cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: కులాల లెక్క తేలకుండానే రిజర్వేషన్లా!?

ఎమ్బీయస్‍: కులాల లెక్క తేలకుండానే రిజర్వేషన్లా!?

జనాభా గణనను కులాలవారీగా చేపట్టాలని కొందరంటున్నారు. అబ్బెబ్బే, అలా చేస్తే కులవ్యవస్థను బలోపేతం చేసినట్లవుతుంది, తప్పు అని కొందరు వాదిస్తున్నారు. గతంలో యుపిఏ లాగానే యిప్పటి ఎన్‌డిఏ కూడా కులగణనకు ససేమిరా ఒప్పుకోవటం లేదు. వాళ్ల రాజకీయక్రీడల గురించి ‘కులగణనను బిజెపి ఎందుకు వ్యతిరేకిస్తోంది?’ అనే వ్యాసంలో మాట్లాడుకోవచ్చు కానీ, ముందుగా కులాల లెక్క తేల్చకుండానే రిజర్వేషన్లు కొనసాగాలా? అన్నదానిపై మనం ఒక అభిప్రాయం – పాలకులెవరూ పట్టించుకోకపోయినా - ఏర్పరచుకోవడం మేలు. ముందుగా అనుకోవలసినది – కులగణన చేయడం వలననే కులవివక్షత ఏర్పడుతుందని వాదించడంలో నాకు నమ్మకం లేదు. మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా రిజర్వేషన్ వ్యవస్థ ఉన్నంత కాలం మన కులం చర్చకు వస్తూనే వుంటుంది.

రిజర్వేషన్ పొందే కులాలు, పొందని కులాలుగా సమాజం విడిపోయి వుంది. మనం ఏదో ఒక వర్గంలో వుండి తీరతాం, యిష్టమున్నా లేకపోయినా! విద్యాసంస్థ, ఉద్యోగమిచ్చే సంస్థ, ఋణమిచ్చే బ్యాంకు, టిక్కెట్టిచ్చే రాజకీయ పార్టీ - ప్రతీదీ మీరు ఏ వర్గంలో చేరతారని అడుగుతుంది. అందువలన మీరు కులం పేరు స్పెసిఫిక్‌గా చెప్పకపోయినా ఒసి, బిసి, ఎస్సీ వంటి వర్గం పేరు చెప్పితీరాల్సి వస్తోంది. ఈ విభజన యింతటితో ఆగటం లేదు. రిజర్వేషన్ లేని కులాలు కొన్ని రిజర్వేషన్ కోసం అడుగుతున్నాయి కాబట్టి, కొన్ని రాజకీయ పార్టీలు ఆ పేర సంఘటితం కావాలని మీపై ఒత్తిడి తెస్తున్నాయి. రిజర్వేషన్ వున్న వర్గాల్లో కూడా చాలా విభేదాలున్నాయి. రిజర్వేషన్ ఫలాలు అందటం లేదని, ఆ వర్గంలోని మిగతా కులాల వారే సింహభాగం ఫలాలను కాజేస్తున్నారని, వారిని ఎదిరించాలని పోరాటాలు చేస్తున్నాయి.

బిసిలలో ఎం(మోస్ట్) బిసిలు అనే చీలిక వుంది. బిసిలలో కొందరు తమను ఎస్సీలలో చేర్చాలని డిమాండు చేస్తున్నారు. ఈ కోలాహలంలో మీరు కులం పేరు చెప్పకపోయినా ఒసి, బిసి, ఎస్సీ వంటి వర్గం పేరైనా చెప్పకుండా వుండలేరు. రిజర్వేషన్ మాట పక్కన పెట్టి ఆలోచించినా, కులప్రస్తావన సమాజంలో పెరుగుతున్న విషయం గమనించండి. ఒక పార్టీ టిక్కెట్లు పంచితే బిసిలకు యిన్ని, ఎస్సీలకు యిన్ని పంచామంటూ ప్రముఖంగా చెప్పుకుంటుంది. మంత్రివర్గం ఏర్పడితే యింతమంది ఫలానా ఫలానా వాళ్లకు యిన్నేసి పదవులు యిచ్చాం అని ప్రకటించుకుంటుంది. ప్రభుత్వాలు కులాల పేర కార్పోరేషన్లు ఏర్పరుస్తాయి. ఆ కులస్తుడు స్కాలర్‌షిప్‌కో, ఋణానికో అప్లయి చేస్తే ఆ కార్పోరేషన్ ద్వారానే పంపిణీ చేస్తాయి.

పాలిటిక్స్ ఇంతేనండి, దరిద్రం అని ఊరుకుందామా? మేట్రిమొనీ యాడ్స్ మాటేమిటి? ఈరోజుల్లో కులాంతర వివాహాలూ, వాటికి సమాజం ఆమోదమూ పెరుగుతున్నాయి. కానీ అవి వ్యక్తిగత యిష్టాయిష్టాల వలనే జరుగుతున్నాయి తప్ప వాటిలో ఏ సిద్ధాంతాలూ, ఆదర్శాలూ లేవు. ప్రేమ వ్యవహారాలు వున్నా, పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఎరేంజ్‌డ్ మారేజికే మొగ్గు చూపుతున్నారు అధికాంశం యువత. పెద్దల్ని సంబంధాలు చూడమనగానే వాళ్లు తమ కులంలోనే చూస్తున్నారు. మారేజి బ్యూరోలో కులం పేరు రాస్తున్నారు. కొందరు కులాంతరానికి అభ్యంతరం లేదని రాసినా, మాట్రిమొనీ కంపెనీవారు వారిని ఆ కులానికి సంబంధించిన విభాగంలోనే వేస్తున్నారు.

వాళ్లు టీవీలో యిచ్చే యాడ్స్ చూడండి. కాపు మేట్రిమొనీ, కమ్మ మేట్రిమొనీ..., మీ కులంలో వాళ్లని చేసుకుంటేనే మీ అభిరుచులు కలుస్తాయి, వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుంటుంది అని ప్రచారం చేస్తున్నారు. నచ్చినవాణ్ని చేసుకోండి అనేది పాతకాలపు నినాదమై పోయింది. యువతలో కులభావనను ప్రచారం చేస్తున్న యీ యాడ్స్‌ను ప్రభుత్వం ఎందుకు వారించదో నాకు తెలియదు. ఈ మేట్రిమొనీ వాళ్లు కులంతో ఆగరు. మీ ఉపకులం ఏమిటని అడుగుతున్నారు. దాని తర్వాత ఆ ఉపకులం పేర ఏర్పాటు చేసిన విభాగంలో మీ పేరు వేసేసి, అక్కడున్న సంబంధాలే పంపిస్తారు. నాకు ఏ ఉపకులమైనా ఫర్వాలేదు మొర్రో అని మీరు చెప్పినా వినరు. ఇదీ మన సమాజస్థితి.

జీవితంలో పైకి రావడానికి టాలెంటు తప్ప కులం అక్కరకు రాదు అనేది వాస్తవం. మీ పని నచ్చితే ఏ కులం వాడైనా సరే, మీకు పని యిస్తాడనేది నిజమే. కానీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిదానిలో కులానికి ఒక పాత్ర వుండి తీరుతుంది. ఐఐటిలు, ఐఐఎమ్‌లే కాదు, ఇప్పటి ప్రభుత్వం కేంద్రవిద్యాలయాలు, సైనిక స్కూళ్లలో కూడా ఒబిసిలకు రిజర్వేషన్ కల్పించేసింది. అందువలన మీ మార్కుల మాట ఎలా వున్నా సీటు వస్తుందో లేదో మీ కులం నిర్ణయిస్తుంది. ఇక ఉద్యోగంలో చేరితే మీ ప్రమోషన్ ఎప్పుడు వస్తుందో కులం నిర్ణయిస్తుంది. ఎస్సీ అయితే తక్కువ సంవత్సరాల అనుభవం వున్నా సరిపోతుంది. ఈ వాస్తవాన్ని మీరు ఆమోదించి తీరాలి. కొన్ని తరాల క్రితం మీ కులస్తులు వారిని తక్కువగా చూసినందుకు యీ తరంలో మీరు మూల్యం చెల్లిస్తున్నారు. ఇది మీ చేష్టల ఫలితం కాదు, మీరు ఫలానా కులంలో పుట్టినదాని ఫలితం. మీ కులమేదో ప్రభుత్వం అడిగి తెలుసుకుని, ‘ఇదిగో నీ పూర్వతరాలు చేసిన నష్టానికి, పరిహారం నీ దగ్గర వసూలు చేస్తున్నా. నీకంటె తక్కువ మార్కులు వచ్చినవాడికి, తక్కువ అనుభవం వున్నవాణ్ని నీకంటె ముందుకు నెడుతున్నాను.’ అని చెప్తోంది.

అంతేకాదు, పత్రికలలో మీ కులం గురించి వ్యాసాలు వస్తాయి. వందల, వేల ఏళ్ల క్రితం మీ కులస్తులు ఎటువంటి ఘోరాలు చేశారో, యితర కులస్తులను ఎంత నీచంగా హింసించారో విపులంగా రాసి, ఆ భావజాలం మీ కులస్తులలో యింకా పోలేదని ముక్తాయింపు రాస్తారు. ఆ కులం పేరు చెప్పి మిమ్మల్ని శిలువ ఎక్కిస్తారు. మీలో ఆ భావజాలం లేదని తేల్చే ఏ స్కానర్నీ యింకా కనిపెట్టలేదు. అందువలన మీ స్నేహితులు, టీవీ చర్చల్లో మీతో పాటు పాల్గొనే కొందరు అతి‘వాదులు’ ఏమైనా అంటే నోర్మూసుకోవాలి. ఇలా కులస్పృహ మీ చుట్టూ ఆవరించి వుంది. ‘నాకా పట్టింపు లేదండి’ అని మీరు బాహాటంగా చెప్పుకుంటూ తిరిగినా ‘అలాగే అంటారు లెండి, అదే నిజమైతే మీ అమ్మాయిని ఎవరైనా దళితుడికి పెళ్లి చేసి చూపండి.’ అంటారు. ‘అప్పుడు నా భావాలను మా అమ్మాయి మీద రుద్ది ఆమె భావస్వేచ్ఛను హరించినట్లు కాదా, ఫెమినిస్టులు దండెత్తితే..?’ అని అడిగితే లాభం లేదు.

నిజానికి కులాంతరం చేసుకున్నంత మాత్రాన కులభావనలు లేనట్లు కాదు. తను ప్రేమించిన వ్యక్తి ఏ కులమైనా ఫర్వాలేదు అనుకోవడం వరకే ఆ కన్సెషన్. తన కులం, భార్య కులం తప్ప తక్కిన వాటిపై చిన్నచూపు వుంటే వుండవచ్చు. తన భార్య కులంలో సైతం తక్కినవారంటే గౌరవం లేకపోవచ్చు. సొంత కులం గురించి, ఇతర కులాల గురించి ఎవరి భావనలు వారికి పరిమితమైనంత వరకు చిక్కు లేదు. కులం కారణంగా యితరులను అవమానిస్తేనో, వారికి న్యాయంగా దక్కవలసినది దక్కకుండా చేస్తేనో తప్పు. నా ఉద్దేశంలో మనం కులం గురించి గర్వపడవలసినది ఏమీ లేదు. అది మనం కష్టపడి సంపాదించినది కాదు. దానిలో మన ఘనత కానీ, న్యూనత కానీ ఏమీ లేదు. దాన్ని యాక్సెప్ట్ చేసి వూరుకోవడం మేలు. మంచీ, చెడూ, సామర్థ్యం, అసమర్థత – వీటికీ కులానికి సంబంధం లేదనే అవగాహన, ఎవరి ఔన్నత్యం వారికి వుందనే స్పృహ వుంటే చాలు.

ఇక రిజర్వేషన్ పాలసీ గురించి నా వ్యక్తిగత అభిప్రాయాలు కూడా చెప్తాను. ఈ పాలసీ పెట్టడానికి ఉపయోగించిన తర్కమేమిటి? తరతరాలుగా సమాజంలో కొన్ని కులాల వారు విద్యకు దూరంగా వుండడం చేత చదువుకోలేక పోయారు, తమ ప్రతిభను పెంచుకుని స్వయంకృషితో ఉద్యోగాలు సంపాదించుకోలేరు కాబట్టి, వారికి తక్కువ మార్కులు వచ్చినా స్కూళ్లల్లో ఎడ్మిషన్లు, ఉద్యోగాలలో కొన్ని రిజర్వ్ చేసి యివ్వాలి అని. దీని వెనకాల ఉన్న పొరపాటు ఆలోచన ఏమిటంటే, అగ్రకులాల వాళ్లందరూ చదివేసుకుంటూ వచ్చారు. తెలివితేటలతో వెలిగిపోతూ వచ్చారు అని. ఒప్పుకోవలసిన పరమసత్యం ఏమిటంటే తెలివితేటలు ఏ కులానికి పరిమితం కావు. ఒకే కుటుంబపు పిల్లలైనా తెలివితేటల తేడా చూడవచ్చు. పండితపుత్రుడు పరమశుంఠ అనే సామెత ఊరికే వచ్చి వుండదు. అలాటి కేసులు చూసే వుంటారు. చిన్న కులాల వాళ్లకు తెలివితేటలు తక్కువ కాబట్టి వాళ్లకు తక్కువ మార్కులు వస్తాయన్న లాజిక్కే తప్పు. తెలివితేటలున్నా చదువు లేకపోతే రాణించవు అనుకుందాం. పెద్ద కులాల్లో కూడా 50 ఏళ్ల కితం దాకా చదువు గురించి పట్టించుకోనివాళ్లు, చదువు మధ్యలో ఆపేసినవాళ్లు కనబడేవారు.

ఇటీవలి కాలంలో చదువు పట్ల శ్రద్ధ అందరికీ పెరిగింది. పెద్ద, చిన్న కులాల వారందరికీ ఉచిత, నిర్బంధ విద్య అమలైంది. ఈ పరిస్థితుల్లో కూడా చదువుకోలేదు, రిజర్వేషన్ పద్ధతి పెట్టినా డ్రాపౌట్లు వుంటున్నాయంటే దానికి కారణమేమిటి? స్కూళ్లల్లో అన్ని కులాల వారినీ రానిస్తున్నారు, విద్య బోధిస్తున్నారు. అక్కడ సామాజిక వివక్షత లేదు. పిల్లవాణ్ని బడికి పంపలేదు అంటే దానికి పేదరికమే కారణం. అది గుర్తించే మధ్యాహ్న భోజన పథకమని, అమ్మ ఒడి అని ఏవేవో స్కీములు పెట్టి, స్కూలు డ్రాపౌట్ల సంఖ్య తగ్గించుకుంటూ వస్తున్నారు. అంటే యిది ఆర్థిక పరమైన సమస్య తప్ప సామాజిక సమస్య కాదు. పేదరికాన్ని, బాలకార్మిక వ్యవస్థను తగ్గించగలిగితే విద్యార్జన, దాని కారణంగా తెలివితేటల రాణింపు, సమాజంలో తెలివైన వారి సంఖ్యలో పెరుగుదల సాధించవచ్చు.

సామాజిక, ఆర్థిక స్థితిగతుల బట్టి రిజర్వేషన్ యిస్తున్నామని ప్రభుత్వం అంటుంది. అంటే రెండిటిలోనూ వెనకబడి వుంటేనే యివ్వడం భావ్యం. అంటే ఆర్థికంగా బాగా వున్న కుటుంబాలను అనగా క్రీమీ లేయర్‌ను దీన్నుంచి తప్పించి తీరాలి. అది జరగటం లేదు. మొదటగా ఎస్సీ, ఎస్టీలను తీసుకుందాం. రెండు వర్గాలలోనూ గతంలో మాట ఎలా వున్నా ఒకటి రెండు దశాబ్దాలుగా డబ్బున్నవారు, అధికారులు, వ్యాపారస్తులు ఉన్నారు. పిల్లలకు చదువు చెప్పించి, ప్రయోజకుల్ని చేయాలన్న ఆలోచనా, ఆ శక్తీ కూడా వుంది వాళ్లకు. ఇక వారికి రిజర్వేషన్ ఎందుకివ్వాలి? ఒక కుటుంబంలో ఒక తరం రిజర్వేషన్ సౌకర్యం పొందాక, తర్వాతి తరానికి కూడా యివ్వడంలో లాజిక్ ఏముంది? రిజర్వేషన్ ద్వారా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగు పడడమే కాక, సామాజిక గౌరవం కూడా ఆటోమెటిక్‌గా పెరుగుతుంది.

ప్రస్తుత ఎస్సీ రిజర్వేషన్‌లో కొన్ని కులాలు మాత్రమే తరతరాలుగా ఫలాలన్నీ అనుభవిస్తున్నాయి కాబట్టే దానిలో వర్గీకరణ డిమాండు ముందుకు వచ్చింది. ఈ మోనోపలీని తప్పిస్తే తప్ప ఆ కాటగిరీలోని తక్కిన కులాలు, కుటుంబాలు బాగుపడవు. తప్పించాలంటే కుటుంబంలో రిజర్వేషన్ సౌకర్యం ఒక్కసారే దక్కుతుందనే రూలు పెడితే సరి! ఈ పరిస్థితి బిసిల్లో కూడా వుంది. అక్కడా కొన్ని కులాలే సర్వసౌకర్యాలు అనుభవిస్తున్నాయి. అందుకే వాటిలో మోస్ట్ బాక్‌వర్డ్ అని, మరోటని కొన్ని చోట్ల విడగొడుతున్నారు, ఎబిసిడి అని వర్గీకరణ చేస్తున్నారు. అయినా కొన్ని కుటుంబాలే లబ్ధి పొందుతున్నాయి. అక్కడ కూడా పై రూలే పెడితే ఎక్కువ కులాలకు, కుటుంబాలకు విస్తరిస్తుంది.

ఇక క్రీమీ లేయర్ పరిమితి ఎంత వుండాలి? మన దేశపౌరుల తలసరి ఆదాయం 2019-20లో ఏడాదికి రూ. 1.27 లక్షలని ఎస్టిమేట్ వచ్చింది. ఇటీవలే 2021 డిసెంబరు కల్లా రోజుకి రూ.372 అవుతుందని అంచనా అన్నారు. అలా అయితే 1.37 లక్షలు. దానికి మూడు రెట్లు వేసుకుంటే 4 లక్షలైంది. అంటే నెలకు 33 వేల ఆదాయం అన్నమాట. తక్కువేమీ కాదు. కానీ బిసిలకు ప్రస్తుతం వున్న క్రీమీ లేయర్ పరిమితి రూ.8 లక్షలు. అంటే నెలకు 66 వేలన్నమాట. అంతకంటె తక్కువ ఆదాయం వచ్చేవాళ్లు ప్రభుత్వ దృష్టిలో ఆర్థికంగా వెనకబడినవారు! వింతగా లేదూ! ఇక ఎస్సీ, ఎస్టీల విషయానికి వస్తే పరిమితే లేదు. కోటీశ్వరులైనా, వందల ఎకరాల భూస్వాములైనా ఆర్థికంగా వెనకబడినట్లే, ఆ యా కులాలకు చెందివుంటే!

ఇక సామాజికంగా వెనకబడి వుండడం అనే కొలబద్ద గురించి మాట్లాడుకుందాం. ఎస్టీలను సమాజం తక్కువగా చూసిందని నాకెప్పుడూ తోచలేదు. ఉదాహరణలకు కోయదొరలకు చేయి చూపించుకుంటారు. వాళ్లు అంటరానివాళ్లని ఎవరూ అనుకోరు. ఎస్సీల పట్ల మాత్రం తరతరాలుగా వివక్షత వుందని ఒప్పుకుని తీరాలి. మన భాషలో, తిట్లలో అది తొంగి చూస్తూనే వుంటుంది. వ్యవసాయ కూలీలుగా వున్న దళితులకు, భూస్వాములుగా వున్న అగ్రకులస్తులకు మధ్య అప్పుడప్పుడు ఘర్షణ రావడం తరతరాలుగా జరుగుతోంది. దళితవాడలను తగలబెట్టడం, వారి ఆడవారిని చెరచడం వంటి ‘శిక్షల’ ద్వారా వారిని అదుపులో పెట్టడానికి చూడడం అనేక ప్రాంతాల్లో జరుగుతూ వచ్చింది. అయితే నగరానికి తరలివచ్చిన దళితులకు, చదువుకుని ఉద్యోగాల్లోనో, వ్యాపారాల్లోనో ప్రవేశించిన దళితులకు యీ బాధ తప్పుతోంది. అంటరానితనం దాదాపు మాయమైనా, కొన్నికొన్ని చోట్ల దాన్ని పాటిస్తున్న వార్తలు వస్తూనే వున్నాయి.

స్థూలంగా చెప్పాలంటే ఆర్థికంగా మెరుగుపడిన దళితుల పట్ల సామాజిక వివక్షత లేదు కానీ, మెరుగుపడని వర్గాల మాత్రం యింకా బాధపడుతూనే వున్నాయి. అందువలన యీ రిజర్వేషన్లను చప్పున అన్ని ఎస్సీ కులాలకు అందేట్లా చూసి, వారి ఆర్థికపరిస్థితి మెరుగుపడేలా చూడాలి. దానికి గాను క్రీమీ లేయర్‌ పెట్టి కొంతమందిని తప్పించి, కుటుంబానికి ఒక్క ఛాన్స్ మాత్రమే అనే పద్ధతితో మరి కొంతమందిని తప్పించి, ఇప్పటిదాకా ఫలాలు అందనివారికి అందించాలి. దానికి తోడు దొంగ ఎస్సీలను ఏరిపారేయాలి. అగ్రకులాల వారు కొందరు రాహుకేతువుల్లా ఎస్సీ పంక్తిలో వచ్చి కూర్చుంటూంటారు. ఇక కొందరు దళిత క్రైస్తవులైతే మరీ ఘోరం, మతానికి క్రైస్తవం, రిజర్వేషన్‌కు ఎస్సీ. ఇప్పటి చట్టం ప్రకారం దళిత హిందువులకు, దళిత శిఖ్కులకు, దళిత బౌద్ధులకు ఎస్సీ రిజర్వేషన్ సౌకర్యం వుంది తప్ప, దళిత క్రైస్తవులకు, దళిత ముస్లిములకు లేదు. (కొన్ని రాష్ట్రాలలో వాళ్లకు బిసి స్టేటస్ యిచ్చారు) చట్టం యొక్క ఉచితానుచితాల గురించి చర్చ అనవసరం. దళిత క్రైస్తవులు ఎస్సీ రిజర్వేషన్ పొందితే చట్టవిరుద్ధమైన పని చేసినట్లే. దట్సాల్. వీళ్లందరినీ ఏరివేస్తే, అసలైన వారు త్వరగా ఉద్ధరించబడడానికి వీలుంటుంది.

బిసిల రిజర్వేషన్ల గురించి ‘కులగణనను బిజెపి ఎందుకు వ్యతిరేకిస్తోంది? అనే వ్యాసంలో చర్చిద్దాం. వారి పట్ల వివక్షత వుందా? సామాజికంగా వెనకబాటుగా వున్నారా? ఎస్సీల విషయంలో అయితే సెన్సస్‌లో వారి జనాభా ఎంతో ప్రతి పదేళ్లకు లెక్క తేలుతోంది. బిసిల విషయంలో అది లేకుండానే, ఊహాగానాల తోనే రిజర్వేషన్లు యిచ్చేస్తున్నారు. ప్రతి బిసి కులమూ తమ తమ కాకిలెక్కలు చెప్పేసి, దాని ప్రకారం రిజర్వేషన్ అడిగేస్తోంది. దాన్ని చెక్ చేసుకోకుండానే ప్రభుత్వం సరేననేస్తోంది. ఇది అసంబద్ధంగా లేదా? 30 ఏళ్ల పైబడి నడుస్తున్న యీ అశాస్త్రీయ ప్రక్రియకు యిప్పటికైనా బ్రేక్ పడాలి కదా! ఫలానా కులం యింతమంది ఉన్నారు, వారి స్థితిగతులిలా ఉన్నాయి అని లెక్కించి, దాని ప్రకారం బిసి రిజర్వేషన్ విధానం నిర్ణయించడానికి పార్టీలకు అభ్యంతరమేమిటి? 1953 బిసి కమిషన్ నుంచి యిప్పటివరకు జరుగుతూ వచ్చినదేమిటి? అనే ప్రశ్నలను దానిలో చర్చిద్దాం.

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2021)

mbsprasad@gmail.com

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి