Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: రేవంత్ – బాబు సంబంధాలు

ఎమ్బీయస్‍: రేవంత్ – బాబు సంబంధాలు

ఇవాళ రేవంత్ తెలంగాణ సిఎం అయ్యారు. ఔతాడని అనుకున్న వార్తలు వస్తూండగానే రేవంత్-బాబు మధ్య సంబంధాలు ఎలా ఉండబోతాయని అనుకుంటున్నారు అని అడుగుతూ నాకు మెయిల్స్ రావడం ప్రారంభమైంది.  నిజానికి యిదొక చిత్రమైన పరిస్థితి. రేవంత్ సిఎం అయ్యాక ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య స్నేహం లేదా వైరం పెరుగుతుందా, ఆంధ్రకు యివ్వాల్సిన బకాయిలు రేవంతైనా యిస్తాడా? రేవంత్-జగన్‌ల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొని, జలసమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? యిలాటి ప్రశ్నలు రావాలి. ఆంధ్రలో ఉన్న ప్రతిపక్ష నాయకుడికి, తెలంగాణ ముఖ్యమంత్రికి మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై చర్చ రావడం మామూలు పరిస్థితుల్లో అయితే అసహజం.

కానీ ప్రస్తుత వింత రాజకీయాల్లో యిది సహజంగానే తోస్తుంది. ఇవాళ గాంధీ భవన్‌లో వేడుకల కంటె ఎన్టీయార్ భవన్‌లో, అమరావతిలోని టిడిపి ఆఫీసులో, చంద్రబాబు తదితర టిడిపి నాయకుల నివాసాల్లో వేడుకలు జోరుగా సాగి ఉంటాయని ఊహించవచ్చు. గాంధీ భవన్‌లో రేవంత్ అనుచరులు మాత్రమే హంగామా చేయవచ్చు. ముఖ్యమంత్రి పదవి దక్కని నాలుగైదు మంది నాయకుల అనుచరులు డల్‌గానే ఉండవచ్చు. వారికి దక్కిన మంత్రి పదవులు తెలిశాక రుసరుస లాడుతారో, బుసలు కొడతారో, నిరాశ పడతారో చూడాలి. కానీ టిడిపి ఆఫీసుల్లో మాత్రం యిలాటి శషభిషలేమీ లేకుండా ఒకటే హుషారు. ఒక పార్టీ గెలిస్తే మరో పార్టీ సంబరాలు చేసుకోవడం వింతల్లో కల్లా వింత.

రేపు అనూహ్యంగా ఆంధ్రలో కాంగ్రెసు నెగ్గితే కూడా టిడిపి యిలా సంబరాలు చేసుకుంటుందా అని ఎవరైనా అడిగితే ‘నీకేమైనా పిచ్చా? వెర్రా?’ అన్నట్లు చూస్తారు. కాంగ్రెసు గెలవగానే రేవంత్ సిఎం అవుతాడన్న అంచనా రాగానే బాబు యిక్కడే కాదు, ఆంధ్రలోనూ గెలిచేసినంత సంబరం చేసుకున్నారు టిడిపి అభిమానులు. బాబు మాటే యిక్కడ చెల్లుతుందని, తెలంగాణ బేస్ చేసుకుని, ఆంధ్రలో జగన్ ఆట కట్టిస్తారని అనుకుంటున్నారు. రేవంత్ బాబు అడుగుజాడల్లో, కనుసన్నల్లో హైదరాబాదులో మరో సైబరాబాదు కడతారా? టిడిపి నాయకుల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ, వాళ్లిక్కడ అరెస్టు కాకుండా కాపాడుతూ, 2024 ఎన్నికలలో వైసిపికి యిక్కణ్నుంచి నిధులు వెళ్లకుండా కట్టడి చేస్తూ, బాబుకి సకల విధాలా సాయపడతాడని, వేయేల రేవంత్ బాబుకి సామంత రాజుగా ఉంటాడని కొందరు ఊహిస్తూ, అలాగే జరుగుతుంది కదా అని అడుగుతున్నారు.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కెసియార్ బాబుకి శృంగభంగం చేసి పంపించడంతో, మీతో కలిసి మేమూ చెడ్డాం అని కాంగ్రెసు వాళ్లు తిట్టిపోయడంతో టిడిపి వాళ్లు కెసియార్ అంటే పగబట్టేశారు. ఆంధ్రలో జగన్‌ను గెలిపిస్తే కెసియార్‌ను గెలిపించినట్లేనని, కెసియార్ ఆంధ్రకు డీఫ్యాక్టో సిఎం అయిపోతాడని, బందరు పోర్టు తమకు రాయించేసుకుంటాడని, యిలా తెగ ప్రచారం చేశారు. బందరు పోర్టు తెలంగాణకు రానూ లేదు, కెసియార్ ఆంధ్రకు యివ్వాల్సిన బాకీలు యివ్వనూ లేదు. ప్రాజెక్టుల దగ్గర తెలంగాణ, ఆంధ్ర పోలీసులు తన్నుకోవడం మాననూ లేదు. కెసియార్, అతని కుటుంబ సభ్యులు జగన్ పాలనలో ఉన్న ఆంధ్రను వెక్కిరించడమూ మానలేదు. పార్టీని భారాసగా మార్చిన తర్వాత ఆంధ్రలో కూడా ఒక యూనిట్ పెట్టి, కాపులను చీల్చడానికి కెసియార్ వెనుకాడనూ లేదు. ఇలా కెసియార్ ఆంధ్రకు డీఫ్యాక్టో సిఎం కాలేక పోయాడు కానీ యిప్పుడు బాబు తెలంగాణకు డీఫ్యాక్టో సిఎం అయిపోతాడని టిడిపి వాళ్ల ఆశ.

తెలంగాణ సిఎంగా రేవంత్ అవుతున్నపుడు అతనెలా పాలిస్తాడని మీరనుకుంటున్నారు? ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడా? తక్కిన ఆశావహులను ఎలా కంట్రోలు చేస్తాడంటారు? యిలాటి ప్రశ్నలతో మెయిల్స్ రాస్తే అదో అందం. రేవంత్ సిఎం అవుతున్నాడంటే మరి బాబు సంగతేమిటి? అని అడగడం తమాషాగా ఉంది కదూ! కానీ దీనిలో మరీ అంత ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎందుకంటే నా పాఠకుల్లో చాలామంది ఆలోచనలు ఆంధ్ర రాజకీయాల చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అర్జంటీనాలో రైటిస్టు ప్రెసిడెంటు ఎన్నిక కావడానికి దారి తీసిన పరిస్థితుల గురించి కష్టపడి సమాచారం సేకరించి, ఆర్టికల్ రాస్తే, ‘అర్జంటీనా గురించి ఎవడడిగాడు? ఆంధ్రలో సైకో పాలన ఎప్పుడు పోతుందో అది చెప్పు చాలు’ అని వ్యాఖ్యలు రాస్తారు చాలామంది.

కన్యాశుల్కం నాటకంలో గిరీశం అంటాడు - పల్లెటూళ్లలో పాలిటిక్స్ మాట్లాడి ప్రయోజనం లేదు. మొన్న బండివాడికి దేశ స్వాతంత్ర్యం అవసరం గురించి గంట సేపు లెక్చరిస్తే వాడు ‘మా ఊరి పోలీసు కనిస్టీపుని ఎప్పుడు మారుస్తారని అడిగాడు’ అని. (సరిగ్గా యివే మాటలు కావు). ఆ బండివాడికి ప్రభుత్వం అంటే కానిస్టేబుల్ మాత్రమే. వాడి పీడ వదిలితే చాలు, పైన ఇంగ్లీషు వాడున్నా, కాంగ్రెసు వాడున్నా వాడికి అనవసరం. నేను పైన చెప్పిన తరహా పాఠకులు కన్యాశుల్కంలో బండివాడి లాటి వాళ్లు. తెలంగాణలో కాంగ్రెసు పాలన వస్తే యిప్పుడున్న అభివృద్ధి కొనసాగుతుందా లేదా అని యిక్కడున్న నాబోటి వాళ్లు వర్రీ అవుతూంటే, యిది బాబుకి లాభమా? జగన్‌కు నష్టమా? బాబు అధికారం మళ్లీ తెలంగాణలో సాగుతుందా? అని వాళ్లు ఆలోచిస్తున్నారు.

తెలంగాణతో పాటు మరో రెండు రాష్ట్రాలలో ప్రభుత్వం మారింది కాబట్టి, ఆంధ్రలోనూ మారుతుందని వాళ్లకు ఆశ పుడుతోందా? మరి మధ్యప్రదేశ్‌లో మారలేదే, దానితో పోల్చుకుంటే!? దక్షిణాది వరకు చూసుకుంటే కర్ణాటక, తెలంగాణలలో నెగ్గాం కాబట్టి యిక్కడా నెగ్గుతాం అంటూ ఆంధ్ర కాంగ్రెసుకు హుషారు రావాలి, టిడిపికి రావడమేమిటి? విడ్డూరం కాకపోతే! కెసియార్‌కు జగన్‌కు ముడిపెట్టి కెసియార్ అపజయాన్ని జగన్ అపజయానికి సూచికగా చూడడం వలన యీ చిక్కు వస్తోంది. టిడిపి అభిమానుల పరిస్థితి ఎలా ఉందంటే, తెరాస, బిజెపి, కోర్టులు సమస్తం జగన్ పక్షాన ఉన్నట్లు తోస్తోంది. అసలు వాళ్లే జగన్‌ను కెసియార్‌కు అంటు కట్టారు.

ఇలా చెప్తూ వచ్చి యిప్పుడు తెలంగాణకు బాబు డిఫ్యాక్టో సిఎం అయిపోతాడని కలలు కంటున్నారు. అది జరుగుతుందా? ఎదిగాక పిల్లలు తండ్రి మాటే వినటం లేదు. ఇక స్థితి మారిన అనుచరుడు వింటాడా? రాజు కింకరుడగు, కింకరుడు రాజగు.. అని సామెత. కింకరుడు రాజయ్యాక, పాత రాజును రాజులాగే చూడాలని ఏముంది? గతం గతః! శుభేందు అధికారి మమతా బెనర్జీకి ఎదురు తిరుగుతాడని, ఎన్నికల్లో పని గట్టుకుని ఓడిస్తాడని ఎవరైనా అనుకున్నారా? సిద్ధరామయ్య పితృసమానుడైన దేవెగౌడకు ఎదురు తిరుగుతాడని ఎవరైనా అనుకున్నారా? వైకో కరుణానిధికి పుత్రసమానుడే కానీ పేచీ పెట్టుకుని విడిపోలేదా? ఒకే పార్టీలో ఉన్నా రాజకీయ సమీకరణాలు మారుతూనే ఉంటాయి. బ్రహ్మానంద రెడ్డి సంజీవరెడ్డికి నమ్మకమైన అనుచరుడిగా పైకి వచ్చాడు. తర్వాత విరోధి అయ్యాడు. ఇద్దరిదీ చెరో వర్గం.

ఆడ్వాణీ సంగతేమిటి? ఆయన తన అనుంగు శిష్యుణ్ని మోదీని పైకి తీసుకుని వచ్చాడు. గోధ్రా అల్లర్ల సమయంలో వాజపేయి చర్య తీసుకుందా మనుకుంటే చక్రం వేసి అడ్డుకున్నాడు. కానీ మోదీ ప్రధాని అయ్యాక గురుదక్షిణ చెల్లించాడా? వయసు పేరు చెప్పి ఆయనను పక్కన పడేశాడు. ఆడ్వాణీ ప్రధాని కావలసినవాడు. వాజపేయిని ముందుకు పెట్టి తను వెనక ఉండిపోయాడు. అలాటివాణ్ని రాష్ట్రపతి చేయవచ్చుగా! మోదీ చేయలేదే! కోవింద్‌ను చేసి, అతని చేత ఒంగిఒంగి నమస్కారాలు అందుకున్న వెంకయ్య నాయుణ్ని ఆయనకు డిప్యూటీగా ఉపరాష్ట్రపతిని చేశాడు. వెంకయ్య నాయుడు మాత్రం ఆడ్వాణీ శిష్యుడు కాదా, మోదీ ప్రభవించగానే ప్లేటు ఫిరాయించేశాడు. అందువలన గురుశిష్య సంబంధం ఎల్లకాలం ఒకేలా ఉండదు.

బాబు దగ్గర ఉండగా రేవంత్‌ది యస్ బాస్ స్థాయి. మరి యిప్పుడు? ఒక ధనిక రాష్ట్రానికి, హైదరాబాదు వంటి హేపనింగ్ మెట్రో కల రాష్ట్రానికి ముఖ్యమంత్రి! మరి బాబు – ఏ వసతులూ లేక ఏదోలా బండి నెట్టుకొస్తున్న ఆపసోపాల ఆంధ్ర రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడో లేదో తెలియదు. కావాలంటే తను సాయపడాలి. స్థితిలో, స్థాయిలో తేడా వచ్చేశాక, పూర్వం లాగానే ఉండడం సాధ్యమౌతుందా? ‘నో మాన్ కెన్ హేవ్ టూ మాస్టర్స్’ అని బైబిల్ సూక్తి. రేవంత్ అటు సోనియా మాటే వింటాడా? ఇటు బాబు మాటే వింటాడా? సోనియా, బాబు యిద్దరూ ఒకే పేజీలో లేరు. బాబు ఇండియా కూటమిలో చేరలేదు. బిజెపికి తన తడాఖా చూపించి, తనను కూటమిలోకి ఆహ్వానించుకునేట్లా చేయడానికి తెలంగాణలో కాంగ్రెసుకు సహకరించాడు తప్ప, బిజెపికి దూరమయ్యే ఉద్దేశంలో లేడని సోనియాకు తెలుసు కదా! రేవంత్ బాబుకి జీహుజూర్ అంటూంటే ఊరుకుంటుందా?

పైగా రేవంత్ చేసే ప్రతీ పనిని నిఘా వేసి చూసి, యింకో నాలుగు కలిపి సోనియాకు చేరవేసే బ్యాచ్ ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది. ఇప్పటికే రేవంత్ బాబుతో రహస్యంగా భేటీ అయ్యారనే వార్త షికారు చేస్తోంది. ఫలితాల తర్వాత కెటియార్ పిల్చిన సమావేశానికి గైరుహాజరైన ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలు కాంగ్రెసులో చేరబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. అసలు వాళ్లు మొదటే కాంగ్రెసులో చేరదామని వస్తే, రేవంతే మీరు తెరాస ద్వారా నెగ్గి, తర్వాత వచ్చి మాతో గెలవండి అన్నారని, యిలాటి కోవర్టు ఐడియాలలో దిట్ట చంద్రబాబు కాబట్టి బాబు సలహా మేరకే రేవంత్ యిలా చేశారని కూడా అనుబంధ పుకారు. ఇలా రేవంత్-బాబు సంబంధాన్ని ఎప్పటికప్పుడు ఒత్తి చెపుతూ రేవంత్ వ్యతిరేక వర్గాలు పని చేస్తున్నాయి. ఇలాటి వాతావరణంలో రేవంత్ బహిరంగంగానైనా బాబుతో దూరం పాటిస్తారని అనుకోవాలి.

గతం మాట ఎలా ఉన్నా వర్తమానంలో రేవంత్ బాబుకి ఒబ్లయిజ్ కావల్సిన పనేముంది? ఆంధ్రమూలాల వారి ఓట్లన్నీ బాబు చేతిలో ఉన్నట్లు, అవన్నీ రేవంత్ సారథ్యంలోని కాంగ్రెసుకు వేయించి, కెసియార్‌కు బుద్ధి చెప్పబోయినట్లు తెలుగు మీడియా పెద్ద హడావుడి చేసింది. దానికి తోడు హైదరాబాదులోని కొన్ని కమ్మ సంఘాలు మా బాబు అరెస్టును ఖండించని కెసియార్‌ను ఓడగొడతాం అనీ ఓవరాక్షన్ చేశాయి. బాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఐటీ వారు ప్రదర్శనలు చేసినదీ హైదరాబాదులోనే! తీరా చూస్తే హైదరాబాదు, మెదక్ బెల్టులోనే తెరాసకు అత్యధికంగా సీట్లు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో జండా ఎగరేసిన కాంగ్రెసు యిక్కడకు వచ్చేసరికి చతికిల పడింది. వాస్తవాలు యిలా ఉండగా డిసెంబరు 5 నాటి ‘‘కొత్త పలుకు’’లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ‘ఎన్నికల వేళ చంద్రబాబును అరెస్టు చేసి జగన్ కెసియార్‌కు నష్టం చేశారు. టిడిపి అభిమానులు కాంగ్రెసు వైపుకి మళ్లారు.’ అని రాశారు.

కానీ క్రితం రోజు ఆంధ్రజ్యోతిలో ‘ఆ వర్గాలు.. బిఆర్ఎస్ వైపే’ పేర వచ్చిన ఆర్టికల్‌లో ‘గ్రేటర్‌లో నివసిస్తున్న యితర ప్రాంతాలలో కొన్ని వర్గాలు కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతాయన్న ప్రచారం ఉత్తుత్తిదే అని తేలింది...’ అంటూ వివరాలు యిచ్చారు. ఆంధ్రజ్యోతి టీవీలో ‘నగరంలో వైసిపి ఓటర్లు తెరాసకు ఓటేసి, కాంగ్రెసును ఓడించారు.’ అని ప్రచారం చేస్తున్నారు. జరిగినదేమిటి? ఎవరో కొద్ది మంది తప్ప, ఆంధ్రమూలాల వారందరూ ఆంధ్ర రాజకీయాలతో సంబంధం లేకుండా తమ సాటి ఓటర్లు ఏ మూడ్‌లో ఉన్నారో, అదే మూడ్‌లో ఓటేశారు. విడిగా ఒక వర్గంగా ఓటేయలేదు. పైన చెప్పిన ‘‘కొత్త పలుకు’’లోనే రాధాకృష్ణ కొన్ని పేరాల తర్వాత ‘హైదరాబాదు ఓటర్లలో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ ఉండటం చేత మొత్తం 24 స్థానాల్లో మజ్లిస్‌కు 7, బిజెపికి 1 పోగా తక్కిన 16 స్థానాలూ తెరాస గెలుచుకో గలిగింది. కాంగ్రెసు అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బ తింటుందని, శాంతిభద్రతల పరిస్థితి ప్రశ్నార్థకం అవుతుందన్న భయం చేతనే వారు కాంగ్రెసును ఆదరించలేదు.’ అని రాశారు.

ఆంధ్రమూలాల వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తెరాస అభ్యర్థులు కళ్లు చెదిరే మెజారిటీలతో గెలిచారు. కుత్బుల్లాపూర్‌లో వివేకానంద్‌కు హరీశ్ కంటె ఎక్కువగా 85 వేల మెజారిటీ వచ్చింది. కూకట్‌పల్లిలో 70 వేలు, శేరి లింగంపల్లిలో 47 వేలు, మల్కాజ్‌గిరిలో 49 వేలు.. యిలా సాగింది తెరాస ప్రస్థానం. ఆంధ్రమూలాల వారు ఎక్కువగా ఉండే నిజామాబాద్ వంటి జిల్లాలో కాంగ్రెసుకు 4 రాగా, బిజెపికి 3, తెరాసకు 2 వచ్చాయి. గతంలో టిడిపికి ఉన్న ఓటు బ్యాంకు కాంగ్రెసుకి మాత్రమే మళ్లింది అనుకోవడానికి లేదు. కొంత బిజెపికి కూడా మళ్లి ఉంటుంది. అది 8 స్థానాలు గెలిచి, 19 స్థానాల్లో రెండో స్థానానికి వచ్చింది. దాని ఓట్ల % 7 నుంచి 16 కి పెరగడంలో టిడిపి వారి వాటా కూడా ఉండవచ్చు. ఇలాటి పరిస్థితుల్లో రేవంత్ ‘నా గెలుపు బాబు వలననే, అందువలన నేను ఆయన పట్ల కృతజ్ఞతతో ఉండాలి’ అనుకోగలరా? నిజం చెప్పాలంటే కెసియార్ వ్యవహారశైలిపే ఆగ్రహమే రేవంత్‌ను ముఖ్యమంత్రిగా చేసింది. అందువలన రేవంత్ కెసియార్‌కే కృతజ్ఞుడై ఉండాలి.

రాజకీయాల్లో ఏ మిత్రత్వం, ఏ శత్రుత్వం శాశ్వతం కాదు. రేవంత్, జగన్ ఫోన్లో మాట్లాడుకున్నారన్న మరో వార్త వచ్చింది. ఎందుకంటే అంటూ ఓ కారణం చెప్తున్నారు. కాంగ్రెసు స్వీప్ చేసిన ఖమ్మం, నల్గొండల నుంచి గెలిచిన వారిలో, ఓటర్లలో ఆంధ్రమూలాల వారితో పాటు వైయస్ అభిమానులు చాలామంది ఉన్నారు. అందుకే 2014లో కూడా వైసిపి అక్కడ నెగ్గింది. (షర్మిల దగ్గర్నుంచి అందరూ అవే లెక్కలు వేశారు. వైయస్ అభిమానులు యింకా ఉన్నారా అని నా సందేహం). రేవంత్‌తో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్ ఆ ప్రాంతపు వారే! అక్కడి ఎమ్మెల్యేలు కొందరిలో జగన్‌కు యింకా పలుకుబడి ఉంది కాబట్టి ఓ మాట చెప్పమని రేవంత్ జగన్‌ను రిక్వెస్టు చేశారని ఆ పుకారు. నిజం కాకపోవచ్చు కానీ రేవంత్ యిలాటి ప్రయత్నం చేసినా చేయవచ్చు. పదవి కోసం ఎలాటి ప్రయత్నమైనా చేస్తాడు రాజకీయ నాయకుడు!

రేవంత్ చాలా సున్నితమైన పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెసు హామీలు గుప్పించి 100 రోజుల్లోనే అమలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చింది. హామీ యిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే ఏటా 88 వేల కోట్లు కావాలని ఒక అంచనా. తెరాస అమలు చేస్తున్న పథకాలను కూడా కంటిన్యూ చేయాలంటే యిది అదనపు భారమే కదా. పాత వాటిలో కొన్ని ఎత్తేస్తారేమో చూడాలి. ఎందుకంటే రాష్ట్రం యిప్పటికే 5 లక్షల కోట్ల అప్పులో ఉంది. విద్యుత్తు సంస్థలు 50 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు ఏ టైములో యివ్వబోతున్నదీ కాంగ్రెసు ముందుగానే ప్రకటించింది. వీటి అమలులో ఏ మాత్రం తడబడినా, ప్రభుత్వంపై అసంతృప్తి రగలుగుతుంది. వెంటనే రేవంత్ ప్రత్యర్థులు ‘ఇది కాంగ్రెసుపై అసంతృప్తి కాదు, రేవంత్ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు, అతన్ని తీసేసి మమ్మల్ని పెట్టండి’ అంటూ దిల్లీలో లాబీయింగు మొదలు పెడతారు.

ప్రాంతీయ పార్టీల్లో అయితే ఒకరే ఐదేళ్లు పాలిస్తారు. జాతీయ పార్టీలో ఆ భరోసా లేదు. 1978-83 మధ్య ఆంధ్రలో కాంగ్రెసు 3గుర్ని మార్చింది. నాలుగో ఆయన్ని ప్రజలే మార్చారు. బిజెపి కూడా ముఖ్యమంత్రుల్ని మారుస్తోంది. ఉత్తరాఖండ్‌లో 2017-22 మధ్య ముగ్గురు ముఖ్యమంత్రులు. కర్ణాటకలో 2008-13 మధ్య ముగ్గురు, 2019-23 మధ్య యిద్దరు ఉన్నారు. గుజరాత్‌లో 2012-17 మధ్య మోదీ ప్రధానిగా వెళ్లాక యిద్దరు మారారు, 2017-22 మధ్య యిద్దరు! అందువలన రేవంత్ ఐదేళ్లూ పాలిస్తారన్న భరోసా ఏమీ లేదు. తెరాస ఏదో చేసేస్తుందన్న భయం కాదు, సహచరులు చాడీలు చెప్పి మార్పించేస్తారన్న భయమే ఎక్కువ.

ఇలాటి పరిస్థితుల్లో రేవంత్ బాబు పనులు కూడా చేసి పెడితే యింకా యిబ్బందులు ఎదుర్కుంటాడు. పనులంటే ముఖ్యంగా కాంట్రాక్టులు. తెరాస పాలనలోనే ఆంధ్రులకు కాంట్రాక్టులిచ్చారని రేవంత్ హోరెత్తించారు. ఇప్పుడు తనూ అదే పని చేస్తే తెరాస వాళ్లే కాదు, సహచర కాంగ్రెసు నాయకులే గోల చేస్తారు. కాంట్రాక్టు తీసుకున్న కంపెనీ భాగస్వాముల్లో ఏ ఒక్క కమ్మవాడున్నా, వెంటనే అతను బాబుకి బంధువు అని మీడియా రాసేస్తుంది. తెలంగాణలో రెడ్లని యిది మండిస్తుంది. ఇక్కడ ఎప్పణ్నుంచో రెడ్లకు, వెలమలకు మధ్య ఆధిపత్యం కోసం పోరు నడుస్తూ వచ్చింది. పైన నిజాం ఉన్నా సంస్థానాల్లో జమీందార్లు యీ కులాలకు చెందినవారే ఎక్కువగా ఉండేవారు. నిజాం పాలన తర్వాత రాజకీయాల్లో పోటీ పడ్డారు. రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి, అంజయ్య రెడ్లు కాగా, వెలమ కులస్తుడు వెంగళరావు ఓ సారి అయ్యారు. అందరూ కాంగ్రెసు వాళ్లే. 2014 నుంచి వెలమ కులస్తుడైన కెసియార్ పాలించారు. ఈసారి మొత్తం 43 మంది రెడ్డి ఎమ్మెల్యేలు. సహజంగా వారిలో అధిక సంఖ్యాకులు కాంగ్రెసులో ఉన్నారు. ఇటీవలి కాలంలో కమ్మవారికి ప్రతినిథిగా పేరుబడిన బాబు వచ్చి యిక్కడ పెత్తనం చలాయించడానికి రేవంత్ సహకరిస్తే వాళ్లు ఊరుకుంటారా?

ప్రతి కులంలో కులాభిమానంతో పక్షపాతం చూపించే వారుంటారు. వారితో పాటు వారికి భిన్నంగా ఉండేవారుంటారు. ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థుల్లో తన కులం వాడు ప్రతిభ కనబరిచినా, వాణ్ని సెలక్టు చేస్తే తనకు కులాభిమానం ఉందని తక్కిన సభ్యులు అనుకుని పోతారేమోనని, ఆ అభ్యర్థికి అందరి కంటె తక్కువ మార్కులు వేసే రకం వీళ్లు. వీళ్ల వలన ఆ అభ్యర్థికి సహజంగా జరగవలసిన న్యాయం కూడా జరగకుండా పోతుంది. రేవంత్ రెండో రకం వాడైతే ఆంధ్ర మూలాల వారికి అన్యాయమే జరుగుతుంది. ఇన్నాళ్లూ తెరాస ప్రభుత్వంలో ఎవరేమనుకున్నా మాకేమిటి? అన్నట్లు ఆంధ్రమూలాల వారిని, తమ తమ స్వార్థాల కోసం, ప్రోత్సహించారు. ఇక ముందెలా ఉంటుందో చూడాలి.

2024 ఎన్నికలలో బాబుకి డబ్బులు పంపి ఆదుకోచ్చనే మాట ఒకటి వినబడుతోంది. 2018లో జగన్ కెసియార్‌కు డబ్బులు పంపాడన్నా, 2019లో కెసియార్ జగన్‌కు పంపాడన్నా నమ్మవచ్చు. ఎందుకంటే వాళ్లు ప్రాంతీయ పార్టీ అధినేతలు. అదేమని అడిగేందుకు పైన ఎవరూ లేరు. కానీ రేవంత్ జాతీయ పార్టీకి తాబేదారు వంటి వాడు. వీళ్లంతా తాము సంపాదించిన దానిలో 90% పైకి పంపాల్సిందేనని వినికిడి. సొంతానికి మిగుల్చుకునేది 10% మాత్రమేట. పైన కాంగ్రెసు అధిష్టానానికి నిధుల కొరత తీవ్రంగా ఉంది. 2019 టైములో పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రప్రభుత్వాలు వాళ్ల చేతిలో ఉండేవి. అక్కణ్నుంచి నిధులు వచ్చేవి. ఇప్పుడు అవన్నీ పోయాయి. హిమాచల్ ఒకటి కొత్తగా వచ్చింది. కానీ అది చిన్న రాష్ట్రం. ఎక్కువ పిండలేరు. కొత్తగా వచ్చినది కర్ణాటక. ఇప్పటికే దాన్ని తెలంగాణకై పిండారు. ఇప్పుడు తెలంగాణ నుంచే మాగ్జిమమ్ గుంజాలి. రేవంత్ వాళ్లకే పంపుతాడా? బాబుకే పంపుతాడా? అందుకని ఆ కోణంలోనూ పెద్దగా ఉపకరిస్తాడని అనుకోను.

చివరగా రేవంత్, బాబుల మధ్య యితర లింకులు మాట ఎలా ఉన్నా ఓటుకు నోటు కేసు లింకు ఒకటి ఉంది. ఇద్దరిలో విభేదం వస్తే ఒకరు మరొకర్ని యిబ్బంది పెట్టగలిగే కేసు అది. ఆ నెత్తి మీద కత్తిని కత్తిరించి పారే పదవి రేవంత్‌కు దక్కింది. తొలి సంతకాలు హామీలపై పెట్టినా, తొలి రోజు సంతకాల్లో కేసు మూసేసే ఫైలుపై పెట్టవచ్చు. రాష్ట్రప్రభుత్వం పెట్టిన కేసు కాబట్టి ఉపసంహరించు కుంటున్నామని కోర్టుకి తెలిపే హక్కు ప్రభుత్వానికి ఉంటుందను కుంటున్నాను. రేవంత్ కాక ఆయన ప్రత్యర్థి సిఎం అయితే యీ వేలాడే కత్తిని వాడుకునేవాడేమో! రేవంత్ కత్తిని తీసిపారేసి ఆ బంధం లోంచి బయటకు వచ్చేస్తాడు. ఇక మిగిలినది వ్యక్తిగత గౌరవాదరాలు. అది ఏ పార్టీలో ఉన్నా ఉండవచ్చు, ఎవరితోనైనా ఉండవచ్చు. అంతమాత్రం చేత రాష్ట్ర వ్యవహారాల్లో చొరబడడానికి బాబుకి ఛాన్సిస్తాడని అనుకోవడానికి లేదు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?