cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: పట్టాభికి, లాలూకు తిట్టురాయ సంబంధం

ఎమ్బీయస్‍:  పట్టాభికి, లాలూకు తిట్టురాయ సంబంధం

ఆంధ్రలో ఒక తిట్టు ఉపయోగించడం వలన పట్టాభి ఎలా చిక్కుల్లో పడ్డారో చూశాం. దానివలన పెద్దగా రాజకీయ పరిణామాలేవీ జరగలేదు. టిడిపి బలం పెరగనూ లేదు, వైసిపి బలం తరగనూ లేదు. కాకపోతే వైసిపి శ్రేణులు ఏ మేరకు బరితెగిస్తాయో, వాటికి ముఖ్యమంత్రి అండ ఎంత బలంగా వుందో తేటతెల్లమైందంతే. కానీ బిహార్‌లో ఓ నిందావాచకం వుపయోగించడం వలన రాజకీయంగా చాలా కథే నడిచింది. కాంగ్రెసు, ఆర్‌జెడిల పొత్తు చెడి, బిహార్ ఉపయెన్నికలలో యిద్దరూ విడివిడిగా పోటీ చేసి జెడియు చేతిలో ఓడిపోవడం జరిగింది. అలా తిట్టవలసిన అవసరం లాలూకి ఏమొచ్చింది, కాంగ్రెసు ఏ విధంగా రెచ్చగొట్టింది అనే విషయాలు మాట్లాడడానికి ముందు ఆయనతో బాదరాయణ సంబంధం ఏర్పరచుకున్న పట్టాభి గారి తిట్టుపై నా వ్యాఖ్యానం చెప్తాను. మొదటగా చెప్పవలసినది పట్టాభి తిట్టు ఎంత పెద్దదైనా వైసిపి కార్యకర్తలు అతని యింటిపై, టిడిపి ఆఫీసుపై దాడి చేయడం మాత్రం గర్హించదగినది. ఆ చర్యను జగన్ ఖండించక పోవడం తప్పు. మాటను మాటతోనే ఎదుర్కోవాలి తప్ప, చేతతో కాదు.

ఆ దాడులూ అవీ క్రిమినల్ కేసులు. కోర్టులో వాటికి శిక్షలు ఎలాగూ పడతాయి. కానీ పట్టాభి తన తిట్టును కోర్టులో సమర్థించుకునే సందర్భంలో ఆ మాటకు అర్థం ఏం చెపుతారో చూడాలనే కుతూహలం నాకుంది. దానికి అర్థమేమిటని అడుగుతూ కొందరు నాకు మెయిల్స్ రాశారు. నిజానికి నాకూ తెలియదు. పెద్దలు మనకు భాష నేర్పేటప్పుడు తిట్లు, బూతులు నేర్పరు. ఎక్కడైనా విని, యింట్లో ప్రయోగిస్తే మొదటిసారి వీపు మీద ఓ దెబ్బ వేసి అలా అనుకూడదు అంటారు, రెండోసారి కూడా అంటే చెంప ఛెళ్లుమనిపిస్తారు తప్ప ఫలానా బూతుకి అర్థం ఫలానా అని విడమర్చి చెప్పరు. నిజానికి మాద-ద్ , బం-త్, భ-వ వంటి పదాలను అర్థం తెలియకుండా యిల్లాళ్లు తమ పిల్లలపై, యితర కుటుంబసభ్యులపై ప్రయోగిస్తూ వుంటారు.

ఓ సారి మా అమ్మమ్మ ‘పెళ్లికి లేటుగా వెళ్లారటగా? ఏమైనా వంటకాలు మిగిలాయా? దుప్పేనా?’ అని నన్ను అడిగింది. ఆ ‘దుప్పి’ ప్రయోగమేమిటో నాకు తెలియదు కానీ అప్పటికి సమాధానం చెప్పేశాను. ఓ అయిదారేళ్ల తర్వాత ఓ పదకోశంలో ‘దుప్పి భోజనం’ అర్థం తెలుసుకుని దానిలోని అశ్లీలత ఆవిడకు తెలుసా? తెలిసి వాడిందా, తెలియక వాడిందా అని ఆశ్చర్యపడ్డాను. అర్థం తెలియకుండా వాడితే దాన్ని బూతు అనవచ్చా? పట్టాభిగారు ఆంతరంగికంగా మాట్లాడితే అదో దారి. కానీ ఆయన టీవీ ఛానెల్‌లో ‘ఓ బోసె-కె ముఖ్యమంత్రీ..’ అంటూ తిడుతూ ప్రయోగించారు. అది సభ్యమైన తిట్టా? అసభ్యమైన, తిట్టా? అశ్లీలమైన బూతా? అన్నది భాషావేత్తలు తేల్చాలి. ఒకవేళ బూతని తేలితే, అర్థం తెలియక ప్రయోగించాను అని తప్పుకునే అవకాశం పట్టాభికి వుందా? నాకు ఒకాయన మెయిల్ రాశారు. ‘టిడిపి వారు జగన్‌ను విపరీత మనస్త్వి అన్నారు, 420 అన్నారు, ఉన్మాది అన్నారు, జాంబీ అన్నారు. వాటన్నిటికీ స్పందించని వైసిపి శ్రేణులు దీనికి మాత్రం ఎందుకిలా రియాక్టయ్యారు? ఇదేదో పెద్ద బూతే అయివుంటుంది.’ అని లాజిక్ లాగారాయన.

ఇప్పుడే ఎందుకు రియాక్టయ్యారనేది చెప్పలేం. మాదాల రంగారావు అని ఓ నటుడు వుండేవాడు. ఆయన నటించిన, తీసిన నాలుగు విప్లవసందేశ సినిమాలు హిట్టవడంతో తను నిజంగా విప్లవకారుణ్ననే భ్రమలో పడ్డాడు. వరసపెట్టి సినిమాలు తీసేసి, తనే దర్శకత్వం వహించేసి, సెన్సార్‌వాళ్లతో తెగ పోట్లాడి, సినిమాలు ఫెయిలయి, చివరకు చప్పబడి జనాల స్మృతిలో మరుగున పడిపోయాడు. కమ్యూనిస్టు పార్టీలకు వీర సపోర్టరు. ఎన్టీయార్ హవా విపరీతంగా నడిచే సమయంలో ఆయన్ని విమర్శిస్తూ ఊరూరా సభలు నిర్వహించాడు. అమలాపురం సభలో అతనిపై రాళ్లు పడ్డాయి. చాలా అప్రజాస్వామికంగా అనిపించి అక్కడి మిత్రుడికి ఫోన్ చేసి అడిగాను, యిదేమిటండీ అని. ‘గాంధీని తిట్టాడండి, జనం వూరుకున్నారు, నెహ్రూని తిట్టాడు ..ఊరుకున్నారు, దేశనాయకులందరినీ తిట్టాడు ..ఊరుకున్నారు. ఎన్టీయార్‌ను తిట్టాడు... రాళ్లేశారు.’ అని క్లుప్తంగా వివరించాడు. ఆనాటి మూడ్‌లో గాంధీ, నెహ్రూల కంటె ఎన్టీయార్ గొప్పవాడన్న భావం అక్కడి ప్రజల్లో వుంది సుమా అనే శ్లేష వినిపించింది.

అలాగే యీ మాటకే ఎందుకు రియాక్టయ్యారు అంటే చెప్పలేం. లాస్ట్ స్ట్రా ఆన్ కామెల్స్ బ్యాక్ అంటారు కదా, తడిసి మోపెడయినపుడు చివరి గడ్డిపోచ కూడా సహించలేని భారమౌతుంది. టిడిపి వాళ్లు క్షేత్రస్థాయిలో ఏమీ చేయటం లేదు, కరోనా టైములో కంటికి కనబడలేదు. ఎన్నికలు ఎగ్గొడుతున్నారు. యాక్టివిటీ కనబరచాలి అంటే టీవీల్లో కనబడి తిట్టడమే పని అనుకుంటున్నారు. పట్టాభి స్థాయి నాయకుడికి గుర్తింపు రావాలంటే ఎబిఎన్, టివి5 తప్ప వేరే గతేముంది? అందువలన నోరు పారేసుకోవడమే ముఖ్యవ్యాపకంగా పెట్టుకున్నారు. కొద్దికాలానికి స్టాకు అయిపోయి, పారేసుకోవడానికి, ఆరేసి చూపడానికీ ఏదీ మిగలలేదు. పదాల వేటలో పడ్డారు. రమణగారి ‘‘ఇద్దరమ్మాయిలు-ముగ్గురబ్బాయిలు’’ నవలలో యిద్దరు హీరోలు మధ్యలో విలన్‌ను పట్టుకుని తిట్టడం మొదలుపెడతారు. దుర్మార్గుడు, దుష్టుడు లాటి పదాలు అయిపోయాక దుర్యోధనుడు, దుశ్శాసనుడు వంటి వంటి పౌరాణిక పాత్రలు కూడా వాడేశాక, దుర్మతి వంటి ప్రయోగం కూడా అయిపోయాక, ఖలుడు అనే పదం తడుతుంది. దానితో పాటు ఖలుడి మీద సుమతి పద్యం గుర్తుకు వచ్చి దాన్నీ వాడతారు. ఈ హడావుడిలో దేని ఆధారంగా తాము తిట్లు లంకించుకున్నామో మర్చిపోతారు. అలాగ పట్టాభి గారికి స్టూడియోకి వచ్చే దారిలో ఎవరో తుంటర్లు ఒకరి నొకరు తిట్టుకుంటూంటే యీ పదం స్ఫురించి వుంటుంది. పట్టుకుని వచ్చి వాడేసి వుంటారు. సినిమా కవుల విషయంలో యిలాటి ఉదంతాలు చాలా వింటాం.

తిట్ల విషయంలో రిసెర్చి కష్టమైన పనే. నాకు తెలుగు బాగానే తెలిసినా, కొన్ని తిట్లు శరీరంలోని ఏ భాగాలకు అన్వయమౌతాయో యిప్పటికీ సందేహాలున్నాయి. ఇంగ్లీషు తిట్లయితే ఎప్పటికప్పుడు అప్‌టుడేట్ కావాల్సిందే. ఇప్పుడైతే నెట్‌లో చూడవచ్చు కానీ, గతంలో నిఘంటువుల్లో దొరికేవి కాదు. నవలలో, సినిమాలో అవి తారసిల్లినపుడు ఊహించుకుని ఊరుకునేవాణ్ని. 1990లో ఓ సారి విఎకె రంగారావు గారు తన మిత్రుడి గురించి మాట్లాడుతూ ఓ లైంగిక చేష్ట గురించి ఓ పదం వుపయోగించారు. నాకు తెలియలేదు. అది గ్రహించి, ఆయన దానికి సంస్కృతానువాదం చెప్పారు. అదీ తెలియలేదు. నిజానికి ఆ చేష్టకు సైంటిఫిక్ టెర్మ్ నాకు తెలుసు. కానీ యీ పదాలు తెలియవు. ఆయన వెంటనే ‘మీలాటి వాళ్లందరూ చదువుకున్నవాళ్లుగా చెలామణీ అయిపోతారు..’ అంటూ వెక్కిరించారు. చదువు‘కొ’న్నవాళ్ల మీద ఆయన చాలా విసుర్లు విసురుతారు.

నాకు రోషం వచ్చి మార్కెట్లో వెతికి ‘డిక్షనరీ ఆఫ్ స్లాంగ్’ అనే అరుదైన పుస్తకం కొని, చదివి, చాలా మాటలు తెలుసుకున్నాను. తెలుగులో కూడా అలాటిదేదైనా వుందా? నాకైతే తెలియదు. పేరడీలకు పేరు బడిన జరుక్‌శాస్త్రి గారు తెలుగు తిట్లతో ‘మైల నిఘంటువు’ అని పుస్తకం రాస్తాను అంటూండేవారట. అది వెలువడలేదు. ఆయన గతించి చాలాకాలమైంది. ‘తెలుగులో తిట్టు కవిత్వం’పై రావూరి దొరసామి శర్మ అనే ఆయన రిసెర్చి చేసి, దాన్ని పుస్తకంగా తెచ్చారు. అశ్లీల పదాలు వాడవలసి వచ్చినపుడు మధ్యలో కొన్ని అక్షరాలకు బదులుగా చుక్కలు పెట్టారు. తెలిసినవారు ఊహించుకోగలరు. తెలియనివారేమీ చేయలేరు. నేను ఆల్మోస్ట్ ఆల్ వూహించగలిగాను. దానిలో యీ బోసె-కె పదం వుందాని వెతకవచ్చుగా అని మీరనవచ్చు. ఆ పుస్తకాన్ని పాఠకులకు పరిచయం చేద్దామని 3 నెలల క్రితమే అనుకున్నాను. కానీ పుస్తకం కనబడటం లేదు. ఇంట్లోనే వుంటుంది. దొరకగానే పరిచయం చేస్తాను. నాకు గుర్తున్నంతవరకు యీ పదం దానిలో తారసిల్లలేదు.

టిడిపి నాయకుడు ఉపయోగించాడు కాబట్టి బోసె-కె పదప్రయోగంలో తప్పేమీ లేదని నిరూపించడానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పూనుకున్నారు. ఫలానా సినిమాలో వాడారు (దానిలో కూడా అది వినగానే టీచరు ఉలిక్కిపడతాడు, విద్యార్థి తన పేరు బోస్ డి. కె. అని చెప్పడంతో ఏమీ అనలేక ఊరుకుంటాడు) వంటి వాదన వినిపించారు తప్ప ఫలానా నిఘంటువులో వాడారనో, ఫలానా కథలో, నవలలోనో సవ్యమైన అర్థంలోనే వాడారనో రుజువులు చూపలేదు. ఒక పత్రికాధిపతి తలచుకుంటే భాషావేత్తలను సులభంగా సంప్రదించవచ్చు. ‘జగన్ మాత్రం ‘ఈ ముఖ్యమంత్రిని ఉరి తీయాలి’ అనలేదా?’ అనే కుతర్కానికి దిగారు. జర్నలిజంలో కొమ్ములు తిరిగిన ఈయనకు ఏ పదం బరువెంతో తెలియదా? రాజకీయ ప్రతిపక్షి పాలనను కర్కశపాలన, రాక్షసపాలన, వీరిని ప్రజలో దండిస్తారు, రాబోయే ఎన్నికలలో బుద్ధి చెప్తారు, చెంపదెబ్బలు కొడతారు’ వంటి ప్రకటనలు సర్వసాధారణం. ‘ఉరి తీయాలి’ తీవ్రమైనదే. కానీ అది స్వాతంత్ర్యానికి ముందు నుంచీ వుంది.

‘స్వాతంత్ర్యం వచ్చాక బ్లాక్‌మార్కటీర్లను సమీపంగా వున్న కరంటు స్తంభాల నుంచి ఉరి తీస్తాం’ అన్నది వేరెవరో కాదు, ‘పండిత్’ జవహర్‌లాల్ నెహ్రూ. జగన్ ఉరి తీస్తాను అనలేదు, ఉరి తీయాలి అనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ఎంతైనా అది తీవ్రపదప్రయోగం, పట్టాభి వాడినది బూతు.. అథవా తీవ్రమైన తిట్టు. తీవ్రమైన.. అని ఎందుకంటున్నానంటే వెధవ, చవట వంటివి ఎప్పుడూ వినబడుతూనే వుంటాయి. పవన్ కళ్యాణ్, వైసిపి మంత్రులు, టిడిపి నాయకులు వాటిల్లో నిష్ణాతులు. ఎడాపెడా వాడేస్తూనే వుంటారు. వారి కంటె సెపరేటు మార్గంలో వెళ్లి గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నారు కాబట్టి పట్టాభి యీ పదాన్ని వాడారు. ‘అది సవ్యమైన పదమే, మా యింట్లో ఒకరిపై మరొకరం వాడుకుంటూ వుంటాం. మా పార్టీ సమావేశాల్లో కూడా..! కావాలంటే మీరు నన్ను అని చూడండి. ముసిముసి నవ్వులు నవ్వుతాను తప్ప బిపి పెంచుకోను’ అని జజ్ గారి ముందు వాదించుకోవలసిన అగత్యం ఆయనకుంది.

ఇంతకీ లాలూ తిట్టు నేపథ్యమేమిటంటే, బిహార్‌లో కాంగ్రెసుకు హఠాత్తుగా దురాశ పుట్టింది. 1990 తర్వాత తమ పార్టీ తరఫున ఒక ముఖ్యమంత్రి అభ్యర్థంటూ లేకుండా పోయాడు కాబట్టి అప్పణ్నుంచి ఆర్‌జెడి తరఫున లాలూ, జెడియు తరఫున నీతీశ్, బిజెపి తరఫున సుశీల్ మోదీ కనబడుతున్నారు తప్ప చూపించుకోవడానికి తమకంటూ ఎవరూ లేరని ముందుగా జ్ఞానోదయం అయింది. ఇదే నా చివరి ఎన్నిక అంటూ గతేడాది నీతీశ్ ప్రకటించేశాడు. లాలూ జైల్లో మగ్గిమగ్గి అనారోగ్యపీడితుడై కదలడం కష్టంగా వున్నాడు. నీతీశ్‌తో మరీ క్లోజ్‌గా వున్నాడంటూ సుశీల్ మోదీని బిజెపి తప్పించివేసింది. అంతా బాగానే వుంది అనుకుంటూంటే లాలూ తనయుడు తేజస్వి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు వచ్చేస్తున్నాడు. అతనిలాటి యువనాయకుడు మనకు లేడు ఎలా అనుకుని, రాహుల్ ప్లానో ఏమో జెఎన్‌టియు విద్యార్థి నాయకుడు కన్హయ కుమార్‌ను సిపిఐ నుంచి రిజైన్ చేయించి, తమ పార్టీలోకి లాక్కుని వచ్చారు. అతనితో బాటు జిగ్నేశ్ మేవానీ వంటి గుజరాతీ దళిత నాయకుణ్ని కూడా బిహార్‌లో తిప్పారు. మహాగఠ్‌బంధన్‌ లోంచి బయటకు వచ్చి కన్హయ చేత పాంచజన్యం పూరించి, ఉపఎన్నికల కురుక్షేత్రంలో దిగి, రెండు స్థానాల్లోనూ విడిగా పోటీ చేద్దామని ప్లాను.

కూటమిలోంచి బయటకు రావడానికి గాను, ఆర్‌జెడిపై బండ వేయడం అత్యంత అవసరమైన పని. ‘ఆర్‌జెడి, బిజెపి కలిసి పని చేస్తున్నాయి’ అని ఒక నమ్మశక్యంగాని ప్రకటన విడుదల చేశాడు బిహార్ కాంగ్రెసు ఇన్‌చార్జి భక్త చరణ్ దాస్! చాలా ఏళ్లపాటు జైల్లో, ఆస్పత్రిలో వుండి, ఆ తర్వాత అనేక మాసాలు దిల్లీలో కూతురు డాక్టరు మీసా భారతి యింట్లో విశ్రాంతి తీసుకుని మూడున్నరేళ్ల తర్వాత అక్టోబరు 24న రాష్ట్రానికి తిరిగి వచ్చిన లాలూను ఎయిర్‌పోర్టులోనే పాత్రికేయులు ‘ఇది నిజమేనా?’ అని అడగడంతో అతనికి ఒళ్లు మండిపోయింది. కోపంగా ‘అలా అన్న ‘భక్‌ఛోన్‌హర్’ ఎవడు?’ అన్నాడు. తన మాతృభాషైన భోజపురి భాషలో ఆ మాటకు అర్థం ‘తెలిసీతెలియకుండా వాగేవాడు’ అని లాలూ, అతన్ని సమర్థించేవాళ్లు అంటున్నారు. ‘కాదు అది తిట్టే, ఒడిశాకు చెందిన దళితుడైన భక్త చరణ్‌ను అవమానించే తిట్టే! దళితులంటే లాలూకు చులకన.’ అని కాంగ్రెసు నానా యాగీ చేసింది. అవును దళితులను అవమానించడానికే లాలూ పుట్టాడు అంటూ కాంగ్రెసుకు విరోధి, బిజెపి-జెడియు ప్రభుత్వంలో భాగస్వామి అయిన జితిన్ రామ్ మాంఝీ అన్నాడు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కింద కేసు పెట్టాల్సిందే అని జగ్‌జీవన్ రామ్ కూతురు, కాంగ్రెసు నేత మీరా కుమార్ అంది. వీటి పర్యవసానాలేమిటి అనేది ‘లాలూతో కాంగ్రెసు చెడగొట్టుకున్న విధం’ అనే వ్యాసంలో చూద్దాం.

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2021)

mbsprasad@gmail.com

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!