Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ : సంతాన చింత

చింతల్లో కల్లా ప్రధానమైన చింత సంతానచింత. కోరుకున్నపుడు సంతానం కలగకపోతే అదో చింత. కలిగాక వాళ్ల ఆరోగ్యం గురించి, భద్రత గురించి కొన్నాళ్లు చింత. ఇక చదువులో పడ్డాక చాలామందికి చింత పుడుతుంది. ఆ చదువు స్థాయి పెరుగుతున్న కొద్దీ చింత కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఆ పై ఉద్యోగచింత. సరైన ఉద్యోగం వస్తుందా, వస్తే నిలుస్తుందా, నిలిస్తే ఎదుగుతాడా... యిలాటి చింత.

ఆ తర్వాత పెళ్లి చింత. మనం ఎంపిక చేసిన అమ్మాయిని ఆమోదిస్తాడా, సొంతంగా చూసుకుంటాడా, అలా చూసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తాడా, ఏమారిపోతాడా అనే చింత. ఆ పై కాపురం సరిగ్గా సాగుతోందా లేదా అన్న చింత. ఇవన్నీ ఓ దశకు చేరాక వృద్ధాప్యంలో మనను చూస్తాడా లేదా అన్న చింత అన్నిటినీ మించిన చింత. అమ్మాయి విషయంలో కూడా యివన్నీ వర్తిస్తాయి. ఇలా నిరంతరం చింత కలిగించే అంశం - సంతానం. చింతతో పాటు సుఖం కూడా ఉంది కాబట్టే ప్రజలింకా సంతానం కావాలని కోరుకుంటున్నారు. కానీ చింత ఎంత తగ్గించుకుంటే సుఖం అంత పెరుగుతుందని గ్రహించాలి. 

ఎదిగే పిల్లలపై ఏ మేరకు నిఘా పెట్టాలి, ఏ మేరకు స్వేచ్ఛ నివ్వాలి అనేదానిపై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. మర్కటశాబక(కిశోర) న్యాయం, మార్జాలశాబక (కిశోర)న్యాయం అని రెండు ఉన్నాయి. పిల్లి తన పిల్లలను మరో చోటకి తీసుకెళ్లినపుడు వాళ్ల మెడలను నోటితో కరచుకుని తీసుకెళుతుంది. అక్కడ బాధ్యతంతా తల్ల్లిదే, పిల్లదేమీ లేదు. కోతి ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు ఉరికినప్పుడు పిల్లను పట్టుకోదు. అదే తల్లి కడుపును కరుచుకుని పట్టుకుంటుంది. కింద పడిపోతే బాధ్యత దానిదే. మనం పిల్లల్ని కొంతకాలం పాటు, కొన్ని అంశాల్లో పిల్లి పిల్లలా పెంచాలి. తర్వాత కోతిపిల్లలా చూడాలి.

పిల్లలను వదిలేసినట్లే వదిలేసి వాళ్లపై ఒక కన్ను వేయాలి అంటారు. దానికి ఉపమానం పాలు కాచడంతో చెప్తారు. మీరు పొయ్యి దగ్గరే ఉన్నంతకాలం పాలు పొంగవు. కాస్త దూరం వెళ్లి దాన్ని పట్టించుకోనట్లు నటిస్తేనే పొంగుతాయి, వెంటనే పరిగెట్టుకుని వెళ్లి పొర్లిపోకుండా పాలగిన్నె దింపేయాలి. గారాబంతోనో, అతిభయం చేతనో పిల్లల్ని ఎక్కడికీ కదలనీయకుండా కళ్ల ముందే ఉంచుకోవాలనుకోవడం చాలా పొరపాటు. 'మీ అమ్మానాన్నా అలాగే చేశారా? నిన్ను ఆడుకోవడానికి వదిలేవారు కదా' అని అడిగితే చాలామంది 'ఆ రోజులు వేరు.

అప్పట్లో యింతలా పిల్లల్ని ఎత్తుకుపోవడాలు ఉండేవి కావు, రోడ్ల మీద యింత రద్దీ ఉండేది కాదు. అయినా మేం ఐదుగురు సంతానం. ఒకళ్లు పోయినా ఫర్వాలేదన్నట్లు ఉండేవాళ్లు మా అమ్మానాన్నా. మరి యిప్పుడు వీడు ఒక్కడే సంతానం (లేదా యిద్దరిలో ఒకడు)' అని సమాధానం చెప్తారు. ఎంతమంది పిల్లలున్నా ఏ తల్లీతండ్రీ తమ పిల్లల్లో ఒకరు పోయినా ఫర్వాలేదు అనుకోరు. వాళ్లకీ శ్రద్ధ ఉండేది. కానీ నీలా చాటుకోలేదంతే. ఇక ప్రమాదాలు అప్పుడూ ఉన్నాయి, యిప్పుడూ ఉన్నాయి. 

మన తెలుగు రాష్ట్రాలలో చదువు పేరుతో నడుస్తున్న హింస గురించి ఎంతైనా చెప్పవచ్చు. పిల్లలను ఆడుకోనివ్వరు, సరదాగా ఉండనివ్వరు, నిరంతరం బడో, ట్యూషనో, ప్రైవేటు క్లాసో. తల్లో, తండ్రో ఎవరో ఒకరు రాత్రి యింటికి వచ్చేవరకు పిల్లవాణ్ని ఏదో ఒక టీచరు సంరక్షణలో ఉంచాలని చూస్తారు. ఆటలాడినా, హాబీలు అలవరచుకున్నా చదువు మీద ఫోకస్‌ పోతుందని కళవెళపడిపోతారు. ఇంత చేసి నాణ్యమైన విద్య గరపగలుగుతున్నారా? గత 30, 40 ఏళ్లల్లో తెలుగు నేల నుంచి ఎంతమంది మేధావులు తయారయ్యారు? అమెరికాలో ఉద్యోగం సంపాదించుకోవడం మేధావితనానికి కొలబద్ద కాదని గమనించాలి. నిజానికి యీ హింస వలన పిల్లలకు చదువుపై ద్వేషం పెరుగుతోంది. ఒకసారి ధనార్జన మొదలెట్టాక వాడు పుస్తకం కేసి చూడడం లేదు.

తన టాలెంటు మెరుగు పరచుకుందామనో లేదా జ్ఞానం పెంచుకుందామనో ప్రయత్నించటం లేదు. చదువనేది ఉద్యోగం కోసమే, ఆ తర్వాత చదవడం అనవసరం అనే భావన ఏర్పడడానికి కారణం యీ ఒత్తిడే. పిల్లల చదువుల గురించి వర్రీకాని పేరెంటు ఉండడు. కానీ దాన్ని ఏ మేరకు అదుపులో పెట్టుకుంటామనేది తరచి చూసుకోవాలి. చేయవలసిన ప్రయత్నం చేశాం, ఆ పై ఫలితం ఎలాగుంటే అలా ఉండనీ అనే ధోరణి ఉత్తమం. అలా కాకుండా పిల్లల చదువు కూడా వీళ్లే చదివేసి, వీలైతే పరీక్ష హాల్లోకి వెళ్లి వాళ్ల బదులు పేపరు రాసేయడానికి కూడా సిద్ధపడే తలిదండ్రులున్నారు. పరీక్షలు ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై విద్యార్థులకు యిచ్చే కోచింగ్‌ వాళ్ల కంటె ఎక్కువగా తలిదండ్రులకు ఉపయోగపడుతుంది. వాళ్లు ఒత్తిడి ఫీలయి, పిల్లల్ని ఒత్తిడికి గురి చేస్తున్నారు. 

విద్యార్థులు సుఖంగా ఉండగలిగేది నైన్త్త్‌ క్లాసు వరకు మాత్రమే. టెన్త్‌లోకి వస్తున్నారంటేనే తలితండ్రులు ఉగ్రరూపంలోకి వచ్చేస్తారు. ఆ పై ఇంటరు ప్రత్యక్షనరకమే. కాలేజీల్లో టీచర్లు కూడా నరసింహావతారం ఎత్తి పిల్లల్ని చీల్చి చెండాడేస్తున్నారు. అది తెలిసి కూడా తలితండ్రులు కిమ్మనరు. పిల్లలు దారిలోకి వస్తున్నందుకు సంతోషిస్తారు. అలాటి కాలేజీలకు పని గట్టుకుని, హెచ్చుఫీజు కట్టుకుని పంపిస్తారు. ఆ తరహా విద్యాబోధన నీ కిష్టమేనా అని పిల్లల్ని సంప్రదించరు. అసలు చదవాల్సిన సబ్జక్ట్‌ గురించే డిస్కషన్‌కు తావుండటం లేదు. 'నేను ఇంజనియరును అవుదామనుకున్నాను కాలేకపోయాను, తల తాకట్టు పెట్టయినా డబ్బు తెస్తాను, నువ్వు అది చదువు'  అనే ధోరణే కనబడుతోంది.

ఇంజనియరింగు నా కల కానీ, వాడి కల కాదు కదా అని అతను ఆలోచించడం లేదు. అది కాకపోతే 'ఫలానా కోర్సు చదివితే ఉద్యోగాలు బాగా వస్తాయి' అని లెక్కలేసి ఆ కోర్సులో చేరమంటారు. రేపు ఎలాటి ఉద్యోగాల అవసరం పడుతుందో మహామహులే చెప్పలేకపోతున్నారు. సాఫ్ట్‌వేర్‌లో కూడా కొత్త కొత్త లాంగ్వేజ్‌లు, ప్లాట్‌ఫాంలు వస్తున్నాయి. ఈనాడు ఉన్న డిమాండు రెండేళ్ల తర్వాత ఉండటం లేదు. అలాటప్పుడు ఫలానా కోర్సు ఉద్యోగాలు తెస్తుందని ఎలా చెప్పగలం? అందుకని పక్కవాడు వాడి పిల్లాణ్ని ఎందులో చేర్చాడో చూసి, మనమూ మన పిల్లాణ్ని దానిలోకి తోస్తున్నాం. చదువురాని రైతులు మూకుమ్మడిగా, మూర్ఖంగా వ్యవహరించి నష్టపోతున్నారని వింటూంటాం. ఈ ఏడాది మిర్చికి మార్కెట్‌ ఉంటే, అందరూ అదే పంట వేసేస్తారు.

వచ్చే ఏడాదికి సప్లయి ఎక్కువై పోయి డిమాండు పడిపోయి అందరూ సామూహికంగా గొల్లుమంటారు. చదువుకున్న మూర్ఖులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. అందరూ ఇంజనియర్లయితే డిమాండు పడిపోదూ? ఏదోలా యింజనియరయిన వాడు గుమాస్తా ఉద్యోగానికి కూడా పనికి రాడు. చదివిన చదువులో అగ్రశ్రేణిలో ఉంటేనే లాభం. దానికి కావలసిన ముడి సరుకు - చదివేవాడికి సబ్జక్టుపై అమితాసక్తి.

ఆ ఆసక్తి ఉందో లేదో తండ్రీ, కొడుకూ కూర్చుని చర్చించుకోవాలి. ఆ కమ్యూనికేషనే మిస్సింగ్‌. చర్చకు కూర్చుంటే కొడుకు 'నాకు ఏ చదువూ వద్దు, నేను క్రికెట్‌ ఆడతా, సింగరవుతా, సినిమాలు తీస్తా' అంటాడేమోనని భయం. అలాటి వాటిల్లోకి పంపడానికి సాధారణ తలిదండ్రులు జంకడం సహజం. 'అవి ప్రస్తుతానికి హాబీగా పెట్టుకుని, ఏ సబ్జక్టులో గ్రాజువేషన్‌ చేస్తావో చెప్పు' అనైనా అడగగలగాలి. కెమిస్ట్రీ చదువుతా అంటే ఉలిక్కిపడకూడదు. ఎల్లకాలం కంప్యూటర్లే రాజ్యం చేయవు. భవిష్యత్తులో దేనికి డిమాండు వస్తుందో ఎవరూహించగలరు. నేను బియస్సీ చదివాను. నా చదువు పూర్తయ్యేసరికి చార్టెర్డ్‌ ఎకౌంటెన్సీ కోర్సుకి డిమాండు పెరిగింది. బికామ్‌ చదివుంటే బాగుండేది అన్నారు యింట్లో పెద్దలు. మూడేళ్లలో పరిస్థితి మారిపోయిందన్నమాట. నాది ఎంపీసీ గ్రూపు, రాయల్‌ గ్రూపు అనేవారు.

బియస్సీలోనే ఎంపిజి (మాథ్స్‌, ఫిజిక్స్‌, జియాలజీ) గ్రూపుండేది. 35% మార్కులు వచ్చినవారికి కూడా సీట్లిచ్చారు. చదువు పూర్తయిన ఏడాదికి ఒఎన్‌జిసి ఊపందుకుంది. జియాలజీ గ్రూపువాళ్లను యింటి కొచ్చి పిలుచుకుపోయి ఉద్యోగాలు యిచ్చారు. మా సోకాల్డ్‌ 'రాయల్‌ గ్రూపు' వాళ్లం ఉద్యోగాలు లేక అల్లాడాం. చివరకు సంబంధం లేని బ్యాంకు ఉద్యోగంలో చేరాను. చెప్పవచ్చేది - భవిష్యత్తు యింత అనిశ్చితిగా వున్నపుడు పిల్లవాడికి ఆసక్తి ఉన్న సబ్జక్టులో ఎందుకు చదవనీయరాదు? ఎంతోమంది యింజనియరింగు అయితే కాలేజీ ఫీజులు తక్కువని, ఫీజు రియంబర్స్‌మెంట్‌ వస్తుందని, మరోటని చేర్పించేస్తున్నారు. కాలేజీలో లైబ్రరీ, లాబ్స్‌, వసతులు వున్నాయా, అక్కడ చదువుకునే వాతావరణం ఉందా లేదా అని కూడా చూడటం లేదు. దాంతో బయటకు వచ్చినవాళ్లల్లో 80% మందికి ఉద్యోగార్హత ఉండటం లేదు. 

కొంతమంది సున్నితమనస్కులు ఇంటర్‌, డిగ్రీ స్థాయిలోనే ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. చచ్చిపోయేముందు అమ్మానాన్నలకు క్షమాపణ లేఖలు పెడుతున్న వీరు బతికుండగా తలితండ్రులతో తమ అవస్థలు చెప్పుకోలేదా, చెప్పినా వాళ్లు వినిపించుకోలేదా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆత్మహత్య చేసుకోకపోయినా, చదువుపై అనాసక్తితో అత్తెసరు మార్కులు తెచ్చుకుని, చిన్న ఉద్యోగాలు చేయడానికి సతమతమై బాధపడేవాళ్లూ ఉన్నారు. వాళ్ల తమ అభిరుచి గురించి తలిదండ్రులకు స్పష్టంగా చెప్పగలిగి వుంటే యిలాటివి నివారించవచ్చు. వాళ్లు చెప్పకపోయినా, చెప్పినా వినిపించుకోకపోయినా తలిదండ్రులదే తప్పు. కాలేజీ స్థాయిలో ఉన్న పిల్లలు అమ్మానాన్నలకు కాక మరెవరికి చెప్పుకోవాలి? చెప్పే స్వేచ్ఛను యివ్వకపోతే, మంచీచెడూ మాట్లాడుకునే వాతావరణం కల్పించకపోతే నిశ్చయంగా పెద్దవాళ్లదే లోపం. ఈ కమ్యూనికేషన్‌ గ్యాప్‌ జీవితమంతా ప్రసరిస్తుంది, వేధిస్తుంది. 

ప్రసిద్ధ కథకుడు బ్నిం రాసిన ఒక కథ ఉంది. కొడుకు డాక్టరు. భార్యాబిడ్డలతో కింద పోర్షన్లో వుంటే అతని అమ్మానాన్నా పై అంతస్తులో ఉంటారు. కానీ వాళ్లతో అరుదుగా మాట్లాడతాడు. తండ్రి మథన పడుతూంటాడు. ఓ సారి వాళ్ల వూరి నుంచి వచ్చిన రైతుకి ప్రాణంమీదకు వస్తే కొడుకు తన క్లినిక్‌లో చేర్చి అహోరాత్రాలు పక్కనే ఉండి, సేవ చేయడం గమనిస్తాడు. కావాలని మందులు మానేసి, అపాయస్థితిలోకి వెళతాడు. కొడుకు వారం రోజుల పాటు దగ్గరుండి వైద్యం చేయడంతో తృప్తి పడి యింటికి వస్తాడు. ఆ సాయంత్రం కోడలు గ్రహిస్తుంది, మావగారు కావాలని మందులు మానేసి, రిస్కు తీసుకున్నాడని. భర్తను నిలదీస్తుంది - మీరు మీ వాళ్లతో మాట్లాడుతూ ఉంటే యిలా జరిగేది కాదు కదా అని.

అప్పుడు కొడుకంటాడు - 'నాకు మా అమ్మానాన్నలతో మాట్లాడడం అలవాటు లేదు. చిన్నప్పుడంతా హాస్టల్లోనే వేశారు. వేసంగి సెలవులకు యింటికి వస్తానంటే వద్దని అక్కడే ట్యూషన్‌ ఏర్పాటు చేసేవారు. మెడికల్‌ కాలేజీలో ఉండగానూ అంతే! నిరంతరం చదవమనేవారు. తర్వాత విదేశాల్లో చదివాను. ఇక్కడికి వచ్చి క్లినిక్‌ పెట్టి బిజీగా ఉన్నాను. కష్టసుఖాలు వాళ్ల దగ్గర పంచుకునే చనువు నాకు లేదు. అప్పుడు దూరంగా పెట్టినవాళ్లు యీనాడు హఠాత్తుగా దగ్గరవమంటే నా వల్ల కావటం లేదు.' అని. పిల్లలతో ఏర్పడుతున్న కమ్యూనికేషన్‌ గ్యాప్‌ గురించిన చక్కని కథ అది. 

ఈ గ్యాప్‌ ఏర్పడితే క్రమేపీ పెద్దదవుతుంది తప్ప తగ్గదు. ముఖ్యంగా తండ్రితో చదువు, డబ్బు గురించి తప్ప వేరే విషయమేదీ మాట్లాడడానికి లేకుండా పోతుంది. గతంలో తల్లికి తండ్రికి భిన్నమైన పాత్ర ఉండేది. ఈ రోజుల్లో వాళ్లూ తండ్రిలాగే ఎప్పుడు చూసినా మార్కులు, ప్రమోషన్లు గురించే మాట్లాడుతున్నారు. పిల్లలకు ఔట్‌లెట్‌ లేకుండా పోతోంది. అందువలన తమ కాళ్ల మీద తాము నిలబడే పరిస్థితి వచ్చాక తలితండ్రులతో కమ్యూనికేషన్‌ తగ్గించివేస్తున్నారు. ఫ్రెండ్స్‌, కొలీగ్స్‌తో ఉన్న అనుబంధం యింట్లో వాళ్లతో ఏర్పడటం లేదు.

చివరకు ప్రేమ వివాహాలు చేసుకుంటే ఊళ్లో అందరికంటె ఆఖర్న తెలిసేది - అమ్మానాన్నలకే అన్నట్లు తయారైంది. పిల్లలు పెద్దయి, సంపాదనపరులయ్యాక వారి వివాహం గురించిన చింత పెద్దలకు ప్రారంభమవుతుంది. దాని గురించి మరోసారి. దాని కంటె ముందు చదువు తర్వాత వేరే కెరియర్‌లోకి వెళతానంటే పిల్లలతో ఏర్పడే ఘర్షణ గురించి మాట్లాడాలి.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com