Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: మన ఆరోగ్యవసతులు

ఎమ్బీయస్‌: మన ఆరోగ్యవసతులు

కరోనా విజృంభిస్తే మనకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చాలదని అందుకే లాక్‌డౌన్‌  పెట్టి, పెరగకుండా చూసి, యీ లోపున ఆరోగ్య వసతులు పెంచుతున్నారనీ కొందరి అభిప్రాయం. ఈ వసతులు యిప్పటికిప్పుడు రెడీ కావు. మొదటి నుంచీ నిర్లక్ష్యం చేసి యీ రోజు అప్పటికప్పుడు కావాలంటే యిదేమీ మాయాబజార్‌ కాదు. ప్రజారోగ్య విషయంలో మన ప్రభుత్వాలు చాలా రోజులుగా తప్పు చేస్తూనే ఉన్నాయి. బజెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయిస్తున్న నిధులను పరిశీలిస్తే ఆ విషయం అర్థమౌతుంది. హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్‌ఫేర్‌ శాఖకు మన బజెట్‌లో ఖర్చు పెట్టే శాతం 2.5% కంటె ఎప్పుడూ తక్కువే వుంటోంది. జిడిపిలో అయితే 1.25% దరిదాపుల్లో వుంటుంది.

2019-20 రివైజ్‌డ్‌ అంచనా ప్రకారం మొత్తం ఖర్చు 2699 వేల కోట్లయితే దానిలో ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టినది 64,609 కోట్లు. అంటే 2.4%. ఈ 2020-21 బజెట్‌లో గతంలో హెల్త్‌ కంటె యీ ఏడాది 3.9% ఎక్కువ ఖర్చు పెడుతున్నామని చెప్పుకున్నారు. కానీ చెప్పనిదేమిటంటే మొత్తం బజెట్‌ 256 వేల కోట్లు పెరిగితే, హెల్త్‌ విషయంలో పెరిగినది 2.5 వేల కోట్లు. ఈ 67,112 కోట్లు మొత్తం బజెట్‌లో 2.2%, అంటే గతంలో కంటె తగ్గిందన్నమాట. ఇదీ ఆరోగ్యం పట్ల మన పాలకుల శ్రద్ధ! ఈ రోజు మన జాతి ఆస్తంతా ఆరోగ్యరక్షణకే కరిగిపోతోంది. ఆదరాబాదరాగా ఏర్పాట్లు చేసుకోకుండా ముందునుంచీ చేసుకుంటూ వస్తే యింత అవస్థ పడాల్సి వచ్చేది కాదు.

ఇప్పుడు కూడా మన ప్రాధాన్యతలేమిటో మోదీకి అర్థం కావటం లేదు. న్యూదిల్లీ అందమైన రాజధాని కాదని ఎవరూ ఎత్తి చూపలేదు. కానీ ‘సెంట్రల్‌ విస్టా రీవాంప్‌ ప్లాన్‌’ పేర కొత్త పార్లమెంటు, కొత్త ప్రధాని నివాసం, కొత్త ఉపరాష్ట్రపతి నివాసం, ఆఫీసు బ్లాకులు అన్నీ కట్టడానికి రూ.20 వేల కోట్ల ఫండ్స్‌ కేటాయించారు. ఇప్పుడు కరోనాకై హెల్త్‌కేర్‌ ఫండ్‌ అంటూ కేటాయించినది దాని కంటె రూ.5 వేల కోట్లు తక్కువగా రూ.15 వేల కోట్లు! అయోధ్యలో రామమందిరం కట్టే పని ఒకటి నెత్తిమీద వుండగా, యీ దిల్లీ షోకులు అవసరమా? ఇటు కరోనాకై మనం కలవరపడుతూండగానే కేంద్రం ఆ ప్రాజెక్టుకై మార్చి 20న నోటిఫికేషన్‌ వెలువరించింది. దానిపై సూచలను, అభ్యంతరాలను సేకరించేశాం, యిక మొదలు పెట్టేస్తాం అంటూ.

ఇంకో పక్క మనను కరోనా పేరు చెప్పి విరాళాలు అడుగుతున్నారు. ప్రధానమంత్రి సహాయ నిధి, ముఖ్యమంత్రి సహాయనిధి అని ఎప్పణ్నుంచో వున్నాయి. వాటికిచ్చిన విరాళాలు కాగ్‌ పరిధిలోకి వచ్చి ఆడిట్‌ అవుతాయి కాబట్టి కొంత ధీమా వుంటుంది. ఆ నిధులు వదిలేసి యిప్పుడీ ‘పి.మ్‌. కేర్స్‌’ అంటూ కొత్త ట్రస్టు ఎందుకు పెట్టాలి? నాకైతే అర్థం కావటం లేదు. ఇది కరోనా కోసమేనా? రేపు మరో వైరస్‌ వస్తే యింకో ఫండ్‌ మొదలులెడతారా? ఈ నిధికి పెన్షను డబ్బుల్లోంచి కూడా యివ్వాలిట!

కేంద్ర ఉద్యోగులకు వచ్చే ఏడాది జులై వరకు డిఏ ఫ్రీజ్‌ చేసేశారు. తక్కినవాటికి కూడా యిలాటి రూలే త్వరలో పెట్టేయవచ్చు. ఇటు కెసియార్‌ మూణ్నెళ్లపాటు అద్దె తీసుకోకూడదంటున్నాడు. వార్షికాదాయం యింతకు పైన వున్న వారికి.. అనే లిమిటు పెట్టి వుండాల్సింది. అద్దె డబ్బులపై బతికేవారి సంగతేమిటి? ఇక్కడీయన, దిల్లీలో పెద్దాయన కొత్త సెక్రటేరియట్‌లు కడదామనుకుంటున్నపుడు డబ్బులెక్కణ్నుంచి తెద్దామనునుకున్నారు? ఇప్పుడీ పేరు చెప్పి మన గోళ్లూడకొట్టి లాక్కుంటున్నారు. సర్దార్‌ పటేల్‌ విగ్రహం కట్టినపుడు, బుల్లెట్‌ ట్రెయిన్‌ ప్లాన్‌ చేసినపుడు, తాజాగా నమస్తే ట్రంప్‌కు రూ.100 కోట్లతో హంగు చేసినపుడు యిలాటి ఉపద్రవాలకై కాస్త అట్టేపెట్టుకోవాలన్న ఆలోచన రాలేదా?

ప్రపంచం మొత్తంలో ఆయిలు ధర పాతాళానికి చేరింది. కానీ మన దగ్గర పెట్రోలు ధరలు ఆకాశం నుంచి దిగి రావటం లేదు. అలా మిగుల్చుకున్న డబ్బంతా (దాదాపు 5 లక్షల కోట్లని ఎవరో లెక్క వేశారు) ఏమైందో, కేంద్రం దగ్గర ఎంత పోగుపడిందో, రాష్ట్రాల వద్ద ఎంత పోగుపడిందో తెలియదు. తాజాగా లాక్‌డౌన్‌ వలన ఆర్థిక యిబ్బందులు ఎదుర్కునేవారి కోసం అంటూ ఆర్థికమంత్రి ప్రకటించిన 1.70 లక్షల కోట్లు మన జిడిపిలో 1% కంటె తక్కువ. బ్రిటన్‌, స్పెయిన్‌, జర్మనీ యిలాటి ఫండ్స్‌కు జిడిపిలో 20% కేటాయించాయట. మన డబ్బంతా విలాసాలకు, ఉచితపథకాలకూ పోతున్నట్లుంది.

అత్యంత అవసరమైన ఆరోగ్యవసతుల పరిస్థితి చూడబోతే - మన 135 కోట్లమంది జనాభాకు ఉన్న వెంటిలేటర్లు 40 వేలు! దానికి 80-100 రెట్లు కావాలట! 84 వేల మందికి ఒక ఐసోలేషన్‌ బెడ్‌ ఉంది. 11,600 మంది పేషంట్లకు ఒక డాక్టరున్నాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెయ్యిమందికి ఒక డాక్టరుండాలంటుంది. క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్టులు 50 వేల మంది ఉండాలంటుంది, మనకు ఉన్నది 8,350 మంది. అవన్నీ యిప్పటికిప్పుడు సవరించలేం, ఎన్నాళ్లు లాక్‌డౌన్‌ పొడిగించినా!

మనకు ఎటుచూసినా ఇంజనియర్లే కనబడుతున్నారు. ఒకర్ని వెతకబోతే వెయ్యిమంది తగులుతున్నారు. కంప్యూటర్లపై పని చేసిచేసి వీళ్లకు మెడనొప్పి, వీపు నొప్పి, కళ్ల నొప్పి వస్తే చికిత్స చేయడానికి పదివేలమందికి ఒక్క డాక్టరు కూడా లేడు. మెడికల్‌ కాలేజీ పెట్టాలంటే మెడికల్‌ కౌన్సిల్‌ ఓ పట్టాన పర్మిషన్‌ యివ్వడం లేదు. నిజానికి మనకు వచ్చే జలుబూ, జ్వరాలకు 500 ఫీజు పుచ్చుకునే స్పెషలిస్టు అక్కరలేదు. గతంలోలా ఆర్‌ఎంపి, ఎల్‌ఎంపి డాక్టర్లు చాలు, మెడికల్‌ కౌన్సిల్‌ వాళ్లను తయారు చేయాలి. ఆయుర్వేదం, హోమియోపతి డాక్టర్లలో క్వాక్స్‌ను ఏరివేసి, ఆ విధానాలపై ప్రజలకు నమ్మకం పెంచాలి.

సరే, యివన్నీ సంచితకర్మ అనుకుంటే యీ కోవిడ్‌ వచ్చిన తర్వాత కూడా మనం ఓ పట్టాన మేలుకోలేదు. 2019 డిసెంబరులో వూహాన్‌లో తీవ్రంగా వచ్చినదని తెలిశాక, ఎయిర్‌ ఇండియా విమానాన్ని పంపి అక్కణ్నుంచి భారతీయ విద్యార్థులను వెనక్కి తెప్పించినపుడే, చైనాతో మనకు చాలా లావాదేమలున్నాయి, వాళ్లు వస్తూపోతూ వుంటారు, నిరోధించాలి అనుకుని వుండాల్సింది. చైనావాళ్లు ప్రపంచమంతా వ్యాపించారు కాబట్టి విదేశాల నుంచి వచ్చిన ప్రయాణీకులందరినీ స్క్రీన్‌ చేయాల్సింది. కానీ ఆ విషయంలో చాలా జాప్యం జరిగిందని గత వ్యాసంలోనే రాశాను.

ఫిబ్రవరి నెలంతా సిఏఏ వ్యతిరేక ఆందోళనకారులను అదుపుచేయడంలో, బజెట్‌ సమావేశాల్లో, ట్రంప్‌ ఫంక్షన్‌ హడావుడిలో గడిచిపోయింది. అప్పటికే ఇరాన్‌, ఇటలీ, దక్షిణ కొరియాలలో ప్రజలు చచ్చిపోతున్నారు. ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల వీసాలు రద్దు చేసేసరికి మార్చి 3 వచ్చింది. మార్చి 13 నాటికి 81 పాజిటివ్‌ కేసులు వచ్చేసినా హెల్త్‌ మినిస్ట్రీలో జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ ఇదేమీ హెల్త్‌ ఎమర్జన్సీ కాదని మీడియాకు చెప్పారు. వారం తిరక్కుండా 22న జనతా కర్ఫ్యూ సూచించారు. 24 నుంచే లాక్‌డౌన్‌ అన్నారు. అదీ నాలుగు గంటల నోటీసుతో, ఎక్కడివారు అక్కడే అన్నారు.

ఇదేమీ భూకంపం కాదు, కకావికలై పరుగులు పెట్టడానికి. లాక్‌డౌన్‌ వంటి తీవ్రమైన చర్య చేపట్టినపుడు ముందుగానే నోటీసు యిచ్చి ఏదో గూడు చూసుకుని సర్దుకోండి అనాలి. దక్షిణాఫ్రికా జనాభా 6 కోట్ల లోపునే, అయినా అది తన ప్రజలకు 72 గంటల నోటీసు యిచ్చి లాక్‌డౌన్‌ విధించింది. 135 కోట్ల మందిమి కుదురుకోవడానికి ఆ పాటి సమయమైనా యివ్వకపోతే ఎలా? అందునా మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు వట్టిపోయి నగరాలు పట్టిపోవడం ఎప్పణ్నుంచో సాగుతోంది.

మహా నగరాలలో సేవలందించేవారందరూ వలస కార్మికులే. వాళ్లు వాళ్లవాళ్ల యిళ్లకు ఎలా వెళతారు? వెళ్లకుండా నగరంలోనే ఓ చోట కట్టకట్టుకుని వుంటే తాము రోగం తెచ్చుకుని, యింకోళ్లకు అంటించే ప్రమాదం వుంది కదా. వాళ్ల తిండితిప్పలు ఎలా? ఆకలికి తట్టుకోలేక గుంపుగుంపులుగా తమ వూళ్లకు ప్రయాణం తలపెడితే సామాజిక దూరం పాటించడం ఒట్టి మాట అవుతుంది కదా అని ఆలోచించి దానికి తగ్గట్టుగా ప్లాన్‌ చేయాలి కదా.

అప్పటికే వూహాన్‌లో లాక్‌డౌన్‌ పెట్టి 8 వారాలైంది. ఇటలీలో కొన్ని ప్రాంతాల్లో పెట్టి నాలుగు వారాలు, దేశమంతా పెట్టి రెండు వారాలు అయింది. వారిని సంప్రదించి, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో కనుక్కుని, వాటిని మనకు అన్వయించుకుని ప్లాను ప్రకారం వుండాల్సింది. హడావుడిగా పెట్టేసి, తర్వాత దిద్దుబాటు చర్యలు తీసుకోవడం జరిగింది. అందుకనే మొదట్లో వ్యవసాయ పనులకు మినహాయింపు యివ్వక, తర్వాత నాలిక కరుచుకుని వాటికీ యిచ్చారు.

కరోనా కారణంగా జరిగే ఆర్థిక నష్టాన్ని నివారించడానికి ఒక స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ నియమిస్తున్నామని, దానికి ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారని మోదీ మార్చి 19న ప్రకటించారు. అయితే దాని సంగతేమీ తెలియదని ఆవిడ చెప్పింది. అలాగే మిగతావీ. ఆటోమొబైల్‌ రంగం వాళ్లని వెంటిలేటర్లు తయారు చేయమని, టెస్టింగ్‌ కిట్స్‌ సప్లయి చేయడానికి 8 మంది సప్లయిర్లను మార్చి 24 దాకా సెలక్టు చేయలేదు. ఈ 8 మందిలో తొలి నాళ్లలో యిద్దరే ఆపరేట్‌ చేశారు.

మార్చి 22నాటి జనతా కర్ఫ్యూ ప్రతిపాదనను మోదీ మార్చి 18న చేశారు. అంటే అప్పటికే కరోనా తీవ్రత అర్థమైందన్నమాటేగా! అయినా మార్చి 19 వరకు పిపిఇ (పర్శనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌. దీనిలో గ్లవ్స్‌, మాస్క్‌, ఎన్‌ 95 మాస్క్‌, శరీరాన్ని పూర్తిగా కప్పే గౌను ఉంటాయి)  ఎగుమతిని నిషేధించలేదు. అప్పటికి మూడు వారాల క్రితమే ఫిబ్రవరి 27న ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘‘పిపిఇల కొరత చాలా వుంది. కరోనా భయంతో కొన్ని దేశాలు విపరీతంగా కొనేస్తూ సరుకు దాచేస్తున్నాయి. అందువలన మీరు ఉన్నవి జాగ్రత్త పెట్టుకోండి, కొత్తవి తయారుచేయించుకోండి’ అని చెప్పింది. ఈ కొరత యిలా వుందని తెలిసి కూడా మనం అప్పటివరకు ఎగుమతులు నిషేధించకపోవడమేమిటి? దీని వెనక్కాల ఎవరిదో హస్తం ఉంది.

ఎందుకంటే జనవరి 30న మొదటి కరోనా కేసు నమోదు కాగానే మర్నాడే ఫారిన్‌ ట్రేడ్‌ డైరక్టరు జనరల్‌ పిపిఇల ఎగుమతిని నిలిపివేస్తూ ఆదేశాలిచ్చారు. వారం గడిచేసరికి ఫిబ్రవరి 8న, ప్రభుత్వం ఆ ఆదేశాన్ని సవరించి సర్జికల్‌ మాస్కులు, గ్లవ్స్‌ మాత్రం ఎగుమతి చేయవచ్చంది. ఫిబ్రవరి 25 నాటి కల్లా, అంటే ఇటలీలో 11 మంది మరణించేనాటికి ప్రభుత్వం వాటిని మరింత సవరించి ఎగుమతి చేసే లిస్టులో మరో 8 ఐటమ్స్‌ చేర్చింది. దాంతో ఇప్పుడు మన డాక్టర్లకు, ఆరోగ్య సిబ్బందికి తగినన్ని పిపిఇలు లేకుండా పోయాయి. డాక్టర్లను, నర్సులను రెయిన్‌కోట్లు, సన్‌ గ్లాసెస్‌ పెట్టుకుని పనిచేయమన్నారు.

దాంతో శ్రీనగర్‌, పంజాబ్‌, దిల్లీలో వాళ్లు నిరసన ప్రదర్శనలు చేశారు. దిల్లీలోని హిందూ రావ్‌ హాస్పటల్‌లో అనేకమంది డాక్టర్లు, నర్సులు నిరసనగా రాజీనామాలు చేశారు. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటానని బెదిరించింది. డిఆర్‌డిఓని పిపిఇలు తయారుచేయమని అడిగాం అవి వస్తాయి, యీ లోపున యిలా కానివ్వండి అన్నారు. ఇది గమనించి భారత్‌ డైనమిక్స్‌ అనే ప్రభుత్వ సంస్థ ఎయిమ్స్‌లో డాక్టర్లకు పిఇపిలు కొనండి అని రూ.50 లక్షల విరాళమిస్తే ఎయిమ్స్‌ యాజమాన్యం దాన్ని పిఎమ్‌ కేర్‌ ఫండ్‌కు మళ్లించేసిందని, యిలా అయితే తమ గతి ఏమిటని ఎయిమ్స్‌ డాక్టర్లు అభ్యంతర పెట్టారు.

ఇక తనకుమాలిన ధర్మాల సంగతికి వస్తే - కితం నెలలోనే 15 టన్నుల పిపిఇలను వూహాన్‌కు పంపాం. 90 టన్నుల పిపిఇలను సెర్బియాకు పంపాం. ఇటలీకి ఉత్తినే యిచ్చాం. కరోనా చికిత్సలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ 29 మిలియన్‌ డోసులు కావాలని ట్రంప్‌ దబాయించి పుచ్చుకున్నాడు. ‘ముందు యివ్వనన్నారు, మోదీకి చెప్పలేదేమో, తక్కిన దేశాలకు ఆపి వుంటారు. మనకెలా ఆపుతారు? మన దగ్గర చాలా సాయం తీసుకుంటున్నారుగా! నేను మోదీతో మాట్లాడాను, ఇస్తాడు. ఇవ్వకపోతే ప్రతిచర్య తప్పక ఉంటుంది.’ అన్నాడు ట్రంప్‌ ఓ విలేకరితో. మొత్తానికి ఆ మందు అమెరికాకు చేరింది. ఇక్కడ మన షాపుల్లో దొరకటం లేదు. రేపు హఠాత్తుగా మనకు పెద్దమొత్తంలో కావాలంటే మన దగ్గర ఎంత స్టాకుందో తెలియదు. మందుల ఫ్యాక్టరీలు 30-50% మాత్రమే, అదీ పది రోజులుగా పనిచేస్తున్నాయి. మరి అంత స్టాకు మళ్లీ రావడానికి ఎంతకాలం పడుతుందో ఎవరికి తెలుసు?

ఇంత జరిగాక ప్రభుత్వం నీతి ఆయోగ్‌ను ఈ విషయంలో ఓ రోడ్‌మ్యాప్‌ను మూడు నెలల్లో తయారుచేసి యిమ్మనమని అడిగింది. ఇప్పుడు నీతి ఆయోగ్‌ దీనిపై కసరత్తు ప్రారంభించింది. వైద్యపరికరాల్లో రిసెర్చి జరగాలని, ఆ రంగానికి ప్రాముఖ్యత యివ్వాలని ఐఎస్‌సి, ఐఐటీ వంటి ప్రముఖ సంస్థల్లో బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, జెనెటిక్స్‌ విద్యార్థుల సంఖ్య మూడు రెట్లు పెంచాలని యిటువంటి ప్రతిపాదనలతో ముందుకు వెళుతోంది. కరోనా చల్లారగానే, యీ ప్రణాళికలన్నీ చప్పబడిపోకుండా, ముందుకు సాగి పూర్తి రూపాన్ని దాల్చి, ఆరోగ్యరంగంలో మన దేశం మెరుగుపడుతుందని ఆశిద్దాం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?