పాపులర్ సినిమా పేర్లు టీవీ సీరియళ్లకు యధేచ్ఛగా వాడుకుంటారు. సులువుగా జనాల్లోకి వెళ్లిపోతాయని.
మాంచి సినిమా ట్యూన్లతో దేవుళ్ల భజన పాటలు కడతారు.. పాడడానకి ఆసక్తికరంగా వుంటుందని.
పిల్లల నోటు పుస్తకాలకు సినిమా బొమ్మల అట్టలుగా వేస్తారు. కుర్రాళ్లు అభిమానంతో కొనుక్కుంటారని
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది అచ్చంగా ఇదే టైపు వ్యవహారం.
మోడీ..మేక్ ఇన్ ఇండియా అంటే…ఈయన మేక్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ అంటారు.
మోడీ స్వఛ్ భారత్ అంటే ఇక్కడ స్వఛ్ ఆంధ్రప్రదేశ్
అక్కడ స్మార్ట్ సిటీ అంటే ఇక్కడ స్మార్ట్ సిటీ
ఇలా అక్కడ ఏది క్యాచీగా వెలువడడం భయం.. ఈయన ఇక్కడ టక్కున క్యాచ్ పట్టేస్తారు. చటుక్కున వాడేస్తారు. జనాల్లోకి తేవడానికి ఆయన అను‘కుల’ మీడియా ఎలాగూ వుండనే వుంది.
కానీ.. అసలు మోడీ క్యారెక్టర్ మర్మం మాత్రం చంద్రబాబు పట్టుకోలేదు. ఒక వేళ పట్టినా, పసికట్టినా కూడా ఆయన వాడరు. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం బాబు స్టయిల్ వేరు కదా.
అసలు మోడీ స్టయిల్ ఏమిటి? బాబు పంథా ఏమిటి.. ఆలోచిస్తే.. హస్తిమశకాంతరంలా కనిపిసిస్తుంది. అంటే మరేమీ లేదు.. ఏనుగు సైజుకు, దోమ పరిమాణానికి వున్నంత తేడా కనిపిస్తుంది.
ఇటీవలి కాలంలో అధికారం అందిన తరువాత మోడీ అంత డిప్లమాటిక్‌గా, డిగ్నిఫైడ్ గా డెడికేటెడ్‌గా, వ్యవహరించిన వారు అరుదు. ఈ ఏంగిల్‌లో చూస్తే చంద్రబాబు వ్యవహారం చాలా చాలా చౌకబారుగా కనిపిస్తుంది. బాబు మంచి ఆడ్మినిస్ట్రేటర్ కావచ్చు.. మంచి వ్యూహకర్త కావచ్చు.. మంచి వ్యవహారశైలి కనబర్చవచ్చు.. విజయం దిశగా పార్టీని నడిపింగల దీక్షాదక్షత కలవాడు కావచ్చు..
కానీ..ఆదర్శవంతమైన రాజకీయాలు మాత్రం చేయరు.. చేయలేరు. అది వాస్తవం. చంద్రబాబులా పాలించాలి.. చంద్రబాబులా ఆలోచించాలి.. చంద్రబాబులా వ్యవహరించాలి అనిపించుకోవచ్చు. కానీ చౌకబారు రాజకీయాలు చేయడం, చౌకబారు ప్రచారం కోసం పాకులాడడం మాత్రం ఎవరికీ నచ్చని వైనం.
మోడీ గుజరాత్‌ను చూడండి.. అక్కడ ప్రగతిని చూడండి.. అంటే అని వుండొచ్చు.. కానీ ఏ నాడూ ఇదంతా నా చలవే.. నేనే చేసాను.. మరెరూ సాధించలేదు అని పొరపాటున కూడా అనలేదు. మోడీ గుజరాత్ అభివృద్ధిని తన ఎదుగుదలకు వాడుకుని వుండొచ్చు.. ఎన్నికలకు ముందు మీడియాను మేనేజ్ చేసి వుండొచ్చు. అయితే ఒక సారి ప్రధాని పదవి అందగానే ఆయన చాలా కూల్‌గా మారిపోయారు. ఆయనను భుజాన ఎత్తుకుని మోసిన మీడియా కూడా మళ్లీ తన రెగ్యులర్ వ్యవహారాల్లో మునిగిపోయింది.
ఉపఎన్నికల్లో భాజపా ఓటనిని మొహమాటం లేకుండా ఎత్తి చూపింది. మోడీ కూడా తాను ఒక్కసారి సైలెంట్ అయిపోతే, ఉవ్వెత్తున లేచిన కెరటం కిందకు జారిపోయినట్లు అవుతుందని, కొంతమంది జనమైనా దీన్ని చూసి, తన సత్తా ఇంతేనా అని అనుకుంటారని వెరవలేదు. తన కొత్త కూల్ ఫంథాలోనే ముందుకు వెళ్తున్నారు. అసలు విధాన పరమైన నిర్ణయాలను, కానీ వాటి అర్థాలు, పరమార్థాలు కానీ ఆయనేమీ భాజా భజంత్రీలు పెట్టి వాయించడం లేదు. ఇప్పటిదాకా ఆయన తీసుకున్న నిర్ణయాలు అనేకానేకం.
కానీ జనబాహుళ్యంలోకి వెళ్లినవి..ఆ మేరకు హడావుడి చేసినవి ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా..మేకిన్ ఇండియా..స్వఛ్ భారత్. కేవలం మూడే మూడు. ఓ ప్రధాని, అందునా భారత్ ను ప్రగతి బాట పట్టించాలని నవ్య దిశగా ఆలోచిస్తున్న వ్యక్తి మూడు నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలు ఇవేనా..కాదు అనేకానేకం వున్నాయి. కానీ ఆ హడావుడి మాత్రం మోడీ చేయలేదు. చిత్రంగా మోడీ మంత్రివర్గంలోని మిగిలిన మంత్రులు కూడా ఇదే రీతి వ్యవహార శైలిలో వున్నారు. మళ్లీ మన బాబుగారి ప్రియ మిత్రుడు వెంకయ్యనాయుడు తప్ప. ఢల్లీలో అకస్మాత్తుగా ఆఫీసు తనిఖీ చేయడం..తెలుగు మీడియాకు అవకాశం ఇవ్వడం..స్మార్ట్ సిటీలంటూ పలవరించడం..తెలుగు మీడియా మైకుల ముందు మాట్లాడడం. అంటే ఇది తను ఎంతలా పని చేస్తున్నానో అని చెప్పాలనే తహతహను సూచిస్తుంది. మోడీ చేయనది..బాబు లాంటివాళ్లు చేస్తున్నది ఇదే.
ఇక మోడీ చేస్తున్నది మరొకటి వుంది. ఎన్నికల అనంతరం ఇంతవరకు యుపిఎ పాలన గురించి కానీ, దాని నిర్ణయాల గురించి కానీ, దాని వైఫల్యాల గురించి కానీ, ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. యుపిఎ గడచిన పదేళ్లలో అలా చేసింది… ఇలా చేసింది..అని అనలేదు ఎక్కడా. అమెరికా వెళ్లి యుపిఎ మన సంబంధాలను గడచిన పదేళ్లలో దెబ్బ తీసింది అని పొరపాటున అనలేదు. సుప్రీంకోర్టు బొగ్గు గనుల ఒప్పందాలను రద్దు చేస్తే, ప్రభుత్వం చేసుకోండి మా ఏర్పాట్లు మేం చేసుకుంటాం అంది కానీ, ఆ మసిని మరోసారి యుపిఎ కు అంటించే పని మొదలు పెట్టలేదు. అసలు యుపిఎ పాలన జరిగింది, ఇప్పుడు మేం వచ్చాం అన్న స్పహ లేనట్లే వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అంతే కానీ, ఇంకా యుపిఎని తిట్టుకుంటూ కాలక్షేపం చేయడం లేదు. ఎందుకంటే అక్కడ తన పని తాను చేస్తోంది కాబట్టి. పని చేయకుండా కబుర్లు చెప్పడం లేదు కాబట్టి. అలా చెప్పాలంటేనే యుపిఎ వ్యవహారాలు నోటినిండా నింపేసుకోవాలి కాబట్టి.
ఇక మన చంద్రబాబు గారి వ్యవహారాలు చూద్దాం.
అధికారం సాధించిన నాటి నుంచి ఈనాటి వరకు ఆయన గడచిన పదేళ్ల పాలనను జనాలకు గుర్తు చేస్తూనే వున్నారు. పదే పదే పలవరిస్తూనే వున్నారు. వాటిప శ్వేతపత్రాలు అన్నారు. పోనీ అక్కడితో ఆగిందా..అబ్బే..గుడికి వెళ్తే..నా పాలనలో ఈ గుడి ఇలా వుండేది..గడచిన పదేళ్లలో ఇలా భ్రష్టు పట్టించారు..బడికి వెళ్తే…నా పాలనలో ఈ బడి ఇలా వుండేది..గడచిన పదేళ్లలో ఇలా భ్రష్టు పట్టించారు అనడం. అధికారం లోకి వచ్చినది మొదలు ఈ రోజు వరకు ఒక్కసారైనా గడచిన పదేళ్ల పాలన గురించి ప్రస్తావించని రోజు వుందా? ప్రతి క్షణం, ప్రతి చోటా..నేను అన్ని అద్భుతాలు చేశాను. ఇన్ని అద్భుతాలు చేసాను..వాళ్లు అలా తగులబెట్టారు..ఇలా తగుల బెట్టారు..అదే చర్విత చరణం. పాడిరదే పాడడం..చెప్పిందే చెప్పడం..
ఇక మరో ముచ్చట కూడా వుంది. తెలంగాణ విడిపోయింది..వాళ్ల పాలన వాళ్లు చేసుకుంటున్నారు. ఇక్కడ ఈయన పాలన ఈయన సాగించాలి. ఇక్కడ ఈయన సైబరాబాద్ లే కడతారో, మలేషియా, సింగపూర్ లే కడతారో ఆయన ఇష్టం. కానీ ఇప్పటికీ హైదరాబాద్ నేనే కట్టా..దాన్ని నేనే పెంచి పోషించా..నేనే అభివృద్ధి చేసా..నేను ఇంతటి మొనగాణ్ణి..అంతటి మొనగాణ్ణి.
ఎందుకిలా? మనం చేసింది జనం గుర్తించి చెప్పాలి. వాళ్లు గుర్తిస్తే మరిచిపోరు. వాళ్లే పది తరాల పాటు చెప్పుకుంటారు. రెండురూపాయిల కిలో బియ్యం అంటే ఎన్టీఆరే గా గుర్తుకొచ్చేది. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ కదా గుర్తుకు వచ్చేది. అలాగే హైదరాబాద్ ఫ్లయ్ ఓవర్లంటే బాబే కదా గుర్తుకు వచ్చేది. ఈ ఆలోచన మాని పరనింద..ఆత్మస్తుతి అన్నదాన్నే పట్టుకు వేలాడుతున్నారు చంద్రబాబు.
సమయం దొరికితే చాలు నేను ఇలా చేసా..వాళ్లు అలా పాడు చేసారు..ఇదే పాట. చిత్రంగా మంత్రులు కూడా ఇదే తరహా పాట మరోలా పాడుతున్నారు. వాళ్లు ఓ పక్క కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన వాటిని ప్రారంభిస్తూనే ఆ పార్టీ పాలనను తిడుతున్నారు. ఇప్పటికిప్పుడు వాళ్లేం ఈ పనులు ప్రారంభించేసి పూర్తి చేయలేదు కదా. మరి ఈ మాటలెందుకు.
మంత్రులు, బాబు వ్యవహారం అలా వుంటే పార్టీ నాయకుల వ్యవహారం ఇంకోలా వుంది. వాళ్లకు జగన్ అంటే సింహస్వప్నం. ఏం జరగనీండి వాళ్లకు జగన్ గుర్తుకు వచ్చేస్తాడు. అమెరికాలోనో, ఇంకెక్కడో అవినీతి తీర్పు వచ్చినా కూడా..‘చూసారా,..ఇక జగన్ కు కూడా శిక్ష గ్యారంటీ’ అని అనేయడం అలవాటైపోయింది. అసెంబ్లీ సెషన్ అంటే జగన్ కేసులు.. రుణమాఫీ అంటే జగన్ కేసులు…ప్రజా సమస్యలు అంటే జగన్ కేసులు..ఇదే పలవరింత పార్టీ నాయకులకు. ప్రజా సమస్యలు ఎవరూ ప్రస్తావించకూడదు. ప్రస్తావిస్తే ముందు వాళ్ల లొసుగులు ఏమిటి? అన్నదే ఆలోచన. ‘మీలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి..ఏ లోపం లేని వారు ఎవరో చూపండి’ అని వెనకటికి పాట వుంది. దాని వెనుక ఓ కథ వుంది. అలాంటి వాళ్లే రాయి వేయాలని. అందువల్ల ఏ పాపం చేయని పరిశుద్ధులు మాత్రమే బాబు పాలనను ఎత్తి చూపాలి. అలాంటి వారు మాత్రమే బాబు పాలనపై మాట్లాడేందుకు అర్హులు. కానీ ఆయన, ఆయన తాబేదార్లు మాత్రం తమ చిత్తానికి ఎదుటివారిపై విరుచుకుపడుతూనే వుంటారు. స్వకుచమర్దనం చేసుకుంటూనే వుంటారు. దానికి మాత్రం వారికే లైసెన్సులు అక్కరలేదు.
ఇక్కడ మరో చిత్రం ఏమిటంటే మోడీ మాదిరిగా బాబు మారనట్లు గానే, జాతీయ మీడియా మారినట్లు మన మీడియా మారలేదు. మన మీడియా అంటే బాబు కుడిఎడమల డప్పు, డోలు పట్టుకుని వుండే మీడియా. బాబు ఇలా అనడం భయం..మర్నాడు పతాక శీర్షికలో అదే మాట. అంతే కానీ ఎన్నికలు అయిపోయాయి..తమ ఆగర్భశతృవు…తాము ఎంత కిందకు దిగజారిపోయినా ఫరవాలేదు..మీడియా విలువలు మంటగలిసిపోయినా ఫరవాలేదు అనుకునే ‘జగనాసురుడి’కి అధికారం అందకూడదు అనుకుని, ఎంత చేయాలో అంతా చేసారు. అనుకున్నది సాధించారు. ఇకనైనా మీడియాగా ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలు చూడడం, గెలిచిన ప్రభుత్వం చేస్తున్నదేమిటి? చేయనిది ఏమిటి? మాటల కోటలేనా? పనుల వ్యవహారాలు ఏమన్నా వున్నాయా? ఇలాంటివి అన్నీ ఆలోచించరేమిటి?
పేర్లు పథకాలు అనుసరించడం కాపీ కొట్టడం కాదు..ఎదుటివాళ్ల మంచి ప్రవర్తన చూసి కూడా మారొచ్చు..ఆచరించవచ్చు..
చాణక్య