పరిస్థితులు చూస్తుంటే భయమేస్తోంది: సాయి కొర్రపాటితో చిట్ చాట్

ఏడాదిలో మూడో సినిమా..చాలా స్పీడుగా వున్నట్లున్నారు.? Advertisement అదేం లేదండీ..అలా కుదిరిందంతే. అయితే ఒకటి లెజెండ్, ఊహలు గుసగులలాడే..రెండు హిట్ లు. మీ అందరి సహకారం, భగవంతుడి దయతో 'దిక్కులు చూడకు రామయ్యా' కూడా…

ఏడాదిలో మూడో సినిమా..చాలా స్పీడుగా వున్నట్లున్నారు.?

అదేం లేదండీ..అలా కుదిరిందంతే. అయితే ఒకటి లెజెండ్, ఊహలు గుసగులలాడే..రెండు హిట్ లు. మీ అందరి సహకారం, భగవంతుడి దయతో 'దిక్కులు చూడకు రామయ్యా' కూడా జనానికి నచ్చితే ఒకే ఏడాది మూడు హిట్ లు ఇచ్చిన క్రెడట్ దక్కుతుంది.

సినిమాలు హిట్ అయితే నిర్మాత హ్యాపీయే నంటారా?

మీ భావం అర్థమైంది. ఇవ్వాళ టాలీవుడ్ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అన్ని రంగాల వారు, అంటే వెబ్ సైట్లు, టీవీ, ప్రింట్, నిర్మాతలు, నటులు అందరూ కలిసి కూర్చుని చర్చించి, ఏదో ఒకటి చేయకుంటే భయానక పరిస్థితులు వస్తాయని భయంగా వుంది.

దీనికి కారణం మీరు అంటే పెద్ద సినిమాల నిర్మాతలు కాదా?

ఒక విధంగా నిజమే. మనకు కథలు లేవాండీ…పోటీలు పడి, కోట్లు పోసి కథలు తేవాలా? దర్శకుడికి పది పన్నెండు కోట్లు పారితోషికమా..అంత పారితోషికం తీసుకుని తీసే సినిమాలు ఎలా వుంటున్నాయి? అసలు ఈ రోజు వారీ పారితోషికాలేంటండీ..ఎక్కడా దీనికి అడ్డుకట్ట పడదా? 

మీరు బయ్యర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్. మరి ఎక్కడ సమస్య వుందో గ్రహించలేదా?

అన్ని చోట్లా వుందండి. అందుకే అందరూ కలిసి కూర్చోవాలి అంటున్నా..ఒక్కరి వల్ల,ఒక్క రంగం వల్ల అయ్యే పని కాదు. ఓ పక్క శాటిలైట్ ఆదాయం పడిపోయింది. కానీ మరోపక్క టీవీ ప్రకటనల రేట్లు పెంచేసారు. ఎలా? పైగా చానెళ్లు అన్నీ సినిమాలను వాడుకుంటాయి. సీరియళ్లలో పాటలు, న్యూస్ బ్యాక్ డ్రాప్ లో పాటలు, కార్యక్రమాల్లో పాటలు, సాఫ్ట్ వేర్ అంతా వాడుకుంటాయి. కానీ ప్రకటనల ధరలు మామూలే.

పబ్లిసిటీ మీదే ఎక్కువ మాట్లాడుతున్నారు.?

తప్పదండీ. ఊహలు గుసగుసలాడే నిర్మాణానికి ఎంత ఖర్చయిందో, ప్రచారానికి అంతకు అంతా ఖర్చయింది. హిట్ అయింది కాబట్టి ఓకె.

ఫైనాన్స్ సమస్యల కూడా వున్నాయి కదా.?

అవును. నాకు అవసరమైతే ఓ కోటి రూపాయిల వరకు సర్దుబాటు చేయగల మిత్రులున్నారు. పెద్ద బ్యానర్, పెద్ద నిర్మాత అని ఇస్తారు. మరి చిన్న నిర్మాతల పరిస్థితి ఏమిటి? నాలుగు కోట్లలో సినిమా తీస్తే, కోటిన్నర వడ్డీలు వేసుకోవాల్సి వస్తోంది.

డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు కొనవంటున్నారట.?

నిజమే. కావాలంటే ఆడించి పెడతాం..కొనమని అడక్కండి అనే పరిస్థితి వచ్చింది. వందల కోట్లు పోయాయి గడచిన నెలన్నరలో. 

ఇటీవల ఈ విషయాల మీదే చాంబర్ మీటింగ్ అయిది,. వెళ్లారా..?

అవును విన్నాను. ఒక్క మీటింగ్ చాలదు..ఇంకా జరగాలి. పారితోషికాలకు ఎక్కడో దగ్గర బ్రేక్ వుండాలి. నిర్మాత బతికితేనే పరిశ్రమ బతుకుతుందన్న వైనం ప్రతి విభాగం గుర్తించాలి. 

దిక్కులు చూడకు రామయ్యా..ఎలా వుంటుందీ సినిమా.?

నా సినిమా నాకు బానే వుంటుంది.కానీ జనానికి కూడా బాగుంటుందని కచ్చితంగా చెప్పగలను. మరో బొమ్మరిల్లు స్థాయిలో వుంటుంది. అలా అలా అలా జోవియల్ గా సాగుతూ, చివర్న కాస్సేపు మనుషుల్ని, మనసుల్ని అలా నిలబెట్టేస్తుంది. 

ఇంక చిన్న సినిమాలేనా..పెద్ద సినిమాలు కూడా చేస్తారా.?

చిన్నసినిమా పెద్ద సినిమా అనేమీ లేదు. అన్నింటికి టెన్షన్. కష్టం ఒక్కటే. సినిమాలు చేస్తూ వుండాలన్నదే కోరిక

మోక్షజ్ఞ కోసం టైటిల్ రిజిస్టర్ చేసారని వార్తలు వినవస్తున్నాయి

మంచి టైటిల్ తట్టింది. చేసాను,. బాలయ్య బాబుకు నచ్చి ఓకె అంటే అంతకన్నా ఏం కావాలి. అంతకన్నా ఈ విషయంలో ఛెప్పడానికి ప్రస్తుతానికైతే ఏమీ లేదు.

కొత్త దర్శకులను ప్రోత్సహిస్తున్నారు..ఈ విధానం కొనసాగుతుందా

తప్పకుండా. మంచి ఫీల్ గుడ్ కథ, కథనాలతో ఎవరు వచ్చినా ప్రోత్సహించాలి. నేనే కాదు మరే నిర్మాతైనా కూడా. 

మీరు ప్రచారానికి కాస్త దూరంగా వుంటారెందుకు?

రేపు ఎలా వుంటుందో తెలియదు కనుక. మీకు తెలుసా నా ఫంక్షన్లకు కూడా నేను ముందు వరుసలో కూర్చోను. భయం. రేపు మళ్లీ కూర్చోగలనో లేదో అని. నిన్నటి రోజున భారీ సినిమాలు తీసి, ఇవ్వాళ మళ్లీ అనామకులై పోయిన నిర్మాతలను చూసి. అందుకే నా ఫంక్షన్లకు అలాంటి వారు వస్తే, వారిని ముందు సీట్లో కూర్చోపెడతా.

బాగా సెన్సిటివ్ అనుకుంటా మీరు.

యాభై వేల రూపాయిలతో ప్రారంభించాను. ఆ రోజు మరచిపోను. సెన్సిటివ్ అనుకంటే కావచ్చేమో?

నాగశౌరితో మరో సినిమా వుంటుందా? 

చూద్దాం..ఈ సినిమా జనానికి చేరువైన తరువాత. తప్పకుండా

బెస్టాఫ్ లక్

థాంక్యూ

చాణక్య

[email protected]