cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : నిమ్మగడ్డోదంతం నేర్పే పాఠం

ఎమ్బీయస్ : నిమ్మగడ్డోదంతం నేర్పే పాఠం

నిమ్మగడ్డ నిన్నటితో రిటైరయ్యారు. ఆయనకి ముందు ఎన్నికల కమిషనర్‌గా పనిచేసినవారు, ఆయన తర్వాత చేసేవారెవరు అంటే చెప్పలేం కానీ నిమ్మగడ్డ పేరు మాత్రం మారుమ్రోగిపోయింది. అదీ పదవి వలన కాదు, ఆయన వ్యక్తిగత వ్యవహార శైలి వలన. బాగా చేసి వుంటే జాతీయస్థాయిలో శేషన్‌లా గుర్తుండేవారు. కానీ అస్తవ్యస్తంగా జరగడంతో మరోలా గుర్తుండిపోతారు. ఆయన పదవీకాలం ముగింపుకి వచ్చేసరికి ఎవర్నీ మెప్పించకుండా దిగిపోయారు. అలాటి పదవి పార్టీలని మెప్పించడానికి యివ్వరు. కానీ నిష్పక్షపాతంగా వ్యవహరించి వుంటే, తమకు కష్టం కలిగించినా సరిపెట్టుకునేవారు. ముఖ్యంగా ఓటర్లు హర్షించేవారు. కానీ ఆయన అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీలకి, గవర్నరుకి, కోర్టుకి, తటస్థ ప్రజలకు.. ఎవరికీ మంచి కాకుండా సెలవు తీసుకున్నారు. ఈ పదవి చేపట్టేదాకా ఆయన రికార్డులో ఏ మచ్చా లేదు. భోజనంలో డిజర్ట్ బాగుండకపోతే చివరకు చేదే మిగులుతుంది. చివరి పోస్టింగు యిలా మిగలడం ఆయన దురదృష్టం.

వ్యక్తిగత అవినీతికి పాల్పడిన ఐఏఎస్‌లు కేసులు ఎదుర్కోవడం మాట సరే, అధికారంలో వున్నవారి మాట విని చిక్కుల్లో పడిన ఐఏఎస్‌ల కథలు చాలా విన్నాం. కానీ వారందరూ ఎలాగోలా బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయనాయకులు వాళ్లను ఏదోలా రక్షించేస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రాకపోయినా, అప్పటి మంత్రి పార్టీ మారి, అధికారంలోకి వచ్చిన కొత్త పార్టీ ద్వారా మళ్లీ మంత్రి అయినా యీ అధికారి బతికిపోతాడు. పైగా వాళ్లు ఫైళ్ల మీద గందరగోళంగా రాసి, కేసుకి దొరక్కుండా చేసుకుంటారు. అటు మంత్రీ దొరకడు, యిటు అధికారీ దొరకడు. నేరం మరీ పెద్దదై పోయిందనుకోండి, అప్పుడు కూడా అధికార యంత్రాంగం వాళ్లకు సాయపడుతుంది. తప్పుడు సెక్షన్లతో కేసులు పెడుతుంది, కోర్టులో కేసు వీగిపోతుంది. పోలీసులకు అక్షింతలు పడతాయి, దులిపేసుకుంటారు.

సరైన సెక్షన్లతో పెట్టిన చోట్ల ఫైళ్లు కనబడకుండా పోతాయి. అవతల యిన్వెస్టిగేట్ చేసేవాళ్లు కూడా ఐపిఎస్‌లే అవుతారు కాబట్టి, వీళ్ల మీద జాలితోనో, రేపు మనకెక్కడైనా తగులుతాడేమోనన్న జంకుతోనో విచారణ సరిగ్గా జరపరు. జరిపినా తాపీగా చేస్తారు. ఈలోగా వీళ్లు రిటైరై పోతారు. మరీ గట్టిగా శిక్షిస్తే వీళ్లు తమ గుట్లన్నీ బయటపెట్టేస్తారేమోనన్న భయం పాలకులకు వుంటుంది. వాళ్లు ఉండేది ఐదేళ్లు, వీళ్లయితే 35 ఏళ్లు. తలచుకుంటే పాతపురాణాలు లాగగలరు. ‘‘ఎస్ మినిస్టర్’’ చూస్తే మంత్రులు, అధికారులు కలిసి ఆడే దొంగాట బాగా అర్థమౌతుంది. అధికారగణంతో పేచీ పెట్టుకుంటే వాళ్లు మంత్రులను ఎలాగైనా యిరికించగలరు. ఫైలు పూర్తిగా చదివే ఓపిక, తీరిక మంత్రులకు వుండదు. ఈ విధంగా పాలకగణం చెప్పినట్లు ఆడిన అధికారులకు తాత్కాలికంగా యిక్కట్లు వచ్చినా అంతిమంగా బయటపడిపోతారు. మహా అయితే మంచి పోస్టింగు దక్కదంతే.

ఇక్కడ నిమ్మగడ్డతో వచ్చిన చిక్కేమిటంటే ఆయన అధికారపక్షం చెప్పినట్లు కాకుండా ప్రతిపక్షం చెప్పినట్లు ఆడాడు. అక్కడ కొట్టింది దెబ్బ! గతంలోనే రాసినట్లు నిమ్మగడ్డ ఎన్నడూ వివాదాస్పద వ్యక్తి కారు, కులపక్షపాతాలు చూపలేదు. మంచిగా గానీ, చెడుగా గానీ సంచలనాలు సృష్టించలేదు. ఏదో నిమ్మళంగా, నింపాదిగా ఉద్యోగం చేసుకుంటూ పోయారు. టిడిపి అధికారంలో వుండగా ‘ఎన్నికలు పెట్టకపోతే ఎలా?’ అని వాళ్లను యిబ్బంది పెట్టలేదు. తప్పినదల్లా మంచిమాట అనుకున్నారు. వైసిపి వచ్చాక కూడా అంతే. అయితే వైసిపి ఎన్నికలు పెట్టగానే, ఏకగ్రీవాల సంఖ్య చూడగానే టిడిపికి గుబులు పట్టుకుంది. అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రజల్లో తమ పలుకుబడి పెరిగింది కానీ తరగలేదు అని వైసిపి నిరూపించుకుంటుందని. (వారి భయాలు నిర్హేతుకమైనవి కావని ఫలితాలు నిరూపించాయి) ఇక దానితో నిమ్మగడ్డపై ఒత్తిడి పెట్టింది. ఎలాటి మొహమాటానికి లొంగారో ఏమో, కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసి, అధికారాన్నంతా గుప్పిట్లోకి తీసుకుని బదిలీలు చేసేసి, వివాదాల్లో చిక్కుకున్నారు. అప్పటిదాకా ఏకగ్రీవాల్లో ఏ తప్పూ కనబడని ఆయనకు సడన్‌గా తప్పులు కనబడసాగాయి. దాంతో జగన్ ఆయన కులప్రస్తావన చేసి కంపుకంపు చేశారు.

ఇక ఈయనకు తిక్కరేగి, తన ప్రాణానికి రక్షణ లేదంటూ కేంద్ర హోం శాఖకు ఉత్తరం రాసేశారు. నిమ్మగడ్డ తక్కిన చర్యలను కష్టపడి సమర్థించవచ్చేమో కానీ యీ లేఖారచనను మాత్రం ఎవరూ సమర్థించలేరు. ముఖ్యమంత్రిది ఫాక్షన్ నేపథ్యమని, తన ప్రాణానికి రక్షణ లేదని.. యిలా ఏమేమో రాసేశాడు. మామూలుగా ఐఏఎస్ అధికారులు అలాటి స్ట్రెయిట్ భాష వాడరు. దొరక్కుండా, ‌డొంకతిరుగుడుగా రాస్తారు. టిడిపి వాళ్లు రాసి వుంటారు కాబట్టి, అలాటి భాష, అవే పదాలు పడ్డాయి. లేఖ రాసి రాయలేదనడం, రాష్ట్రం వెలుపల దాక్కోవడం, విచారణ మొదలెట్టాక నేనే రాశాననడం, యివన్నీ ఆయన పరువు తీశాయి. ఆ తర్వాత ప్రభుత్వం ఆయన్ని తీసేయడంతో, కోర్టుకి వెళ్లడం వరకు బాగానే వుంది. కానీ హోటల్లో రాజకీయ నాయకులతో రహస్య సమావేశాలూ, తర్వాత కోర్టు ఆదేశాలతో ఉద్యోగం మళ్లీ వచ్చాక, పంతం బట్టి ప్రభుత్వాధికారులను నిర్లక్ష్యం చేయడాలూ, పంచాయితీ ఎన్నికలనడాలూ, సొంతంగా యాప్ చేయించాననడాలు.. యిలా యిదంతా వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయంగా తీసుకున్నారు.

ఇదంతా ప్రతిపక్షాలకు యింపుగానే వుంది కాబట్టి ఆకాశానికి ఎత్తేస్తూ వచ్చారు. ఈయన కూడా గతంలో ఏ ఈసీ చేయనట్లుగా ఊళ్లు తిరగడాలు, ఉపన్యాసాలు యివ్వడాలూ, సాటి ఐఏఎస్‌లు రికార్డులు ఖరాబు చేయడాలూ చేశాడు. కానీ ఫలితాల దగ్గరకు వచ్చేసరికి తేడా కొట్టేసింది. రూలు ప్రకారం వెళితే వైసిపికి లాభించింది. అది యీయన చేతిలో లేని విషయమని టిడిపికి తెలిసినా, ఈయన ఏదోలా ఫలితాలు ఆపాల్సిందని, ఏకగ్రీవాలు రద్దు చేయాల్సిందని వారాశించారు. పాపం యీయన పరిమితులు యీయనకు వుంటాయి. అప్పటికీ చేతనైనన్ని పుల్లలు వేసి చూశారు. అక్రమాలు జరిగాయని కలక్టర్లు రిపోర్టు యివ్వకపోతే ఆయనేం చేస్తాడు. పోనీ ఆరోపణలు చేసినవాళ్లు ఆధారాలు చూపారా అంటే అదీ లేదు. టిడిపి యిదేమీ అర్థం చేసుకోలేదు. మనవాడనుకుంటే ఏమీ చేయలేకపోయాడని ఈయనపై కక్ష పెంచుకున్నారు. పార్టీ ఫిరాయించాడు, వైసిపి మనిషయ్యాడు అని ఆడిపోసుకున్నారు.

ఏం చేసినా టిడిపిని తృప్తి పరచడం మన వలన కాదు అనుకుని నిమ్మగడ్డ అంతటితో సరిపెట్టాల్సింది. కానీ మునిసిపల్ ఎన్నికలు కూడా నిర్వహించేశారు. టిడిపికి పట్టణ జనాభాలో మద్దతు వుందంటారు, దీనిలోనైనా కాసిన్ని సీట్లు వచ్చి టిడిపి శాంతిస్తుందనుకున్నారో ఏమో పాపం. తీరా చూస్తే అక్కడా దెబ్బ కొట్టేసింది. దాంతో టిడిపి శివాలెత్తిపోయింది. ఇప్పుడు ఆ ఎన్నికలు బహిష్కరిస్తుందన్న పుకార్లు వినబడుతున్నాయంటే ఎన్నికలంటే టిడిపి తెనాలి రామలింగడి పిల్లిలా అయిపోయిందని అర్థమౌతోంది కదా. అందువలననే జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టివుంటే నిమ్మగడ్డను నిలువునా చీరేస్తామన్నంత కోపం వ్యక్తం చేసి వుంటారు వాళ్లు. ఇటు వైసిపి జిల్లా ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు అంటూ తొందర పెట్టేస్తోంది. ఏం చేయాలో పాలుపోక సెలవు పెట్టేసి కూర్చున్నారు. ఎవరేమనుకున్నా సరే జిల్లా ఎన్నికలు మాత్రం పెట్టకూడదనుకుంటూ చివరి రోజుల్లో తొలినాళ్ల నాటి నిష్క్రియాపరత్వాన్ని ఆశ్రయించారు.

పార్టీల సంగతి అలా వుంటే, గవర్నరు రమ్మంటే హైదరాబాదు వచ్చి వాక్సినేషన్ వేయించుకున్నాను, రాలేను అని జవాబిచ్చారు. టీకా వేయించుకున్నాక అరగంట తర్వాత వెళ్లమంటారు. ఈయన అదేదో ఆపరేషన్ అన్నంత బిల్డప్ యిచ్చారు. పైగా ఆయన ఆఫీసులోంచి సమాచారం లీక్ అయిందని ఫిర్యాదు చేసి, సిబిఐ విచారణ చేయాలంటూ కోర్టుకి వెళ్లారు.  తనంతట తనే ఆ లెటర్‌ను చీఫ్ సెక్రటరీకి, పంచాయితీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫార్వార్డ్ చేసి, ఆ విషయం దాచి పెట్టి కోర్టును తప్పుదారి పట్టించినందుకు ఆయన మీద కంటెప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు పెట్టాలని గవర్నరు తరఫు న్యాయవాది వాదించారు. ఈయన్ని ఎపాయింట్ చేసిందే గవర్నరు. కానీ చివర్లో ఈయన ఎపాయింట్‌మెంట్ అడిగితే యివ్వనని చెప్పి తన ఆగ్రహాన్ని బహిర్గతం చేశాడాయన.

అమరావతిలో ఒక ఆఫీసు, హైదరాబాదులో మరో ఆఫీసు రన్ చేశారన్న విషయంలో ఫిర్యాదు వచ్చింది. మంత్రి విషయంలో హద్దు మీరి ప్రవర్తించారని సభాహక్కుల నోటీసు వచ్చింది. ఇలా అన్ని రకాలుగా, అన్ని వర్గాల చేత మాట పడి మరీ కుర్చీ దిగారాయన. ఏం బావుకున్నట్లు? చిన్నపుడు ఓ కథ చదివాను. అరేబియాలో ఒకతనికి శిక్ష వేశారట. అతి చేదు ఫలాలు వందైనా తిను, లేదా వంద కొరడా దెబ్బలైనా తిను అని. కొరడా కంటె ఫలాలే మేలు అనుకుని, తినడం మొదలెట్టాడట. పాతిక తినేటప్పటికి దీని కంటె కొరడా దెబ్బలే బెటరు అనుకుని అవి కొట్టమన్నాడట. ఇప్పుడు ఛాయిస్ మారిస్తే ఈ పాతికా లెక్కలోకి రావు, వంద దెబ్బలూ తినాల్సిందే అన్నాడు న్యాయాధీశుడు. సరేనన్నాడు యితను. పాతిక కొరడా దెబ్బలు తినేసరికి, ‘అబ్బే వీటి కంటె ఫలాలే మేలు’ అనుకుంటూ మళ్లీ అవి మొదలెట్టాడు. ఇలా మార్చిమార్చి చివరకు 100 ఫలాలూ, 100 కొరడా దెబ్బలూ తిని రెట్టింపు శిక్ష అనుభవించాడట. అలా నిమ్మగడ్డ కూడా అటు కాస్సేపు, యిటు కాస్సేపు వుండి చివరకు రెండిటికే కాదు, అనేకవాటికి చెడ్డారు.

ఈయనే రాజకీయనాయకుడైతే అటు, యిటూ ఎటు గెంతినా నడిచిపోతుంది. ఎలాటి భాష వాడినా, అధికార దుర్వినియోగం చేసినా చెల్లిపోతుంది. కానీ యీయన అధికారి మాత్రమే. పదవి ముగిసిపోయాక పలకరించే దిక్కుండదు. భాష వాడేటప్పుడు కూడా రాజకీయ నాయకుడు ఏదైనా వాడవచ్చు, వాళ్లకు యిమ్యూనిటీ వుంటుంది. తక్కినవాళ్లకు ఉండదు. అప్పోజిషన్ వాళ్లు, వారి మీడియా వాళ్లు ఎత్తేస్తున్నారు కదాని యీయనా మురిసిపోయి, తలకిందులై పోయారు. గతంలో జెడి లక్ష్మీనారాయణ గారికీ యీ భోగం పట్టింది. ఒకప్పుడు కటౌట్లు. ఇప్పుడు కట్-ఔట్. ఏ పార్టీలో వున్నారో, ఎలాటి సంఘసేవ చేస్తున్నారో ఎవరైనా అడుగుతున్నారా? గడీ (గడియ) వేషానికి గడ్డం, మీసం గీయించాడని సామెత ఎప్పుడో వచ్చింది. తమ అవసరాల కోసం ఉబ్బేసి, ఏ పనైనా చేయించుకుంటారు. కానీ రాజకీయభూతాలను తృప్తిపరచడం మానవమాత్రుల తరం కాదు. సిరిగల వానికి చెల్లును.. అన్నట్లు రాజ్యసిరి కలవానికి ఏదైనా చెల్లుతుంది కానీ అధికారికి చెల్లదు. అతను నియమాల చట్రంలో బందీ. ఎగిరిపడితే చివర్లో దిగాలు పడక తప్పదు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2021)

mbsprasad@gmail.com

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×