అవిభక్త భారతదేశంగా వుండగా కమ్యూనిస్టులు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పంజాబ్, సింధు ప్రాంతాల్లో చురుకుగా పనిచేసేవారు. దేశం విడిపోయిన తర్వాత కలకత్తాలో 1948లో జరిగిన సమావేశంలో పాకిస్తాన్‌కై వేరే పార్టీ యూనిట్ వుండాలని నిర్ణయించారు. 65 ఏళ్ల తర్వాత దాని పరిస్థితి ఏమిటి అని చూడబోతే నిరాశ కలుగుతుంది. పాకిస్తాన్ ఆవిర్భవించిన తొలి సంవత్సరాలలో ఇండియాలో లాగానే అక్కడా వామపక్ష విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, యితర సంస్థలు, పార్టీలు అన్నీ వుండేవి. అవి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కొన్ని సంస్కరణలు కూడా చేయించాయి. అయితే 1954లో కమ్యూనిస్టు పార్టీని, దాని అనుబంధ సంస్థలన్నిటినీ ప్రభుత్వం నిషేధించింది. ఇక అప్పణ్నుంచి అవి చాటుమాటుగా పనిచేయసాగాయి. పోనుపోను పాకిస్తాన్‌లో మతానికి ప్రాధాన్యత పెరిగింది. కమ్యూనిస్టులు మతవ్యాప్తిని హర్షించరు కాబట్టి, మతం పరంగా రాజకీయాలు నడపరు కాబట్టి వారు వెనకబడిపోయారు. 1948లో 650 మంది పార్టీ కార్డ్ హోల్డర్లు వుండేవారు. తర్వాతి రోజుల్లో యువకులు పార్టీలో చేరడం తగ్గిపోయింది. పాకిస్తాన్ కాలేజీల్లో చేరేటప్పుడు 'నేను వ్యవస్థకు వ్యతిరేకంగా ఏ ఉద్యమంలోను పాల్గొనను' అని హామీపత్రం రాసి యివ్వాలి. ఏదైనా రాజకీయకార్యకలాపాల్లో పాల్గొంటే తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. అందువలన విద్యార్థులు రాజకీయాలకు దూరంగా వుండసాగారు.
వామపక్షవాదులు కళల ద్వారా తమ భావాలను వ్యాప్తి చేస్తూ మనుగడ సాగించారు. సింధు ప్రాంతంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ స్థాపించినపుడు వామపంథా అనుసరించేవారు ఆ పార్టీలో చేరారు. తీరా చూస్తే భుట్టో ఆ పార్టీ నాయకత్వాన్ని చేజిక్కించుకుని దేశాధినేత అయి, తర్వాతి రోజుల్లో నియంతగా మారాడు. పాకిస్తాన్‌ను నియంతలు లేదా సైన్యం పాలిస్తూ వచ్చారు. ప్రజాస్వామ్యం సరిగ్గా నెలకొనలేదు. కమ్యూనిస్టులు బలంగా వుండి వుంటే ఉద్యమాల ద్వారా నియంతృత్వాన్ని ఎదిరించేవారేమో. కానీ వారు రష్యా సమర్థకులుగా, చైనా సమర్థకులుగా విడిపోయి మరింత బలహీనపడ్డారు. రష్యా కుప్పకూలడంతో కమ్యూనిస్టులు మరింత దెబ్బ తిన్నారు. ఆ తర్వాత గ్లోబలైజేషన్ ప్రారంభమైంది. ఈ మార్కెట్ ఎకానమీ రోజుల్లో వారి సిద్ధాంతాలు పట్టించుకునేదెవరు? దానికి తోడు వారు సిద్ధాంతవైరుధ్యం అంటూ మూడు పార్టీలుగా చీలిపోయారు. 2012లో ఈ మూడు పార్టీలూ కలిసి అవామీ వర్కర్స్ పార్టీగా ఏర్పడ్డాయి. వచ్చే నెలలో వాళ్లు ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. అదెంతవరకు విజయవంతం అవుతుందో వేచి చూడాలి.
-ఎమ్బీయస్ ప్రసాద్