ఏ ఒక్క వ్యక్తీ యీ విశాలదేశాన్ని ఒంటి చేత్తో బాగుపరచలేడని, దిశానిర్దేశం మాత్రమే చేయగలడని, చేయవలసినదంతా ప్రజలు, వారికి సన్నిహితంగా వుండే నాయకులు అని వీరు గుర్తించటం లేదు. మోదీకి ఓటేసి జై కొట్టాం కాబట్టి అతనే అన్నీ చేసేస్తాడని గుడ్డిగా నమ్ముతున్నారు. వీళ్లంతా రేపు ఆశాభంగం చెందుతారే అని నా దిగులు. ఉపయెన్నికల ఫలితాలపై విశ్లేషిస్తూ శేఖర్ గుప్తా ''ఇండియా టుడే''లో చక్కటి వ్యాసం రాశారు. ''నేను ఒకసారి బుద్ధదేవ్ భట్టాచార్యను ఇంటర్వ్యూ చేశాను. 'ఒక కమ్యూనిస్టు ముఖ్యమంత్రిగా వుంటూ ఆర్థిక సంస్కరణలను ఎలా అమలు చేస్తున్నారు' అని అడిగాను. ఆయన కాస్త ఆగి 'మా కమ్యూనిస్టు సిద్ధాంతాలు అమలు చేయడానికి మాదేమీ స్వతంత్ర దేశం కాదు. జాతీయ వ్యవస్థలో భాగంగా, రాజ్యాంగానికి లోబడే పని చేస్తూ మేము మాదైన ముద్ర వేయగలుగుతామంతే.' అన్నాడు. ఈ పాఠాన్ని మోదీ, బిజెపి నేర్చుకోవాలి. వాళ్లు మొత్తం వ్యవస్థను తలకిందులు చేసి తిరగతోడేద్దామంటే కుదరదు. ఉన్న వ్యవస్థలోనే కాస్తకాస్త మార్పు తీసుకురాగలరంతే అని అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారతాయి కానీ వ్యవస్థ (రెజీమ్) మారదు. పార్లమెంటు ఎన్నికలలో వచ్చిన ఘనవిజయంతో దాన్ని హార్డ్‌కోర్ హిందూత్వకు ఓటుగా పొరబడిన బిజెపి మొత్తం వ్యవస్థనే మార్చేయగలనని ఆశపెట్టుకుంది. కానీ రాజకీయంగా అది తెచ్చే మార్పుకు ఎలాటి పరిమితులున్నాయో ఉపయెన్నికలు చాటి చెప్పాయి. అభివృద్ధి నినాదానికి వచ్చిన స్పందన లవ్ జిహాద్‌కు రాలేదు.'' అన్నాడు.
అవినీతిరహిత భారత్ గురించి మోదీ ఎన్ని కబుర్లు చెప్పినా, రాజకీయ అవసరాలు అవినీతితో రాజీపడేట్లు చేస్తాయి. ఎడ్యూరప్పను పార్టీలోకి తీసుకోవడంతోనే అది తెలిసింది. భాగస్వామి పక్షాలే కాదు, బిజెపి నాయకులందరూ పులుకడిగిన ముత్యాలు కారని ఎన్నోసార్లు తేలింది. వ్యవస్థతో రాజీ పడుతూనే పయనం సాగించాలి. అది ఏ మేరకు, ఎంత వేగంగా సాగుతుందనేది వేచి చూడాలి. అవినీతి సహించను అంటూ ఎన్టీయార్ చెలరేగిపోతే ఆయన పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేసి దింపేశారు. నాదెండ్ల చేసిన తిరుగుబాటు విఫలం కాగా, చంద్రబాబు చేసిన తిరుగుబాటు సఫలమైంది. ఎన్టీయార్‌కు రాజకీయాలు కొత్త కాబట్టి అలా జరిగింది. మోదీ చిన్నప్పటినుండి రాజకీయాల్లో ఆరితేరిన దిట్ట, అలా జరగనీయడు. ప్రస్తుతం తన యిమేజి బిల్డప్ పనిలో వున్నాడు.
గతంలో ఇందిరా గాంధీ యిదే పనిలో వుండేది. మీడియాలో, బ్యూరాక్రసీలో వున్న వామపక్ష మేధావులను, యంగ్‌టర్క్‌ల పేరుతో వుండే కాంగ్రెసులోని సోషలిస్టు భావాల యువకులను చేరదీసి వారిచేత తను అభివృద్ధి కాముకురాలిగా, తనను వ్యతిరేకించే మొరార్జీ దేశాయ్, కామరాజ్, అతుల్య ఘోష్, ఎస్ కె పాటిల్, నిజలింగప్ప (వీరందరినీ కలిపి సిండికేట్ అనేవారు) అభివృద్ధి నిరోధకులుగా ప్రచారం చేయించి తను పార్టీని కైవసం చేసుకుంది. వీరందరినీ రాజకీయంగా నిర్మూలించాక తన నిజస్వరూపం చూపించి నియంతగా మారింది. అప్పటిదాకా కాంగ్రెసు పార్టీ అధ్యకక్షుడికి కూడా ప్రధానమంత్రికి వున్నంత విలువ వుండేది. ఇందిర హయాం వచ్చాక పార్టీ ప్రభుత్వానికి వూడిగం చేసింది. కొంతకాలం రెండు పదవులూ ఆమెయే నిర్వహించింది. 'ఇందిరే ఇండియా, ఇండియాయే ఇందిర' అనే నినాదం యివ్వనివాడు తనకు, పార్టీకి ద్రోహం చేసినట్లే అనే భావనతో వుండేది. ఇప్పుడు మోదీ 1967 నాటి ఇందిర విధానాలను అవలంబిస్తున్నారు. గుజరాత్లో వుండగా మోదీ ఏకచ్ఛత్రాధిపత్యంతో పార్టీని, ప్రభుత్వాన్ని శాసించారు. అధికారులను నమ్మినంతగా యితర మంత్రులను నమ్మలేదు. గుజరాత్లో ఏం జరిగినా మోదీ పేరే తీసుకుంటున్నారు తప్ప, వేరే ఎవరి పేరూ పైకి రాలేదు. అమిత్ షా ద్వారానే అందర్నీ అదుపులో పెట్టారు.
ఇప్పుడు ఢిల్లీకి వచ్చాక అదే ఫార్ములా వుపయోగిస్తున్నారు. ప్రభుత్వంలో ఏ మంత్రి తన శాఖలో తనకు నచ్చిన అధికారిని వేసుకునే వెసులుబాటు లేదు. పిఎంఓ ఎవరిని చెపితే వాళ్లని తీసుకోవలసినదే. పార్టీలో యితర నాయకులందర్ని స్థాయి దింపేసి, పక్కన పడేశారు. 1990ల్లో పార్టీ ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది – 'భాజపా కే తీన్ ధరోహార్, అటల్, ఆడ్వాణీ, మురళీ మనోహ్ా' అని. ఇప్పుడు ఆ ముగ్గురూ మూలన పడ్డారు. వాజపేయికి ఆరోగ్యం బాగా లేదు, వదిలేయండి. ఆడ్వాణీకి వయసు మీదపడినా శారీరకంగా కాని, మానసికంగా కాని దృఢంగా వున్నారు. కానీ ఆయన్ను, మురళీ మనోహర్ జోషిని పార్లమెంటరీ బోర్డు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నుండి తప్పించి 'మార్గదర్శక్ మండలి' అని కొత్తగా ఏర్పాటు చేసిన మండలిలో చేర్చారు. పార్టీ రాజ్యాంగంలో ఆ మండలికి చోటు లేదు. దానికి అధికారమూ లేదు, చెపితే వినేవాడూ లేడు, వినకపోతే వీళ్లు చేసేదీ లేదు.
ఆడ్వాణీ, వాజపేయి యిద్దరూ జనసంఘ్‌లో పనిచేశారు. జనతా పార్టీలో సహచరులుగా చేశారు. జనతా పార్టీ నుండి బయటకు వచ్చి బిజెపి పార్టీ పెట్టారు. 1984లో 2 సీట్లు మాత్రమే తెచ్చుకుని డీలా పడినప్పుడు ఆడ్వాణీ వాజపేయి నీడలోంచి బయటకు వచ్చి ఆయన ఉదార విధానాలను పక్కకు పెట్టి, ఆరెస్సెస్ విధానాలను తలకెత్తుకున్నాడు. 1986లో పార్టీ అధ్యకక్షుడై హిందూత్వ విధానాన్ని తీవ్రంగా ముందుకు తీసుకుని వెళ్లాడు. 1990లో రథయాత్ర నిర్వహించడంతో ఆడ్వాణీకి వాజపేయి కంటె ఎక్కువ పాప్యులారిటీ వచ్చింది. అయినా దేశవ్యాప్తంగా వాజపేయికున్న ఆమోదయోగ్యత తనకు లేదని గ్రహించిన ఆడ్వాణీ బిజెపి అధికారంలోకి వస్తే వాజపేయియే ప్రధాని అని ప్రకటించి పార్టీలో చీలిక రాకుండా చూసుకున్నాడు. 1991లో అధ్యకక్షుడైన మురళీ మనోహర్ జోషిది కూడా ఆడ్వాణీ విధానమే. ఆయనా ఏక్తా యాత్ర చేశాడు. అయితే వీళ్లిద్దరూ యిప్పుడు మోదీ రథం కింద నలిగి పచ్చడయ్యారు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2014)