథ్యం చివర్లో చెప్తాను.

‘‘ఆశ్చర్యం, మీరిక్కడున్నారేమిటి, మిస్టర్ రంగన్?’’ అంటూ విపిన్ సేఠ్ నా చెయ్యి పట్టుకున్నాడు. ఇలాటి ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో నాబోటి బ్యూరోక్రాట్ ఉండడం ఆశ్చర్యకరమైతే, విపిన్ లాటి దురాశాపరుడైన వ్యాపారవేత్త ఉండడం విడ్డూరం. ఒడిశాలో తన ప్రాజెక్టు గురించి తప్ప మరేదీ అతని బుర్రలో దూరుతుందని నేనెన్నడూ అనుకోలేదు. పైగా కళకు సంబంధించిన వ్యవహారం యిది! ఒళ్లు మండుతూండగా ‘‘ఈ ఎగ్జిబిషన్‌కు మనిద్దరం భారం కాదు లెండి’’ అన్నాను వెక్కిరింతగా.

‘‘కరక్టుగా చెప్పాలంటే ముగ్గురం..’’ అంటూ పక్కకు తిరిగి ఒకావిణ్ని చూపించి ‘‘మా ఆవిడ రేణు’’ అని పరిచయం చేశాడు. చూడగానే మతి పోగొట్టే రూపసి ఆమె. పాల నురుగు లాటి మేనిఛాయ. ఫీచర్స్ చూడబోతే ఎవరో శిల్పి చెక్కినట్లుంది. నా ఊపిరి స్తంభించి, నోరు వెళ్లబెట్టాను. అది వాళ్లు గమనించారో లేదో తెలియదు కానీ మామూలు ధోరణిలోనే పరిచయాలు జరిగాయి. ఆమె భర్త కేసి తిరిగి వాళ్ల భాషలో ‘‘మీకో మద్రాసీ స్నేహితుడున్నాడని నాకెప్పుడూ చెప్పలేదే!’’ అనడం నా కర్థమైంది.

నేను మితభాషినే కానీ ఆ రోజు ఆమెపై చమత్కారబాణం వేయబుద్ధయింది. ‘‘మాది మద్రాసనుకుని ఈకారం చేర్చి మద్రాసీ అన్నారు. కానీ మాది తిరుచ్చి అని తెలిస్తే ఏమంటారు?’’ అని అడిగాను. ఆమె ఏ మాత్రం తగ్గకుండా వెంటనే ‘‘తిరుచీచీ అనాలేమో’’ అంటూ నవ్వింది. అంటూనే ‘‘శ్రీరంగం వారు కాబట్టే తాము రంగడయ్యారన్నమాట, అంతటితో ఆగారా? పూలరంగడయ్యారా?’’ అని పగలబడి నవ్వింది. నవ్వుతూ కన్ను కూడా గీటిందా అని లేశమాత్రం అనుమానం కలిగింది. ఆ తర్వాత ఎగ్జిబిషన్‌లో తిరుగుతూ పెయింటింగ్స్ చూస్తున్నపుడు ఆమె చాలా అవగాహన కనబరుస్తూ, చక్కటి వ్యాఖ్యలు చేసింది. ఎంతోకొంత ఆర్ట్ గురించి తెలుసనుకునే నాకంటె ఆమెకే కొన్ని సంగతులు ఎక్కువ తెలుసని నాకర్థమైంది. విపిన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా బొమ్మల్ని ఎగాదిగా చూస్తున్నాడు. బయటకు వచ్చేస్తున్నప్పుడు ‘‘ఒక్కరే వచ్చారేం? ఫ్యామిలీని తీసుకురాలేదా?’’ అన్నాడు.

‘‘మీకు తెలియదు కాబోలు, నేనింకా బ్రహ్మచారినే’’ అన్నాను.

‘‘వాళ్లు మనవాళ్లలా కాదు. మన దగ్గర కుర్రాళ్లు సొంతంగా ఏమీ సంపాదించకపోయినా 18 ఏళ్లు వచ్చేసరికి పెళ్లికి సిద్ధపడిపోతారు. ఉమ్మడి కుటుంబంలో ఖర్చులు ఎత్తిపోతాయి కదాన్న ధీమా. వాళ్లయితే సొంత సంపాదనతో జీవితంలో స్థిరపడ్డాకనే పెళ్లికూతురి కోసం చూస్తారు.’’ అని రేణు భర్తను ఎత్తిపొడిచింది. విపిన్ నవ్వుతూ ఆమెకు దణ్ణం పెట్టాడు.

‘‘సాధారణంగా నార్త్ ఇండియన్లకు సౌత్ ఇండియన్ల గురించి పెద్దగా ఏమీ తెలియదు. మీకు తమిళియన్స్ గురించి బాగా తెలుసే!’’ అన్నాను. ఆమె వెంటనే అంటించేసింది. ‘‘సాధారణ మద్రాసీల హిందీ కంటె మీది ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. దానికేమంటారు?’’ అని! ఇద్దరం పగలబడి నవ్వుకున్నాం. నవ్వు ఆపుకుంటూ ‘‘తమిళియన్స్ అనగానే యాంటీ హిందీ అనుకుంటారు. ఇటీజ్ నాట్ లైక్ దట్..’’ అంటూ ఏదో చెప్పుకుపోయాను. మధ్యలో గుర్తించాను, అప్పటిదాకా సంభాషణంతా హిందీలోనే జరిగినా, నేను మధ్యమధ్యలో హిందీలోంచి ఇంగ్లీషులోకి మారిపోతున్నానని! ‘ఐ యామ్ సారీ! నేను ఇంగ్లీషులో మాట్లాడేస్తున్నాను.’’ అని అని అనగానే విపిన్ ‘‘నాది బొటాబొటీ చదువు కదాని, మా ఆవిడా అదే రకం అనుకోకండి సాబ్! తను ఇంగ్లీషు ఎమ్మే. పుస్తకాలు బాగా చదువుతుంది.’’ అన్నాడు. నేను ఆమెను మెచ్చుకోలుగా చూశాను. వాళ్లిద్దరూ కారెక్కి వెళ్లిపోయారు.

ఆ రాత్రి నాకు సరిగ్గా నిద్రపట్టలేదు. విపిన్-రేణుల జంటను కూర్చిన దేవుడు బహు చమత్కారి కదా అనిపించింది.  భార్యేమో సరస్వతీదేవి అవతారం. భర్తేమో కుబేరపూజారి. చదువు మీద, కళల మీద, సంస్కారం మీద బొత్తిగా ఖాతరు లేనివాడు. డబ్బు సంపాదించడానికి అడ్డదారులు వెతకడానికే జీవిస్తాడు. కలకత్తాలో అడ్డగోలుగా సంపాదించిన డబ్బు చాలలేదు. ఒడిశాలో ఓ ఫ్యాక్టరీ పెట్టాలని పంతం పట్టాడు. ‘పెట్టండి, దానికేముంది? కానీ పారిశ్రామికపరంగా, పర్యావరణపరంగా తీసుకోవాల్సిన భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే’ అంటే ‘అవన్నీ ఎందుకు సాబ్’ అంటాడు. ఎందుకేమిటి? అవి తీసుకోకపోతే కార్మికులు ఆరోగ్యం చెడి ఛస్తారు, చుట్టూ ఉన్న నీరు కలుషితమౌతుంది, వన్యప్రాణులు నశిస్తాయి... ఇలా ఎంత నచ్చచెప్పినా వినడు. తనకు ఓ నాలుగు డబ్బులు మిగిలితే చాలు, సమస్తలోకం ధ్వంసమై పోయినా వాడికి ఖాతరు లేదు.

వాడు ఒడిశాలో ఫ్యాక్టరీ నెలకొల్పడానికై అన్ని రకాల భద్రతాపరమైన అనుమతులు యిచ్చే ఆఫీసు కలకత్తాలో ఉండడం, యిచ్చే అధికారిని నేనే కావడం వలన నాకు పరిచయమయ్యాడు. నన్ను చూడగానే మెలికలు తిరుగుతూ, దొంగ నవ్వులు రువ్వుతూ వెధవ్వేషాలు వేయడం మొదలెట్టాడు. నేను డబ్బుకి అమ్ముడుపోనని తెలుసుకుని వుంటాడు. అందుకని అతి వినయంగా నన్ను యింప్రెస్ చేయాలని తంటాలు పడుతున్నాడు. నిపుణులిచ్చిన సర్టిఫికెట్లు అంటూ ఓ పది పట్టుకుని వచ్చి యిచ్చాడు. నా దృష్టిలో వాటికి ఏ విలువా లేదు. వాళ్లను ఎలాగోలా ప్రలోభపెట్టి సంపాదించి ఉంటాడు. అందుకే అనుమతి యివ్వకుండా తొక్కిపెట్టాను. వాణ్ని చూస్తేనే నాకు రోత. అలాటివాడితో రేణు వంటి సుకుమారి పక్క పంచుకుంటోందని ఊహించుకోవడం నాకు కష్టంగా తోచింది. కానీ దైవనిర్ణయం అది. మానవమాత్రులం ఏం చేయగలం? నిట్టూర్చి ఊరుకోవడం తప్ప!

రెండు వారాల తర్వాతనుకుంటా, కళామందిర్ ఆడిటోరియంలో సెమ్మంగుడి కచ్చేరికీ వెళ్లినపుడు సేఠ్ దంపతులు మళ్లీ తగిలారు. అసలీ మొద్దు స్వరూపానికి కర్ణాటక సంగీతం గురించి ఓనమాలు తెలుసా? అనుకున్నాను. నా భావం మొహం మీద కనబడిందో ఏమో తనే చెప్పేశాడు ‘‘మా ఆవిడ కోసం రావడం తప్ప నాకు ఏ రాగమూ తెలియదు, ఏ గాయకుడు ఎలాటివాడో తెలియదు. తనకు కర్ణాటక సంగీతం చాలా యిష్టం. దాంతో నా దుంప తెంపి సౌత్ ఇండియా కల్చరల్ అసోసియేషన్‌కు పేట్రన్‌గా ఉండమని పోరింది.’’ అన్నాడు. ఈ మహానుభావుడు సంగీతకార్యక్రమాలకు దాతగా ఉండడమా? హతవిధీ! నేనేమీ అనకుండానే సమాధానం చెప్పేశాడు, ‘‘సాబ్, సంగతేమిటంటే, వారంలో ఆరు రోజులు నా వ్యాపారం గొడవల్లో నేనుంటాను. తను నా జోలికి రాదు. ఆదివారం ఒక్కరోజూ మాత్రం తనిష్టం. ఎక్కడకి రమ్మంటే ఎక్కడు వస్తాను, ఏం చేయమంటే అది చేస్తాను. ఈ సాపాసా..లు ఏమీ తెలియని శుంఠని. కానీ తనకోసం అంగరక్షకుడిలా వస్తాను.’’ అంటూ హావభావాలతో సరదాగా వర్ణించాడు.

నేను ఫకాలున నవ్వి రేణుతో ‘‘అయితే మీ కారణంగా ఆయనకు కొంత సంగీతజ్ఞానం అబ్బుతోందంటారు.’’ అన్నాను. ‘‘ఆయన కబుర్లు విని మోసపోకండి. సినిమా పాటలంటే చెవి తెగ్గోసుకుంటారు. వాటికి బేస్ యిదే కదా! ఏదైనా కీర్తన వచ్చినపుడు ఫలానా పాటలా ఉందే అంటారు. తనూ ఎంజాయ్ చేస్తారు. కానీ నన్ను ఉద్ధరించినట్లు పోజు పెడతారు.’’ అంది రేణు. తన మొగుణ్ని వెనకేసుకుని రావడానికి రేణు ప్రయత్నించిన సంగతి కాస్సేపటికే తెలిసిపోయింది. కచ్చేరీ మంచి రసపట్టులో ఉండగా విపిన్ లేచి వెళ్లిపోయాడు. రేణు సంజాయిషీ చెప్తున్నట్లు ‘‘పొద్దుటి నుంచి తలనొప్పితో బాధపడుతున్నాడు. నేనే అనవసరంగా కచ్చేరికి లాక్కుని వచ్చాను.’’ అంది. నేను నవ్వేసి ఊరుకున్నాను. మన దేశంలో భార్యలందరూ చేసే పని యిది. మొగుడి పరువు కాపాడ్డానికి నానా తంటాలూ పడతారు. వాస్తవమేమిటంటే రేణుకి కర్ణాటక సంగీతం క్షుణ్ణంగా తెలుసు, విపిన్‌కి దాని పట్ల అభిరుచే లేదు. కచ్చేరీ ముగిసే సమయానికి డ్రైవరు వచ్చి రేణుని తీసుకుని వెళ్లాడు.

పదిహేను రోజులు పోయాక, నేను ఆఫీసులో ఉండగా ఓ మధ్యాహ్నం రేణు నుంచి ఫోను వచ్చింది. లలితకళల విషయంలో నాకు అభినివేశం ఉందన్న సంగతి రేణు గ్రహించిందని నాకు అర్థమైంది కానీ ఫ్రెంచ్ శిల్పి రోదా శిల్పాల ఎగ్జిబిషన్‌కు తోడుగా రమ్మంటుందని నేనూహించలేదు. నన్నే ఎందుకు రమ్మనవలసి వచ్చిందో చాలా వివరణే యిచ్చింది. ‘‘ఈ ప్రదర్శన యింకా మూడు రోజులే ఉంటుంది. ఇండియాలో రోదా ఒరిజినల్స్ చూడడమనేది అసాధ్యమని అనుకుంటూన్నపుడు వారి ప్రపంచ పర్యటనలో భాగంగా ఇండియాకు వాటిని తీసుకుని వస్తున్నారు. ఇది మిస్సయితే జన్మలో మళ్లీ చూడలేం. విపిన్ ఒడిశా వెళ్లారు. ఆదివారం దాకా తిరిగి రారు. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. మీతో పాటు చూస్తే నాకు తెలియని విషయాలు తెలుసుకోవచ్చనే ఆశ ఒకటుంది.’’ అంది. నేను చిరునవ్వు నవ్వి ‘‘చూడబోతే నేను కలైజ్ఞర్ కరుణానిధి అనుకుంటున్నట్టున్నారు మీరు. శిల్పకళ గురించి నాకు పెద్దగా తెలియదు. అయినా మీతో పాటు చూస్తే అదో అనుభవం. సాయంత్రం 5.30కి బిర్లా ఆర్ట్ మ్యూజియం వద్ద వెయిట్ చేస్తాను. వస్తారా?’’ అన్నాను.

‘‘తప్పకుండా టైముకి వచ్చేస్తాను. ఇంకొక్కమాట. మీరు దీని గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ, కొలీగ్స్‌తో కానీ ఎక్కడా ఏమీ అనరుగా’’ అంది రేణు. ‘‘మా ఫ్యామిలీ, అంటే మా అమ్మానాన్నా చెల్లెలు తిరుచ్చిలో ఉంటారు. ఇక్కడ నేనొక్కణ్నే ఉంటాను. ఇక్కడ కొలీగ్స్‌లో ఎవరితోనూ నేను సన్నిహితంగా ఉండను. అందువలన ఎవరితోనూ చెప్పే ప్రశ్నే లేదు. సాయంత్రం కలుద్దాం. ఉంటా, వేరే ఫోన్ మోగుతోంది.’’ అన్నాను.

సదరన్ ఎవెన్యూలో మ్యూజియానికి చెప్పిన టైముకి వెళ్లాను. ఆమె అప్పటికే వచ్చేసి, వెయిట్ చేస్తోంది. ఎగ్జిబిషన్ చూసి చాలా ఎంజాయ్ చేశాం కానీ రద్దీ ఎక్కువగా ఉండడంతో అలసిపోయాం. టీ తాగుదామన్నాను. ‘‘తప్పకుండా, కానీ రెస్టారెంట్‌లో వద్దు. పక్కనే ఉన్న ఢాకూరియా లేక్ గట్టు మీద నడుస్తూ మట్టి పిడతల్లో టీ తాగుదాం.’’ అందామె. కాస్సేపటికే మేమిద్దరమూ కబుర్లు చెప్పుకుంటూ ఆ సరస్సు గట్టు మీద నడుస్తున్నాం. ఆమె లక్నోలో తన బాల్యం గురించి చెప్పింది. (అదీ సంగతి! కళలకు ఆటపట్టయిన తంజావూరుతో సరి తూగే ఊరు ఉత్తరభారతంలో ఏదైనా ఉందా అంటే అది లక్నో మాత్రమే!) సంభాషణ సాగుతూండగా అప్పుడప్పుడు మా భుజాలు రాసుకున్నాయి. రేణు పట్టించుకున్నట్లు కనబడలేదు. వివాహిత ఐన ఆమెకు అది సహజమే కావచ్చు కానీ 32 ఏళ్ల నాబోటి బ్రహ్మచారికి మహా రొమాంటిక్ ఘట్టమది!

దానికి మించినది కాస్సేపటికే జరిగింది. కారెక్కబోతూ ‘‘రంగన్, యివాళ యిలా వచ్చిన సంగతి విపిన్‌ దగ్గర ప్రస్తావించకపోతే మంచిదనుకుంటున్నాను. తను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవచ్చేమో, ఎవరికి తెలుసు?’’ అంది. ఆ రాత్రి నాకు సరిగా నిద్రపట్టలేదు. ఒక పెద్ద వ్యాపారవేత్త భార్యను అతనికి తెలియకుండా చాటుగా కలుస్తున్నానన్న విషయం నాకు గిలిగింతలు పెట్టింది. 28 ఏళ్ల మా చెల్లెలుకు సరైన పెళ్లికొడుకు దొరికేదాకా నేను పెళ్లి చేసుకోకూడదనుకుని వాయిదా వేస్తున్నాను. సాంప్రదాయకమైన కుటుంబంలో పుట్టాను కాబట్టి యిప్పటిదాకా పక్కచూపులు చూడకుండా బ్రహ్మచారిగా ఉన్నాను. కానీ రేణుతో తరచుగా కలుస్తూంటే ఆ బ్రహ్మచర్యం ఎన్నాళ్లు కాపాడుకోగలనో తెలియదు.

తనకు నేనంటే యిష్టమని తెలుస్తూనే ఉంది కానీ కారణమేమిటో అర్థం కావటం లేదు. అందంలో కానీ, ఐశ్వర్యంలో కానీ, కుటుంబనేపథ్యంలో కానీ నేనామెకు సాటి రాను. అఫ్‌కోర్స్ విపిన్‌కు ఆమెకు లేని కంపాటిబిలిటీ మా యిద్దరి మధ్య ఉంది. ‘మాకు పెద్దగా ఛాయిస్ ఉండదు. మా కమ్యూనిటీలో మగాళ్లందరూ ఒక్కలాటి వారే! ఏదో కాస్త వానాకాలం చదువు చదివేసి, వ్యాపారంలోకి దూరడం, తిమ్మినిబెమ్మి చేసి డబ్బు సంపాదించి అదే ఘనకార్యం అనుకోవడం. సాహిత్యం, సంగీతం, కళలు.. యివన్నీ దండగమారి పనులని వాళ్ల ఉద్దేశం. సమాజంలో డబ్బుకున్న విలువ వీటికి లేదని వాళ్లకు బాగా తెలుసు.’ అంది. నిజానికి తెలివితేటలు, కళాభిరుచి, సంస్కారం ఉన్న నాలాటి వాడి సాంగత్యంలో ఆనందం పొందగలదని ఆమెకు తెలుసు. కానీ వివాహబంధంలో యిరుక్కున్నాక ఏమీ చేయలేదు కదా!

నాకైతే అలాటి బంధం ఏమీ లేదు. అందువలన నేను ఆమె గురించి రొమాంటిక్‌గా ఆలోచించడంలో తప్పేమీ కనబడలేదు. నిరాశలో మునిగిన ఒక బాధిత మహిళకు నా సాన్నిహిత్యం కాస్త ఊరట కలిగిస్తే దాన్ని అందించడానికి నేనెందుకు వెనకాడాలి? నన్ను పొందే అర్హత ఆమెకుంది. కానీ బయట కలిసి తిరిగితే ఎవరి కంటనైనా పడతాం. అందుకే ఓ నెల పోయాక, విపిన్ ఊళ్లో లేనప్పుడు ఓసారి యింటికి వస్తారా అని ఆమె పిల్చినపుడు నిస్సంకోచంగా వెళ్లాను. రెండంతస్తుల భవంతి. మంచి అభిరుచితో తీర్చిదిద్దినట్లుంది. ఇద్దరు, ముగ్గురు పనివాళ్లు మాత్రమే ఉన్నారు. ‘మాకింకా పిల్లలు కలగలేదు. అత్తమామలు సొంతూర్లో ఉంటారు. ఇంటిపనులు నేనే చూసుకుంటాను కాబట్టి పనివాళ్లను పెద్దగా పెట్టుకోలేదు.’ అంది. తన పనివాళ్లతో ‘ఈయన మా బంధువు. విపిన్‌కు, వీళ్ల ఫ్యామిలీకి మాటలు లేవు. అందుకే ఆయన లేనప్పుడు వచ్చారు. ఆయనతో చెప్పకండి.’ అని చెప్పిందట. వాళ్లు నమ్మారో లేదో తెలియదు కానీ, మేమిద్దరం కాస్సేపటికి పై అంతస్తులోని బెడ్‌రూమ్‌లోకి దూరినప్పుడు మొహం మీద ఆశ్చర్యం కూడా చూపలేదు. విపిన్ అంటే వాళ్లకు కూడా అసహ్యం, కోపం  కాబోలు.

నాలుగు నెలలు యిలా గడిచాక, నేను వాళ్లింటికి వెళ్లలేని పరిస్థితి వచ్చింది. ఒడిశా ప్రాజెక్టుకు అనుమతులు రావటం లేదని, యిక దాన్ని కట్టిపెట్టి కలకత్తాలోనే మరో ప్రాజెక్టు చేపడదామని విపిన్ నిశ్చయించుకున్నాడు. ఊళ్లోనే ఉంటున్నాడు. మేం బయట తిరిగినా ఎవరో ఒకరు చూసి చెప్పేసే ప్రమాదం ఉంది. చేసేదేమీ లేక ఊరుకున్నాను. కానీ రేణు ఊరుకోలేక పోయింది. విపిన్‌కు చెప్పి ఓ రోజు డిన్నర్‌కు పిలిపించింది. మధ్యలో అతను ఫోన్ ఎటెండ్ కావడానికి పక్క రూముకి వెళ్లినపుడు, ఓ డీప్ కిస్ యిచ్చింది. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. విపిన్ మాకు అడ్డు రాకుండా ఏదో ఒకటి చేయాలనుకున్నాను.

మర్నాడు ఆఫీసులో విపిన్ ప్రాజెక్టు రిపోర్టు బల్ల మీద వేసుకుని కూర్చున్నాను. ప్రమాదం లేదంటూ నివేదికలు యిచ్చినవారందరూ ప్రఖ్యాతులే. నేను తిరస్కరిస్తే, విపిన్ కోర్టుకి వెళితే, నివేదికలు ఎందుకు నమ్మలేదంటూ కోర్టు నన్ను నిలదీస్తే సమాధానం చెప్పుకోవడం కష్టం. నేనే మూర్ఖంగా వ్యవహరిస్తున్నానేమో అని ఆలోచిస్తూండగా రేణు నుంచి ఫోన్ వచ్చింది. ‘‘ప్రాజెక్టు వైండప్ చేయడానికి విపిన్ మూడు రోజులు ఒడిశా వెళుతున్నాడు. నువ్వు సెలవు పెట్టి వచ్చేయ్. ఆ మూడు రోజులూ మనం ఇంట్లోనే గడుపుదాం.’’ అంది. ఆ మూడు రోజులూ రేయింబవళ్లు కలిసే ఉన్నాం. మర్నాడు విపిన్ వచ్చేస్తాడనగా రేణు నా కంటె దిగులుగా కనబడింది. ‘‘ఈ జన్మలో మనం కలవడం యిదే ఆఖరుసారి కావచ్చు. ఆ ఒడిశా ప్రాజెక్టు కనుక ఉండి వుంటే, నెలల తరబడి అతను అక్కడే పడి ఉండేవాడు. ఇప్పుడు యిక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటాడు. నా మొహాన యింతే రాసి పెట్టి ఉంది.’’ అని ఏడ్చింది.

ఇంటికి తిరిగి వచ్చాక నా తరఫు నుంచి ఏదో ఒకటి చేయాలని నాకర్థమైంది. నా ద్వారా విపిన్ ప్రాజెక్టుకి అనుమతి యిచ్చేట్లా చేస్తున్న దేవుడికి, తను సృష్టించిన ప్రకృతిని, ప్రజలను ఎలా కాపాడుకోవాలో తెలిసే ఉంటుంది. నేనే పెద్ద రక్షకుడిగా పోజు పెట్టడం అవివేకం. అనేక రంగాల్లో, అనేక స్థాయిల్లో ఉన్నవాళ్లని మేనేజ్ చేయగలిగిన విపిన్ రేపు నా స్థానంలో వచ్చినవాణ్ని ప్రలోభపెట్టలేడా? అందరూ నా అంత నిజాయితీగా ఉంటున్నారా? ఆ కాడికి నేను ప్రాజెక్టు ఆపేసి, ఏదో ఘనకార్యం చేసినట్లు ఫీలవడం దేనికి? పొద్దున్నే రేణుకి ఫోన్ చేసి విపిన్‌ను ఒడిశా ప్రాజెక్టు మూసివేయవద్దని చెప్పమన్నాను.

రెండు రోజుల తర్వాత విపిన్ వచ్చి నన్ను కలిశాడు. మరి కొందరు నిపుణుల నివేదికలు అందించాడు. అవన్నీ కూలంకషంగా చదవడానికి నాకో రెండు రోజుల సమయం యిచ్చి శుక్రవారం నాడు కలవమన్నాను. శుక్రవారం ఫైలు మీద సంతకం పెట్టి పంపించేశాక, విపిన్ రాక కోసం ఎదురు చూశాను. కానీ అతను రాలేదు. ఇంకో రెండు గంటలు ఎదురు చూశాను. అప్పటికీ రాకపోతే రేణుకి ఫోన్ చేశాను. అది పని చేయటం లేదు. సాయంత్రమయ్యేసరికి నాకు అసహనం పెరిగింది. ఇన్నాళ్లూ నన్ను వేపుకుతిన్న మనిషి ఇవాళ వచ్చి నా నుంచి తీపి కబురు వినకుండా తాత్సారం చేస్తున్నాడెందుకు అనిపించి, మర్యాదలు పక్కన పెట్టి అతని ఆఫీసుకి నేనే డైరక్టుగా ఫోన్ చేశాను. ‘‘సాబ్ ఇవాళ ఆఫీసుకి రాలేదు. ఆయన భార్య యివాళ ఉదయమే సడన్‌గా పోయారు...’’ అని ఆపరేటర్ అంటూండగానే నాకు మతి పోయింది.

వెంటనే విపిన్ యింటికి టాక్సీలో వెళ్లాను. ఇల్లు చేరుతూండగానే రేణు పోర్టికోలోనే కనబడింది. ఇంటి బయట సందడీ లేదు, జనాలూ లేరు. టాక్సీలోంచి బయటకు ఉరుకుతూనే, పరిగెట్టి రేణును కౌగలించుకున్నాను. కౌగలించుకున్నాక తట్టింది విపిన్ లోపల ఉన్నాడేమోనని. అడిగితే రేణు లేడంది. హమ్మయ్య అనుకుంటూండగానే పకపకా నవ్వు వచ్చింది. ‘‘ఇవాళేమైందో తెలుసా? ఎంత కన్‌ఫ్యూజన్! బాప్‌రే! విపిన్ ఫైలు సైన్ చేసి, గుడ్ న్యూస్ చెప్దామని ఆఫీసుకి ఫోన్ చేస్తే ఆ ఆపరేటర్ సన్నాసి నువ్వు చచ్చిపోయావని చెప్పాడు. నాకు ప్రాణం పోయిందనుకో...’’ అని యింకా చెప్పబోతూండగా రేణు సీరియస్‌గా ‘‘అతనేమన్నాడో కరక్టుగా చెప్పు.’’ అంది. ‘‘..విపిన్ సేఠ్ గారి భార్య పోయింది అన్నాడు. కొంపదీసి ఫ్యామిలీలో యిద్దరు విపిన్‌లు ఉన్నారా ఏమిటి?’’ ‘‘లేదు ఒక్కరే ఉన్నారు. అతను నిజమే చెప్పాడు. విపిన్ భార్య పోయారు.’’ అంది రేణు కూల్‌గా.

తెలివైనవాణ్ని కాబట్టి నాకు ఒక్క క్షణంలో సర్వం అర్థమైంది. ‘‘ఓహో, నువ్వు రెండో భార్యవా? అందుకే అక్కడకు వెళ్లలేదన్నమాట. వెళ్లి చూడకపోతే బాగుండదేమో..’’ అన్నాను. ‘‘రంగన్! మీరు కాస్త అక్కడ ఆగండి. నేను రెండో భార్యనూ కాను, మూడో ఉంపుడుగత్తెనూ కాను. నేను ఆయన దగ్గర ఉద్యోగం చేస్తాను. మీలాటి వాళ్ల పనులు చూడడానికి ఆయన నన్ను పనిలో పెట్టుకున్నాడు. అంతకు మించి మా యిద్దరి మధ్య ఏ బంధమూ లేదు.’’ అంది రేణు. ‘‘ఉద్యోగమా?’’ అన్నాను అయోమయంగా. ‘‘ఔను. యిప్పుడీ ఒడిశా పని అయిపోయింది కాబట్టి వెంటనే వేరే జాబ్ అప్పగించారు. మొండికేసిన ఓ ఫైనాన్షియర్‌ను ఒప్పించి, అప్పు పుట్టించాలి.’’

నాకు తల తిరిగింది. కింద పడిపోతాననిపించింది. ఓ గోడకు ఆనుకుని నిలబడి, నోరు పెగల్చుకుని ‘‘అంటే యిదంతా..’’ అంటున్నాను. ‘‘అవును స్వామీ, నాటకమే. డబ్బుకి లొంగకపోవడంతో నీ గురించి సేఠ్‌జీ వాకబు చేశారు. నీ ఫ్యామిలీ బాక్‌గ్రౌండ్, నీ బ్రహ్మచర్యం, నీ అభిరుచులు, మీ తమిళ సంస్కృతిపై నీకున్న స్వాతిశయం అన్నీ తెలుసుకుని నన్ను యీ అవతారం ఎత్తమన్నాడు. నేను సాధారణ కాల్‌గర్ల్‌గా నీ దగ్గరకు వచ్చి వుంటే తరిమికొట్టేవాడివి. అందుకే నీ ఇగోను శాటిస్ఫయి చేశా. దానికోసం నేను అనేక విషయాలు తెలుసుకుని, చాలా కసరత్తే చేయాల్సి వచ్చింది. చివరకు గేలానికి పడ్డావు. ఇప్పుడు ఫైలు మీద సంతకం పడిపోయింది. దాన్ని వెనక్కి తీసుకోలేవు. నా పని పూర్తయిపోయింది. నెక్స్‌ట్ ఎసైన్‌మెంట్ మీద పని ప్రారంభిస్తున్నాను కూడా.’’

కాస్సేపు గుటకలు మింగాక ‘‘నేనివాళ యిక్కడకి వచ్చి ఉండకపోతే నన్ను మళ్లీ కలిసేదానివా?’’ అని అడిగాను. ‘‘లేదు లేదు. నేను కూడా విపిన్‌తో బాటు ఒడిశాకు షిఫ్ట్ అయిపోయానని చెప్పేదాన్ని. నీకు ఫోన్లో కూడా అందుబాటులోకి వచ్చేదాన్ని కాదు. అమిత ధనవంతుడి భార్య నీ వలలో పడిందనే భ్రమలో శేషజీవితం గడిపేవాడివి. కానీ సేఠ్‌జీ భార్య మరణంతో నేను ఎక్స్‌పోజ్ కావడం, నీ రొమాంటిక్ స్వప్నాలు భగ్నం కావడం జరిగాయి. ప్చ్! ఏం చేస్తాం? ఏది ఏమైనా మన బంధానికి ఫుల్‌స్టాప్ పడింది.’’

పెదాలు తడుపుకుంటూ ‘‘ఇంతకీ నువ్వెవరు? అదే నిజమైన నువ్వు..’’ అని అడిగాను. ‘‘తెలుసుకుని ప్రయోజనం లేదు. నన్ను పెళ్లి చేసుకుని నన్నీ పాపకూపంలోంచి ఉద్ధరిద్దా మనుకుంటున్నావేమో! అలాటి పిచ్చిపని చేయకు. నా చేతిలో మోసపోయినవాళ్లు అలా అడిగి భంగపడ్డారు. నేను చదువుకున్నదాన్ని, స్వతహాగా డబ్బున్నదాన్ని. నా అందంతో, తెలివితేటలతో నీలాటి వాళ్లను బురిడీ కొట్టించడమే నాకు కిక్ యిస్తుంది. ఒక్కోరి దగ్గర ఒక్కో వేషం. ఒకరి దగ్గర ముగ్ధగా, మరొకరి దగ్గర డాషింగ్‌గా, యింకోరి దగ్గర టఫ్ టు గెట్‌లా.. భలే థ్రిల్ ఉంది దీనిలో!’’

‘‘కానీ నీలాటి ఉత్తమాభిరుచి ఉన్న అమ్మాయి, యిలాటి పనులు...’’

‘‘ఇక నీ వాగుడు ఆపి కదులుతావా? అభిరుచా, గాడిదగుడ్డా? క్లయింటుని బట్టి వేషం మారుస్తాను. తర్వాతి వాడు మరాఠీవాడు. వాడికి పల్లెటూరి మొద్దులా ఉండేవాళ్లు నచ్చుతారట. తలపై కొంగు కప్పుకుని, ఓరచూపులు చూడడం ప్రాక్టీసు చేస్తున్నాను. ఇక, మన సంగతి బయటపెట్టావో నీ ఉద్యోగానికే ముప్పు, అది తెలుసుకో. ఇల్లు తెలుసుకదాని మళ్లీ నన్ను కలవడానికి ప్రయత్నించకు. గుడ్‌బై, మిస్టర్ రంగన్!’’

ఇక కథానేపథ్యం గురించి – దీనికి కలకత్తాను వేదికగా ఎంచుకోవడానికి కారణం ఉంది. పాతకాలం  తెలుగు కథలు, నవలలు మద్రాసులో జరిగినట్లు రాసేవారు. మద్రాసు నుంచి విడిపోయాక హైదరాబాదులో జరిగినట్లు రాస్తూ వచ్చారు. నేను ‘‘అచలపతి కథలు’’ రాసినప్పుడు మద్రాసులో జరిగినట్లు రాశాను. ఈ ఒక్క కథనే కలకత్తాలో జరిగినట్లు రాశాను. నా మిత్రుడు, శాంతా బయోటెక్నిక్స్ వరప్రసాద్ ఎపిఐడిసిలో పని చేసే రోజుల్లో ఆఫీసు పని మీద పట్నా వెళ్లి అక్కణ్నుంచి కలకత్తా మీదుగా హైదరాబాదు వెళుతూ కలకత్తాలో మా యింటికి వచ్చి ఓ రోజు ఉన్నాడు. కథలో రాసిన సదరన్ ఎవెన్యూ, ఢాకూరియా లేక్ దగ్గర మేమిద్దరం పచార్లు చేస్తూండగా నేను ‘మా పిల్లల్ని మిసెస్ బి... నడుపుతున్న క్రెష్‌లో పెట్టాం.’ అన్నాను. ‘ఈ మిసెస్ బి..లు, మిసెస్ గో..లు ఎంతవరకు కరక్టో తెలియదండి. కొంతమంది అలాటి వ్యాపారకుటుంబాల పేర్లతో చలామణీ అవుతూ సమాజసేవ చేస్తున్నామని చెప్పుకుంటూ ఉంటారు. వగలు చూపి, అధికారులను బుట్టలో పెడుతూ, ఆ వ్యాపారస్తుల పనులు చేసి పెడుతూంటారు. డబ్బుకి లొంగని యీ అధికారులు బిజినెస్ మాగ్నెట్‌ను కుకోల్డ్ చేశామన్న భ్రమతో వాళ్ల బుట్టలో పడుతూంటారు.’’ అన్నాడాయన.

ఇది జరిగినది 1984 ప్రాంతంలో. ఈ థీమ్ బాగా నచ్చి 1996లో కథ రాసినప్పుడు ఉపయోగించు కున్నాను. అందుకే ఆనాటి సంభాషణకు జ్ఞాపకంగా ఆ నేపథ్యం ఉపయోగించుకున్నాను. ఇక కథలో రాసిన రోదా ఎగ్జిబిషన్ 1983లో కలకత్తాలో నిజంగా జరిగింది. మరొక స్వీయానువాద కథ వచ్చే నెల నాలుగో బుధవారం చదవవచ్చు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2022)

mbsprasad@gmail.com

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి