ఇక నాయకుల జయంతులు, వర్ధంతులకు సెలవు యివ్వడం గురించి ! సెలవు యివ్వడం కాని, విగ్రహం పెట్టడం కాని, కాలనీకి, రోడ్డుకి పేరు పెట్టడం కాని .. యివన్నీ జాతి వాళ్లను గుర్తు పెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు. అవి మితిమీరిన మాట వాస్తవం. అన్ని మతాలను బ్యాలన్స్ చేయాలని సెలవులు విపరీతంగా యిస్తున్నారు. పార్శీ నూతన సంవత్సరం రోజుని మనమేం జరుపుకుంటాం? ఓనమ్‌ను నార్త్ వాళ్లేం జరుపుకుంటారు? ఇలా సర్దేసి, దసరాకు ఒక్క రోజు మాత్రమే సెలవిస్తే తిట్టుకుంటాం. ఏడాదిలో పండగల లిస్టు ప్రకటించి వీటిలో మీకు కావలసిన పది రోజులు లేదా ఐదు రోజులు సెలవు తీసుకోవచ్చు అని చెప్పేస్తే చాలు – అని నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ అదేదో గొప్ప రిసెర్చి చేసి కనిపెట్టిన విషయంలా చాటుకోవడానికి, అన్నిటికంటె ముందుగా ముఖ్యమైన విషయంలా ప్రకటించడానికి మొహమాటపడతాను. కానీ జనసేనకు అది చాలా ప్రధానంగా కనబడింది. కానీయండి. పనిలో పనిగా సినిమా తారల పుట్టినరోజున ఫ్లెక్సీలు కట్టకూడదని, సినిమా మొదటి రోజు ప్రదర్శననాడు అభిమానులు యీలలేసి గోల చేసి సినిమా ప్రేక్షకులను డిస్టర్బ్ చేయకూడదని, అభిమాన హీరో సినిమా రిలీజు రోజున పొట్టేళ్లను బలి యివ్వకూడదని.. యిలా ఓ నాలుగు విషయాలు ప్రకటిస్తే దానిపై మనమందరం చర్చలు జరిపి, టీవీ ఛానెళ్లు ఒపీనియన్ పోల్ నిర్వహించి, నాబోటి వాడు నాలుగు కబుర్లు చెప్పుకుని.. యిదో కాలక్షేపం.
ఈ సెలవురోజుల గోల కంటె ముందు పవన్ తన వూహలు వ్యక్తం చేయవలసిన అంశాలు చాలా వున్నాయి. అన్నిటి కంటె ముందు కాంగ్రెసు పట్ల ఆయన వ్యవహరించే తీరు గురించి స్పష్టం చేయాలి. ఎందుకంటే ఆయన నేడో రేపో బిజెపి-టిడిపిలతో చేతులు కలపబోతున్నారని మీడియాలో గుప్పుమంటోంది. కాంగ్రెసు హటావో అన్న నినాదం యిచ్చినందుకే వాళ్లు యీయన్ని వాటేసుకుంటున్నారా? కాంగ్రెసు హటావో అంటే పవన్ దృష్టిలో సోనియా, రాహుల్ మాత్రమేనా? ఆయన గుండెల్లో నెలకొన్న అన్న చిరంజీవి కాంగ్రెసు మంత్రి, సీమాంధ్రలో కాంగ్రెసును సముద్ధరించడానికి కంకణం కట్టుకున్న ప్రచారకర్త. కాంగ్రెసును విడిచి వెళ్లినవాళ్లని నిందిస్తున్న పెద్దమనిషి. ఇక పవన్‌కు విపరీతంగా నచ్చేసిన తెలంగాణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కాంగ్రెసు ఎమ్మెల్యేనే. వీళ్లకు వ్యతిరేకంగా పవన్ ప్రచారం చేస్తారా? లేదా? కాంగ్రెసు నాయకులంతా ఇన్నాళ్లూ పార్టీలో వుండి, పదవులు అనుభవించి, సోనియాకు వంతపాడి, యిప్పుడు ప్రజాగ్రహానికి వెఱచి, పార్టీ వీడి టిడిపిలోకి వస్తున్నారు. టిడిపి పట్ల సానుభూతి చూపిస్తున్న.., వీలైతే పొత్తు కుదుర్చుకోబోతున్న పవన్ వీరి తరఫున ప్రచారం చేస్తారా? కాంగ్రెసును వీడి వచ్చారు కాబట్టి పునీతులై పోయారని చక్రాంకితులను చేస్తారా? కాంగ్రెసు ప్రభుత్వం పడిపోతే జగన్ అధికారంలోకి వచ్చే ప్రమాదం వస్తుందన్న భయంతో యిన్నాళ్లూ కాంగ్రెసు ప్రభుత్వానికి కొమ్ము కాసిన చంద్రబాబును పవన్ ఎలా మెచ్చుకుంటారు? మూడేళ్ల క్రితమే కాంగ్రెసు ప్రభుత్వం పడిపోయి వుంటే విభజన జరిగేది కాదేమో, ఆ ఛాన్సు లేకుండా చేసిన చంద్రబాబు పట్ల పవన్‌కు కోపం లేదా?
కాంగ్రెసుపై పవన్‌కు యింత ద్వేషం దేనికి అంటే అన్యాయంగా విభజించారు కాబట్టి అంటున్నారు. మరి ఆ విభజనకు దోహదపడినది బిజెపి కాదా? బిజెపి సహకారం లేనిదే లోకసభలో, రాజ్యసభలో కాంగ్రెసుకు అడుగు ముందుకు పడేదా? రాజ్యసభలో కంటితుడుపుగానైనా వెంకయ్య అడిగిన ప్రశ్నలు లోకసభలో సుష్మ ఎందుకు అడగలేదు? అసలు బిల్లే ప్రవేశపెట్టలేదని వాదించిన సుష్మ మర్నాటి కల్లా నోరు మూసుకుని కూర్చుందేం? ఆంధ్రకు మేలు చేసే ఒక్క సవరణ కూడా ఎందుకు ప్రతిపాదించలేదు? టీవీ ప్రసారాలు ఆపేసినా, ఆ విషయాన్ని ఆమె పార్టీ ఎంపీలు ఆమె దృష్టికి తెచ్చినా అభ్యంతర పెట్టలేదేం? రాజ్యసభలో వెంకయ్య గొప్పగా ప్రశ్నలు లేవనెత్తి సాధించినది ఏమిటి? బిల్లులో ఒక్క విషయం మార్పించగలిగారా? ప్రధాని నుండి ఒక ప్రకటన రాబట్టారంతే! అది కూడా 'బిజెపి వాళ్లు అడిగారని కాదు, సీమాంధ్ర మంత్రులు అఖరిక్షణంలో అడిగారు కాబట్టి మేమే చేయించాం' అని జైరాం చెపుతున్నారు. ఆ ప్రకటనకు పూచికపుల్లెత్తు విలువ లేదని అందరికీ తెలుసు. పోలవరం ఆర్డినెన్సు వెలువడదనీ తెలుసు. గ్రామాలు మండలాలుగా మార్చామన్నారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి జైరాం ప్రయత్నించి, డిజైన్ మార్చమంటున్నారు. డిజైన్ మార్చకపోతే చుక్క నీరు వదలమని కెసియార్ హుంకరిస్తున్నారు. థాబ్దాలుగా నిపుణులు చర్చించి చేసిన డిజైన్ మళ్లీ మార్చాలంటే అంటే కథ మొదటికి వచ్చినట్లే. దేశంలో ఏ ప్రాజెక్టూ కేంద్రం చేపట్టలేదు. ఇది ఒక్కటీ మాత్రం చేపడితే తక్కిన రాష్ట్రాలు వూరుకుంటాయా? ప్రత్యేక ప్రతిపత్తి యిస్తున్నామన్న ప్రకటనకే కారాలు, మిరియాలు నూరుతున్నాయి. అది కూడా హుళక్కే అని అందరికీ అర్థమవుతోంది.
రాబోయే రోజుల్లో ఆంధ్రకు అడుక్కుతినడం తప్ప వేరే గతి లేదని మెడకాయ మీద తలకాయ వున్నవాళ్లందరికీ అర్థమవుతోంది. ఉద్యోగుల జీతాలకే దిక్కు లేదు. మొదటి ఏడాది మాత్రం కేంద్రం ఆదుకుంటుందన్న హామీ యిచ్చింది. తర్వాతి సంవత్సరాలలో ఎలా? హైదరాబాదు ఆదాయంలో చిల్లిపైసా రాదు. 'ఇద్దామనుకున్నాం కానీ రాజ్యాంగంలో అలాటి వీలు లేదని వూరుకున్నాం' అంటాడు జైరాం. ఉమ్మడి రాజధాని రాజ్యాంగంలో వుందనే ప్రకటించారా? ఆర్టికల్ 3 రెసిడ్యువల్ యిస్యూస్‌లో దీన్ని కూడా బనాయించలేకపోయారా? మేం మాట యిచ్చాం కాబట్టి ఎలాటి అధ్వాన్నమైన బిల్లుకైనా మద్దతు యివ్వక తప్పదు అంటూ యిలాటి అన్యాయపు, అక్రమాల బిల్లుకు వంతపాడి తగుదునమ్మా అని ఓట్లడగడానికి వస్తున్న బిజెపితో పవన్ ఎలా పొత్తు పెట్టుకుంటారో, దాన్ని ఎలా సమర్థించుకోగలరో నాకైతే అర్థం కావటం లేదు. అసలు విభజనకు ఆజ్యం పోసింది టిడిపి కాదా? చిన్నారెడ్డి చేత వైయస్సార్ లేఖ యిప్పించారు కాబట్టే తెలంగాణ అంశం ప్రారంభమైందని కొందరు అంటూంటారు. అలా అయితే తెలంగాణ ప్రకటన రాగానే, విభజన బిల్లు పాస్ కాగానే తెలంగాణవాదులు వెళ్లి వైయస్సార్ విగ్రహానికి దండలు వేయాలిగా! వేశారా? తెలంగాణకై లేఖ యిచ్చిన చంద్రబాబుకీ మెప్పు లేదు. కానీ తేడా ఏమిటంటే – టి-కాంగ్రెసు వాళ్లు వైయస్సార్‌ను తలవటం లేదు, టి-టిడిపివారు బాబు వల్లనే వచ్చిందని చెప్పుకుంటున్నారు. నిజానికి సీమాంధ్ర టిడిపి ఎంపీ మోదుగులని బాదినది టి-టిడిపి ఎంపీలే కదా! ఇవన్నీ పవన్‌కు కనబడవా? ఎంపీలను తన్ని విభజించిన టిడిపితో పొత్తు ఎలా పెట్టుకుంటారు? అంటే పవన్‌కు కాంగ్రెసంటే గుడ్డి ద్వేషం తప్ప ఓ తర్కమూ, ఓ పద్ధతీ లేదన్నమాట. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2014)