Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: రావి కొండలరావు కథలు, నాటకాలు

ఎమ్బీయస్: రావి కొండలరావు కథలు, నాటకాలు

2020లో వెళ్లిపోయిన చిత్రప్రముఖుల్లో రావి కొండలరావుగారు ఒకరు. నాకెంతో ఆత్మీయులు. జులైలో ఆయన పోగానే నివాళి రాద్దామనుకుంటూనే వాయిదా వేసుకుంటూ పోయాను. ఎందుకంటే రాయడానికి చాలా వుంది. నిజానికి ఆయన పోగానే పత్రికలు ఘనంగా నివాళి అర్పించాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంజలి ఘటించారు. బతికి వుండి వుంటే ఆయనే ఆశ్చర్యపడి, తన మీద తనే జోక్ చేసేవారు. అందువలన ఆయన సినిమా పాత్రల గురించి రాయను. సినీచరిత్రకారుడిగా ఆయనే తన కాలమ్స్ ద్వారా తన గురించి, యితరుల గురించి విస్తారంగా రాశారు. ఆయన యితర రచనల గురించి, ఆయనతో నాకున్న వ్యక్తిగత అనుభవాల గురించి రాస్తాను. దానికి ముందు రేఖామాత్రంగా ఆయన కెరియర్ గురించి..

1932లో జన్మించిన రావి కొండలరావు గారు 87 ఏళ్లు జీవించారు. నటుడిగా, నాటకరచయితగా, నాటకదర్శకుడిగా పేరు తెచ్చుకుని సినిమారంగంలోకి అడుగుపెట్టిన యీయన రాసిన 3 నాటకాలు, 20 నాటికలు సుప్రసిద్ధాలు. పత్రికారచయితగా, సహాయదర్శకుడిగా వుండగానే ‘‘శోభ’’ (1958) ద్వారా నటుడయ్యారు. ‘విజయచిత్ర’కు 26 యేళ్లు, ‘వనిత’కు 5 యేళ్లు సహ (పేరుకి అలా వేశారు కానీ మొత్తమంతా యీయనే చూసుకునేవారు) సంపాదకత్వం నెరుపుతూనే 550కు పైగా సినిమాలలో, ప్రధానంగా హాస్యపాత్రలు పోషించారు. ‘‘పెళ్లి పుస్తకం’’ సినిమా కథకు నందీ అవార్డు నందారు. 

విజయా-చందమామ చిత్రత్రయం ‘‘బృందావనం’’, ‘‘భైరవద్వీపం’’, ‘‘శ్రీకృష్ణార్జునవిజయం’’లకు నిర్మాణ సంచాలకుడిగా వున్నారు. సినీచరిత్రను గ్రంథస్తం చేసిన ‘బ్లాక్‍ అండ్‍ వైట్‍’కు నందీ అవార్డు వచ్చింది. నటుడిగా ‘‘ప్రేమించిచూడు’’ ‘‘వరకట్నం’’, ‘‘అందాలరాముడు’’. ‘‘మీ శ్రేయోభిలాషి’’, ‘‘పెళ్లిపుస్తకం’’ యిత్యాది అనేక సినిమాలలో పాత్రల ద్వారా పేరు తెచ్చుకున్నారు. ‘‘నాగావళి నుంచి మంజీర వరకు’’ పేరుతో ఆత్మకథ రాశారు. భార్య రాధాకుమారి కూడా నటి. ఈయన కంటె ముందే గతించారు.

కొండలరావుగారు రాసిన 18 కథలతో ఓ సంకలనం వెలువడింది. వాటిలో 4 కథలను పరిచయం చేస్తున్నాను. హాస్యరచయితగా ప్రఖ్యాతి చెందిన యీయన చావు గురించి రాసిన కథలవి - ‘‘రెండు శవాలు’’ - ఒకూళ్లో ఓ పాడుబావి రెండు శవాలు దొరికాయి. ఒక ఆడ, ఒక మగ. ఇద్దరూ వయసులో వున్నవారే! ఆత్మహత్యలు కావచ్చని పోలీసులు తేల్చారు. ఆ అబ్బాయికి పెళ్లి కాలేదు. ఆ అమ్మాయి మాత్రం వివాహిత. 

ఇక దాంతో వూళ్లో వాళ్లు కథలు అల్లేశారు. వారిద్దరికీ సంబంధం వుందని, అది తెలిసి ఆమె భర్త మందలించాడని..యిలా.. చివరకు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు - వాళ్లిద్దరూ లవర్స్ అనీ, నూతి దగ్గర కూచుని కబుర్లు చెప్పుకుంటూ వుంటే ఆమె భర్త వాళ్లిద్దరినీ వెనక్కాలనుండీ తోసేశాడనీ! అసలు నిజం చనిపోయినవాళ్ల ఆత్మల సంభాషణ ద్వారా బయటపడుతుంది. జరిగినదేమిటంటే ఆమె భర్త పేదరికం భరించలేక యిల్లు వదలి వెళ్లిపోయాడు. ఈమె ఆకలికి తాళలేక ఒక రాత్రివేళ ఆత్మహత్య చేసుకుంది. కాస్సేపటికి అతను వచ్చి నూతి గట్టుమీద కూచుని ఏదో ఆలోచించుకుంటూ జారిపడ్డాడు. అంతే!

‘‘చావులకొండ’’ - ఆ వూళ్లో ఆ కొండను చావుల కొండ అంటారు. ఎందుకంటే అక్కణ్నుంచి అందరూ ఆత్మహత్యలు చేసుకుంటూ వుంటారు. వాటిని ఆపడానికి ప్రభుత్వం ఓ యిద్దరు పోలీసులను - ఒకతను వయసులో పెద్దవాడు, మరొకడు చిన్నవాడు - కాపలా పెట్టింది. ఓ సాయంత్రం ఒకతను ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చాడు. తన కష్టాలు చెప్పుకొచ్చి తనను చావనిమ్మని బతిమాలాడు. కేసు పెడతాం జాగ్రత్త అని వీళ్లిద్దరూ అతన్ని తరిమేశారు. కాస్సేపటికి చిన్న పోలీసు టీ కోసం కొండకింద కొట్టుకెళ్లి వచ్చేసరికి పెద్దపోలీసు కనబడలేదు. టోపీ కింద ఓ ఉత్తరం వుంది - ‘ఇందాకా వచ్చినవాడి కష్టాల లాటివే నావీనూ. ఆత్మహత్యకు మించిన పరిష్కారం లేదని ఎంతో చక్కగా విడమరిచి చెప్పాడు. అందుకే నేను చచ్చిపోతున్నాను.’ అని.

‘‘మూమూర్ష’’ - రామ్మూర్తి అనే అతను యిహలోకంలో కష్టాలు భరించలేక, వాటిని తప్పించుకుందామని బండరాయి మీదనుండి వురికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య పాపం కాబట్టి యమలోకంలో యమకింకరులు యితన్ని నానారకాల బాధలూ పెట్టారు. ఆ బాధలు భరించలేక భూలోకమే సుఖంగా వుందనిపించింది అతనికి. అందువలన యమసదనం శిఖరం ఎక్కి అక్కణ్నుంచి దభాలున దూకేసి ‘ఆత్మహత్య’ చేసుకున్నాడు.

‘‘దిదృక్ష‘‘ - శేషగిరి అనే అతనికి ఓ వింత కోరిక - తను చనిపోయినప్పుడు జనం ఎలా ఏడుస్తారో చూడాలని! తనే అనేమిటి - ఎవడూ చూడలేదు కదా! చూడగలిగితే అదృష్టవంతుడే! చూడగలగడం ఎలా? అని ఆలోచిస్తే విపరీతమైన వూహ కలిగింది. చచ్చిపోయినట్టు నటిద్దామనుకున్నాడు. శవంలా నటించడం సాధ్యం కాదు కాబట్టి, వేరే వూరుకు వెళ్లిపోయి, తను అకస్మాత్తుగా చనిపోయినట్టుగా ఎవరిచేతో టెలిగ్రాం యిప్పించి, తను మారువేషంలో దొంగతనంగా యిల్లు చేరుకుని - ఆ ఏడుపులూ వ్యవహారాన్ని చాటుగా చూడవచ్చని ఐడియా వేశాడు. అలా అయితే ఏడ్చి మూర్ఛపోయిన భార్య సంతోషిస్తుంది. తన మిత్రులెవరో, శత్రువులెవరో తేటతెల్లంగా తెలిసిపోతుంది.

ఐడియా వేశాక అతను వేరే వూరికి వెళ్లిపోయి అక్కణ్నుంచి చావు టెలిగ్రాం యిచ్చాడు. తర్వాత రైలెక్కి తన వూరుకి ముందు వూరులోనే దిగాడు. అక్కడ చిన్న హోటల్లో భోజనం చేసి రాత్రి తొమ్మిదిగంటలవేళ పల్లెటూరివాడిలా వేషం వేసుకుని, తలకొక పాగా చుట్టుకుని జట్కాలో తమ వెనకవీధికి చేరి, తన యింటి పెరట్లో దాగున్నాడు. వచ్చేపోయేవాళ్ల పరామర్శలు, భార్య దుఖం కళ్లారా చూసి ఆనందంతో లోపలకి రాబోయే వేళ అతన్ని ఓ పామూ కాటేసింది! అతను నిజంగానే చనిపోయాడు.

ఇక నాటకాల గురించి. తెలుగు సినిమారంగంలో దాదాపు అందరు నటీనటులూ నాటకరంగం నుండే వచ్చినా సినిమాలకు వచ్చాక వారందరూ నాటకరంగాన్ని విస్మరించారు. విస్మరించని అతి కొద్దిమందిలో రావి కొండలరావుగారు ఒకరు. ‘‘కన్యాశుల్కం’’పై అభిమానంతో ఒక్క అక్షరమైనా మార్చకుండా టీవీ సీరియల్‍గా రూపొందించారు. సినిమాల్లో నటిస్తూ, ‘విజయచిత్ర’కు సంపాదకత్వం వహిస్తూ కూడా ఆయన నాటకాలు, రాయడమే కాదు, నటించి, దర్శకత్వం వహించారు. ‘ఆంధ్ర ఆర్ట్స్’ పేర నాటకబృందాన్ని ఏర్పరచి ఊరూరా ప్రదర్శనలు యిచ్చారు. 

ఆయన రాసిన నాటకాల్లో ఇరుగుపొరుగు గొడవలపై రాసిన ‘‘నాలుగిళ్ల చావిడి’’, యవ్వనానికి మందు కనిపెట్టిన ‘‘ప్రొఫెసర్‍ పరబ్రహ్మం’’ యిత్యాది ప్రసిద్ధమైనవి. కొన్ని కథలలో సీరియస్‍నెస్‍ చూపినా, స్వతహాగా ఆయన హాస్యప్రియుడు. వైజాగ్‍, హైదరాబాద్‍లలో ‘‘హ్యూమర్‍ క్లబ్స్’’ స్థాపించారు. రంగస్థలానికి ఆయన రాసిన యితివృత్తాలలో, సంభాషణలలో గుచ్చుకోని హాస్యం అడుగడుగునా తొంగిచూస్తుంది.

నాటికల విషయాని కొస్తే ఆయనకు బాగా పేరు తెచ్చినది - ‘‘కుక్కపిల్ల దొరికింది’’. 1956 నాటి యి నాటిక యిప్పటికీ పాప్యులరే. ఓ పెద్దమనిషి పెంచుకునే కుక్కపిల్ల తప్పిపోయింది. దాన్ని వర్ణిస్తూ, పట్టి తెచ్చినవారికి నూటపదహార్లు యిస్తానని  పత్రికలో ప్రకటన యిచ్చాడు. ఇక దానితో మొదలవుతాయి అతని కష్టాలు. ప్రతీవాడూ రోడ్డు మీద దొరికిన ఊరకుక్కపిల్లను తీసుకువచ్చి ‘ఇదే మీ కుక్కపిల్ల, బహుమతి యివ్వండి’ అని పేచీ పెట్టారు. తెల్లరంగు అని రాశారు కాబట్టి నల్లదానికే సున్నం కొట్టి ఒకడు తెచ్చాడు. పొట్టితోక అన్నారు కాబట్టి వున్న తోకను కత్తిరించి తెచ్చాడు మరోడు. ఇదేమిటయ్యా అంటే నేనేం కత్తిరించలేదు, ఆకలేసి అదే కొరుక్కు తినేసిందని దబాయించాడు. బహుమతి యివ్వకపోతే తంతామన్నాడు. చివరకు యి బాధ భరించలేక ‘కుక్కపిల్ల దొరికింది, ఇంకేమీ తీసుకురావద్దు’ అని మరో ప్రకటన యిచ్చాడు.

‘‘స్వయంవరం’’ అనే మరో నాటికలో రఘునాథ్‍ షా (బెర్నార్డ్ షా పై అభిమానంతో తన పేరుకు షా అని చేర్చుకున్నాడు) తన కూతురును పెళ్లి చేసుకోవడానికి వచ్చినవారిని యింటర్వ్యూలు చేశాడు. ఒకడు కమ్యూనిస్టు. అందుకని తన పేరును రష్యన్‍ మోడల్లో గోపాలోవ్‍ అని మార్చుకున్నాడు. మరొకడు కవి. తన పేరు రుధిరశ్రీ అని పెట్టుకున్నాడు. మరొకడు పిల్లజమీందార్‍. వీళ్లు తమలో తామూ కలహించుకున్నారు. ఈ లోపున  స్వయంవరం చేసుకోవలసిన అమ్మాయి  తండ్రి యిష్టానికి వ్యతిరేకంగా మేనమామను పెళ్లి చేసుకోవడానికి యింట్లోంచి పారిపోతూ పోతూ తండ్రి పేర రాసిన ఉత్తరం రాసింది. అది చదివి  వీళ్లంతా హతాశులై పోయారు.

‘‘కథ కంచికి’’ అనే నాటిక ఓ నాటకం రిహార్సల్‍లో తమాషా గురించి. హీరోయిన్‍ వేషం వేస్తున్న చంద్రిక హీరో వేషం వేస్తున్న రామంతో ప్రేమ నటించలేకపోతోంది. పైగా విలన్‍ వేషంలో వున్న వైకుంఠంతో చనువుగా వుంటోంది. అతన్ని కొట్టవలసిన ఘట్టాల్లో కూడా కొట్టడం లేదు. దీనికి కారణం ఏమిటంటే అంతకుముందు యిదే టీమూ వేరే నాటకంలో వేస్తూండగా చంద్రిక విసిరిన పూలకుండీ పొరబాటున రామానికి తగిలింది. ఆమె క్షమాపణ కోరింది. ఇక రామం ఆమె వెంటపడ నారంభించాడు. ఈ నాటకంలో హీరో వేషం రావడంతో యిక రెచ్చిపోతున్నాడు. కానీ చంద్రిక వైకుంఠాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకుంటోంది. అందువలన హీరోలో విలన్‍ను, విలన్‍లో హీరోను చూసి సరిగ్గా నటించలేకపోతోంది.

ఈ నేపథ్యం తెలిశాక రచయితకు ఐడియా వచ్చింది - పాత్రధారులను తారుమారు చేద్దామని.         ఈ లోపునే ఓ సంఘటన జరిగింది. రిహార్సల్‍లో చంద్రిక విసిరిన దువ్వెన పొరబాటున రామం కంట్లో గుచ్చుకుంది. చంద్రిక సింపతీ కోసమే రామం దారిలో నిలబడ్డాడని వైకుంఠం కోపం తెచ్చుకుని విలన్‍లా ప్రవర్తించాడు. దాంతో చంద్రికకు వైకుంఠం మీద అసహ్యం, రామంపై జాలి కలిగి రామాన్ని పెళ్లి చేసుకుంటానంది. ఇక హీరో, విలన్‍ పాత్రధారులను తారుమారు చేయనవసరం లేకపోయింది.

‘‘అంతరాయానికి చింతిస్తున్నాం’’ అనే నాటిక నాటకాల ముందు మీటింగులు పెట్టి నాటకప్రదర్శనలను ఎలా దెబ్బ తీస్తున్నారో చెప్పే సునిశిత విమర్శ. ‘‘చుట్టం కొంప ముంచాడు’’ అనే నాటికలో అప్పుల్లో కొట్టుమిట్టులాడుతున్న ఓ దంపతుల యింటికి దూరపు బంధువునంటూ ఒకతను వస్తాడు. అతన్ని వదిలించుకోవాలని వీళ్లు ఎంతో ప్రయత్నించి చివరకు వెళ్లగొడతారు. తీరా చూస్తే అతను వీళ్లు అభిమానంగా వుంటే ఆస్తి యిచ్చి వెళదామని వచ్చినవాడు. ‘‘అకరసటం శ్రీమంకాంకుం’’ అనే నాటిక తెలుగింట బారసాల ప్రహసనాలను వెక్కిరిస్తుంది. ఇష్టదైవాల పేర్లు అయిపోయాక, క్రికెట్‍టీమ్‍ సభ్యుల పేర్లు కూడా కలపడంతో ఆ పేరు వచ్చింది. చివరకు పురోహితుడు కూడా ఓ పేరు కలిపేస్తాడు!

వచ్చేసారి ఆయనతో నాకున్న వ్యక్తిగత పరిచయం గురించి రాస్తాను. (ఫోటో ‘‘వైకుంఠపాళి’’ నాటిక ప్రదర్శన)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?