Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: మాయాబజార్‌కు 60 ఏళ్లు-3

ఇలాటి కోటబుల్‌ కోట్స్‌ మాయాబజారు నిండా ఎన్నో వినబడతాయి. ఇవన్నీ సామెతల స్థాయికి ఎదిగిపోయాయి. 'ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?', 'ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉందిగా', 'ఉద్దండపండితులే కానీ మీకు ఉండవలసిన బుద్ధి మాత్రం లేదయా', 'పెళ్లి పెద్దలంటూ శుద్ధమొద్దులు తయారయారు', 'ఉన్నమాటైనా సరే ప్రభువుల ఎదుట పరులను పొగడరాదు', 'చేతులు రాక కాదు - చేతకాక అని చెప్పు',  'మాలో గోటు అంటే గొప్ప అని అర్థం పండితులు తమకైనా తెలియదుటండీ' అని చినమయ అనగానే వెంటనే ఈ పండితుడు 'ఆ పై మాట నేను చెబుతా, తీట అంటే గౌరవం అంతేగా!' అంటాడు. పండితులను ముఖస్తుతితో ఎలా బోల్తా కొట్టించాలో గొప్ప ఉదాహరణ. 'పెళ్లి సందడిగా జరిపిస్తాన'ని కృష్ణుడు వదినగారికి మాట ఇస్తాడు. ఎలా కావాలంటే అలా అన్వయించుకునే వీలుంది. కొన్ని ఎక్స్‌ప్రెషన్స్‌ జనజీవితంలో భాగంగా అయిపోయాయి కూడా ! ఇదివరకు ఏదైనా గొప్పపని చేస్తే 'మెచ్చి మేకతోలు కప్పడం' ఉండేదమో. మాయాబజారు వచ్చాక 'వీరతాడు' వేయడం మొదలయింది. అసలు ఆలోచిస్తే వీరతాడు ఏమిటి? దుష్టసమాసం కాదూ. అయినా జనం నోళ్లల్లో పడి యాక్సెప్టబుల్‌ అయిపోయింది. 

పాత్రల పేర్లలో కూడా ఓ తమాషా కనబడుతుంది. జాతకాల విషయంలో శంకించే ఆయన పేరు శంకుతీర్థులవారు. శశిరేఖ చేత చెంప చెళ్లుమని కొట్టించుకున్న చెలికత్తె పేరు చంప. రాజ్యవైభవాన్ని కోల్పోయి వచ్చిన అభిమన్యుణ్ని చూపించి కృష్ణుడు 'శశీ, చూశావా మీ బావ సత్యవంతుడై వచ్చాడు' అంటాడు. దానికి రుక్మిణి 'ఆయన సత్యవంతుడైతే, ఈమె సావిత్రి అవుతుంది' అంటుంది. రాజ్యం కోల్పోయినా భర్తను అంటిపెట్టుకుని ఉన్న పౌరాణిక పాత్రను గుర్తు చేస్తూ. పైగా అక్కడ ఆ పాత్ర వేసిన నటి పేరు కూడా సావిత్రే! మయుడు మయసభ నిర్మించిన విధంగా భ్రమలు కల్పించే మాయాబజారు నిర్మించిన ఘటోత్కచుడి శిష్యుడి పేరు - చిన్న మయ. మయసభ నిర్మించినవాడు సీనియర్‌ మయుడయితే ఇతను జూనియర్‌ మయుడన్నమాట. అలాగే గోడ ఆకారంలో వెళ్లి అభిమన్యుడిని అడ్డుకోబోయినవాడు - కుడ్యాసురుడు. శకుని పేరు వీళ్లు పెట్టినది కాకపోయినా 'లక్ష శనిల పెట్టు శకుని మామ' అనడానికి ఉపయోగించుకున్నారు. దుర్యోధనుడు చెప్పినది చెప్పినట్టు వెంటనే ఆచరించడం మరోటి ఎరుగని దుశ్శాసనుడికి ఊతపదం - మరి మన తక్షణ కర్తవ్యం? ఇవేకాక పింగళి ఈ సినిమాకోసం అనేక మాటలు సృష్టించి తెలుగుభాషకు అందించారు. అసమదీయులు, తసమదీయులు, తల్పం, గిల్పం, కంబళి, గింబళి, హైహై నాయకా, వైవై నాయకా, దవారం... !  

సినిమా వచ్చాక పింగళిని ఎవరో అడిగారు. 'దుర్యోధనుడు వీరాధివీరుడు, విశాల సామ్రాజ్యాన్ని పాలించిన రణధీరుడు. మరి అతని కొడుకు లక్ష్మణకుమారుడిని బొత్తిగా వెర్రి వెంగళప్పలా, వెకిలిగా చిత్రీకరించేరేం? 'తిరోగమించుటే మీకు తెలియును' అని అన్నా అర్థం తెలియనంత శుంఠా?' అని. దానికి ఆయన సమాధానం చెప్పాడు. 'భారతంలో అతను ధీరుడు, శూరుడు అని చెప్పలేదు. భారతయుద్ధంలో ప్రవేశించిన రోజే అభిమన్యుడి చేతిలో ఛస్తాడు. అటువంటివాడిని హాస్యానికి వాడుకుంటే తప్పేముంది?' అని. కానీ అందరూ పంచెలు కట్టుకుంటే లక్ష్మణుడు మాత్రం బొత్తిగా పైజమా వేసుకోవడం అదోలా ఉంటుంది. అతనేమైనా అరబ్బీ యువకుడా ఏమన్నానా? అతని చేత 'పెళ్లికూతురు మీద సర్వహక్కులూ నాకున్నాయి.' అని కూడా అనిపించేశారు. హక్‌ అన్నది ఉర్దూ పదం కదా, సర్వాధికారాలు అంటే సరిపోయేది. కానీ.. చల్తా హై.. హాస్యం కదా, పైగా రేలంగి. మనమేమీ నొచ్చుకోలేదు. లక్ష్మణకుమారుడి పాత్ర గురించి పింగళిగార్ని అడిగారు కానీ రేవతి గురించి చర్చేమీ జరిగినట్టు లేదు. ఒకవేళ రచయితను అడిగినా 'ఆవిడ ఉత్తమురాలు అని భారతంలో లేదు కాబట్టి కాస్త గయ్యాళితనం చూపిస్తే తప్పులేదు' అని సద్దేసేవారేమో! ఆవిడ గురించి కాస్త చెప్పుకుందాం. 

ఆడపడుచు మీద ఆవిడ విసుర్లు బ్రహ్మాండంగా ఉంటాయి. 'ఏ శోభలూ లేకుండా నీకు వలెనే నా కూతుర్ని కూడా పుట్టింట్లో పడి వుండమంటావా?' అనేస్తుంది. విభవం కోల్పోయి సుభద్ర వస్తే తలనొప్పి నటిస్తుంది. 'ఏ యింటికి వెళ్తే ఏంలే అమ్మా - నా కా పట్టింపులేమీ లేవు... ఇక అంతా ఇక్కడుండవలసిన వాళ్లమేగా.. ఈ పన్నెండేళ్లూనూ..!' అని ఎత్తిపొడుస్తుంది. చివర్లో సుభద్ర మాటకు మాట అంటిస్తుందనుకోండి. లక్ష్మణకుమారుడి సంబంధం కుదుర్చుకుని వచ్చాక ఆ విషయం సుభద్రకు చెప్పవద్దని మొగుడ్ని కట్టడి చేస్తుంది. గొప్ప సంబంధం అని మురిసిపోయినా చివర్లో పెళ్లిపీటల మీద అతని పిచ్చిచేష్టలు చూశాక తక్షణం మొగుణ్ని బ్లేమ్‌ చేస్తుంది - 'ఏమండీ మీరు ముందుగా అబ్బాయిని చూడలేదుటండీ' అంటూ. టిపికల్‌ వైఫ్‌ లాగ! బలరాముడు కూడా టిపికల్‌ కుటుంబపెద్దలా వ్యవహరిస్తాడు. సుభద్ర నిలదీసినప్పుడు 'ఈ ఆగడాలు అఘాయిత్యాలు నాకు పనికిరావు' అని డిక్లేర్‌ చేసి తప్పుకుంటాడు. ఇరుకున పడ్డప్పుడు కోపం ప్రదర్శిస్తుంటారు ఇలాటి సందర్భాల్లో. 

ఇక కెవి డైరక్టోరల్‌ టచెస్‌ గురించి - ఘటోత్కచుడు వచ్చి ఒక పర్వతం మీద వాలినప్పుడు ఆ బరువుకి ఓ రాయి దొర్లిపోతుంది. అదే విధంగా ఘటోత్కచుడి ఎరీనాలోకి పరులు ప్రవేశించినప్పుడు వెలిగే ఢక్క. రాడార్‌ ఐడియా అన్నమాట. అది స్ఫురించేట్లు సిగ్నల్స్‌ ఇచ్చినట్టు చూపించడానికి వెలుగు పడుతూ ఆరుతూ ఉంటుంది. అలాగే చెలికత్తె మాయా శశిరేఖతో పడే ఇబ్బంది. మాయా శశిరేఖ చెయ్యి తన భుజం మీద పడినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటుంది. మగాడు, పైగా రాక్షసుడు తన మీద చెయ్యి వేసాడన్న అనీజీనెస్‌ కనబడుతుంది. అభిమన్యుడు బాణాల నిచ్చెన వేసేందుకు ముందు శశిరేఖను 'కిటికీలోంచి దూకేసేయ్‌' అంటే దూకేయడానికి ఆమె సిద్ధపడుతుంది. అదీ బావపై ఆమెకున్న విశ్వాసం. మాయాబజార్లో సృష్టించాక అమ్మాయిలు 'ఒకటే మా వయసు ఓ రాజు' డాన్సు చేస్తూంటే తండ్రీకొడుకూ ఇద్దరూ చూసి ఎంజాయ్‌ చేస్తారు. ఇద్దరూ వేరేవేరేలా రియాక్టు అవుతారు. కృష్ణుడి చిన్ననాటి చేష్టల గురించి నృత్యనాటిక వస్తూ ఉంటే రుక్మిణి తన మొగుడికేసి చూస్తుంది 'ఇంత గడుగ్గాయా మీరు' అన్నట్టు. ఘటోత్కచుడు మాయా శశిరేఖ అయినతర్వాత తన కంఠం గురించి చెలికత్తెతో చెక్‌ చేసుకుంటాడు చూడండి. కానీ పైట సంగతి చూసుకోడు. చెలికత్తె సైగచేశాక సద్దుకుంటాడు. అలాగే మాటిమాటికీ మగాళ్లలా చేతులు కట్టుకుంటూ వుంటే కృష్ణుడు మురళితో తట్టి దించమని సైగ చేస్తూ ఉంటాడు. 

కౌరవులు విలన్లే కానీ చేతకానివాళ్లు కారు. యుద్ధం అంటూ పెడితే కర్ణుడితో సహా వాళ్ల ప్రతాపం చూపాలి. అందువల్ల మాయాయుద్ధం చూపించి వాళ్లని మూటగట్టి పంపించేసినట్టు చూపారు. లాహిరిలాహిరి పాటలో తోడికోడళ్ల మధ్య స్పర్ధను ఎంతబాగా చూపించారో చూడండి. 'కాలమహిమ కాకపోతే చిన్నపిల్లకు మల్లే ఈ రుక్మిణికి ఇంకా ఈ విహారాలేమిటండీ' అంటుంది రేవతి. కాస్సేపటికి రుక్మిణి 'కాలమహిమ కాకపోతే మా అక్కగారికి ఎందుకండీ ఈ వయసులో ఈ విహారం' అంటుంది. మాయాబజారు సినిమా హాల్లో ఇన్నిసార్లు చూశాను కానీ లాహిరి, లాహిరి పాటలో చివరిదృశ్యంలో పాట ఇప్పటిదాకా వినలేదు. బలరాముడు, రేవతి పడవ ఎక్కగానే హాల్లో అందరూ నవ్వుతారు. ఆ నవ్వులో వాళ్లు పాడినది వినబడదు. లాహిరి, లాహిరి అనగానే ఫోటోగ్రఫీ గుర్తుకువస్తుంది. అది మూడు స్థలాల్లో వేర్వేరు వేళల్లో తీసి కలిపారట, తెలుసా? ఆ తెల్లగడ్డి ఎండలో తీసేరట. అది బ్యాక్‌ ప్రొడక్షన్‌ అని తెలుస్తుందా అసలు ఎక్కడైనా అతికినట్టు ఉందా? దటీజ్‌ మార్కస్‌ బార్‌ట్లే! పున్నమినాడు వెన్నెల చక్కగా ఉంటే విజయావారి వెన్నెలలా ఉందని మనం అనుకుంటున్నామంటే దానికి కారణం ఆయనే! చిన్న శశిరేఖ నుండి పెద్ద శశిరేఖ కావడం సింగిల్‌ షాట్‌లో తీశారట. మిక్సింగ్‌ లేదు. ఎలా తీశాడో మహానుభావుడు! అలాగే గింబళి చుట్టుకోవడం షాటు ఎలా తీశారన్నది ఈనాటి టెక్నీషియన్లకీ పెద్ద ప్రశ్నే! 

ఫస్ట్‌ సాంగ్‌లో చూడండి. ఏభైమంది ముత్తయిదువులు పాడుతున్నారంటే అందరూ ఫోకస్‌లోనే ఉంటారు. చివరున్నవారి ముఖం కూడా స్పష్టంగా కనబడుతుంది. బ్లర్‌ అవదు. సముద్రంలో ద్వారక షాట్స్‌ చూడండి. ఘటోత్కచుడి నీడ సముద్రంలో పడుతుంది. రాత్రిపూట ఘటోత్కచుడు రాజమహల్లో తిరుగాడుతూంటే లైటింగు చూడండి. వివాహభోజనంబు పాటలో ఘటోత్కచుడు పెద్దవాడయాక అతని గద సైజు చూసుకుని నవ్వుకోవడం చూడండి. లడ్లు తింటూ మీసాలు తుడుచుకోవడం చూడండి. ఇలా అన్నీ చూడాల్సిందే. మార్కస్‌ బార్‌ట్లేతోబాటు ఆర్ట్‌ డైరక్టర్‌ మాధవపెద్ది గోఖలేకు కూడా దండం పెట్టుకోవాలి. ముఖ్యంగా ఘటోత్కచుడి గెటప్‌ చూడండి. ఎంత హుందాగా ఉంటుందో! నటీనటులు అందరూ ప్రతిభావంతులే, అందమైన వారే! వాళ్లని మరింత అందంగా చూపడానికి, మన హృదయఫలకాలపై నిల్చిపోయేట్లు చేసినది మాత్రం ఈ టెక్నీషియన్లే! మాయాబజార్‌ కృష్ణుడి వేషంలో ఎన్టీ రామారావు మన మనస్సుల్లో ముద్ర వేసుకుపోయేడు. అసలు కృష్ణుడు వచ్చి నేనిలా, మరోలా ఉంటాౖనా బాబూ అన్నా పోవోయ్‌ అంటాడు తెలుగువాడు. 

ఇంటర్వెల్‌ తర్వాత అంతా విడిదిలో మగపెళ్లివారు చేసే అడావుడే! వాళ్లను ఆడపెళ్లివాళ్లు ఏడిపించడం. ఇది ఎంత బాగా హత్తుకుపోయిందంటే తలచుకున్న కొద్దీ నవ్వొస్తుంది. 'మా ఆచారంలో ఇంతసేపు తెరపట్టడం లేదు' అన్నమాట ఒకటి. పెళ్లిళ్ల వ్యవహారాల్లో జిల్లా జిల్లాకు ఆచారాలు మారతాయి కాబట్టి ఈ మాట రాక తప్పదు. శకుని కాబట్టి లౌక్యంగా చెబుతాడు. శశిరేఖను ఒకచోట 'చక్కగా.. సిగ్గులేకుండా చనువుగా వున్నావు' అంటాడు. ఆ విరుపు సియస్‌ఆర్‌కి మాత్రమే సాధ్యం. శకుని కాక తక్కిన దుష్టచతుష్టయంలో దుశ్శాసనుడు మరీ రెచ్చిపోతాడు. లక్ష్మణుడు పోట్లాడి తెర తీసేయించగానే 'భలే కర్ణా, మనవాడు మన పేరు నిలబెట్టాడు' అని పొంగిపోతాడు. కానీ దుర్యోధనుడు రారాజు కదా, మరీ అంత బయటపడడు. ముసిముసి నవ్వులు నవ్వుతూ 'కర్ణా, కృష్ణుని అవస్థ చూస్తే జాలి వేస్తోంది.' అంటాడు. ఏమిటో ఈ భేషజం! మళ్లీ ఇంకోసారి 'భలే మామా భలే, మనవాడు కృష్ణుడిమీద భలే చమత్కారబాణం విసిరాడు' అని దుశ్శాసనుడు మురిసిపోతాడు. 

శకుని విడిదిలో దిగుతూనే బ్రహ్మోపదేశం చేస్తాడు - 'మనం వరుని పక్షం. బెట్టు చెయ్యాలి. అది బాగులేదు, ఇది బాగులేదు అని - వాళ్లని చిన్నబుచ్చాలి.' అని. ఆ మాట పట్టుకుని కంబళీ వద్దు, గింబళీ కావాలని, తల్పం వద్దు గిల్పం కావాలనీ ఇలా ఎక్కడా లేనివాటి గురించి కోరికలు కోరుతారు. అక్కడ డైలాగు చూడండి - ఈ నాసి కంబళ్లా మాకు వేసేది? మా వూళ్లో దాసీవాళ్లకు వేస్తే తోసి అవతలకు పారేశారు'. ఇప్పటికీ మగపెళ్లివారి మాట ఇలాటి డైలాగులే వినబడతాయి కాబట్టి మాయాబజారు ఎప్పటికీ నిత్యనూతనంగా ఉంటుంది. శాస్త్రి శర్మ వేషాల్లో వంగర, అల్లు రామలింగయ్య తినేశారు. ఎన్ని వంటకాలున్నా ఓస్‌ ఇవేముంది కూరగాయలు, పానీయాలు, చిత్రాన్నాలు.. అంటూ తీసి పారేసి లేనిదేదో అడుగుతారు. వాళ్లకి తోడు బాలకృష్ణ ఒకడు. పెద్ద పోజు. తలుపు హఠాత్తుగా తెరుచుకోవడంతో దొర్లుకుంటూ వచ్చి పడతాడు. 'ఓ సారథిగారూ, పడ్డది తమరా బాబూ' అంటాడు వంగర. 'పడ్డానూ, మొగ్గ వేశానంతే!' అని సర్దుకుంటాడు బాలకృష్ణ. ఇదీ మొగపెళ్లివారి భేషజం.    

ఇక సంగీతం గురించి కాస్త చెప్పుకుందాం. మాయాబజారు థీమ్‌ మరాఠీ, హిందీ నాటకాలనుండి, సినిమాల్లోకి వచ్చిందన్నాగా, వాటన్నిటిలోనూ కామన్‌గా ఉన్న పాటలు ఈ సినిమాలో కూడా పెట్టారు. కృష్ణుడి బాలలీలలపైన ఓ పాట విధిగా ఉంటుంది. అదే ఈ సినిమాలో 'విన్నావటమ్మా యశోదమ్మా' అన్నట్టు ఆ పాటలో వేసిన బాలకృష్ణుడు ఎవరో తెలుసా? హిందీనటి రేఖా అన్నగారు. బాబ్జీ అని పేరు. అలాగే విధి గురించి ఓ పాట. మనకు 'భళి భళి దేవా' అన్నపాట. దారుకుడు వేషంలో ఉన్న మాధవపెద్ది తనకు తానే ప్లేబ్యాక్‌ పాడుకున్నాడు. తమిళ వెర్షన్‌లో కూడా ఆయనే తెరమీద కనబడతాడు కానీ వాయిస్‌ మాత్రం వేరే వాళ్లది. అలాగే మాయాబజార్‌ సృష్టించాక 'రక్షలు రక్షలు' పాటకు కూడా మాతృక ఉంది. 'పురానా దో నయే లో' అన్న పాట నాటకాల నాటిదే! అన్నట్టు ఇక్కడో మాట. మాయాబజారులో బొమ్మల షాపు వెలిసినపుడు అందులో బుద్ధుడి బొమ్మ కూడా ఉంటుంది. కృష్ణావతారం తర్వాతే కదా బుద్ధుడి అవతారం. ఇది చిన్న పొరబాటే ననుకోండి. ఇది తప్ప మాయాబజారులో తప్పులేమీ కనబడవు.

పాటల విషయానికొస్తే 'అహనా పెళ్లి అంట' టైపు పాట 1949 హిందీ వెర్షన్‌లో ఉంది. దాని పల్లవి 'మొహే దుల్హన్‌ బనాదె సఖీ'. ఇక వివాహ భోజనంబు పాట తీసుకుంటే 1936 నాటి మాయాబజారులోని ట్యూన్‌ తీసుకుని లిరిక్‌ మార్చి వాడుకున్నారు. ట్యూన్‌ పుట్టింది మాత్రం విదేశాలలోనే. 1930 ప్రాంతాల్లో బ్రిటన్‌, అమెరికా దేశాల్లో ప్రహసనాలు ఆడేటప్పుడు రంగస్థలం మీదకు ఆయా పాత్రధారులు వాళ్ల దుస్తులు తోపుడుబళ్లమీద వేసుకుని తోసుకుంటూ వచ్చేవారు. అప్పుడు వినబడే ట్యూన్‌ ఇది. దాన్ని 'మెక్సికన్‌ మెర్రీ గో రౌండ్‌' అనే పాటగా ఎడ్మండ్‌ రాస్‌ మలిచారని, ఆ ట్యూనే మనవాళ్లు గ్రహించారని చదివాను. అది కాదు, దానికి ఆధారం చార్లెస్‌ జోలీ అనే గాయకుడు పాడిన ''ద లాఫింగ్‌ పోలీస్‌మన్‌'' (1922) పాట అంటూ ఇప్పుడు వాట్సప్‌లలో వస్తోంది. వివాహ భోజనం పాటను తెలుగులో మాధవపెద్ది, తమిళంలో తిరుచ్చి లోకనాధన్‌ పాడారు. మాధవపెద్ది రంగారావుకి ప్లేబ్యాక్‌ ఇచ్చారు. రంగారావుపై పద్యాలు చిత్రీకరించినపుడు పద్యాల ముందు వచ్చే మాటలు కూడా మాధవపెద్ది చేతనే అనిపించారు. 

మాయాబజారు గురించి ఏ ముచ్చటయినా పాటల గురించి ప్రస్తావించనిదే పూర్తయినట్లు కాదు. సినిమా గొప్ప మ్యూజికల్‌ హిట్‌. లిరిసిస్ట్‌గా పింగళి, కంపోజర్‌గా ఘంటసాల విశ్వరూపం కనబడుతుంది. టైటిల్స్‌లో సంగీతం ఘంటసాల అన్నా, నాలుగు పాటలకు ఎస్‌.రాజేశ్వరరావుగారు ట్యూన్‌లు కట్టారు. అవి - లాహిరి లాహిరి లాహిరిలో, నీవేనా నను తలచినది, చూపులు కలసిన శుభవేళా, నీ కోసమె నే జీవించునది. ముందులో రాజేశ్వరరావునే మ్యూజిక్‌ డైరక్టర్‌ అనుకున్నారు. నాలుగు పాటలు కంపోజ్‌ చేశాక ఏదో పేచీ వచ్చినట్టుంది. ఆయన్ని తీసేసి ఘంటసాలను పెట్టుకున్నారు. ఆర్కస్ట్రయిజేషనూ, రికార్డింగూ అన్నిటికీ ఘంటసాలే! మిస్సమ్మలో రామారావు, నాగేశ్వరరావు కలిసి నటించారు. నాగేశ్వరరావుకి ఒక్క పాటా లేదు. మళ్లీ మాయాబజారులోనూ కలిసి నటించారు. ఇందులో రామారావుకి ఒక్క పాటా లేదు. అయినా వాల్‌ పోస్టర్లమీద అంతటా రామారావే! అదీ కృష్ణగారడీ! దీని తర్వాత మళ్లీ ఐదేళ్లపాటు అంటే గుండమ్మకథ 1962లో విడుదల అయ్యేదాకా వాళ్లిద్దరూ కలిసి నటించలేదు. మాయాబజారులో ఘంటసాల హీరో నాగేశ్వరరావుకే కాదు, రేలంగికి కూడా పాడారు. నాగేశ్వరరావు హీరోయిజం ఈ సినిమాలో అంతగా తెలియదు. ఘటోత్కచుడు అతన్ని హైహై బాలకా అన్నట్టుగానే ఉంటుంది. ఆలోచించి చూడండి. ఘటోత్కచుడు శశిరేఖను దొంగిలించి తేగానే ప్రేక్షకుడికి హీరోహీరోయిన్‌ల గురించి ఉత్కంఠ పోయింది. హీరోయిన్‌ హీరో గూట్లోనే ఉంది. పెళ్లి జరక్క ఛస్తుందా? ఆ తర్వాత కథ నడిపించినదంతా అద్భుతరసం, హాస్యరసం. పాత్రల పరంగా చెప్పాలంటే చిన్నమయ అండ్‌ గ్యాంగ్‌. అందుకే సినిమా పేరు చెప్పగానే మాటిమాటికీ గుర్తుకు వచ్చేది - మాయా శశిరేఖ, ఘటోత్కచుడు, లక్ష్మణకుమారుడు,  చిన్నమయ, లంబు జంబు, శర్మ, శాస్త్రి. అండ్‌ అఫ్‌కోర్స్‌ కృష్ణుడు. సినిమా పాటలు ఇంత తేలిక పదాలతో కూడా రాయవచ్చా? అనిపించేట్లా పింగళి పాటలు రాశారు. పరికించి చూడండి మాటలు సింపుల్‌గా ఉంటాయి. భావాలు ప్రౌఢంగా ఉంటాయి. పింగళి తన పాండిత్యాన్ని ఒలకబోయకుండా మామూలు జనం కూడా పాడుకునేట్లా చేశారు. అందుకే మాయాబజారు పాటల మకుటాలన్నీ తర్వాతతర్వాత సినిమా పేర్లగా వచ్చేశాయి.
ఇవి మాయాబజార్‌కు సంబంధించిన కొన్ని విశేషాలు మాత్రమే! (సమాప్తం)
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
mbsprasad@gmail.com