Advertisement

Advertisement


Home > Politics - Analysis

డబ్బు నుంచి పదవి.. పదవి నుంచి డబ్బు

డబ్బు నుంచి పదవి.. పదవి నుంచి డబ్బు

కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి ఇప్పుడు అనేక వృత్తి సమస్యలతో ఇబ్బంది పడుతూ వుండొచ్చు. క్యాష్ క్రంచ్‌తో కిందా మీదా అవుతూ వుండొచ్చు. కానీ ఆయన ఉత్తరాంధ్రలో ఓ రాజకీయ సూత్రం కనిపెట్టారు. ఆ మాటకు వస్తే ఉత్తరాంధ్రలో అని కాదు, రాజకీయాల్లో, సొసైటీలో డబ్బుతోటే మాగ్జిమమ్ పనులు జరిగిపోతాయని ఒకటికి పది సార్లు చాటి చెప్పారు.

నెల్లూరుకు చెందిన ఆయన విశాఖలో ఏటా లక్షలు ఖర్చు చేసి శివరాత్రి ఉత్సవాలు ప్రారంభిస్తారు. ఆ తరువాత ఢిల్లీలో కిందా మీదా పడి టికెట్ తెచ్చుకుని, విశాఖ ఎంపీగా పోటీ చేసేవారు. కళాబంధు విశాఖ ఇంటికి వస్తున్నారు అంటే అక్కడ చిన్న సైజు తిరునాళ్లలా వుండేది. ఎంపీ పరిథిలోని ఎమ్మెల్యే నియోజక వర్గాల లోకల్ లీడర్లకు పండగే పండగ. డబ్బే డబ్బు. ఆ రోజుల్లో మహా అయితే అయిదు నుంచి పది కోట్లు.

టిఎస్సార్ కేంద్రంలో తన పలుకుబడి వాడుకుని, తెచ్చుకున్న కాంట్రాక్ట్ ల్లో ఓ కాంట్రాక్ట్ లాభం వదిలేసుకుంటే చాలు. ఇలా ఎంపీగా గెలిస్తే మళ్లీ కాంట్రాక్ట్ లు తెచ్చుకోవచ్చు. ముంబాయిలో, ఢిల్లీలో పార్టీలు ఇచ్చి పలుకుబడి పెంచుకోవచ్చు. ఇలా డబ్బు పదవిని, పదవి డబ్బును సంపాదిస్తుంది అనే సూత్రం విజయవంతంగా అమలు చేసారు. ఆ తరువాత ఇక అందరూ అదే బాట పట్టారు.

గంటా శ్రీనివాసరావు తొలిసారి ఎమ్మెల్యే టికెట్ కోసం రెండు కోట్ల పార్టీ ఫండ్ ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఇచ్చారనే టాక్ వుండేది. ఆయన తొలిసారి పోటీ చేసినపుడు లోకల్ మీడియాకు బంగారు కానుకలు ఇచ్చారనే టాక్ కూడా వుంది. అలా డబ్బును వాడడం ద్వారా అందరి మనసులు చూరగొని ఎన్నిక కావడం అనేది ఓ ఫార్ములాగా మారింది.

విశాఖలో వెలగపూడి ఎప్పుడూ గెలుస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలతో సంబంధం లేకుండా తన నియోజకవర్గంలో జరిగే ప్రతి చిన్న, పెద్ద గ్రామ దేవతల పండుగకు, చాలా అంటే చాలా మంది పెళ్లిళ్లకు ఆయన నుంచి వెళ్లాల్సిన చందానో, కానుకనో వెళ్లిపోతుంది. లిక్కర్ సిండికేట్ ఆయన కంట్రోల్‌లో వున్నంత కాలం లిక్కర్ పార్టీలు బాగానే నడిచేవి.

ఇలా నాన్ లోకల్స్ డబ్బుతో లోకల్ జనాల మనసులు చూరగొనడం అన్నది పెరిగింది. అది ఇప్పుడు లోకల్.. నాన్ లోకల్ అని లేదు. ఎన్నిక అంటే డబ్బు అన్న లెక్కగా మారిపోయింది. జనం కూడా తెలివి మీరిపోయారు. డబ్బులు తీసుకుంటూ కూడా, తాము ఎవరికి వేయాలో వాళ్లకు వేస్తున్నారు.

ఈ ఎన్నికలో గుంటూరు నుంచి పెమ్మసాని, విజయవాడలో కేశినేని, సుజన, అనకాపల్లిలో సిఎమ్ రమేష్, నెల్లిమర్లలో లోకం మాధవి నెల్లూరు లో విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, లాంటి అపర కోటీశ్వరులు పోటీ చేస్తున్నారు. సిఎమ్ రమేష్ లాంటి పారిశ్రామిక వేత్త అనకాపల్లి నుంచి గెలిస్తే అది డబ్బు మహిమ కాక మరేంటీ? కానీ గెలిస్తే ఇక్కడ జనాలకు ఆయన అందుబాటులో వుండగలరా? ఆయనకు ఎన్ని వ్యాపకాలు. ఆయన ప్రతినిధిగా ఎవరో ఒకర్ని మాత్రం ఇక్కడ వుంచగలరు. ఇది తెలిసి జనం గెలిపించారు అంటే అది డబ్బు మహిమే.

గతంలో గల్లా జయదేవ్, ఇప్పుడు పెమ్మసాని గుంటూరు బరిలోకి వచ్చిన వేల కోట్ల ఆసాములు. నెల్లూరు బరిలో వేమిరెడ్డి, విజయసాయి రెడ్డి కూడా బాగా డబ్బున్న ఆసాములు. డబ్బున్న ఆసాములు అంతా వ్యాపారాల్లో, విదేశాల్లో సంపాదించి అదే పెట్టుబడిగా రాజకీయాల్లోకి వచ్చిన వారే. గుంటూరు పెమ్మసాని భారీగా పార్టీ ఫండ్ ఇచ్చారని టాక్ వుంది. వీళ్లతా గెలిచారు అంటే జనం ఓట్లేసింది వీళ్లు కుమ్మరించిన డబ్బును చూసా? లేక నిజంగా వీళ్లంతా ప్రజాసేవ చేస్తారని నమ్ముతున్నారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?