ఎమ్బీయస్‌ : పవన్‌కి ఛాన్సుందా? -2

పవన్‌ యీ డిప్లొమసీకి కారణం ఏమిటి? చిరంజీవి అభిమానులకు కోపం వస్తుంది అన్న భయమా? చిరంజీవి సినిమాల్లో నటించడం మానేశారు కాబట్టి, ఆయన అభిమానుల సంఖ్య తక్కువే అనుకోవడానికి లేదు. రామ్‌చరణ్‌ తేజ, అల్లు…

పవన్‌ యీ డిప్లొమసీకి కారణం ఏమిటి? చిరంజీవి అభిమానులకు కోపం వస్తుంది అన్న భయమా? చిరంజీవి సినిమాల్లో నటించడం మానేశారు కాబట్టి, ఆయన అభిమానుల సంఖ్య తక్కువే అనుకోవడానికి లేదు. రామ్‌చరణ్‌ తేజ, అల్లు అర్జున్‌ అభిమానులు కూడా అదే బ్యానర్‌లో కలిశారంటే చాలామందే అవుతారు. వారందరూ తనకు ఎదురుతిరగకుండా చూసుకోవడానికే పవన్‌ యీ మాటలగారడీ ప్రయోగించారనుకోవాలి. అర్జునుడికి దగ్గరుండి ద్రోణుడిచేత విలువిద్య నేర్పించినవాడు భీష్ముడు. అందుకని యుద్ధం ప్రారంభంలో అర్జునుడు ఆయన పాదాలకు నమస్కారబాణం వేశాడు. ఆ తర్వాత ఆయన గుండెల్లోకి వేశాడు. పవన్‌ ఏం చేయబోతాడో వేచి చూడాలి. 'పవన్‌కు ఫ్యామిలీ సపోర్టు లేదు, మేమంతా అన్నయ్య పక్షమే, ఆయన కారణంగానే మాకు సమాజంలో గుర్తింపు వచ్చింది.' అని నాగబాబు ఓ స్టేటుమెంటు యిచ్చి ఒక విధంగా పవన్‌కు ఉపకారం చేశారు. పవన్‌కు కావలసినది 'అందరివాడు' అన్న యిమేజి. కొణిదెల కుటుంబీకుడు, కాపు కులస్తుడు అంటూ పరిమితం చేసేస్తే నష్టపోతాడు. చిరంజీవి కారణంగానే తమ్ముళ్లకు తొలి గుర్తింపు రావడం వాస్తవం. అక్కడే ఆగిపోవాలని అనుకోవడం నాగబాబు దురదృష్టం. తప్పటడుగులు వేసేటప్పుడు కొడుకు తండ్రి వేలు పట్టుకుని నడవడం తప్పదు. కానీ ఎప్పటికీ కేరాఫ్‌ తండ్రిలాగే వుండాలని కొడుకూ అనుకోడు, తండ్రీ అనుకోడు. పెద్దయ్యాక కూడా అదే ధోరణిలో వుంటే పెంపకంలో లోపం అనుకుంటారు. కనీసం స్వతంత్రంగా ఆలోచించడం కూడా తండ్రి నేర్పలేదన్నమాట అని జాలిపడతారు. 

చిరంజీవిగారు పార్టీ పెట్టేందుకు ముందు నాగబాబు సమాజంలోని అనేక మేధావి వర్గాలతో సదస్సులు నిర్వహించి, చర్చలు జరిపి ఒక భూమిక ఏర్పరచారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టాక ఆ నివేదికలన్నీ మూలపడ్డాయనుకోండి కానీ నాగబాబుగారికి సమాజం పట్ల, రాజకీయాల పట్ల అవగాహన పెరిగి వుంటుందనుకున్నాను. అవగాహన వుంటే ఆలోచన పుడుతుంది. అలా పుట్టిన ఆలోచనను చంపేసుకుని, తన ఆలోచన అన్నగారి ఆలోచనలాగే వుండి తీరాలని ఫిక్సయిపోతే యిక యీయన బుర్రను శ్రమ పెట్టి ఆలోచించడం వేస్టు. తనలా పవన్‌కూడా ఆలోచనలు చంపేసుకుని ఫీలై పోయి, వూరికిముందే 'మాకూ, పవన్‌కు పార్టీకి సంబంధం లేద'ని స్టేటుమెంటు యిచ్చేయడం యింకా వేస్టు. పవన్‌ ఆలోచనల్లో స్పష్టత లేదని, ఏం మాట్లాడాడో తనకైతే అర్థం కాలేదని చిరంజీవి విమర్శించడం రాజకీయాల రీత్యా అవసరం. లేకపోతే ఆయన పార్టీ వూరుకోదు. నాగబాబుకి అలాటి ఆవశ్యకత, అనివార్యత ఏమీ లేదు. తొందరపడి ముందే కూసిన కోయిలలా వుంది వ్యవహారం. పార్టీ పెట్టేముందు కుటుంబసభ్యులతో చర్చించలేదు అని పవన్‌ చెప్పేసి అందరికీ యిబ్బంది తప్పించారు. ఇలాటి సందర్భాల్లో 'అభిమానులే నా కుటుంబసభ్యులు' అని సినీతారలు గ్రాండ్‌గా చెప్పుకోవచ్చు. ఇలా అంటూనే వుంటారు కానీ తమ వారసులుగా కుటుంబసభ్యుల్ని తీసుకుని వస్తారు కానీ అభిమానులను కాదు.  అయినా అభిమానులు ఏమీ పట్టించుకోరు.

పవన్‌ సభకు ముందే చేసిన మరో విమర్శ – కాంగ్రెసు నాయకుడు వి హనుమంతరావు ప్రస్తావించిన మూడు పెళ్లిళ్ల ప్రస్తావన. సభ తర్వాత యితర కాంగ్రెసు నాయకులు 'భార్యకే న్యాయం చేయలేనివాడు సమాజానికి ఏం చేస్తాడు?' అంటూ మళ్లీ లేవనెత్తారు. వీటికి పవన్‌ తన ఉపన్యాసంలో సమాధానం చెప్పేశారు. కాంగ్రెసు నాయకులు వ్యక్తిగత విషయాల ప్రస్తావన చేయడం అనవసరం. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం నేరమైతే అదే నేరం చేసిన శశి థరూర్‌ను కేంద్రమంత్రి ఎలా చేశారు? వచ్చే ఎన్నికలలో తిరువనంతపురం నుండి టిక్కెట్టు ఎలా యిస్తున్నారు? పవన్‌ ఒకరి తర్వాత మరొకర్ని చేసుకున్నారు. మొదటి భార్య వుండగానే మరో భార్యను కట్టుకున్న ఎంపీ కాంగ్రెసు పార్టీలోనే వున్నారని అందరికీ తెలిసిన విషయం. రహస్యవ్యవహారాల గురించి మాట్లాడనక్కరలేదు. ఎన్‌ డి తివారి వ్యవహారం తెలిసినదే కదా, ఆయన ఎట్టకేలకు తన వివాహేతర సంబంధం ఒప్పుకున్నాడు కూడా. అలాటాయన్ని ఎన్నో సార్లు ముఖ్యమంత్రి చేసిన పార్టీ కాంగ్రెసు! పైగా గవర్నరు చేసి మన రాష్ట్రపు రాజభవన్‌లో పెడితే దాన్ని రాసలీలాభవన్‌గా చేశాడాయన. ఆయన వికారపు చేష్టలు యింటింటా టీవీల్లో జనాలు చూశారు. ఇలాటి నాయకుల్ని పెట్టుకుని కాంగ్రెసువారు యింకోర్ని అనడం దేనికి? 'ఇక కట్టుకున్న భార్యకు న్యాయం చేయలేని…' అనే వ్యాఖ్య గురించి చెప్పాలంటే – ప్రజాజీవితంలో వున్న ప్రతీ వ్యక్తి – స్త్రీకాని, పురుషుడు కాని – కుటుంబానికి న్యాయం చేయనట్లే! వారికి తగినంత సమయం కేటాయించనట్లే! వారికి కేటాయిస్తే ప్రజల్ని పలకరించడానికే సమయం చాలదు. టెన్‌ టు ఫైవ్‌ జాబ్‌లు చేసే మనబోటి వాళ్లు యిలాటి వ్యాఖ్యలు చేసినా ఫర్వాలేదు కానీ ప్రజా నాయకులు ఒకరిపై మరొకరు యిలా విమర్శించుకోవడం ఫన్నీగా వుంటుంది.

పవన్‌ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని బహిరంగంగా చర్చించడం వలన పడే ఓట్లు పడడం మానేస్తాయా? ప్రజలు యిలాటి విషయాల్లో అంత సెన్సిటివ్‌గా వుంటారని నాకు తోచదు. ఎన్టీయార్‌ ముదిమి వయసులో లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నందుకు ప్రజలు ఏవగించుకుంటారని చంద్రబాబుతో సహా టిడిపి నాయకులందరూ భయపెట్టారు. ప్రజలు అలా అనుకోలేదు. శుబ్భరంగా ఓట్లేసి గెలిపించారు. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిథి శోభారాణి తనను విమర్శించిందన్న కోపంతో సినీనటి రోజా చిరంజీవి, పవన్‌లను ఉద్దేశించి ''మీరు ఎంతమందిని పడుక్కోబెట్టుకున్నారో లెక్కలు చెప్పండి' అంటూ పబ్లిగ్గా డిమాండ్‌ చేశారు. వీళ్లు లెక్కలేమీ చెప్పలేదు. అసలు పట్టించుకోలేదు. ప్రజలూ అడగలేదు. రేణూ దేశాయ్‌ను పెళ్లి చేసుకోకుండా ఆమెతో సహజీవనం చేస్తున్నావన్న రోజా వ్యాఖ్యలను మాత్రం పట్టించుకుని పవన్‌ రేణూని పెళ్లి చేసుకున్నాడు. ఫలితంగా విడాకులు యిచ్చినపుడు భారీగా భరణం యిచ్చుకోవాల్సి వచ్చింది. ఇంకో పెళ్లి చేసుకున్నందుకు మహిళా ఓటర్లు చీదరించుకుంటారు అని కాంగ్రెసు నాయకులు అనుకుంటే అది పొరబాటే. రాజకీయ ప్రత్యర్థులకు, మీడియాకు పట్టినంతగా ప్రజలకు యివి పట్టవు. గ్రంథసాంగులైన అనేకమంది రాజకీయనాయకులు ప్రజాజీవితంలో వెలుగుతూనే వచ్చారు. ఇక్కడే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా! ఆ వ్యవహారాలు వారి పాలనపై ప్రభావం చూపించినప్పుడే ప్రజలు రియాక్టవుతారు. లేకపోతే అవి వ్యక్తిగత బలహీనతలుగా పరిగణించి వూరుకుంటారు. ఇది గ్రహించి యిక దానిపై చర్చ మానేస్తే మంచిది.  (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2014)

[email protected]

Click Here For Part-1