Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సిద్దూ ఆశలు

ఎమ్బీయస్‌ : సిద్దూ ఆశలు

పంజాబ్‌ నుంచి తనను దూరంగా వుంచడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ నవజోత్‌ సిద్దూ బిజెపినుంచి బయటకు వచ్చినపుడు అతను ఆప్‌లో చేరతాడని చాలామంది వూహించారు. కానీ సిద్దూ దాని గురించి సమాధానమేమీ చెప్పలేదు - అప్పటికి బేరసారాలు సాగుతున్నాయి కాబట్టి! తర్వాత అరవింద్‌తో చర్చలు జరిగినపుడు తనను ముఖ్యమంత్రిగా ప్రకటించమని సిద్దూ కోరినట్లు సమాచారం. ఢిల్లీ ముఖ్యమంత్రిగా తన ఏ నిర్ణయమూ తీసుకోనీయకుండా బిజెపి చేతులూ, కాళ్లూ కట్టేస్తోంది కాబట్టి పంజాబ్‌ సిఎంగా వెళ్లి తన తడాఖా చూపిద్దామని అనుకుంటున్న అరవింద్‌కు యిది రుచించే ప్రతిపాదన కాదు. ఎన్నికలకు ముందే తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపుకుంటే, బయటి వ్యక్తి, పైగా పంజాబ్‌తో నిరంతరం ఘర్షణ పడే హరియాణాకు చెందినవాడు అనే కారణం చేత ఓట్లు పడవని భయం. అందువలన ముఖ్యమంత్రి ఎవరో చెప్పకుండా ఎన్నికలకు వెళదామని అరవింద్‌ ఐడియా కావచ్చు. పైగా సిద్దూకి అమృతసర్‌ దాటితే అంత పలుకుబడి లేదని అతనికి అందిన భోగట్టా. పైగా మొన్నటిదాకా బిజెపితో వూరేగిన ఫిరాయింపుదారుకి బంగరు పళ్లెంలో పెట్టి ముఖ్యమంత్రి పదవి యివ్వడానికి అతను సిద్ధపడలేదు. దాంతో చర్చలు బెడిసికొట్టాయి. 'బిజెపి నన్ను పంజాబ్‌కు దూరంగా వుండమని అంది, ఆప్‌ నన్ను ఎన్నికలలో పోటీ చేయవద్దని అంది' అని ప్రకటించి, సిద్దూ పంజాబ్‌ సొంతంగా ఆవాజ్‌-ఎ-పంజాబ్‌ అనే వేదికను సెప్టెంబరు 8న ప్రకటించాడు. సంస్థ పెట్టగానే జనం విరగబడతారనుకున్నాడేమో, అదేమీ జరక్కపోయేసరికి వచ్చే 2017 ఎన్నికలలో పోటీ చేయనని ప్రకటించాడు. ఆ తర్వాత పర్గత్‌ సింగ్‌, సిమర్‌జీత్‌ సింగ్‌ భైన్స్‌, బల్వీందర్‌ సింగ్‌ బైన్స్‌ అనే ఎమ్మెల్యేలు అతనితో చేతులు కలిపారు. దాంతో ఎన్నికలలో పోటీ చేయాలనే కోరిక పుట్టింది. 

ఇప్పటికే అకాలీ దళ్‌-బిజెపి కూటమి ఒక పక్క, కాంగ్రెస్‌ మరో పక్క, ఆప్‌ యింకో పక్క వున్నాయి. ఆవాజ్‌ పార్టీ కూడా చేరితే చతుర్ముఖ పోటీ అయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అకాలీ దళ్‌-బిజెపి కూటమి సునాయాసంగా నెగ్గేస్తుందని అందరూ అనుకోసాగారు. అకాలీ దళ్‌-  బిజెపి సంకీర్ణ ప్రభుత్వం యిమేజి బొత్తిగా బాగాలేదు. గత పదేళ్లగా అది అధికారంలో వుండి అవినీతికి, అసమర్థతకు ఆలవాలమై పోయింది. 'గతంలో ముఖ్యమంత్రులందరూ 20% కమిషన్‌ తీసుకునేవారు. ఇప్పుడు వీళ్లకు అలాటి లెక్కలు లేవు. దొరికినంత వరకు తినివేయడమే! రాష్ట్రంలో జరిగే ప్రతి బిజినెస్‌లో, ప్రతి పరిశ్రమలో వాటాలడుగుతున్నారు. దానివలన పరిశ్రమలు రాకుండా పోయాయి. ఇటీవల పెద్ద ట్రాక్టర్‌ యూనిట్‌కు మధ్యవర్తి ద్వారా కబురంపారు 'మేం మీ కంపెనీలో 25% వాటా తీసుకుంటాం' అని. 'సరే, యిస్తా, క్యాష్‌ తెమ్మనండి' అన్నాడు ఆ కంపెనీ యజమాని. 'క్యాషా? డబ్బిచ్చి వాటాలు కొనుక్కోవడం మా యింటావంటా లేదు. నాల్గో వంతు షేర్లు ఊరికే మా పేర రాసేయాలంతే' అన్నారు వీళ్లు. 'అలా అయితే కంపెనీ మొత్తాన్ని వేరే రాష్ట్రానికి తరలించుకుని పోతాను.' అని బెదిరించాడతను. ఇదీ పరిస్థితి.' అంటున్నారు పాత్రికేయులు. 'వెళ్లకుండా వుండిపోయిన పరిశ్రమలు కూడా బాదల్‌లకు యివ్వాల్సిన లంచాల వలన వాటి ఉత్పాదనలకు రేట్లు పెంచాల్సి వస్తోంది. అమ్మకాలు తగ్గుతున్నాయి. మైనింగ్‌, లిక్కర్‌, ట్రాన్స్‌పోర్ట్‌, హోటళ్లు.. యిలా ఏ బిజినెస్‌ తీసుకున్నా వాటిలో వాటా అడుగుతున్నారు. ఇటీవలే రెండు పెద్ద ట్రాన్స్‌పోర్టు కంపెనీలను పూర్తిగా సొంతం చేసుకున్నారు. ఇవన్నీ చాలనట్లు డ్రగ్‌ మాఫియాను ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌ బాదల్‌ బావమరిది బిక్రమ్‌ మజీతియాయే ప్రోత్సహిస్తున్నాడు. ఎందరో తలిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఒకసారి మాదకద్రవ్యాలకు అలవాటు పడి, కుటుంబసభ్యుల బోధన వలన బాగుపడి, తమకు యివి అమ్మినవారి సమాచారాన్ని బయటపెడదామని చూస్తున్నవారిని డ్రగ్‌ ట్రేడర్స్‌ వాళ్లకు హెచ్చు మోతాదులో డ్రగ్‌ యిచ్చేసి చంపేస్తున్నారు. మత్తుమందు సేవనం వలన చచ్చిపోయాడంటూ పోలీసులు కేసు మూసేస్తున్నారు.' అంటున్నారు పరిశీలకులు. 

అయితే అకాలీ దళ్‌-బిజెపిలను గద్దె దింపే స్థాయి కాంగ్రెసు, ఆప్‌లకు వుందా లేదా అన్నదే పెద్ద ప్రశ్న. కాంగ్రెసు నాయకుడు అమరీందర్‌ సింగ్‌ గతంలో ముఖ్యమంత్రిగా చేశాడు, ఓడిపోయాడు. ఆప్‌ అయితే కొత్త పార్టీ. జనవరి నెలలో పంజాబ్‌కు అరవింద్‌ తొలిసారి వచ్చినపుడు ఓటర్లలో నూతనోత్సాహం కనబడింది. పంజాబ్‌లో ఆప్‌ గెలుపు తథ్యం అనేయసాగాయి కొన్ని పత్రికలు. అయితే క్రమేపీ అది వివాదాల వూబిలో దిగబడింది. మొత్తం 117 నియోజకవర్గాల్లో అందరి కంటె ముందుగా 32 వాటికి అభ్యర్థుల పేర్లను ఆప్‌ ప్రకటించగానే ముసలం పుట్టింది. టిక్కెట్లు దొరకనివాళ్లు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటంతా టిక్కెట్లు ప్రకటించిన నియోజకవర్గాలలోనే జరగడం, వాళ్లు స్టేట్‌ కన్వీనరు సూచా సింగ్‌ ఛోటేపూర్‌ మనుషులు కావడంతో ఆప్‌ నాయకత్వానికి అనుమానం వచ్చింది. సూచా సింగ్‌ పూర్వం అకాలీ దళ్‌లో వుండేవాడు. రాజకీయంగా కాకలు తీరిన యోధుడు. ఆప్‌లో చేరి, పంజాబ్‌లో పార్టీని నిర్మించాడు. ఎప్పుడైతే తన మాట చెల్లలేదో యిలా తిరగబడ్డాడని అరవింద్‌కు అర్థమై, అతనిపై స్టింగ్‌ ఆపరేషన్‌ జరిపించాడు. ఒక పార్టీ వర్కరు నుంచి రూ. 2 లక్షల తీసుకుంటూ అతను కెమెరాలకు చిక్కాడు. వెంటనే అతన్ని ఆగస్టు 27 న పార్టీలోంచి బహిష్కరించారు. అతని స్థానంలో గురుప్రీత్‌ సింగ్‌ను నియమించారు. అంతే, అమృత్‌సర్‌ -గురుదాస్‌పూర్‌ బెల్ట్‌లో వున్న ఆప్‌ క్యాడర్‌లో 80% మంది పార్టీ విడిచి వెళ్లిపోయారు. ఆగస్టు 30 న 13 మంది జోనల్‌ కోఆర్డినేటర్లలో (ఒక్కో పార్లమెంటు స్థానం ఒక్కో జోన్‌ అన్నమాట) 7గురు 'ఛోటేపూర్‌ను వెనక్కి తీసుకుని రండి. ఢిల్లీ నుంచి పంపుతున్న సంజయ్‌ సింగ్‌, దుర్గేశ్‌ పాఠక్‌లను పంజాబ్‌కు రాకుండా చేయండి' అని అల్టిమేటమ్‌ యిచ్చారు. అది ఫలించకపోవడంతో మూకుమ్మడిగా రాజీనామా చేశారు. అమృత్‌సర్‌ లోకసభ నియోజకవర్గం జోనల్‌ ఇన్‌చార్జ్‌ గురీందర్‌ సింగ్‌ బాజ్వా, 85 మంది ఆఫీసు బేరర్స్‌ సెప్టెంబరు 4 న రాజీనామా చేశారు. 

దీని తర్వాత ఢిల్లీలోని ఆప్‌ ఎమ్మెల్యే పంజాబ్‌ ఆప్‌ నాయకుల శృంగార కార్యకలాపాల గురించి అరవింద్‌కు లేఖ రాసి, దాని కాపీలను విడుదల చేశాడు. దానికి ప్రతిగా ఢిల్లీ నుంచి పరిశీలకులు వచ్చిన టిక్కెట్లు అమ్ముకున్నారని, తన నుండి 50 లక్షలు డిమాండ్‌ చేశారని పవిత్ర సింగ్‌ అనే అతను ఫిర్యాదు చేశాడు. పరిశీలకుల్లో విజయ్‌ చౌహాన్‌, తను దిగిన గెస్ట్‌ హౌస్‌లో పనిమనిషితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని పంజాబ్‌ ఆప్‌ మాజీ నాయకులు ఆరోపించారు. పాఠక్‌తో సమావేశ పరచడానికి రూ. 5 లక్షలు అడిగాడని ఛోటేపూర్‌ సహచరుడు ఫిర్యాదు చేశాడు. గురీందర్‌ బాజ్వా 'నేను రెండున్నర నెలల క్రితం అమృతసర్‌లో రూ. 22.5 లక్షలు నిధులు సేకరించి ఎంకె హోటల్లో పాఠక్‌ మనిషి కపిల్‌కు యిచ్చాను. ఇలా డబ్బు తీసేసుకుంటూ ర్యాలీలకు, సమావేశాలకు డబ్బు కావాలని అడిగితే అది వేరే ఏర్పాటు చేసుకోండి అని చెప్తూ వచ్చారు ఢిల్లీవాళ్లు' అన్నాడు. కొత్త తరహా పార్టీగా ప్రజల ముందుకు వచ్చిన ఆప్‌ యిలా అన్ని రకాలుగా యిమేజి చెడగొట్టుకుంది. వీళ్లపై తీవ్రవాద ముద్ర కూడా వేయడానికి అకాలీ దళ్‌ చూస్తోంది. శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ శిఖ్కులలో చాలా శక్తివంతమైన సంస్థ. దాని ఎన్నికలు నవంబరులో జరుగుతున్నాయి. 'దానిలో తీవ్రవాదులు కొందరు పోటీ చేద్దామని చూస్తున్నారు. మీరు అసెంబ్లీ ఎన్నికలలో మాకు సాయపడండి, కమిటీ ఎన్నికలలో మీకు మేం సాయపడతామంటూ ఆప్‌ వాళ్లతో బేరం కుదుర్చుకుంది' అని సుఖ్‌బీర్‌ సింగ్‌ ఆరోపించాడు. 'విదేశాల నుంచి ఆప్‌కు వచ్చే విరాళాలు పంపేవారిలో శిఖ్కు ఉగ్రవాద సంస్థలు కూడా వున్నాయేమో పరిశీలించండి' అని అతను రాజ్‌నాథ్‌ సింగ్‌ను కోరాడు. 

రోజులు గడిచే కొద్దీ తన పార్టీకి పెద్దగా ప్రజాదరణ లేదని, ప్రతిపక్షాల్లో ఏదో ఒక దానితో ముడి వేసుకుంటే తప్ప మర్యాద దక్కేట్లు లేదని సిద్దూకి బోధపడింది. అందువలన ఆప్‌తో కానీ, కాంగ్రెసుతో కానీ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని రెండు రోజుల క్రితం ప్రకటించాడు. అందరి లాగానే 'ఇది అవకాశవాద పొత్తు కాదు, కామన్‌ మినిమమ్‌ ఎజెండా కుదిరితేనే పెట్టుకుంటాం. పంజాబ్‌ ఓటర్లకు స్పష్టమైన ఛాయిస్‌ యివ్వడానికే యీ ప్రయత్నం' అన్నాడు.  అంతకు కొద్ది రోజుల ముందు కాంగ్రెసుకి చెందిన రాజ్యసభ సభ్యుడు ప్రతాప్‌ సింగ్‌ బాజ్వా, కాంగ్రెసు సలహాదారు ప్రశాంత్‌ కిశోర్‌, రాజకీయాలతో సంబంధం లేని రాహుల్‌ గాంధీ సన్నిహితులిద్దరూ సిద్దూతో కలిసి మాట్లాడారట. భావసారూప్యత ప్రధానాంశమనుకుంటే వైరిపక్షాలైన ఆప్‌ కాంగ్రెసు యిద్దరితోనూ సిద్ధమే అనడమేమిటి? 'ఒకర్ని చూపించి మరొకరితో గీచిగీచి బేరాలాడడానికే యిదంతా' అన్నారు ఆప్‌ నాయకులు. ఓ రోజాగి సిద్దూ 'కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవాలంటే ఒక షరతు వుంది. అమరీందర్‌ సింగ్‌ నాయకుడిగా వున్నంతకాలం కాంగ్రెసు జోలికి పోము. అతను బాదల్‌ కుటుంబీకులతో కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నాడు. అతను లేని కాంగ్రెస్సే మాకు సమ్మతం.'' అన్నాడు సిద్దూ. బిజెపి నుంచి సిద్దూ బయటకు వచ్చినపుడు అమరీందర్‌ సింగ్‌ అతన్ని మెచ్చుకుని కాంగ్రెసులో చేరమని కోరాడు. కానీ సిద్దూకి మాత్రం అమరీందర్‌ అంటే అస్సలు పడనట్లుంది. అమరీందర్‌ను కాంగ్రెసు వాదులందరూ కెప్టెన్‌ అని పిలుస్తారు. కెప్టెన్‌ లేకుండా మా నౌక కదలదు అంటారు వాళ్లు. మరి సిద్దూ కోరిక నెరవేరుతుందా? ముఖ్యమంత్రి కాకపోయినా మామూలు మంత్రయినా అవుతాడా అని సందేహం వస్తున్న వేళ ఆప్‌ లోనుంచి బయటకు వచ్చేసిన సూచా సింగ్‌ ఛోటేపూర్‌ ఆవాజ్‌లో చేరతాడనే పుకారు వస్తోంది. అతను ఆప్‌ను శిఖ్కు వ్యతిరేకిగా వర్ణించాడు. ఆ ఢిల్లీవాళ్లు పంజాబ్‌ను అర్థం చేసుకోలేరన్నాడు. అతను తన అనుచరులందరితో ఆవాజ్‌ పార్టీలో చేరి, శిఖ్కు ప్రయోజనాలు కాపాడుతామంటూ చెప్పుకుంటే అకాలీ దళ్‌ నష్టపోవచ్చు. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?