cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సంతాన చింత - 3

ఎమ్బీయస్‌: సంతాన చింత - 3

పిల్లల ఉద్యోగాల, జీవనోపాధి గురించి తలితండ్రులు తెచ్చుకునే టెన్షన్ల గురించి మాట్లాడుతున్నాం. వాళ్లకు ఆసక్తి ఉన్న రంగంలో కొద్దికాలం పాటు ప్రయోగాలు చేయనిచ్చి చూడడం మేలు అని ఒప్పుకుంటే ఏం చేయనివ్వాలి అనే ప్రశ్న వెంటనే పుట్టుకుని వస్తుంది. సమాజం వేలెత్తి చూపనిదేదో చేయాలని తలిదండ్రులు ఆరాటపడతారు. ఒకవేళ యిలాటి ఆరాటం యువతకే ఉంటే వాళ్లను మార్చడం కష్టం.

ఇది సంతాన చింత గురించి రాస్తున్న సీరీస్‌ కాబట్టి తలితండ్రులకు అలాటి చింత ఉంటే ఏం చేయాలన్నదానిపైనే దృష్టి కేంద్రీకరిద్దాం. ఏదైనా చేయబోయే ముందు చుట్టూ ఉన్నవాళ్లు ఏమనుకుంటారోనని ఆలోచిస్తూ కూర్చుంటే అడుగు ముందుపడదు. నిజానికి సమాజం మన గురించి పట్టించుకుంటుందని మనం అనుకున్నంత స్థాయిలో సమాజం పట్టించుకోదు. ఎవరి గోలలో వారుంటారు. పని గట్టుకుని విమర్శించేవాళ్లు ఎప్పుడూ విమర్శిస్తూనే వుంటారు.

నాకు నచ్చే కథ ఒకటి ఉంది. ఒక తాత, మనుమడు వాళ్లింట్లో గాడిదను సంతకు తీసుకుని వెళ్లి అమ్ముదామని పట్నం వెళుతున్నారు. ముగ్గురూ నడుచుకుంటూ వెళుతూంటే ఒకడు తారసిల్లి, 'ఆ గాడిదను ఊరికే నడిపించడం దేనికి, మీలో ఎవరైనా దాని మీద కూర్చోవచ్చు కదా, ఆ పాటి ఆలోచన లేదా?' అని ఎద్దేవా చేశాడు. మనుమడు గాడిద ఎక్కాడు.

కొంత దూరం వెళ్లాక మరొకడు కనబడి మనుమణ్ని ఉద్దేశించి, 'పెద్దాయనను ఎండలో నడిపిస్తున్నావు, కుర్రాడివి, నువ్వు దిగి ఆయన్ను ఎక్కించలేవా?' అని తిట్టాడు. కుర్రాడు దిగి ముసలాయన గాడిద ఎక్కాడు. ఇంకాస్త దూరం వెళ్లేసరికి ఇంకోడు కనబడి 'ఏవయ్యా, పెద్దాయనా? చిన్న పిల్లాణ్ని నడిపిస్తున్నావు, ఆ మాత్రం యింగితం లేదా?' అని మందలించాడు. ఆయన అప్పుడు మనుమణ్ని కూడా ఎక్కమన్నాడు.

కాస్సేపటికి ఒకడు కనబడి 'ఏవయ్యా, ఆ గాడిద యిద్దర్నీ ఎలా మొయ్యగలదయ్యా? దారిలోనే ఛస్తే సంతకి తీసుకెళ్లి మాత్రం ఏం చేస్తారయ్యా?' అని ఛడామడా దులిపేశాడు. కథలో నీతి ఏమిటంటే - మనం ఏం చేసినా, ఎలా చేసినా అనేవాళ్లు అంటూనే ఉంటారు. మనం మన మనస్సాక్షిని మాట వినాలి తప్ప ఊళ్లోవాళ్లని ఎల్లకాలం సంతోషపెట్టాలని చూస్తే మాత్రం అది ఎన్నటికీ జరగదు. కొంతమందినే, అదీ కొద్దికాలమే తృప్తిపరచగలం.

కొన్ని పనులు చేస్తే శబాషని, కొన్ని చేస్తే అబాసని అనుకోవడంతోనే వస్తుంది చిక్కు. ఏదైనా కొత్తల్లో వింతగా, రోతగా, న్యూనతగా అనిపించినది, కొన్ని రోజులు గడిచేసరికి అలవాటుగా అయిపోతుంది. మన సమాజంలో చాలా రోజుల పాటు ఉద్యోగం చేయడం నామోషీగా ఫీలయ్యేవారు. వ్యవసాయం, వ్యాపారం చేసుకునేవాళ్లు 'ఉద్యోగమంటే మరొకడి వద్ద తల వంచుకుని బతకడమే' అనేవారు.

ఉద్యోగస్తుణ్ని చూసి 'పొట్ట చేత్తో పట్టుకుని పరాయి వూళ్లో నాలుగు రాళ్ల కోసం చాకిరీ చేస్తున్నాడు' అనేవారు. క్రమేపీ ఉద్యోగాల అందరూ ఎగబడి న్యూనతా భావం పోయింది. కొన్ని కులాల వాళ్లే కొన్ని వ్యాపారాలు చేయాలి అనుకునేవారు. దాన్ని ధిక్కరించిన వాళ్లూ ఉన్నారు. కొత్త వ్యాపారాలు వచ్చినపుడు వాటిని ఏ కులంతో అంటుకట్టాలో తెలియని పరిస్థితి వచ్చింది.

మా నాన్న ప్రింటింగు ప్రెస్‌ పెట్టినపుడు మా నాయనమ్మ 'ఇనుపముక్కల వ్యాపారం, శని' అని యీసడించింది. 'ఇనుము కాదు, అచ్చు అక్షరాలను సీసంతో చేస్తారు. అయినా మనం వాటిని అమ్మం, వాటిని ఉపయోగించి పుస్తకాలు వేస్తాం. అయినా ఇనుము వ్యాపారం శని కాదు. టాటా వాళ్లు ఆ వ్యాపారం చేసే బోల్డు సంపాదించారు' అని చెప్పి చూశాను, ఆవిడ వినలేదు. మా నాన్న 'మన యింటి పక్క బ్రాహ్మలు గానుగలు పెట్టి తెలికల వ్యాపారం చేయడం లేదా? ఎవరికి వచ్చింది వాళ్లు చేస్తారు.' అని కొట్టి పారేశాడు. హైదరాబాదులో ఒక అగ్రవర్ణస్తుడు హెయిర్‌కటింగ్‌ సెలూన్స్‌, బ్యూటీపార్లర్లు చెయిన్‌ ఆఫ్‌ నడుపుతున్నాడు.

మంగలి వ్యాపారం అని ఆయన బంధువులు మొదట్లో అన్నారట. ఈ మధ్యే చదివాను. ముగ్గురు ఐఐఎమ్‌ కుర్రాళ్లు మాసిన బట్టలు యింటి దగ్గర సేకరించి, శుభ్రం చేసి యింటి దగ్గరే యిచ్చే వ్యాపారం మొదలుపెట్టారట. అది చాకలి వ్యాపారం అని ఎవరైనా అంటే? నగరంలో చెత్త సేకరించి, రీసైకిల్‌ చేసే వ్యాపారం ఉంది. దాన్ని ఏమని పిలవాలి? గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్లు నడిపే వ్యాపారం ఉంది. దాన్నేమనాలి? ఏ పని చేసినా దాన్ని దైవకార్యంగా చూడమని ధర్మవ్యాధుడి కథ ద్వారా మన సంస్కృతి మనకు నేర్పింది. అది మర్చిపోతే ఎలా?

మోసం చేయనంతవరకు, ముష్టి ఎత్తనంతవరకు మనం ఏ పనిచేసినా తలెత్తుకునే చేయాలి. తమాషా ఏమిటంటే యువత యీ సిద్ధాంతాన్ని విదేశాల్లో అయితే అమలు చేస్తారు. స్వదేశంలో అయితే చేయడానికి జంకుతారు. తలిదండ్రులు కూడా మన బంధువర్గాలకు తెలియనంత కాలం, విదేశాల్లో నువ్వు ఏం చావు చచ్చినా చావు, యిక్కడ మాత్రం ఆ పనులు చేసి మా పరువు తీయకు అంటూంటారు. మనవాడు అక్కడ చేస్తున్నది బంధువర్గానికి ఎక్కడ తెలిసిపోతుందోనన్న భయంతో, బాధతో సగం ఆరోగ్యం చెడగొట్టుకుంటారు. ఇది అవసరమా? అనిపిస్తుంది.

ఆ మధ్య ఒక ఎన్నారై అమ్మాయి 'మా అవస్థలు, బతుకులు యివి' అంటూ చెప్పుకొస్తే, ఆమె మీద సాటివాళ్లే విరుచుకు పడ్డారు - 'ఇవన్నీ చెప్పాలా? అంతగా యిష్టం లేకపోతే యిక్కడికి ఎందుకు వచ్చావ్‌? ఇదేమైనా ఇండియా అనుకున్నావా, కాళ్లు బారజాపుకుని కూర్చోడానికి' అని. తాము చేసేది చెప్పుకోవడానికి అంత నామోషీ ఎందుకు? అయినా 'డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌' అనేది విదేశాల్లోనే వర్తిస్తుందా? ఇక్కడ వర్తించదా? నువ్వేదైనా కొత్త మార్గంలో వెళ్లినపుడు బంధువులు వెక్కిరిస్తారు. కానీ నువ్వు విజయం సాధించగానే వాళ్లే వచ్చి 'మా వాడికి మీ దగ్గర ఏదైనా ఉద్యోగం ఉంటే చూద్దూ..' అని బతిమాలుతారు.

వీళ్ల గురించా, వీళ్ల వ్యాఖ్యల గురించా నువ్వు వర్రీ అయ్యేది? శుద్ధ అనవసరం. ఇక చాలామంది తమ పిల్లల్ని వేసే ప్రశ్న - నువ్విలాటి ఉద్యోగం చేస్తే నీకు పిల్ల నెవరిస్తార్రా? అని. పిల్లలు పుట్టినప్పటి నుంచి మనవాళ్ల ఆలోచనలు వాళ్ల పెళ్లిళ్ల చుట్టూనే తిరుగుతాయి. ఆడపిల్ల ఆడుకోవడానికి బయటకు వెళతానంటే నీకు కాలో, చెయ్యో విరిగితే రేపెవడు పెళ్లి చేసుకుంటాడు? అంటాం. మగవాడైతే యిలా... వీటిలో గమనించవలసినది - చిన్న ఉద్యోగంలో చేరినవాడు అక్కడే ఉండిపోడు, ఏ మాత్రం కష్టపడినా పైకి వస్తాడు. వచ్చాకే పెళ్లి చేసుకోవాలి.

యుక్తవయస్సు వచ్చింది కదాని పెళ్లికి తొందరపడకూడదు. ఎప్పటికీ రాకపోతే అతనికి తగ్గ అమ్మాయే దొరుకుతుంది. ఈ ఉద్యోగం కాదు, ఈ వ్యాపారం కాదు, సమాజంలో గొప్పగా చెప్పుకునే ఉద్యోగం చేసేవాళ్లకు కూడా పెళ్లిళ్లు కావడం, అయ్యాక నిలవడం కష్టంగా ఉందన్నమాట కూడా గుర్తుంచుకోవాలి. దానికి కారణాలు అనేకం. వాటి గురించిన చర్చ యిక్కడ అప్రస్తుతం. కొడుకు లేదా కూతురు కాస్త భిన్నంగా ఉండే ఉద్యోగం లేదా వ్యాపారం చేసి చూద్దామని అంటే సమాజం గురించి వర్రీ అవకుండా వారిని చేయనీయడమే మేలు అనుకుని యిక్కడ ఆపవచ్చు. ఇక పిల్లల పెళ్లి విషయమై పడే టెన్షన్ల గురించి మరోసారి.

ఎమ్బీయస్‌ : సంతాన చింత

ఎమ్బీయస్‌: సంతాన చింత - 2

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 
-mbsprasad@gmail.com