Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ కథలు - 70 రాంపండూ - హెడ్‌మాస్టర్లూ

ఆటల పోటీల పందాల్లో ఓడిపోయాక రాంపండు అనంత్‌ దగ్గరికి వచ్చి భోరుమన్నాడు. ''ఆ హెడ్‌మాష్టారు పరంధామయ్య నా కొంపముంచాడ్రా. అచలపతి వెళ్లి తప్పు చేసినట్టూ, అది ఒప్పుకున్నట్టూ నటించడం ఏమిటి? ఈయన అది నమ్మేసి మొదట వచ్చిన ఐదుగురినీ డిస్‌క్వాలిఫై చేసేసి ఆరో అమ్మాయికి ప్రైజు ఇచ్చేయడమేమిటి? అటు తిరిగి, ఇటు తిరిగి నా జేబు కొల్లగొట్టేశాడు దుర్మార్గుడు. ఘోరంగా దెబ్బతినేశాను.''

అనంత్‌ ఓదార్చబోయేడు. ''ఈ హెడ్‌మాష్టార్ల వరస నీకు తెలియనిదేముంది?'' అంటూ! 

రాంపండుకి ఉక్రోషం వచ్చింది. ''నాకొళ్ళు మండిందంటే మా పాత హెడ్‌మాష్టారు రామబ్రహ్మం గారిని నొక్కేసినట్టు నొక్కి పారేయగలను ఏమనుకుంటున్నాడో'' అంటూ రంకెలేశాడు. దాంతో అనంత్‌కి గతం ఒక్కసారి కళ్లముందు తిరిగినట్టయింది.

***

అప్పట్లో రాంపండు ''జల్సా'' అనే ఓ చిన్న పత్రికకి ఎడిటరుగా పని చేసేవాడు. అనంత్‌ ఓ రోజు అతన్ని చూడడానికి వెళ్లినప్పుడు రాంపండు ఓ కవయిత్రితో ప్రేమలో పడ్డట్టు తెలిసింది. అదీ అనుకోకుండా...!

అసలు ఆవేళ పొద్దున్నే అనంత్‌కి, అచలపతికి ఓపాటి మనస్ఫర్ధ వచ్చింది. ముందురోజు ఎగ్జిబిషన్‌లో ఓ పూలకూజా కనబడితే హాల్లో పెట్టవచ్చని అనంత్‌ కొని తెచ్చాడు. అది హుందాగా లేదనీ, హాల్లో పెట్టించుకునే అర్హత దానికి లేదని అచలపతి వాదం.

''ఇదిగో చూడు అచలపతీ, నువ్వు నేను వేసుకునే డ్రస్సు దగ్గర్నించి, బూట్ల దగ్గర్నుంచీ అన్నిటినీ శాసించాలని చూసినా సహించాను. కానీ ఈ ఫ్లవర్‌వేజ్‌ విషయంలో మాత్రం ఎవ్వరిమాటా వినదలచుకోలేదు'' అంటూ అనంత్‌ ధాటీగా చెప్పేసి బయటకు వచ్చేసేక ఎటు వెళ్ళాలో తేల్చుకోలేక అనుకోకుండా రాంపండు ఆఫీసువైపు నడక సాగించేడు.

ఓ పత్రిక ఎడిటరు దగ్గరికి వెళితే వచ్చే సహజమైన ప్రశ్న ''మా లేటెస్టు ఇస్యూ చదివేవా?'' అని. హృదయమున్నవాడు, పైగా ఎడిటరుకి స్నేహితుడైనవాడు దానికి 'లేదు' అని చెప్పలేడు. అవునని చెప్పాలంటే పత్రిక చదవాలి. లేకపోతే ''అది బాగుందా? ఇది బాగుందా? దానికంటె ఇది బాగుందా? లేక దీనికంటె అది బాగుందా?'' అని ఎదురయ్యే సవాలక్ష ప్రశ్నలకు జవాబు చెప్పడం కష్టం. ''జల్సా'' పత్రిక చదివి ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటె ఫ్రెండైనా రాంపండుని తప్పించుకు తిరగడమే మంచిదన్న అభిప్రాయంతో అనంత్‌ అతని ఆఫీసుకి వెళ్లడమే మానుకున్నాడు.

కానీ ఆవేళ అచలపతి గొడవతో మతిపోయిన అనంత్‌ కాస్సేపటికి ''జల్సా'' ఎడిటర్‌ గుమ్మం దగ్గర తేలేడు. అది ''ప్రైవేట్‌'' అని రాసి ఉన్న గుమ్మం. ఎడిటర్‌కి అత్యంత సన్నిహితులు మాత్రమే రాదగిన ద్వారం. తక్కినవాళ్లందరూ దానికి ఎదురుగా ఉన్న ఆఫీసులోకి వెళ్లి వేరే ద్వారం ద్వారా ఆ రూమ్‌లోకి రావాలి. అనంత్‌ ఎడిటర్‌ ఫ్రెండు కాబట్టి ఈ ద్వారం ద్వారా వెళ్లడానికి ఎవరూ అభ్యంతరపెట్టరు. కానీ అసలు అభ్యంతరం ఎడిటరు దగ్గర్నుంచే వస్తుంది - వచ్చినవాడు అతని పత్రిక చదవకుండా చేతులూపుకుంటూ వచ్చేడంటే!

అందుకే అనంత్‌ వెళుతూనే రాంపండుని కంగ్రాట్యులేట్‌ చేసేశాడు. ''నీ లేటెస్టు ఇస్యూ బ్రహ్మాండంగా ఉందోయ్‌! అవునుగానీ మీ బాబాయ్‌ ఎలా వున్నాడు? నీ పాకెట్‌మనీ ఏమైనా పెంచాడా? లేక ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి అక్కర్లేదన్నాడా...?''

మాటమార్చడానికి రాంపండు ఒప్పుకోలేదు. ''పత్రిక నీకు నిజంగా నచ్చిందా?''

''ఆహాఁ''

''మొత్తమంతా....?''

''ప్రతీ పేజీ....''

''ముఖ్యంగా ఆ కవిత లేదూ-''ఏకాంతం''!?''

''అక్షరం, అక్షరం ... ఆణిముత్యం''

''మాస్టర్‌ పీసు కదా''

''అవును బ్రహ్‌మాండం... ఇంతకీ ఎవర్రాసారు?'' అన్నాడు అనంత్‌ ఇకపై ఎలా మెచ్చుకోవాలో తెలియక.

రాంపండుకి ఒళ్లు మండిపోయింది. ''కింద పేరు వేశాంగా'' అని విసుక్కున్నాడు.

''పేరు మర్చిపోయానులేరా...'' అనంత్‌ సర్దుకున్నాడు.

''ఆ కవిత, ఆ అద్భుతమైన కవిత... రాసినది..'' ఒక్కసారి ఆగి ఊపిరి పీల్చుకుని రాంపండు ఎనౌన్స్‌ చేశాడు. - ''సుమనోహరి''

రాంపండు ఆ పేరు ఉచ్చరించిన తీరు చూస్తేనే అనంత్‌కి అనుమానం వచ్చింది. రాంపండుకి మళ్లీ ప్రేమరోగం పట్టుకుందాని. కాస్సేపట్లోనే రోగ నిర్ధారణ కూడా అయిపోయింది. రాంపండు మళ్ళీ ప్రేమలో పడ్డాడు! సుమనోహరి ఎంత మనోహరంగా ఉంటుందో పావుగంట సేపు విన్నాక అనంత్‌ అడిగేడు.

''ఇంతకీ నీ ప్రేమ గురించి ఆమెకు చెప్పావా?''

''లేదు. చెప్పలేదు. నాకు భయంగా వుంది''.

'భయం నీకెందుకురా? నిన్ను ప్రేమించే వాళ్లకుండాలి గానీ' అని అనంత్‌ వాదించినా రాంపండు వినలేదు. సుమనోహరి ఒక దేవతట. ఆమె ముందు రాంపండు ఒక క్రిమిట... కాదు కీటకంట... కాదు పిపీలికంట. ఆమె చెయ్యి పట్టుకునే అర్హత లేదట. చెయ్యేమిటి? ఆమె ఎదుట నిలబడే అర్హత కూడా లేదని రాంపండు ఎనౌన్స్‌ చేసాడు.

''నువ్వు సన్నాసివే కానీ మరీ అంత సన్నాసివి కావ''ని అనంత్‌ చెప్తూండగానే ఒక పెద్దాయన తలుపు తోసుకుని జబర్దస్తీగా వచ్చాడు. భారీ మనిషి. పంచె లాల్చీ, పైమీద కండువా, చేతిలో చేతికర్ర, కంచుకంఠంతో ''ఒరే రాంపండూ'' అంటూ రాగానే రాంపండు ఠపీమని లేచి అటెన్షన్‌లో లేచి నుంచున్నాడు. ఆయన బర్రుమని కుర్చీ లాక్కుని కూచుని, ''ఊ కూచో'' అనేదాకా రాంపండు కూచోలేదు. అదీ కుర్చీ అంచుమీదే కూచున్నాడు. ఏ క్షణంలోనైనా లేచి కుర్చీమీద నిలబడడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాడు.

''ఇదిగోనోయ్‌, ఇంకో వ్యాసం నీ కోసం ప్రత్యేకంగా రాసి పట్టుకొచ్చా. ''చోళుల కాలంలో చోళ్లు తిన్నారా? లేదా?'' అని వ్యాసం పేరు. జాగ్రత్తగా చదివి అచ్చేయి. అక్కడా, ఇక్కడా పారేయక. నీకు చిన్నప్పటినుండి శ్రద్ధ తక్కువ. రెండ్రోజులకోసారి ఎక్కాలపుస్తకం పారేసుకునే వాడివి. మూడు రోజులకోసారి పలక విరక్కొట్టుకునేవాడివి. ఇది చదివేటప్పుడు కాగితాలు నలిగిపోకుండా చదువు'' అని ఆర్డర్లేస్తున్నాడు ఆ వచ్చినాయన, పక్కనే ఉన్న అనంత్‌ అనే మానవుడి ఉనికే పట్టించుకోకుండా!

పుత్రకామేష్టి యాగం చేసాక దశరథుడు పాయసం కుండని అందుకున్నంత భయభక్తులతో రాంపండు అది అందుకున్నాడు. కానీ వచ్చినాయన తృప్తి పడ్డట్టు లేదు. ''ఇప్పుడు బాగానే తీసుకుంటావ్‌. తర్వాత దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వవ్‌. కితం సంచికలో 'శాతవాహనుల కాలంలో సనాతన వాహనాలు' వ్యాసం ఎక్కడో లోపలి పేజీల్లో వేశావ్‌. ఇదయినా కాస్త అందంగా, అందరూ చదివేచోట వేయి. నా ఫోటో అదీ కావాలంటే ముందే అడుగు. ఆఖరి క్షణంలో వెతకాలంటే కష్టం. ఇవన్నీ చెబుతున్నానంటే సంపాదకుడిగా నీ స్వేచ్ఛను హరిస్తున్నానని అనుకోవద్దు. నీకు తెలియదు కదాని, నా స్టూడెంటువి కదాని అభిమానంతో చెబుతున్నానన్నమాట. నువ్వు కలర్‌ ఫొటో వేసినా, బ్లాక్‌ అండ్‌ వైట్‌ వేసినా నీ ఇష్టం. అది నిర్ణయించుకునే హక్కు నీదే! వస్తా''.

ఆయన వెళ్లగానే రాంపండు జుట్టు పీక్కోవడం, తలకాయ టేబుల్‌మీద పెట్టి వెక్కి వెక్కి ఏడవటం జరిగింది.  అతన్ని ఓదారుస్తూ అనంత్‌ సేకరించిన సమాచారం ఇదీ - వచ్చినాయన రామబ్రహ్మం. రాంపండుకి ఎలిమెంటరీ స్కూల్లో హెడ్‌మాష్టారు. ఈ పత్రికలో వాళ్ల మనవరాలి పెళ్లి సంబంధం గురించి ప్రకటన ఇవ్వడానికి వచ్చి రాంపండును చూశాడు. ఇక మనవాడే కదాని ఎస్సేల మీద ఎస్సేలు రాసి పడేస్తున్నాడు. వేయమని దండిస్తున్నాడు. ''జల్సా'' అని పేరుపెట్టిన పత్రికలో ఇంత సీరియస్‌ విషయాలేమిటని పాఠకుల గోల. ఆ ఉత్తరాలు పబ్లిషర్‌ కంటపడితే  ఉద్యోగమే ఊడుతుందని రాంపండు గోల.

''ఇలాంటివి రాయక్కరలేదని చెప్పేయ లేకపోయావా?'' అడిగేడు అనంత్‌.

రాంపండు దెబ్బతిన్నట్టు చూశాడు. ''నీ ఎలిమెంటరీ స్కూలు హెడ్‌మాష్టరు ఇప్పుడు నీ ఎదుట నిలబడితే నీకెలా అనిపిస్తుంది?''.

''దెయ్యాలున్నాయని నమ్మాలనిపిస్తుంది. ఆయన చచ్చిపోయి పదేళ్లయింది.''

''చచ్చి మనను బతికించిన వాళ్ల సంగతి కాదురా. చావకుండా మనల్ని చంపుకుతినే రామబ్రహ్మం లాటివాళ్ల గురించి చెబుతున్నా. ఆయన నా కళ్లెదురుగా కనబడగానే నేను నాలుగోక్లాసు కుర్రాడిలా మారిపోతాను. ఆయన ఎప్పుడు బెత్తం ఝళిపిస్తాడో, నేనెప్పుడు బెంచీ ఎక్కాల్సి వస్తుందోనన్న భయం నన్ను ఆవహిస్తుంది. 'యస్సర్‌, యస్సర్‌' తప్ప నా నోట ఇంకో మాట రాదు. ఆయన జేబునిండా, సంచీనిండా పాండ్యుల గురించి, పల్లవుల గురించి రాసుకొచ్చి అచ్చు వేయమని చంపుతాడు. వేయకపోతే వీపు బద్దలు కొడతాడేమోనని భయం. మా పబ్లిషరు ప్రస్తుతం ఫారిన్‌ వెళ్లాడు. వెనక్కి వచ్చి ఇవి చూశాడా, నా ఉద్యోగం పోవడం ఖాయం. ఒరే, నేనేం చేయాలో తెలియటం లేదురా'' అంటూ రాంపండు కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.

***

ఇంటికి రాగానే అచలపతి కనబడడంతో పొద్దున మనస్ఫర్ధలను పక్కకు పెట్టి రాంపండు సమస్య గురించి డిస్కస్‌ చేశాడు అనంత్‌. ''ఆ సమస్యకు మూలకారణం కూడా కనిపెట్టేసేనోయ్‌. రాంపండు ఒక విధమైన కాంప్లెక్స్‌తో బాధపడుతున్నాడు. అది కలగడానికి కారణం ఆ హెడ్‌మాష్టర్‌. ఆ కాంప్లెక్స్‌ వల్లనే రాంపండు ఆ సుమనోహరికి తన ప్రేమను వెల్లడించలేకపోతున్నాడు. తనను తాను తక్కువగా అంచనా వేసుకుంటున్నాడు. ఆ కాంప్లెక్స్‌ను ఏదో అంటారయ్యా, చట్టున గుర్తుకు రావటం లేదు...''

అచలపతి అందించాడు. ''ఇంగ్లీషులో ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌. తెలుగులో ఆత్మన్యూనతా భావం''.

చూడగానే ''కరక్టుగా చెప్పేవయ్యా. మన మానసిక బలహీనతలన్నిటికి అదే మూలకారణం. ఎవరిదాకానో ఎందుకు నా మట్టుకు నాకే ఆ కాంప్లెక్స్‌ ఉంది తెలుసా? మా పెద్దత్తయ్య లేదూ....? మాంకాళి అత్తయ్య. తనని చూడగానే చిన్నప్పుడు నాచేత 13వ ఎక్కం అప్పచెప్పించుకున్నప్పుడు పిక్కపాశాలు పెట్టిన సంగతి, తన సెంటుబాటిల్‌ పగల కొట్టినప్పుడు నా వీపు బద్దలు కొట్టిన సంగతి, ఆముదం తాగనని మొండికేస్తే చింతబరిక పెట్టి కొడతానన్న సంగతి - ఇవన్నీ గుర్తుకు వచ్చి వణికిపోతాను. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో మునిగిపోతాను. 'సరే అత్తయ్యా, అలాగే అత్తయ్యా' తప్ప మరోమాటే రాదు నానోటివెంట. ప్రస్తుతం రాంపండు తన హెడ్‌మాష్టారు రామబ్రహ్మం వల్ల అదే విధంగా బాధపడుతున్నాడు. ఆ కాంప్లెక్స్‌ పోగొడితే తప్ప రాంపండు ఓ ఇంటివాడవడు....''.

అచలపతి గొంతు సవరించుకున్నాడు. ''సర్‌, నా ఉద్దేశంలో అటునుండి నరుక్కురావడం మంచిదంటాను..''

''అంటే రామబ్రహ్మంగారి సుపీరియారిటీ  కాంప్లెక్స్‌ తగ్గించమనా నీ ఉద్దేశ్యం? అబ్బే, అది చాలా హెచ్చుమోతాదులో ఉందయ్యా. నా అంతటి వాడు పక్కన కూచున్నా పట్టించుకోలేదు తెలుసా?''

''సర్‌, నా ఉద్దేశం అదికాదు. రాంపండుగారు ఎంతో గొప్పగా భావించే సుమనోహరి ఒక వేళ ఆయన ప్రేమను అంగీకరించిందనుకోండి. అప్పుడు కలిగే  ఉత్సాహంతో ఆయన రామబ్రహ్మంగారిని తీసి అవతల పారేయగలుగుతారు''.

''ఆడదాని అంగీకారం మగవాడిలో అంత ఊపు కలిగిస్తుందని ఒప్పుకుంటాను. కానీ అసలు రాంపండు తన ప్రేమను వ్యక్తపరిస్తే కదా, సుమనోహరి అవుననడానికి, కాదనడానికి...!''.

''దానికి ఎప్పటినుండో కథల్లో వాడిన ఫార్ములా ఉంది కదా సర్‌. రాంపండుకి ఆక్సిడెంటు అయిందని తెలియబరిస్తే సుమనోహరి పరుగు, పరుగున వచ్చి...''

'అచలపతీ, నీ బుర్ర బొత్తిగా బూజు పట్టిపోయిందోయ్‌. రాంపండు ఏ లారీ కిందో పడేదాకా ఆగి అప్పుడు సుమనోహరికి చెప్పి, ఆమె వచ్చి కన్నీళ్లు పెట్టుకుని 'నీతోటే నేనూ చితి నెక్కుతాన'ని అని.... నేనే పతివ్రతనయితే నాకు కట్టబోయే మంగళసూత్రం నిలిపే భారం మీదేనని దేవుళ్లను నిలదీసి... ఆ తర్వాత పెళ్లాడి.... ఆమె ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో వీడెళ్లి రామబ్రహ్మంగారిని... అబ్బే.... ఇదంతా ఈ దశాబ్దంలో అయ్యే పని కాదు. కానీ నేనింకో మంచి ఐడియా చెప్తాను విను. అంత గొప్ప ఐడియా నాకు ఎలా వచ్చిందో ఆ సంఘటన కూడా చెప్తాను విను. రేపు నా జీవిత చరిత్ర రాద్దామని నీ కనిపిస్తే, విషయం అందుబాటులో ఉంటుంది''.

అచలపతి తల వంచాడు. ''కానీయండి సర్‌'' అన్నాడు. అదేమంత ఎంకరేజింగ్‌గా అనిపించకపోయినా అనంత్‌ తన కథ కొనసాగించాడు. ''చూడు అచలపతీ, నేను మా మాంకాళి అత్తయ్య గురించి చెప్పాను కదా. నాకు ఆవిడంటే భయం పోయిన ఘడియ ఒకటుంది తెలుసా? నువ్వు నమ్మవు కానీ అప్పుడు నేను ''ఏమిటీవిడ గొప్ప?'' అనుకున్నాను. జరిగిందేమిటంటే మేమంతా కలిసి నార్తిండియా టూరుకెళ్లి ఓ హోటల్‌లో దిగినప్పుడు మా అత్తయ్య ముత్యాల హారం పోయింది. ఆ గది తుడవడానికి వచ్చిన పనిపిల్లే  తీసిందని అత్తయ్య వెళ్ళి హోటల్‌ మేనేజరుకి ఫిర్యాదు చేసింది. అంతా కలిసి ఆ పనిపిల్లను నానాహింస పెట్టిన తర్వాత ఆ హారం అత్తయ్య పెట్లోనే కనబడింది. అప్పుడు ఆ పనిపిల్ల, దాని కంటె మరింత ఊరపందిలా ఉన్న ఆ హోటల్‌ మేనేజరూ కలిసి హిందీలో మా అత్తయ్యను తిట్టిన తిట్లు వినితీరాలి. అత్తయ్యకు హిందీ రాకపోయినా తిట్లజోరుకి అడిలిపోయింది. సగం, సగం అర్థమయి నేను ఆశ్చర్యపడ్డాను - అత్తయ్యను ఇంతలా తిట్టినా ఫర్వాలేదాని. వర్షంలో తడిసిన పిల్లిలా అత్తయ్య వణుకుతుంటే నాకు ఆవిడంటే అస్సలు భయం పోయింది...''

అచలపతి కథనానికి అడ్డు వచ్చాడు. ''... అంటే మీకు ఆవిడంటే ఇప్పుడు భయం పోయిందా సర్‌?''

అనంత్‌ విసుక్కున్నాడు. ''పోయిందో, లేదో నీకు తెలుసు అచలపతీ. కొంతకాలం తర్వాత మళ్లీ తిరిగివచ్చింది. కానీ కొంతకాలం పాటు ఆవిడంటే లెక్కలేకుండా తిరిగాను. ఇక్కడ పాయింటేమిటంటే ఒక మనిషిని నిస్సహాయ స్థితిలో చూసినప్పుడు మనకు వాళ్లంటే భయం పోతుంది. ఉదాహరణకి ఓ కంపెనీలో పనిచేసే వాడికి వాళ్ల జనరల్‌ మేనేజరంటే భయం అనుకో. కానీ ఓ జనవరి ఫస్టు నాడు ఆయన తప్పతాగి రోడ్డు పక్కన పడివుండటం చూశావనుకో. అప్పణ్నుంచి ఆయనంటే భయం పోతుందా, లేదా....?''

''అంటే జనవరి 1 దాకా ఆగి.... రామబ్రహ్మం గారిని తప్పతాగించి....''

''అచలపతీ నా మాటలు నాకే అప్పగించాలని చూడకు. ఆ లోపునే రామబ్రహ్మాన్ని ఇంకోలా నిస్సహాయ స్థితిలో నెడతాను. వెళ్లి మూడు కిలోల శుభ్రమైన మైదా పిండి తీసుకురా.''

''మైదానా?'' అనంత్‌ బుర్ర ఎటుపోతుందో అంతటి మేధావి అచలపతి కూడా ఊహించలేకపోయాడు.

''అవును. నాదో బ్రహ్మాండమైన ప్లానుంది. రామబ్రహ్మం ఇవాళ మూడు గంటలకు వస్తానని చెప్పాడు. ఆ టైముకి రాంపండుని ఆఫీసులో ఉండమని ఆర్డరేశాడు. రాంపండు రూముకి డైరెక్టుగా కాకుండా ఆఫీసులోంచి వెళ్లేదారి మరోటి వుందని తెలుసుగా. ఆ వేళకు ఆ గుమ్మం పైన మైదాపిండిమూట ఏర్పాటు చేసి పెడతాను. ఆయన వచ్చి తలుపు తీయగానే ఆ పిండిమూట నెత్తిమీద పడుతుంది. ఒళ్లంతా పిండి కొట్టుకుపోయిన రామబ్రహ్మాన్ని ఒక్కసారి చూస్తే చాలు. రాంపండు భయం అంతా పటాపంచలయిపోతుంది.'' 

***

మర్నాడు మధ్యాహ్నం రెండు నలభై అయిదు నిమిషాలకు మొదటి అంతస్తు మెట్లెక్కి అనంత్‌ ''జల్సా'' ఆఫీసుకు చేరడం, ముందు గదిలో ఉన్న ఆఫీసుబాయికి గంటదాకా రావద్దని లంచంపెట్టి అక్కడి నుండి తరిమేయడం, కుర్చీ లాక్కొని స్కూలు రోజుల్లో టీచర్లను ఏడిపించిన కళను గుర్తుకు తెచ్చుకుని పిండిమూటను జాగ్రత్తగా తలుపుమీద బ్యాలెన్స్‌ చేసి పెట్టడం జరిగింది.

తన ఆనవాళ్లు తుడిపేసి, ఏమీ తెలియనట్టు ఆ ప్రమాద స్థలం నుండి బయటపడి, అరగంటసేపు రోడ్డు మీద చక్కర్లు కొట్టి మూడుం పావుకి రాంపండు గదికి చేరి చూడబోతే రాంపండు లేడు. పైగా రామబ్రహ్మం మాత్రం చిర్రుబుర్రులాడుతూ కూచున్నాడు. మూడు గంటలకు ఉండి తీరాలన్న హెడ్‌మేష్టారు మాట జవదాటగల ధైర్యం రాంపండు కెలా వచ్చిందన్న ఆశ్చర్యంతో బాటు రామబ్రహ్మంగారి ఒంటి మీద మైదా అవశేషాలు కూడా కనబడకపోవడం అనంత్‌ను ఆశ్చర్యపరిచింది. మంచీ, మర్యాదా లేకుండా ఆయన కూడా తనలాగే ఎడిటర్‌ ప్రైవేటు ఎంట్రన్సులోంచి గదిలోకి దూరి ఉంటాడను కున్నాడు.

''మీరు ఆఫీసు గదిలోంచి రాలేదా?'' అన్నాడు అనంత్‌ మాట కలుపుదామని ప్రయత్నిస్తూ.

రామబ్రహ్మం చదువుతున్న పేపరులోంచి తలెత్తి చూశాడు. ''మీరేదో అన్నట్టున్నారు'' అన్నాడు కటువుగా. ఇక అనంత్‌కు నోరు పెగలలేదు. తనూ ఇంకో పేపరు తీసి చడామడా చదివేయడం మొదలెట్టాడు.

ఓ పావుగంట పోయాక రాంపండు విజిల్‌ పాట వినబడింది. కొన్ని సెకండ్లలో కనబడ్డాడు కూడా. క్రితంసారి చూసిన రాంపండుకీ, ఈసారి చూసిన రాంపండుకీ కనబడ్డ దారుణమైన తేడా చూపి అనంత్‌ తెల్లబోయేడు. రామబ్రహ్మం కూడా. ముఖ్యంగా రాంపండు తనని పిలిచిన పిలుపు విని మరీ తెల్లబోయేడు.

''కాస్త లేటయ్యింది గురూ గారూ ఏమను కోకండి''.

రామబ్రహ్మానికి ఒళ్లు మండిపోయింది. ''కాస్తేమిట్రా రాంపండూ, నేను నిన్ను మూడు గంటలకు ముందే ఉండమన్నానా? లేదా? నాకిలాగ గంటల తరబడి వెయిట్‌ చేయడం అలవాటు లేదు.''

రాంపండు కోపం తెచ్చుకోలేదు. ''సారీ అన్నానుగా. ఇంతకీ మీకు కావల్సిందేమిటి? నిన్న పట్టుకువచ్చిన ఆర్టికల్‌ ఎలా వుందని అడగడానికేగా? నా సమాధానం రెడీగా ఉంది. నాకేం నచ్చలేదు. మా పత్రిక సరదాగా ఉండాలనుకొనేవాళ్ల కోసం పెట్టింది. ఈదురో దేవుడా అనుకునే వాళ్ల కోసం మార్చినప్పుడు కనబడండి....''

''రాంపండూ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకే సరిగ్గా తెలుస్తున్నట్టు లేదు. అసలలాటి ఆర్టికల్‌ వేసుకునే అర్హత మీ పత్రికకు లేకపోయినా పోనీ ఏదో శిష్యుడివి కదాని....''

''నో థాంక్స్‌. ఇదిగో మీ వ్యాసం. అర్హత  ఉన్నచోటే ఇచ్చుకోండి. ఇక నా సలహా వినండి. ఇలాగే రాస్తూ పోతే, మీరూ కొన్నాళ్ళకి బాగా రాయగలరు. ప్రాక్టీసు చేస్తూండండి.  పత్రికలకు పంపుతూండండి. ఎవడైనా పొరబాటున వేసేడనుకోండి. ఇంకోటి పంపండి. తిక్కకుదురుతుంది వాడికి. తిప్పి కొట్టాడనుకోండి. ఎడిటర్ని మార్చి చూడండి. రైటర్‌గా మీ భవిష్యత్తు ఎలా వుందో నేను అతి శ్రద్ధగా గమనిస్తూంటానన్నమాట మర్చిపోకండి.''

పళ్లు పటపట కొరుకుతూ రామబ్రహ్మం వెళ్లిపోగానే అనంత్‌ ఉత్సాహం పట్టలేకపోయాడు. ''ఏమిట్రా ఇది? నీకింత ధైర్యం ఎక్కణ్నుంచి వచ్చింది? నువ్వు నువ్వేనా లేక ఏదైనా డబుల్‌రోలా?''

''అవన్నీ చెప్పే తీరికలేదు. సుమనోహరిని ఇవాళే డిన్నర్‌కి తీసుకెళుతున్నాను. తయారవ్వాలి. పెళ్లి చేసుకోడానికి ఒప్పుకుంది. కానీ పెళ్లి జూన్‌ తర్వాతేనట. తను రాస్తున్న పద్యకావ్యం అప్పటిదాకా పూర్తవదట. కానీ నాకు మేరేజ్‌ గిఫ్ట్‌ ఇవ్వడానికి నువ్వు అప్పటిదాకా ఆగక్కర్లేదు. ముందే  ఇచ్చేసి రసీదు పుచ్చుకో.''

''ఏమిటి? నువ్వు ఆ అమ్మాయితో నీ ప్రేమ గురించి చెప్పడం.... పెళ్లి గురించి మాట్లాడ్డం... ఇవన్నీ ఎప్పుడురోయ్‌?''

''విపులంగా చెప్పడానికి టైము లేదు. వివరాలు కావాలంటే మీ అచలపతి నడుగు. నాతో బాటే వచ్చి రోడ్డుమీద వెయిట్‌ చేస్తున్నాడు. ఇక నేను ప్రేమ గురించి చెప్పడమంటావా... తను నా మీదకు ఒంగి ఆతృతగా చూసినప్పుడు నా దగ్గరనుండి  ఒకే ఒక్కమాటకై తను ఎదురుచూస్తోందని నాకు తెలిసి పోయింది. ఆ మాటే 'ఐ లవ్‌ యూ'! ఇంకెందుకు ఆలస్యం? అనేశా!''

''ఆగాగు. మరీ స్పీడుగా వెళ్లిపోతున్నావ్‌. ఆ అమ్మాయి నీ మీదకు ఒంగి ఆతృతగా చూడడమెందుకు?''

''నీకు బుర్రలేదురా. నేను నేల మీద పడివుంటే ప్రాణం ఉందో లేదో చూడడానికి ఒంగి చూస్తారా, చూడరా? నీదో మట్టిబుర్రరా బాబూ. నీకు చెప్పడం బ్రహ్మతరం కూడా కాదు. నా టైము వేస్టు చేయకు''. రాంపండు పరుగు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు.

***

అనంత్‌ బుర్ర తిరగనారంభించింది. ఎలాగోలా మెట్లు దిగి రోడ్డు మీదకి వెళ్లే సరికి అచలపతి కనబడ్డాడు. ''ఈ రాంపండు గాడు ఏడయ్యా? నిన్ను ఏదో అడగమంటాడేమిటి?'' అని అడిగాడు విసుగ్గా.

''దేని గురించి అడగమన్నారు సర్‌? సుమనోహరి, ఆయన మనింట్లో కలుసుకున్న దృశ్యం గురించా?''

''మధ్యలో మనింట్లో  కలుసుకోవడమేమిటి?''

''రాంపండు గారికి మనింట్లోనే ఏక్సిడెంటయిందని మీ పేరుతో నేను సుమనోహరిగారికి ఫోన్‌ చేశాను కాబట్టి సుమనోహరి గారు అక్కడికే వచ్చారు''.

''వచ్చి ఏక్సిడెంటు జరగలేదని తెలిసి మండిపడి తిట్టి వుండాలే...!''

''ఏక్సిడెంటు జరక్కపోవడమేం? నేను మీ హాకీ బ్యాటు పెట్టి రాంపండు గారికి ఒక్కటిచ్చు కున్నానుగా''

జరిగినదంతా అనంత్‌ కళ్లక్కట్టింది. ''హారినీ, ఇప్పుడర్థమయింది. నువ్వు రాంపండు బుర్రబద్దలు కొట్టి సుమనోహరిని రప్పించావన్న మాట. ఆమె ఇన్నాళ్లూ దాచుకున్న ప్రేమ సింపతీ కారణంగా బయటపడింది. మనవాడు ఆమె ప్రేమ గెలుచుకున్న హుషారులో రామబ్రహ్మాన్ని కూడా లెక్కచేయడం మానేశాడు. అంతా బాగానే ఉంది కానీ, నువ్విలా హాకీ బ్యాట్‌ పట్టుకుని తనను కొట్టావని రాంపండుకి తెలిస్తే....?''

''తెలియడానికి అవకాశం లేదు సర్‌. నేను తలుపు వెనక్కాల దాక్కుని ఆయన లోపలికి రాగానే హాకీబ్యాటుకి పని చెప్పాను..''

''సర్లే, అప్పుడు చూడకపోయినా తర్వాత తలమీద బొప్పి చూసైనా తన నెత్తిమీద ఏం పడిందని అడుగుతాడుగా?''

''అడిగారు సర్‌. మీ  ఫ్లవర్‌వేజ్‌ పైనుండి పడిందని చెప్పాను''

''అది నిక్షేపంలా ఉంటే కిందపడిందని ఎలా నమ్ముతాడోయ్‌?''

''నమ్మరు సర్‌. అందుకనే సాక్ష్యం కోసం దాన్ని నేనే ముక్కలు, ముక్కలుగా విరకొట్టాల్సి వచ్చింది''.

అనంత్‌కి కోపం, ఏడుపు రెండూ వచ్చాయి. చివరికి అచలపతి ఫ్లవర్‌వేజ్‌ విషయంలో తన మాట నెగ్గించుకున్నాడన్న మాట!

అచలపతికి వినయానికి తక్కువేమీ చేయలేదు. ''సర్‌, మీ కళ్లు ఎర్రబడుతున్నాయి. ఎండక్కాబోలు. గాగుల్స్‌ రాంపండు గారి గదిలో మర్చిపోయినట్టున్నారు' అని గుర్తు చేశాడు.

అనంత్‌ వెంటనే మెట్లకేసి పరుగెట్టాడు. హడావుడిలో 'ప్రైవేటు' గుమ్మం  నుండి కాకుండా, దాని కెదురుగా ఉన్న ఆఫీసు గుమ్మం తోసి లోపలికి వెళ్లాడు.

అంతలోనే వర్షం కురిసింది. మైదా పిండి వర్షం. అనంత్‌ జుట్టునిండా, కళ్లనిండా, నోటినిండా, బట్టలనిండా, ఒంటినిండా ఎక్కడ చూసినా మైదాయే. నడిచే మైదా బస్తాలా ఉన్న అనంత్‌ను చూసి అప్పుడే  తిరిగి వచ్చిన ఆఫీసుబాయ్‌ కెవ్వున కేకపెట్టాడు.

(పి జి ఉడ్‌హవుస్‌ రాసిన ''The Inferiority Complex of Old Sippy '' అనే కథ ఆధారంగా సాగిన రచన, 2002లో ''హాసం''లో ప్రచురితం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
mbsprasad@gmail.com