cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : శ్రీలంక అధ్యక్షుడి భారత పర్యటన - 5

మైత్రీపాల జనవరి 9 న అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశాడు. మామూలుగా అయితే చీఫ్‌ జస్టిస్‌ ఎదుట చేయాలి. కానీ ఆ పదవిలో వున్న మోహన్‌ పెయిరిస్‌ రాజపక్ష మనిషి కాబట్టి అతని ఎదుట చేయనంటూ సుప్రీం కోర్టు జడ్జి శ్రీపవన్‌ ఎదుట చేశాడు. వెనువెంటనే యుఎన్‌పికి చెందిన రానిల్‌ విక్రమ్‌సింఘే ప్రధానమంత్రిగా చేశాడు. తర్వాత వెంటనే చేసిన పని మోహన్‌ను తీసేయడం! 225 మంది సభ్యులుండే పార్లమెంటుకు ఏప్రిల్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. రాజపక్ష వ్యతిరేకులందరినీ కలుపుకుని పోకపోతే ఆ ఎన్నికలలో యిబ్బంది వస్తుంది. యుఎన్‌పి గ్రామీణ ప్రాంతాల్లో బలహీనంగా వుంది. అది బలపడాలంటే వారికి యిలాటి పదవి ఒకటి ముఖ్యం. ఎన్నికల సందర్భంగా మైత్రీపాల చిత్తం వచ్చినట్లు వాగ్దానాలు చేశాడు. ఒకే వ్యక్తి అధ్యక్షుడిగా రెండు కంటె ఎక్కువసార్లు ఎన్నిక కావచ్చంటూ రాజపక్ష చేసిన రాజ్యాంగ సవరణను 100 రోజుల లోపు తిరగతోడతానన్నాడు. తను ఒక టర్మ్‌ మించి వుండనని మాట యిచ్చాడు. అధ్యక్షుడి అధికారాలు తగ్గిస్తానన్నాడు. దానికి సవరణ అవసరం. సవరణ కోసం పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ వుండాలి. సాధ్యమా? అతను మీడియాకు న్యాయవ్యవస్థకు, పోలీసు వ్యవస్థకు స్వేచ్ఛ యిస్తానన్నాడు. అవినీతి తొలగించి  ప్రజలకు 'గుడ్‌ గవర్నన్స్‌' అందిస్తానన్నాడు. 

మైనారిటీలు, తమిళులు చాలా ఆశలు పెట్టుకున్నారు. తమిళ ప్రాంతాల్లో సైన్యాన్ని పూర్తిగా తొలగించి, తమిళ కౌన్సిళ్లకు అధికారాలు బదిలీ చేయకపోతే వాళ్లు వూరుకోరు. చేస్తే సింహళులు అలుగుతారు. ఇప్పటికే దక్షిణ శ్రీలంకలో పుకార్లు షికారు చేస్తున్నాయి - మైత్రీసేన విజయాన్ని తమ విజయంగా భావించిన తమిళ వేర్పాటువాదులు తమిళ ఈలం పేర జండా ఎగరేశారనీ, ఆర్మీ క్యాంప్‌లపై రాళ్లు విసిరారనీ! దీన్ని లౌక్యంగా పరిష్కరించడానికి మైత్రీసేన తమిళులతో పేచీలు పడుతున్న చీఫ్‌ సెక్రటరీని మార్చడంతో బాటు తమిళులున్న ఉత్తర ప్రాంతానికి గవర్నరుగా వున్న మేజర్‌ జనరల్‌ని తీసేసి, అతని స్థానంలో అనుభవజ్ఞుడైన పాలిహక్కర అనే మాజీ ఫారిన్‌ సెక్రటరీని వేశాడు. వాళ్లు యిదే అదనని యుద్ధనేరాలపై కూడా విచారణ జరపాలని పట్టుబడితే మైత్రీసేన స్వయంగా చిక్కుల్లో పడతాడు. మైత్రీపాలకు ఏదైనా ధైర్యంగా చేయాలన్నా భయమే, ఎందుకంటే మైత్రీసేనది సంకీర్ణ ప్రభుత్వం! వామపక్ష పార్టీలు రాజపక్షపై కోపంతో నానాగోత్రాలకు చెందిన పార్టీలు కూటమిగా ఏర్పడి మైత్రీపాలను సమర్థించాయి కానీ వారిలో వారికి సిద్ధాంతవైరుధ్యం వుంది. తరతరాలుగా  ప్రతిపక్షాలుగా వున్న యుఎన్‌పి- ఎస్‌ఎల్‌ఎఫ్‌పి, సింహళ బౌద్ధులు- తమిళ హిందువులు, అర్బన్‌ మిడిల్‌క్లాస్‌-అర్బన్‌ పూర్‌, మాజీ ఆర్మీ కమాండర్‌-వామపక్షాలు, తమిళ ప్లాంటేషన్‌ వర్కర్లు, ప్రొఫెషనల్స్‌-ఆర్గనైజ్‌డ్‌ యూనియన్లు.. యిలా వీరందరూ కలిస్తే యీ ఫలితం వచ్చింది. వీరు ఎంతకాలం కలిసి వుంటారో ఎవరూ వూహించలేకున్నారు.

అన్నిటికన్నా పెద్ద యిబ్బంది ఆర్థికవ్యవస్థను చక్కదిద్దడం, చైనాతో సంబంధాలను సమీక్షించుకోవడం. చైనాతో సంబంధాలు హఠాత్తుగా తెంచుకుంటే సగంలో వున్న భారీ ప్రాజెక్టులు ఆగిపోతాయి. వాటిని కొనసాగిస్తే పెనుభారాన్ని మోయవలసి వుంటుంది. దుస్తులు, చేపలు, టీ ఎగుమతి, టూరిజం వంటి పరిశ్రమలు పుంజుకునేట్లా చేసి ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ గడించాలి, ఉద్యోగాలు కల్పించాలి. చైనా రాజపక్షకు అనుకూలంగా వ్యవహించి కాబట్టి దాన్ని తరిమివేసి దాని స్థానంలో ఇండియాను తెద్దామన్నా, ఇండియా ఒప్పుకుంటుందా? చైనా స్థాయిలో పెట్టుబడులు పెడుతుందా? చైనాతో పేచీ ఎందుకని వూరుకుంటుందా? చైనాతో మరీ విరోధం పెట్టుకుంటే యునైటెడ్‌ నేషన్స్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ సెషన్‌లో యిబ్బంది వస్తుందన్న భయం వుంది. యుద్ధనేరాలపై శ్రీలంకకు వ్యతిరేకంగా తీర్మానం చర్చకు వచ్చినప్పుడల్లా చైనా తన వీటో అధికారం వుపయోగించి శ్రీలంకను రక్షిస్తోంది. మార్చిలో ఆ తీర్మానం పునస్సమీక్షకు వస్తోంది. ఈసారి చైనా యిరుకున పెడితే? ఇలాటి చిక్కు వ్యవహారాలు చూడడానికి మైత్రీసేన యునైటెడ్‌ నేషన్స్‌లో అండర్‌ సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన జయంత ధనపాలను విదేశాంగ వ్యవహారాల విషయంలో తనకు సలహాదారుగా నియమించుకున్నాడు.

రాజపక్ష, మైత్రీపాల, అతని వెనుక వున్న చంద్రిక అందరూ ఎస్‌ఎల్‌ఎఫ్‌ పార్టీకి చెందినవారే. రాజపక్ష యిన్నాళ్లూ పార్టీని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఈ ఓటమి తర్వాత చంద్రిక, మైత్రీపాల పార్టీని రెండుగా చీల్చారు. నిర్మల్‌ శ్రీపాల వర్గం రాజపక్ష పార్టీ నాయకుడిగా ప్రకటిస్తే, శరత్‌ అమునుగామా వర్గం మైత్రీపాలను పార్టీ చైర్మన్‌గా ప్రకటించింది. తనకు యుపిఎఫ్‌ఏ కూటమిలోని 41 మంది ఎంపీల మద్దతు వుంది కాబట్టి తనే ప్రతిపక్ష నాయకుణ్నని రాజపక్ష ప్రకటించుకున్నాడు. కానీ 35 మంది ఎంపీలు మైత్రీసేన వైపు మళ్లారు. దాంతో రాజపక్ష బరిలో నుంచి తప్పుకుని మైత్రీసేనకు చైర్మన్‌గిరీ అప్పగించేశాడు. అతని సోదరుడు బాసిల్‌ పార్టీ నేషనల్‌ ఆర్గనైజర్‌ పదవికి రాజీనామా చేశాడు. ఇది యుఎన్‌పిని భయపెట్టింది. మైత్రీసేనను తమ నుంచి వేరు చేయడానికి రాజపక్ష వేస్తున్న పన్నాగం యిది అనుకున్నారు. ఆ భయాలు పారదోలడానికి మైత్రీపాల అవినీతి నిర్మూలనకై కమిషన్‌ వేసి దాన్ని వామపక్షాల ఆధ్వర్యంలో పెట్టి రాజపక్ష, బాసిల్‌, కొడుకు నామల్‌లపై వచ్చిన ఆరోపణలను విచారించమన్నాడు. బాసిల్‌, అతని భార్య తమ అమెరికన్‌ సిటిజన్‌షిప్‌ అడ్డం పెట్టుకుని జనవరి 11న అమెరికా పారిపోయారు.

అవినీతి ఆరోపణలు చేసినంత సులభం కాదు, వాటిని నిరూపించడం. ఆ పనులు చేసినవారు అదను చూసి పాలకపక్షంలో చేరిపోతారు, యిక విచారణ కుంటుపడుతుంది. యంత్రాంగం మారదు కాబట్టి వారు ఆధారాలను నాశనం చేస్తారు, ఫైళ్లు దొరకవు. మరీ దూకుడుగా వెళితే 'కక్షసాధింపు చర్య' అనుకుని ప్రజలు అవతలివాడిపై సానుభూతి కురిపిస్తారన్న భయం ఒకటి. మన దేశంలోనే, మన రాష్ట్రాలలోనే యివన్నీ ఎన్నాళ్లగానో చూస్తున్నాం. ప్రతిపక్షంలో వుండగా స్విస్‌ బ్యాంకుల నుండి బ్లాక్‌మనీ తెప్పించి పౌరులందరి ఖాతాల్లో జమ చేస్తానని బీరాలు పలికిన వారే అధికారంలోకి రాగానే 'అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించలేం కదా, వారు సమాచారం యివ్వకపోతే మనం ఏం చేయగలం?' అంటూ సంజాయిషీలు చెప్తారు. నేరం చేసినట్లు ఆధారం వుంటే చూపండి, బ్యాంకు ఖాతా వివరాలు యిస్తాం అంటారు స్విస్‌ అధికారులు. మీరు ఖాతాలో ఎంత వుందో చెప్తే దాన్ని బట్టి నేరం జరిగినట్లు మేం కేసు అల్లుకుంటాం అంటారు మనవాళ్లు. పెళ్లి ముందా? పిచ్చికుదరడం ముందా? ప్రతిపక్షంలో వుండగా యిలాటి ఆలోచనలు రావు పాపం. గద్దె కెక్కాకనే కళ్లు విచ్చుకుంటాయి. చైనాకు అప్పగించిన భారీ ప్రాజెక్టులలో రాజపక్ష కమిషన్‌ తీసుకున్నాడని ఇచ్చినవాళ్లు చెప్తారా? పుచ్చుకున్నవాళ్లు చెప్తారా? అనుమానంతో ప్రాజెక్టు ఆపేస్తే ప్రజలు డబ్బులు మిగిలాయని సంతోషిస్తారా? దాని ఫైనాన్షియల్‌ వయబిలిటీ వారికి పట్టదు. తమ వూళ్లో పెద్ద రోడ్లు, వంతెనలు, హాళ్లు వచ్చాయా లేదా అవే చూస్తారు. వాటిని అర్ధాంతరంగా ఆపేసిన వాళ్లను శత్రువులుగా భావిస్తారు. 

రాజపక్షపై అవినీతి కంటె పెద్ద ఆరోపణను ముందుగా విచారిస్తున్నారు - తను ఓడిపోతున్నాడని గ్రహించిన రాజపక్ష జనవరి 9 న సైన్యం సహాయంతో ఓట్ల లెక్కింపును భగ్నం చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిందన్న సాకుతో ఎమర్జన్సీ విధిద్దామనుకున్నాడని, దానికి అతని సహచరులు కొందరు సహకరించారని ఆ ఆరోపణ. సైన్యాధికారులను పిలిచి ఆ దిశగా మాట్లాడాడని వాళ్లు నిరాకరించడంతో విధిలేక తప్పుకున్నాడని కొత్తగా విదేశాంగ మంత్రి అయిన మంగళ సమరవీర కొలంబో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అటార్నీ జనరల్‌ యీ ఫిర్యాదుపై స్పందించి, రాజపక్ష, అతని సోదరుడు గోటబయ, చీఫ్‌ జస్టిస్‌గా వున్న మోహన్‌,   ఫారిన్‌ సెక్రటరీగా వున్న జి ఎల్‌ పెయిరిస్‌ యిత్యాదులపై కేసు పెట్టి విచారణకు ఆదేశించాడు. ఈ ఆరోపణను రుజువు చేయలేకపోతే రాజపక్షపై అనవసరంగా జాలి పెరుగుతుంది. రాజపక్ష కుటిల రాజకీయాలు నడపడంలో దిట్ట. ఇప్పటికే అతను తను జాతీయవాదినని, శ్రీలంకను ఐక్యంగా వుంచడానికి కృషి చేస్తే మైనారిటీలు, తమిళులు పగబట్టి విదేశీ శక్తుల సహాయంతో తనను ఓడించారని చెప్పుకుంటున్నాడు. సింహళీయులకు యీ మాటలు తలకెక్కతున్నాయి కూడా. ఏప్రిల్‌లో రాబోయే పార్లమెంటు ఎన్నికలలో అతను యుఎన్‌పికి చెందిన రానిల్‌పై పోటీ చేస్తే యుఎన్‌పి అంటే థాబ్దాలుగా మండిపడే ఎస్‌ఎల్‌ఎఫ్‌ పార్టీ వారందరూ - మైత్రీసేన వర్గంలో వున్నవారు కూడా - సమర్థించవచ్చు. 2005 అధ్యక్ష ఎన్నికలలో రాజపక్ష రానిల్‌ను 2 లక్షల మార్జిన్‌తో ఓడించాడు. ప్రస్తుతం ప్రధాని చేతిలో పెద్దగా అధికారాలు లేవు, అన్నీ అధ్యక్షుడి చేతిలోనే వున్నాయి. అయితే మైత్రీసేన తన అధికారాలు కుదించుకుంటా నంటున్నాడు. ఎన్నికలకు ముందు అంత సాహసం చేస్తాడా? రాజపక్ష ప్రధాని అయినా అలా చేస్తాడా? అని పలు సందేహాలు. చేయకుండా వుంటే యితనూ ప్రజాస్వామ్యవాది కాదన్న మాట పడతాడు.

మైత్రీసేనకు ఎన్నికలలో భారత గూఢచారి సంస్థ 'రా' సహాయం చేసిందన్న సందేహాలు అంతర్జాతీయ సమాజంలో వున్నాయి. అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే మైత్రీపాల నాలుగురోజుల పర్యటనపై ఇండియాకు రావడం వలన అవి మరింత బలపడతాయి. ఇండియాకు వచ్చి సివిల్‌ న్యూక్లియార్‌ కోఆపరేషన్‌ గురించి ఒక ఒప్పందం చేసుకున్నారు. రక్షణ, భద్రత విషయాలలో తమకున్న అనుబంధాన్ని మరింతగా విస్తరించాలని నిర్ణయించారు. ఈ న్యూక్లియార్‌ ఒప్పందానికి అమెరికా ఏమీ అభ్యంతరం చెప్పలేదు. శ్రీలంక-భారత్‌ స్నేహం గురించి ఆందోళన చెందవలసిన చైనా కూడా చాలా గడుసుగా వ్యవహరించింది. ఈ నెలాఖరులోనే శ్రీలంక విదేశ వ్యవహారాల మంత్రి మంగళ సమరవీర, మార్చి నెల చివరిలో మైత్రీపాల చైనాకు వెళుతున్నారు. దానికి భూమిక ఏర్పరచడానికి చైనా 'చైనా-శ్రీలంక-భారత్‌ల మధ్య త్రైపాక్షిక భాగస్వామ్యం ఏర్పడాల'ని ఆకాంక్షిస్తూ ప్రకటన విడుదల చేసింది. పాశ్చాత్య దేశాలకు తమ ఎగుమతులు పెంచుకోవడానికి హిందూ మహాసముద్రంలో మారిటమ్‌ సిల్క్‌ రూట్‌ అని చైనా ప్లాన్‌ చేస్తోంది. దక్షిణాసియాలో ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ ముఖ్యమైన భాగస్వాములు. ముఖ్యంగా శ్రీలంక - ఎందుకంటే నడిదారిలో సరుకులు ఒక ఓడ నుంచి మరొక ఓడకు మార్చుకునే ట్రాన్స్‌షిప్‌మెంట్‌ సెంటర్‌గా శ్రీలంకయే ఉపయోగపడుతుంది. శ్రీలంకతో వైరం తెచ్చుకుంటే యీ ప్లానంతా చెడుతుంది. పైగా తాము యిప్పటికే అక్కడ చాలా పెట్టుబడులు పెట్టి వున్నారు. మైత్రీసేన భారత పర్యటన చైనా-భారత్‌ల మధ్య వైషమ్యానికి, స్పర్ధకు దారి తీయకుండా పరస్పర సహకారానికి దారి తీస్తే అంతకంటె ఆనందించవలసిన విషయం మరొకటి లేదు. (సమాప్తం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

mbsprasad@gmail.com

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4