Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఆశల పల్లకీలో ఊరేగుతున్న గులాబీ బాస్

ఆశల పల్లకీలో ఊరేగుతున్న గులాబీ బాస్

పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గులాబీ పార్టీ బాస్ కేసీఆర్‌లో ఏవేవో ఆశలు చిగురిస్తున్నాయి. ఆయన ఆశల పల్లకీలో ఊరేగుతున్నాడు. ఆయన ఆశలు నిజమవుతాయా లేదో చెప్పలేం. కానీ ఆశలు పెట్టుకోవడంలో తప్పులేదు కదా. వాటికి డబ్బు ఖర్చు పెట్టనక్కరలేదు కదా. కేసీఆర్ ఒక్కడే కాదు, ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ కలలు కంటుంది. ప్రతి నాయకుడు ఆశలు పెట్టుకుంటాడు. సామాన్యులనైనా, రాజకీయ నాయకులనైనా ముందుకు నడిపించేది ఆశే కదా.

అయితే కేసీఆర్ పార్టీ పోటీ చేస్తున్నది పార్లమెంటు ఎన్నికల్లో కాబట్టి ఆయనకు ఆశలు నేషనల్ లెవెల్లో ఉన్నాయి. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆయన గట్టిగా అభిప్రాయపడుతున్నాడు. బీజేపీకి 200 సీట్లకు మించి రావని అంచనా వేస్తున్నాడు. కేంద్రంలో హంగ్ వస్తుందని నమ్ముతున్నాడు. హంగ్ వస్తే గులాబీ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నాడు. హంగ్ వస్తే బీఆర్ఎస్ కీలక పాత్ర ఎలా పోషిస్తుంది?

ఎలా పోషిస్తుందంటే.. రాష్ట్రంలో ఆ పార్టీకి 14 లేదా 15 ఎంపీ స్థానాలు గెలవాలి. కేంద్రంలో హంగ్ రావాలి. అప్పుడు మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని కేసీఆర్ చెబుతున్నాడు. గోదావరి, కృష్ణా నదులు కాపాడుకోవాలన్న, ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించాలన్నా, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలన్నా, మన బతుకులు బాగుపడాలన్నా గులాబీ పార్టీ ఎక్కువ సీట్లు సాధించాలని కేసీఆర్ అంటున్నాడు.

పార్లమెంట్ ఎన్నికల్లో తన పార్టీకి 15 సీట్లు ఇస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుందని, తానే మళ్ళీ అధికారంలో వస్తానని చెబుతున్నాడు. అంటే... పార్లమెంటు ఎన్నికల్లో 15 సీట్లు గెలుచుకుంటే రెండు ప్రయోజనాలు కలుగుతాయని కేసీఆర్ చెబుతున్నాడన్న మాట. మొదటిది కేంద్రంలో చక్రం తిప్పొచ్చు. రెండోది రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావచ్చు. 

కానీ ఇదంతా కేసీఆర్ కాకి లెక్కలు చెప్పినంత సులభం కాదు. కేసీఆర్ చెప్పినదాన్నిబట్టి అర్ధమయ్యేది ఏమిటంటే ...ఆయనకు జాతీయ రాజకీయాల పట్ల ఆశ చావలేదు. రాష్ట్రంలో మళ్ళీ తానే అధికారంలో రావాలనే యావ తగ్గలేదు. మరి ఆయన అంచనాలు నిజమవుతాయో, తప్పుతాయో దేశవ్యాప్తంగా ప్రజలు ఇచ్చే సీట్ల పైన ఆధారపడి ఉంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?