Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ : రాజీవ్‌ హత్య - 65

ఆగస్టు 3 - పొద్దున్నే సిట్‌కు జగన్నాథన్‌ దొరికాడు. అతను తమిళ కార్యకర్త. ఎల్‌టిటిఇ కార్యకర్తలకు యిళ్లు యిప్పించే బాధ్యత చేపట్టాడు. ఇంకా ఎక్కడెక్కడ యిప్పించావో చెప్పు అని పోలీసులు సమాచారాన్ని కక్కించారు. మధ్యాహ్నానికల్లా ఇందిరా నగర్‌లోనే దోమలూరులో మరో రహస్య శిబిరం వున్నట్టు తేలింది. దాని మీద సిట్‌ నిఘా ప్రారంభమైంది. నాలుగు గంటలపాటు ఆ యింటికేసే చూస్తూ కూర్చున్నా అలికిడి లేదు. చీకటి పడే సమయంలో ఒక పదహారేళ్ల కుర్రాడు అటూయిటూ చూసుకుంటూ లోపలకి వెళుతున్నాడు. ఆ కాలనీలో దొంగల భయం వుంది. కాలనీవాసులు బ్యాచ్‌బ్యాచ్‌లుగా కాపలా కాస్తున్నారు. వీణ్ని చూసి దొంగ అనుకుని పట్టుకున్నారు. ఎవడ్రా అని అడుగుతూండగానే సిట్‌వాళ్లు చుట్టుముట్టేశారు. వాణ్ని అదుపులోకి తీసుకుని, యింట్లోకి చొరబడ్డారు. ఆ కుర్రాడి పేరు మిరేష్‌. గాయపడి చికిత్సకు వచ్చిన ఎల్‌టిటిఇ కార్యకర్త. ఆ యింట్లో ఎవరూ లేరు.

మిరేష్‌ పెద్ద యిబ్బంది పెట్టకుండా వున్నదంతా చెప్పేశాడు - 'నేనూ, మరికొందరం ఎల్‌టిటిఇ కార్యకర్తలం చికిత్సకోసం వచ్చాం. కానీ ఇందిరా నగర్‌ శిబిరంపై దాడి జరగడంతో సురేష్‌ మాస్టర్‌ ఆదేశాలతో అతని అసిస్టెంటు మూర్తి అందర్నీ వేరేవేరే చోట్లకి తరలించాడు. ముగ్గురు మహిళా కార్యకర్తల్ని ద్రవిడ కళగం నాయకురాలి యింట్లో పెట్టారు. మరో ఆరుగుర్ని ఆసుపత్రిలో పెట్టారు. నన్నూ, యింకా కొంతమందిని రాత్రిపూట బస్టాండ్లలో, పార్కుల్లో పడుక్కోవాలని చెప్పారు.' అని. 

'బాగానే వుంది. చికిత్స తీసుకోవడం నేరమేమీ కాదు, ఇందిరా నగర్‌ శిబిరంలో అరసన్‌, కులతన్‌లు లొంగిపోవచ్చుగా, సైనైడ్‌ మింగడం దేనికి?' అని అడిగారు సిట్‌వాళ్లు. ''మీరు పట్టుబడితే పోలీసులు శివరాజన్‌ గురించి అడుగుతారు. మీరు నోరు విప్పితే ప్రమాదం. అందువలన పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటారనిపిస్తే సైనైడ్‌ మింగేయండి. మీకు చికిత్స చేయిస్తున్నందుకు మీరు మాకు చేయవలసిన ప్రత్యుపకారం యిది.' అని తిరుచ్చి శంతన్‌ మాకు చెప్పాడు'' అన్నాడు మిరేష్‌. రాజీవ్‌ హత్యలో తమ పాత్ర బయటపడకూడదని ఎల్‌టిటిఇ ఎంత బలంగా ప్రయత్నిస్తోందో సిట్‌కు అర్థమైంది. ఇంతకీ శివరాజన్‌ ఏడి? అంటే మీరు 6 రోజుల క్రితం కోయంబత్తూరులో డిక్సన్‌ను పట్టుకున్నపుడు ఇందిరా నగర్‌ నుంచి దోమలూరు శిబిరానికి మారారు. నిన్న ఇందిరా నగర్‌ శిబిరం మీద దాడి చేసినపుడు నిన్న రాత్రే మూర్తి వాళ్లని వేరే చోటికి తరలించాడు అన్నాడు. 

సిట్‌కు మరో తీవ్ర ఆశాభంగం. వెంట్రుకవాసిలో శివరాజన్‌ తప్పిపోతున్నాడు.

ఆగస్టు 4 - మిరేష్‌ను వెంటపెట్టుకుని పార్కుల్లో, బస్టాండుల్లో తిరుగుతున్న ఎల్‌టిటిఇ కుర్రాళ్ల కోసం వెతికారు. అందరూ మాయమై పోయారు. 

xxxxxxxxxxxxxxxxx

''ఫ్రంట్‌లైన్‌'' తన ఆగస్టు 3 నాటి సంచికలో జులై 25న రాజ్యసభలో ఎస్‌ బి చవాన్‌ ప్రస్తావించిన విదేశీ శక్తులు ఏవై వుంటాయన్న దానిపై కథనం వేసింది. జయలలిత సిఐఏ హస్తాన్ని చూడగా చవాన్‌ ఆమెరికాను, దానికి సన్నిహితంగా వుండే ఇజ్రాయేల్‌ను శంకిస్తున్నారు. రాజీవ్‌ అంత్యక్రియలకు హాజరైన పిఎల్‌ఓ (పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌) అధినేత యాసర్‌ అరాఫత్‌ అప్పటి ప్రధాని చంథ్రేఖర్‌తో 'నేను రాజీవ్‌కు ఎప్పుడో చెప్పాను, నిన్ను హత్య చేయడానికి కొందరు పన్నాగం పన్నుతున్నారనీ, వారికి ఇజ్రాయేలు తర్ఫీదు యిస్తోందనీ' అని చెప్పారట. ఇజ్రాయేలు గూఢచారి సంస్థ మొసాద్‌లో కేసి ఆఫీసరుగా పని చేసి, 1985లో దానికి వ్యతిరేకిగా మారిన విక్టర్‌ ఆస్టోవ్‌స్కీ చాయ్‌రే హోయ్‌ అనే అతనితో కలిసి 1991లో ''బై వే ఆఫ్‌ డిసెప్షన్‌'' అనే పుస్తకం రాశాడు. దానిలో ఇజ్రాయేలు గూఢచారులు ప్రపంచవ్యాప్తంగా ఆడే నాటకాలను బహిర్గతం చేశాడు. శ్రీలంక గురించి చెపుతూ వాళ్లు శ్రీలంక సైన్యంతో, తమిళ టైగర్లతో యిద్దరితో వ్యాపారం చేస్తూ, ఆయుధాలు అమ్ముతూ, తర్ఫీదు యిస్తూ డబుల్‌ గేమ్‌ ఆడారని తెలిపాడు. అమీ యార్‌ అనే వీళ్ల బాస్‌ తీరప్రాంతాలలో గస్తీకి ఉపయోగపడే పిటి బోట్లను శ్రీలంక సైన్యానికి అమ్మాడు. అదే సమయంలో ఆ బోట్లను పేల్చివేయగల సరంజామాను తమిళ టైగర్లకు అమ్మారు. 

అస్టోవ్‌స్కీ తమిళ టైగర్లకు గెరిల్లా తర్ఫీదు యిస్తూండగానే అమీ యార్‌ పిలిచి 'శ్రీలంక సైన్యం నుంచి కూడా గెరిల్లా ట్రైయినింగ్‌కై వస్తున్నారు. వాళ్లని ఎయిర్‌పోర్టు వెనక తలుపు నుంచి బయటకు తీసుకెళ్లి వ్యాన్‌ ఎక్కించేయ్‌' అన్నాట్ట. క్ఫార్‌ సిర్కిన్‌ అనే చోట తమిళులకు, సింహళీయులకు ఏకకాలంలో తర్ఫీదు యిచ్చారట. విధ్వంసం ఎలా చేయాలో తమిళులకు, వాళ్లని ఎలా ఆపాలో సింహళులకు. వాళ్ల క్యాంపులు కొన్ని గజాల దూరంలో ఏర్పాటు చేసి ఒకరి గురించి మరొకరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారట. మూడు వారాలు గడిచేసరికి సింహళ వాళ్లని అట్లిట్‌ వద్ద వున్న టాప్‌ సీక్రెట్‌ కమాండో బేస్‌కు తరలిస్తూండగానే ఓ రోజు అమీ యార్‌ పిలిచి ''చూడు ఓ సమస్య వచ్చిపడింది. ఇండియా నుంచి 27 మంది స్వాట్‌ టీమువాళ్లు వస్తున్నారు. వాళ్లకీ ట్రైనింగ్‌ యివ్వాలట.'' అన్నాడు. ''బాబోయ్‌ వీళ్లూనా?'' అన్నాడు ఆస్టోవ్‌స్కీ. ''అవునూ వీళ్లకీ అవే టెక్నిక్కులు నేర్పాలి. తమిళులు ఖాళీ చేసిన బేస్‌ వుంది కదా అక్కడకి తోలేయ్‌..'' అన్నాడతను. ఇవన్నీ పుస్తకంలో వున్నాయట. ఈ తర్ఫీదుల సంగతి పసిగట్టిన అరాఫత్‌ రాజీవ్‌ను హెచ్చరించి వుంటాడు - అని ఫ్రంట్‌లైన్‌ కథనం.

ఆగస్టు 7 - రంగనాథ్‌ యింట్లో ఎక్కువ రోజులు వుండడం క్షేమం కాదనుకున్నాడు సురేష్‌ మాస్టర్‌. చుట్టుపక్కల వాటాల వాళ్లు చూస్తే ప్రమాదమనిపించింది. రంగనాథ్‌ని పట్టుకుని అనైకల్‌లో యింకో యిండిపెండెంటు యిల్లు అద్దెకు తీసుకున్నాడు. అక్కడకు రాత్రివేళ మారిపోయారు. అక్కడకు వెళ్లాక చూస్తే చాటుమాటు రాకపోకలకి అది వీలుగా లేదనిపించింది. 'బెంగుళూరు శివారుల్లో వున్న గ్రామాల్లో ఏవైనా యిండిపెండెంటు యిళ్లు చూడు. సినిమా షూటింగుకు కావలని చెప్పు. అద్దె ఎంతైనా యిస్తామను.' అని రంగనాథ్‌కు చెప్పాడు. ( సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌  (ఏప్రిల్‌ 2015)

mbsprasad@gmail.com

Click Here For Archives