Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ కథ: ఓటీలో పాటల అగచాట్లు

ఎమ్బీయస్ కథ: ఓటీలో పాటల అగచాట్లు

ఓ హాస్పటల్ ఓటీ (ఆపరేషన్ థియేటర్). కైలాసం గారికి తుంటి ఎముక ఆపరేషన్‌కై సిద్ధం చేస్తోంది సిస్టర్ రాధ. ఇంతలోనే తలుపు తెరుచుకుంది. వార్డ్‌బాయ్ పేషంటును తీసుకుని వచ్చి టేబుల్‌పై పడుక్కోబెట్టేశాడు. కైలాసంగారు మధ్యవయస్కుడు. భయంభయంగా చుట్టూ చూసి “ఇంకా రెడీ కాలేదామ్మా, ముందుగానే తీసుకుని వచ్చేసినట్టున్నాడు” అన్నారు. రాధ తలవూపింది. “జస్ట్...” అని గబగబా సర్దసాగింది. అప్రయత్నంగా ఆమె పెదాలపై పాట వెలువడింది 'ముందు తెలిసెనా ప్రభూ, యీ మందిర మిటులుంచేనా, మందమతిని, నీవు వచ్చు మధురక్షణ మేదో.. కాస్త ముందు తెలిసెనా..." థియేటర్‌లో పెట్టిన బోస్ మేక్ సౌండ్ రిసీవర్ బాక్సులను చూస్తున్న కైలాసంగారు దృష్టి మరల్చి మెచ్చుకోలుగా ఆమెవైపు చూశారు. “నీకు పాటలంటే యిష్టం లాగుందే..”

రాధ కాస్త సిగ్గుపడింది - “ఏదో.. యిష్టమే ననుకోండి. కానీ యీ డాక్టరు గారి దగ్గర చేరిన తర్వాత మరీ పెరిగిందండి. ఆయన యీ థియేటర్‌లో సౌండ్ సిస్టమ్ పెట్టించి, నిరంతరంగా పాటలు వినిపించడంతో పాటలన్నీ నోటికి వచ్చేశాయండి. ఒక్కో సందర్భం బట్టి పాట అలా తోసుకువచ్చేస్తుంది.. ” కైలాసం చిరునవ్వు నవ్వారు. “నీ పేరుకు తగ్గట్టే వేణుగానానికి, సంగీతానికి పరవశిస్తావన్నమాట..” రాధ బుగ్గలు ఎరుపెక్కాయి. “డాక్టరు గారూ అదే అంటారండి. అయినా నాకే కాదండి. మా బాయ్ ఆలీకి కూడా మ్యూజిక్కంటే యిష్టమేనండి.”

పక్కనున్న ఆలీ కైలాసంకి నమస్కారం పెట్టాడు. అది అందుకుంటూ “ఆపరేషన్ థియేటర్ లో మ్యూజిక్ ఐడియా చాలా బాగుందమ్మా. హాస్పటల్ ఓపెనింగ్‌కి వచ్చినపుడే బిల్డింగ్ చాలా బాగుంది అనుకున్నా. బాత్‌రూమ్‌లో జారిపడి మళ్లీ యిలా రావలసి వస్తుందని అనుకోలేదనుకో.. కానీ అప్పటికీ యిప్పటికీ చాలా మార్పులు చేశారు. డాక్టరు గారు మంచి టేస్టుతో చాలా బాగా తీర్చిదిద్ది యిలాటి వింతలన్నీ పెట్టారు.” అని కైలాసం మెచ్చుకున్నారు. 'ఇదిగో నవలోకం, వెలిసే మనకోసం..' పాట పాడింది రాధ సన్నగా. కైలాసం అంగీకారంగా తల వూపారు. ఆలీకి కూడా తన ప్రతాపం చూపాలనిపించింది. తనూ ఓ హిందీపాట అందుకున్నాడు. 'ఏ జిందగీ కే మేలే, జిందగీ కే మేలే, దునియా మేఁ కమ్ న హోంగే, అఫ్సోస్ హమ్ న హోంగే...” కైలాసం మొహం చిట్లించి అతనికేసి చూశారు. “దిలీప్ కుమార్ “మేలా” సినిమాలో పాట కదూ, అర్థం ఏమిటి బాబూ..” అని అడిగారు. ఆలీ ఉత్సాహంగా చెప్పాడు. “అంటేనండి.., సమయం గడిచే కొద్దీ లోకంలో చాలా చాలా వేడుకలు జరుగుతాయి, యీ బతుకు సంబరాలు ఎప్పటికీ తగ్గవు. కానీ బాధేమిటంటే అవి చూడడానికి మనం వుండం..”

కైలాసం మొహం వాడిపోయింది. ఆ పాటేదో యిప్పుడే పాడాలా? అనుకుని 'ఆ పైప్డ్ మ్యూజిక్ మానిటారింగ్ యూనిట్ యిక్కడే ఉన్నట్లుంది. దానిలో ఏం వస్తోందో కాస్త ఆ స్విచ్చి నొక్కండి.’ అన్నారు. ‘మీకు ఆపరేట్ చేసే సర్జన్‌గారే హాస్పటల్ ఎండీ. మ్యూజిక్ లవర్. పైప్‌డ్ మ్యూజిక్‌గా ఏది రావాలో ఆయనే డిసైడ్ చేస్తూంటారు. రోజులో ఓటీలోనే ఎక్కువసేపు ఉంటారు కాబట్టి, ఆ యూనిట్టూ, సిడిలు యిక్కడే పెట్టించారు.’ అని వివరించింది. మ్యూజిక్ స్విచ్చి నొక్కగానే దానిలో సుబ్బులక్ష్మి 'భజగోవిందం' పాట రాసాగింది. అమ్మయ్య భక్తి గీతం అనుకుంటూండగానే సుబ్బులక్ష్మి పాడింది - 'సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ కరణే.. '. పోయేకాలం వచ్చినపుడు యీ వ్యాకరణాలూ, యీ పాండిత్యాలు నిన్ను రక్షించవురా మూఢుడా అన్న అర్థం స్ఫురించగానే కైలాసంకు భయం వేసింది. “ఇదిగో ఆలీ, సిడిలు మార్చడం నీ చేతిలోనే ఉంది కదా, తెలుగు పాటలేవైనా వుంటే పెట్టవయ్యా, సంస్కృతం మనకు అర్థం కాదు కదా..” అన్నారు. ఆలీ అక్కడున్న సిడిలు పరికించి చూశాడు. “సార్, ఘంటసాల, సుశీల డ్యూయట్స్ వున్నాయి పెట్టనా?” “పెట్టు, పెట్టు” అన్నారు కైలాసం సంతోషంగా.

'తందనాన నానా..' అనే ఆలాపన రాగానే కైలాసం “అమ్మాయి రాధా విన్నావా, అదీ జానపద సంగీతంలో వున్న గమ్మత్తు.. ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకులు సిగన చుట్టి.. చూశావా ఎంతటి తెలుగుతనమో’’ అని ముచ్చటపడ్డారు. కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. పాట 'కాలు చేయి లోపమనీ, కొక్కిరాయి రూపమనీ నలుగురు నవ్వి పోదురా, వదినలు గేలి సేతురా..' దగ్గరకు వచ్చేసరికి కైలాసంకు ఒళ్లు మండింది. “అమ్మాయి రాధా, యిదెక్కడి పాటమ్మా, ఈ తుంటి ఎముక మళ్లీ అతుక్కుంటుందా లేదా, జీవితాంతం కుంటి కులాసం అన్నట్టు కుంటి కైలాసంగా వుండిపోతానా, మంచంలోని పడి వుండి పై కెళ్లిపోతానా అని భయపడి ఛస్తూ వుంటే యీ పాట పెట్టాడు.. ఆ సినిమాలో ఎన్టీయార్ కుంటివాడు. రేలంగి మాటిమాటికి ఒరేయ్ కుంటి కులాసం అంటూ పిలుస్తూ వుంటాడు..” అంటూ వాపోయారు.

రాధ ఆయన బాధను అర్థం చేసుకుంది. “ఆలీ, అది తీసేసి హిందీ పాటలేమైనా పెట్టు” అని ఆర్డరేసింది. ఆలీ ఓ విజిల్ వేసి “అయితే రఫీ పాటలు పెడతా..” అంటూ ఓ సిడి పెట్టాడు. 'ఎయ్ ఫూలోంకీ రాణీ, బహారోంకి మలికా..' అని “ఆర్జూ” సినిమా పాట రాసాగింది. కైలాసం మొహంలో మళ్లీ నవ్వు విరిసింది. కానీ అదీ కాస్సేపే! “అబ్బే, ఈ సినిమాలో రాజేంద్ర కుమార్ హీరోయిన్ సింపతీ కోసం కుంటివాడిగా నటిస్తాడయ్యా. అబ్బ, ఇవేమీ వద్దు కానీ కట్టి పారేయ్” అన్నాడు విసుగ్గా. తన ఫేవరెట్ సాంగ్ విననీయకుండా చేసినందుకు కైలాసం కేసి కోరగా చూస్తున్న ఆలీని కళ్లతోనే మందలిస్తూ రాధ పేషంటును అనునయించింది, “మా దగ్గర తెలుగు, హిందీయే కాదండి. డాక్టరుగారి దగ్గరకి అన్ని భాషల పేషంట్సూ వస్తారు కదండి. వేరే భాషలవి కూడా పెట్టాం. అరవపాటలు పెట్టిస్తా. మనకు అర్థం తెలియదు, మీరు సినిమా చూసి వుండరు కాబట్టి హీరో గురించి ఆలోచనలు పోవు.” అంది.

కైలాసం ఏమీ మాట్లాడకపోవడం చూసి రాధ ఆలీతో “ఆ లెఫ్ట్ సైడ్ ర్యాక్ లోంచి ఏదో ఒక సిడి తీసి వేసెయ్” అంది. కొద్ది సేపట్లోనే 'పోనాల్ పోగట్టుం పోడా...' అని వినబడసాగింది. పాట గంభీరంగా వుందే అనుకుంటూ కైలాసం మొహం కేసి చూసిన రాధ అది పాలిపోవడం గమనించి 'ఏం నచ్చలేదా?” అని అడిగింది. “ఈ పాట తెలుగులో వుందమ్మా. 'పోతే పోనీ పోరా, ఈ పాపపు జగతిని శాశ్వత మెవరురా?' అని శ్మశానపు పాట.. పాటలేవీ వద్దమ్మా, కాస్సేపు హరేరామ హరేకృష్ణ అనుకుంటూ పడుక్కుంటాను. మీ పని మీరు చేసుకోండి.” అన్నారు కైలాసం గిల్టీగా ఫీలవుతూ. రాధ జాలిపడింది. “ఇదిగో ఆలీ, యీ సినిమా పాటలేవీ వద్దు కానీ అన్నమయ్య సిడి ఏదైనా పెట్టు. సిడి కవర్ మీద ఏ పాటలున్నాయో చూసి అప్పుడు పెట్టు, ఏదో ఒకటి పెట్టేయకు” అంది. అన్నమయ్య సిడి ఒకటి లాగి చదివాడు గాడు ఆలీ. “ఇదిగో 'కుంటి శుక్రవారం' అని ఫస్ట్ పాట. పెట్టనా?” అన్నాడు. రాధ కిసుక్కున నవ్వింది. “సరిగ్గా చదవవయ్యా, కంటి శుక్రవారం.. అసలే ఆయన భయపడుతూ వుంటే మధ్యన నువ్వొకడివి..." ఆలీకి కోపం వచ్చింది. “నాది తెలుగు మీడియం మేడమ్. చూడు ఇది కుంటే.. పోనీ మీరు చెప్పండి సార్..” అని సిడి కవర్ పట్టుకుని దగ్గరకి వచ్చాడు. పుచ్చుబఠాణి నమిలిన వేదాంతిలా నవ్వాడు కైలాసం “అచ్చుతప్పు అయివుంటుందిలే.. అయినా నా ఖర్మ కాకపోతే నువ్వు చేయి పెట్టగానే అదే తగలాలీ..”

ఆలీకి కోపం వచ్చింది. “ఎందుకు సార్, యియన్నీ. నేను జబర్దస్త్ హిందీ పాట పాడతాను వినండి. మీ దుఖ్కం అంతా పోతుంది.” అంటూ 'రాహీ మన్‌వా దుఃఖ్ కీ చింతా క్యోం సతాతీ హై' అని ఎత్తుకున్నాడు వద్దనే ఛాన్సు పేషంటుకి యివ్వకుండా. రెండో చరణం ఎత్తుకోబోతూ కాస్త ఆగినప్పుడు కైలాసం అతని చెయ్యి పట్టుకున్నాడు. “బాబూ చాలా బాగా పాడుతున్నావు. పాట ఏ సినిమాలోదో తెలుసా?” అని అడిగాడు. కాంప్లిమెంటుతో మొహం విప్పారిన ఆలీ “ఏమో తెలియదు సార్, ఏదో బ్లాక్ అండ్ వైట్ సినిమా” అంటూ మళ్లీ గొంతెత్తబోయాడు. కైలాసం అతనికంటె గొంతు పెంచాడు. “అది దోస్తీ సినిమా పాట. ఓ కుంటివాణ్ని ఉద్దేశించి గుడ్డివాడు పాడే పాట..” అని దాదాపు అరిచాడు. ఆలీ ఆగిపోయాడు.

పొరబాటు గ్రహించిన రాధ సరిదిద్దబోయింది. నేనో భావగీతం పాడతాను వినండి అంకుల్’ అంటూ ఆఫర్ చేసింది. నోటితో ఏం మాట్లాడడానికి యిష్టపడని కైలాసం 'సరే కానీ, ఏం చేస్తాం' అన్నట్టు చేయి వూపాడు. “గుడిగంటలు’’ సినిమాలో 'ఎవరికి వారౌ యీ లోకంలో' అనే పాట భావయుక్తంగా పాడసాగింది. రాధ, పల్లవి పూర్తవగానే కైలాసం రాధ చేయి పట్టుకున్నాడు. “నువ్వు చాలా మంచిదానివమ్మా, చాలా చక్కగా పాడుతున్నాను కూడా. కానీ చూశావూ, నా ఖర్మ అలా కాలింది. నువ్వు యీ పాట పిక్చరైజేషన్ చూళ్లేదు కదూ..” రాధ తల అడ్డంగా తిప్పింది. “లేదండి, ఘంటసాల హిట్స్ లో ఉంటే..’ ‘.... ఆ సినిమాలో కాలు విరిగి చక్రాల కుర్చీలో తిరిగే హీరోకి హీరోయిన్ సేవ చేస్తూ వుంటే ఆమెను ఉద్దేశించి హీరో పాడతాడమ్మా యిది...” రాధ నిట్టూర్చింది. “సార్, మీ ఔట్‌లుక్ మార్చుకోవాలండి. అదేదో జోక్‌లో తిప్పితిప్పి ఆవు గురించి మాట్లాడినట్లు .. ఏ పాట పాడినా మీరు కుంటి కులాసం సబ్జక్ట్ మీదకు వెళ్లిపోతున్నారు." అని మందలించింది.

ఇంతలో తలుపు తెరుచుకుంది. సర్జన్ గ్రాండ్ ఎంట్రీ యిచ్చారు. విజిల్ వేస్తూ 'చీకటితో వెలుగే అన్నది నేనున్నాననీ.. నీకేం కాదనీ..” హమ్ చేశారు. కైలాసం గారికి ఉత్సాహం వచ్చింది. “నమస్కారం డాక్టర్ గారూ.” అన్నారు. అంటూనే కాస్త సందేహంగా "మేజర్ ఆపరేషన్ కదా, ఫర్వాలేదంటారా?”

“లేదన్నాగా.. యింతదాకా వచ్చి యిప్పుడెందుకు యీ సందేహాలు?"

“అదేమిటో శకునాలు బాగా లేవండీ, కాస్త భయంగా వుంది...” ఈ సారి సర్జన్ నోరు విప్పి పాట పాడారు “చీకటితో వెలుగే అన్నది నేనున్నాననీ.. నీకేం కాదని..’ పల్లవి దగ్గర ఆపి ‘నేను యింత భరోసా యిస్తూండగా వైడూ యూ వర్రీ?” అని భుజం తట్టారు. ఇంతలో ఆయన వెంట వచ్చిన డాక్టరుగారి సెల్ రింగ్ టోన్ మోగింది. 'న ఆద్మీకా కోయీ భరోసా..’ సర్జన్ మొహం చిట్లించారు. “ఓటీలోకి వచ్చేటప్పుడు సైలంట్ మోడ్‌లో పెట్టుకోవాలి. లేదా యిలాటి పాటలు తీసేయాలి..” అన్నారు. అంటూ పేషంటు కేసి చూసి సర్వం గ్రహించారు. 'ఇలాటి శకునాలు చూశా మీరు జంకేది? మీ మూడ్ అప్‌లిఫ్ట్‌ చేస్తాం చూడండి.” అంటూ తోటి డాక్టర్ల కేసి చూసి సైగ చేశారు. అందరూ కలిసి కోరస్ పాడారు - 'జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా' అని. పల్లవి పాడి అందరూ పకపక నవ్వారు. థియేటర్ వాతావరణాన్ని ఉల్లాసభరితం చేసినందుకు తనను తాను అభినందించుకుంటూ ఆపరేషన్ ప్రారంభించబోతున్న సర్జన్ కైలాసం మొహం కేసి చూసి గతుక్కుమన్నారు.

“ఇదెందుకు పాడారు డాక్టరు గారూ, అంటే నేను ఆపరేషన్ జరిగాక యీ పాట గుర్తు చేసుకుంటూ ఆ సినిమా హీరోలాగ కుంటికాలేసుకుని రిక్షా తొక్కుకోవాలంటారా?” దీనంగా అడిగాడు కైలాసం. ఈ చాదస్తపు పేషంటుతో ఎలా వేగాలో అంత సర్జన్‌కి అర్థం కాలేదు. సిస్టర్ రాధ కేసి చూశారు. కైలాసంకు కనబడకుండా ఆవిడ నుదురు కొట్టుకుంది 'ఇందాకట్నుంచి యిదే వరస' అన్నట్టు. సర్జన్ గొంతు సవరించుకున్నారు. వాయిస్ బేస్ స్థాయికి తీసుకుని వచ్చి గంభీరంగా “మీకేం కాదని, మీరు మళ్లీ మామూలుగా నడవడం ఖాయమని ఒట్టేయమంటారా?” అని అడుగుతూ కైలాసం కళ్లలోకి చూశారు. కైలాసం ఒక విధమైన హిప్నాసిస్ లోకి వెళ్లి, సరేననబోతూండగా యింకో డాక్టర్ సెల్ మోగింది. ఆయన కంగారు పడుతూ అది ఎక్కడుందో వెతుక్కుని దాని నోరు కట్టేసేలోపున రింగ్ టోన్లో పాట అందరికీ వినబడింది. 'కస్మే వాదే, ప్యార్ వఫా సబ్, బాతే హై, బాతోం కా క్యా..”

“చూశారా, డాక్టరు గారూ, ఈ ఒట్టు వేయడాలు, ప్రేమా, నమ్మకమూ అన్నీ ఒట్టి మాటలే.. మాటలకేముంది..” అంటోంది ఆకాశవాణి. పైగా యీ పాట తెరమీద పాడింది కూడా కుంటి మలాంగ్ బాబా..” అన్నాడు కైలాసం దిగాలుపడి. సర్జన్ గారికి తన కొలీగ్స్ పై కోపం కట్టలు తెంచుకుంది. “చెప్పాను కదండీ, సెల్‌ఫోన్లు ఓటీలోకి తీసుకురావద్దని. వినరు కదా, పేషంట్ స్పిరిట్ యిలా దెబ్బ తింటే ఎలా?” అని వాళ్లని చివాట్లేసి ఆలీ కేసి చూసి సైగ చేశారు. అతను వెంటనే సౌండ్ సిస్టమ్ లో 'మై హూఁ న' పాట వేసేశాడు. ఆ పాట వింటూనే కైలాసంగారి మొహం విప్పారింది. సర్జన్ చిరునవ్వు చిందించారు. కళ్లు ఆర్పుతూ 'నేనున్నానుగా' అన్న అర్థం స్ఫురించేట్లు అభయం యిచ్చారు. పేషంటును ఆపరేషన్‌కి మానసికంగా సిద్ధపరచారు.

ఇంకాస్సేపట్లో ఎనస్తీటిస్టు కైలాసానికి మత్తు యింజక్షన్ యిస్తున్నారు. కానీ పేషంటుకి మత్తు ఎక్కడం లేదు. సర్జన్ చురుగ్గా ఆలోచించి మ్యూజిక్ సిస్టమ్ కేసి చూశారు. 'మత్తు వదలరా, నిద్దుర మత్తు వదలరా' పాట వినిపిస్తోంది అది. చకచక ఆలోచించి సిడి బాక్స్ దగ్గరకు వెళ్లి ఓ సిడి వెతికి పాట ఆలీకి పాట నెంబరు చూపించారు. ఇంకో రెండు నిమిషాల్లో సిస్టమ్ లోంచి 'నిషా లేని నాడు హుషారేమీ లేదు' పాట రాసాగింది. కైలాసం మొహంలో మార్పు తెలిసింది. మత్తు ఎక్కిందని పరీక్ష చేసి చూసుకున్నారు సర్జన్.

“లోకల్ ఎనస్తీషియా ఎఫెక్టివ్ గానే వుంది. ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ రెడీయేనా, సిస్టర్” అన్నారాయన. ఆమె చేతి కందించిన కత్తి పదును చూసుకుంటూ వుంటే సౌండ్ సిస్టమ్ లో కొత్త పాట ప్రారంభమైంది. “నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిటి యముణ్ని నేను, నీ కరక్టు మొగుణ్ని నేను” అని. సర్జన్ కంగారు పడ్డారు. “ఆలీ, ఆ సిస్టమ్ వల్ల మా చెడ్డ డిస్టర్బెన్సుగా వుందయ్యా. కాస్సేపు మ్యూట్ చేయి” అని. క్షణాల్లో సిస్టమ్ నోరు నొక్కబడింది.

సర్జన్ ఒక్కసారి అన్నీ సరి చూసుకుని “ఓకే డాక్టర్స్, ప్రారంభిద్దామా?” అనగానే ఆయన సెల్ మోగింది. రింగ్ టోన్ అందరికీ వినిపించింది - 'సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారబ్దం'.

విసుగెత్తి పోయిన సర్జన్ ఆ సెల్ ఫోన్ ని కింద పడేసి కాలితో తొక్కేశారు.

ఈ సారి రింగ్‌టోన్‌తో మత్తులోంచి తేరుకున్న పేషంటే పాడాడు -' జన్మమెత్తితిరా, అనుభవించితిరా...' (మరో హాస్య కథ వచ్చే నెల మూడో బుధవారం)

- ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2022)

mbsprasad@gmail.com

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా