2017లో బిజెపి జగన్నాథ రథం అప్రతిహతంగా ముందుకు సాగింది. గోవా, యుపి, ఉత్తరాఖండ్, మణిపూర్, తాజాగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో విజయంతో 19 రాష్ట్రాలలో దాని ప్రభుత్వం ఉంది. వీటిలో కొన్ని ఎన్నికలలో గెలిచినవి, మరి రాజకీయపు టెత్తులతో, ఫిరాయింపులతో సాధించినవి ఉన్నాయి. నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి తీవ్రమైన ఆర్థిక విధానాలను నదురు, బెదురు లేకుండా అమలు చేస్తూ పోయింది.
వీటి వలన ప్రజలు నష్టపోతున్నాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా కానీ ప్రజలు బిజెపిని ఆదరిస్తూనే ఉన్నారు. ఇది ప్రతిపక్షాలను నిరాశకు గురి చేస్తోంది. 2017 వారికి ఏ మాత్రం కలిసి రాలేదు. 2018లో 8 రాష్ట్రాలు – కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, త్రిపుర -లలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి అవి సిద్ధంగా ఉన్నాయా?
కాంగ్రెసు – పంజాబ్‌లో గెలుపు తప్ప కాంగ్రెసుకు 2017లో గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎన్నాళ్ల నుంచో అధ్యక్ష పదవి చేపట్టడానికి నిరాకరిస్తూ వచ్చిన రాహుల్ యిలాటి అధ్వాన్న తరుణంలో ముందుకు వచ్చి ముళ్ల కిరీటం ధరించాడు. అది అతని నిర్ణయమో, లేక తన అనారోగ్యం కారణంగా పట్టాభిషేకం యిక ఏ మాత్రం వాయిదా వేయకూడదన్న సోనియా నిర్ణయమో తెలియదు. సోనియా, రాహుల్ ద్వయం అధికారంలో ఉండగా ఎలా వ్యవహరించారో, ప్రతిపక్షంలో ఉండగా కూడా అలాగే వ్యవహరించారు. రాష్ట్రాల నుంచి వచ్చిన అసమ్మతి నాయకులకు వారాల తరబడి ఎపాయింట్‌మెంటు యివ్వకపోవడం, చివరకు రాహుల్ దగ్గరికి వెళితే సోనియా దగ్గరకు వెళ్లమనడం, ఆవిడ దగ్గరకు వెళితే రాహుల్ దగ్గరకి వెళ్లమనడం.. యిలా చేసి రాష్ట్రాలలో నాయకత్వాన్ని తగలేసుకున్నారు.
గోవా, మణిపూర్‌లలో ఎక్కువ సీట్లు తెచ్చుకుని కూడా అసమర్థతతో, అలసత్వంతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోలేకపోయారు. అధిష్టానానికే యింట్రెస్టు లేనప్పుడు మనకేం భవిష్యత్తు ఉంటుందనుకుని చాలామంది రాష్ట్రస్థాయి నాయకులు యితర పార్టీల్లోకి దూకేశారు. రేవంత్ రెడ్డి వంటి జిల్లా స్థాయి నాయకుడు, ఓటు-నోటు కేసులో ప్రధాన నిందితుడు వేరే పార్టీలోంచి తమ పార్టీలోకి దూకితే, అతన్ని బాహుబలి అని కీర్తించే స్థాయికి తెలంగాణ కాంగ్రెసు పడిపోయింది. ఆంధ్రలో కాంగ్రెసు ఎక్కడుందో వెతుక్కోవాలి. ఏదైనా ఉద్యమాలు చేపడితే స్థానిక నాయకులు తమ స్థాయిలో చేపట్టడమే తప్ప జాతీయ స్థాయి నుంచి ఏ విధమైన డైరక్షన్ లేకుండా పోయింది. రాహుల్ ఎన్నికల టైములోనే కాస్త చురుగ్గా ఉంటాడు తప్ప తక్కిన టైములో ఎక్కడికి పోతాడో ఎవరికీ తెలియదు.
పార్లమెంటులో మాట్లాడిన సమయాల్లో కూడా సమస్యలపై అవగాహన ఉన్నట్లు మాట్లాడలేదు. యుపిలో అఖిలేశ్‌తో పెట్టుకున్న పొత్తు యిద్దరికీ లాభించలేదు. రాహుల్ని యుపి ప్రజలు తిరస్కరించారు. పంజాబ్‌లో కాంగ్రెసు గెలుపు అమరీందర్ ఖాతాలోకే పడింది. నిజానికి సోనియా గట్టి నాయకురాలు. పార్టీ అధోగతిలో, అంధకారంలో ఉండగా పగ్గాలు చేపట్టి దాన్ని అధికారంలోకి తెచ్చింది. తక్కిన పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచి పదేళ్ల పాటు ఏలగలిగింది. ఆమె నాయకత్వ లక్షణాలు రాహుల్‌లో కనబడవు.
రాహుల్ బదులు ప్రియాంకా వచ్చి వుంటే మెరుగ్గా ఉండేదని అంటూంటారు. దానికి ఆధారం ఏమిటో తెలియదు. ఇప్పటిదాకా ఆమె వ్యక్తిగతంగా సాధించినదేమిటో ఎవరూ చెప్పలేరు. ఆమె ప్రచారంలో పాల్గొంటే, ఆమెను చూడడానికి జనం వస్తున్నారు, అది చాలా? అలా వచ్చే జనాలను అస్సలు నమ్మడానికి లేదు. వాళ్లు వేడుక కొద్దీ చూస్తారు తప్ప, ఆమె చెప్పినవారికి ఓట్లేయాలనుకోరు. ఆమె కున్న రాజకీయ పరిజ్ఞానం ఏమిటో ఎప్పుడూ పరీక్షకు గురి కాలేదు. పైగా ఆమె మెడకు భర్త రూపంలో ఒక గుదిబండ. ఈమె అధికారంలోకి వస్తే బేనజీర్ భుట్టో కథ పునరావృతమవుతుందని అనేకమంది అంచనా. దానాదీనా ప్రియాంకా రాజకీయాల్లోకి చురుగ్గా రావటం లేదు.
ఇందిరా గాంధీ వ్యూహం కారణంగా దేశమంతా తెలిసిన కాంగ్రెసు నాయకుడు లేకుండా పోయాడు. ఎవరి పేరు ప్రస్తావించినా ఆ రాష్ట్రం, పక్క రాష్ట్రంలో తప్ప ఎక్కడా తెలియదంటారు. ఏ ఒక్కరికి ఛాన్సివ్వబోయినా, అతనికంటె మేం మాత్రం ఏం తక్కువ అంటూ అరడజను మంది లేస్తారు. అందువలన అందరూ ఆమోదించాలంటే గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులలోనే వెతకాలి. అయితే రాహుల్ లేకపోతే ప్రియాంకా. ఇదీ పరిస్థితి. వంశపారంపర్య పాలన అని వాళ్లను వెక్కిరించ నక్కరలేదు, కాంగ్రెసును ఆ విషయంపై ఎద్దేవా చేస్తూ అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీలన్నీ అదే బాట పట్టాయి. బిజెపిలో కూడా రెండవతరం నాయకులకు పదవులు దక్కుతున్నాయి. ఎవరేమనుకున్నా ఫర్వాలేదనుకుని రాహుల్‌కు పట్టాభిషేకం చేసేశారు.
దానికి ముందు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో రాహుల్ కాస్త ఓపిక చేసుకుని తిరిగాడు. ఈ సారి అతని మీద మరీ ఎక్కువ జోకులు పడలేదు. దిగజారడమే తప్ప కోలుకోవడానికి అవకాశం ఏమీ కనబడటం లేదు అనుకుంటున్న తరుణంలో ఏడాది చివరలో వచ్చిన గుజరాత్ ఫలితం కాంగ్రెసులో మళ్లీ ఆశలు చిగిర్చేట్లా చేసింది. కాంగ్రెసుకు వ్యవస్థాగత నిర్మాణం లేకపోయినా, నాలుగున్నరేళ్ల పాటు ఎలాటి ఉద్యమాలు చేపట్టకపోయినా, స్థానిక నాయకత్వాన్ని తయారు చేసుకోకపోయినా, బిజెపిపై అసంతృప్తితో ఉన్నవారు కాంగ్రెసుకు ఓట్లేశారు. దానికి కులసమీకరణాలు, తోడుగా నడిచిన యువ ఉద్యమకారులు కొంతవరకు దోహదమయ్యాయి. రాహుల్ వ్యూహాత్మక తప్పిదాలు చేశాడని, లేకపోతే యింకా మెరుగైన ఫలితాలు వచ్చేవనీ విశ్లేషకులు అంటున్నారు.
అధిష్టానం అధ్వాన్నంగా ఉన్నా, స్థానిక నాయకుల చొరవ వలన కాంగ్రెసు గెలుస్తోంది. డిసెంబరులోనే పంజాబ్‌లో జరిగిన స్థానిక ఎన్నికలలో, రాజస్థాన్‌లో జిల్లా పరిషత్, పంచాయత్ సమితి ఉపయెన్నికలలో కాంగ్రెసు మంచి ఫలితాలు రాబట్టింది. ఏది ఏమైనా రాహుల్‌కు, కాంగ్రెసును నమ్ముకుంటే తమకూ కాస్త భవిష్యత్తు ఉందని, తొందరపడి తట్టాబుట్టా సర్దుకోనక్కరలేదనీ సగటు కాంగ్రెసు కార్యకర్త అనుకున్నాడు. 2018లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో చాలా వాటిలో కాంగ్రెసు బిజెపితో ముఖాముఖీ తలపడబోతోంది. వాటిలో బిజెపికి సమీపంగా ద్వితీయ స్థానంలో ఉన్నా పార్టీ యింకా కొన్నాళ్లు బతుకుతుంది.
తృణమూల్ కాంగ్రెస్ – బిజెపిని, దాని విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్టీలలో చెప్పుకోదగ్గది తృణమూల్. ఉదారవాదియైన వాజపేయి హయాంలో కొంతకాలం బిజెపికి సన్నిహితంగా ఉన్న మమత, ముస్లిం వ్యతిరేక ముద్ర ఉన్న మోదీతో మొదటినుంచీ వైరం పూనింది. బెంగాల్‌లో తనకున్న ముస్లిం ఓటు బ్యాంకు కాపాడుకోవడానికి అది ఆమెకు అత్యవసరం. సిపిఎంతో వేగలేమనుకుని కాంగ్రెసు చాలాకాలంగా బెంగాల్‌ను పట్టించుకోవడం మానేసింది. దాని వైఖరితో విసిగిన మమత, బయటకు వచ్చి, కమ్యూనిస్టు వ్యతిరేక ఓటు బ్యాంకును కైవసం చేసుకుని ఎట్టకేలకు అధికారం దక్కించుకుంది. సిపిఎం, యితర వామపక్షాలు ప్రతిపక్షంలో ఉండి పోరాడుతున్నాయి. బిజెపి మాత్రం బెంగాల్‌ను వాళ్లిద్దరికీ వదలదలచుకోలేదు.
ఈశాన్య భారతంలోనే చొచ్చుకుపోతూండగా లేనిది బెంగాల్‌లో పాగా వేయలేమా అనుకున్నారు. హిందూత్వ శక్తులను, మమత వ్యతిరేక శక్తులను కూడగట్ట నారంభించారు. 2016 అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్‌కు 211, కాంగ్రెసు-లెఫ్ట్ కూటమికి 76 రాగా, గూర్ఖా లీగ్‌తో చేతులు కలిపిన బిజెపికి 6 మాత్రమే వచ్చాయి. అయినా అది పోరాటం కొనసాగిస్తూ ప్రతిపక్ష స్థానం నుంచి సిపిఎంను నెట్టివేసి, ద్వితీయ స్థానాన్ని తను ఆక్రమిద్దామని చూస్తోంది. ఇది ఆమెను కలవరపరుస్తోంది. సిపిఎంతో పోరాడడం సులభం. వాళ్లకు గతం ఉంది. కానీ బిజెపి లోపాలను ఎత్తి చూపడానికి వాళ్లక్కడ గతం లేదు. పైగా హిందూమతం పేరుతో కూడగడుతున్నారు. 2017లో ముఖ్య పరిణామాలు ఆమె చిరకాల సన్నిహితుడు ముకుల్ రాయ్‌ను బిజెపి ఎగరేసుకుని పోవడం, మమత తన మేనల్లుణ్ని వారసుడిగా తయారు చేయడం.
బహుజన సమాజ్ పార్టీ – జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలలో తన ఉనికిని చాటుకుంటున్న బహుజన సమాజ్ పార్టీ ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయింది. అయితే యిటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో నగర కార్పోరేషన్లలో బిజెపి విజయకేతనం ఎగరేసినా, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అది దెబ్బ తింది. నగర పాలికా పరిషద్‌లలో 5217 స్థానాల్లో 914 మాత్రమే (18%) గెలుచుకుంది. 5390 నగర పంచాయితీ స్థానాల్లో 662 మాత్రమే (12%) గెలుచుకుంది. 70% స్థానాలు ఇండిపెండెంట్లే పట్టుకుపోయారు. ఎస్పీ, బియస్పీ రెండూ తమ ఉనికిని చాటుకున్నాయి. బియస్పీ ఓటు బ్యాంకులో పెద్ద తేడా ఏమీ రాలేదు.
ప్రతిపక్షంలో చాలాకాలంగా ఉంటున్నా మాయావతి ధోరణిలో మార్పు రాలేదు. సమాజ్‌వాదీతో కానీ, కాంగ్రెసుతో కానీ, యితర పార్టీలతో కానీ చేతులు కలిపేందుకు సిద్ధంగా లేదు. 2017లో ఆమె పార్టీలోంచి అనేకమంది నాయకులు వెళ్లిపోయారు. అయినా ఆమె దిగి రాలేదు. తన మేనల్లుణ్ని వారసుడిగా తీర్చిదిద్దుతోంది. తన ఓటమికి కారణం ఇవిఎంలే అంటూ వాటినే తప్పు పడుతోంది తప్ప, తన విధానాలను పునస్సమీక్షించుకోవటం లేదు.
సమాజ్‌వాదీ పార్టీ – కులరాజకీయాలు, బంధుప్రీతి అనే జాడ్యాలతో యీ పార్టీ యీ ఏడాదిలో పూర్తిగా కునారిల్లింది. పార్టీ వ్యవస్థాపకుడు ములాయం పూర్తిగా మతి పోగొట్టుకున్నాడు. భార్య, సంతానం, తమ్ముళ్లు, కజిన్స్ వీళ్లందరూ చాలనట్లు పై నుంచి అమర్ సింగ్ అందరూ కలిసి పార్టీని చెడుగుడు ఆడేశారు. ఎలాగోలా గెలవడమే ప్రధానం తప్ప నేరచరిత్ర ఉన్నవాళ్లను దూరం పెట్టనక్కరలేదనే ములాయం, శివపాల్‌ల వాదన తప్పని ఎన్నికలు తేల్చాయి. పదవీకాలంలో సగకాలం కుటుంబం చెప్పుచేతల్లో ఉండి, తక్కిన సగకాలం ఏదో చేసి చూపిద్దామని తాపత్రయ పడిన అఖిలేశ్ ఎన్నికల ఓటమితో కుదేలయ్యాడు. కాంగ్రెసుతో చేతులు కలపడంలో అతని విజ్ఞతను పార్టీ పెద్దలు ప్రశ్నించారు.
విపరీతమైన మెజారిటీలో అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ తప్పులు చేయకపోతాడా, ఎదిరిస్తూ ప్రజల తరఫున మాట్లాడుతూ ఉంటే, మళ్లీ తమకు అవకాశం రాకపోతుందా అని యువకుడైన అఖిలేశ్ ఆశ. ఆ ఆశ ములాయంకు, అతని తమ్ముళ్లకు లేదు. ఎలాగైనా బిజెపిని మంచి చేసుకోవాలనే తపన లేకపోలేదు. పార్టీకి అఖిలేశ్ ఒక్కడే ఆశాదీపం. కానీ అతనికి కుటుంబబంధాలు అడ్డువస్తాయి. తండ్రిని బాహాటంగా ఎదిరిస్తే పార్టీ కార్యకర్తలు మెచ్చరన్న భయం ఉంది. ములాయం మూలపడేవరకూ ఆ పార్టీ మిణుకుమిణుకు మంటూనే ఉంటుంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఓట్లు, సీట్లు రావడం కార్యకర్తల్లో నైతిక స్థయిర్యాన్ని నింపింది.
జెడి (యు)- బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెసు, లాలూతో కలిసి బిజెపిని ఓడించిన నీతీశ్ కుమార్ 2017లో మళ్లీ ఎన్‌డిఏ వైపుకి మరలాడు. దాని వలన పార్టీ చీలింది. ఎక్కువమంది అధికారంలో ఉన్న నీతీశ్‌వైపే నిలిచారు. ఎవరికి ప్రజామోదం ఎలా వుందో తెలుసుకోవడానికి కొంతకాలం ఆగాలి. 2019 పార్లమెంటు ఎన్నికల సమయానికి బిజెపి, జెడి(యు) ల మధ్య సీట్ల సర్దుబాటు చర్చకు వచ్చేసరికి బంధం ఏ మేరకు నిలుస్తుందో కూడా తెలియదు. ఆర్‌జెడికి 2017 అంతా కష్టకాలమే. లాలూ కుటుంబసభ్యులందరూ కేసులు, విచారణలు ఎదుర్కుంటున్నారు. లాలూ కొడుకులకు ప్రజాదరణ లభిస్తోందని అని సంబరపడుతున్న తరుణంలో అధికారం చేజారింది. ఆర్‌జెడి కర్ణాటకలో ఉనికి కాపాడుకుంటోంది. 2018 ఎన్నికలలో జయాపజయాల బట్టి దాని భవిష్యత్తు తేలిపోతుంది.
ఒడిశాలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న బిజెడికి 2017 స్థానిక ఎన్నికలలో బిజెపి గట్టిపోటీ యిచ్చింది. బిజెడికి వచ్చిన సీట్లలో 75% తెచ్చుకుని కాంగ్రెసును మూడో స్థానానికి నెట్టివేసింది. దిల్లీలో గెలుపు తర్వాత అత్యుత్సాహంతో పంజాబ్ ఎన్నికలలో పాల్గొన్న ఆప్ ఒక దశలో గెలిచేస్తుందేమో ననిపించింది. కానీ పార్టీ నిర్మాణం సరిగ్గా లేకపోవడం, అనేక తప్పిదాలు చేయడంతో ఆ అవకాశాన్ని జారవిడుచుకుంది. గోవాలో అయితే యింకా తక్కువ వచ్చాయి. గుజరాత్‌లో సోదిలోకి లేకుండా పోయింది. అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ప్రభుత్వం బిజెపి చేతిలో నానా అవస్థలు పడుతున్నాయి. చీటికీమాటికీ నోరు పారేసుకోవడం అరవింద్ 2017లో కాస్త తగ్గించాడు. సోషల్ మీడియా ఉపయోగించుకోవడంలో తను బిజెపికి సాటి రానని తెలుసుకున్నాడు లాగుంది.
వామపక్షాలు మొత్తం మీద బాగా దెబ్బ తిన్నాయి. సిపిఎం ఒక్కటే కేరళ, బెంగాల్, త్రిపుర అస్తిత్వాన్ని కాపాడుకుంది. కేరళలో పినరాయ్ విజయన్ వంటి కళంకితుడి నేతృత్వంలో నడుస్తున్నా ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం యిప్పటివరకు పెద్దగా వివాదాల్లో చిక్కుకోలేదు. కేరళలో సిపిఎం, బిజెపిల మధ్య హింసాత్మక ఘటనలు 2017లో బాగా పెరిగాయి. కానీ రాజకీయంగా బిజెపి బలపడుతోందనడానికి దాఖలాలు చిక్కలేదు. త్రిపురలో 1993 నుంచి నడుస్తున్న సిపిఎం ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజెపి సకలయత్నాలూ చేస్తోంది. ముఖ్యమంత్రి ఆగస్టు 15 ఉపన్యాసాన్ని కూడా సెన్సార్ చేసింది. 2018 ఎన్నికలలో పాతికేళ్ల ప్రభుత్వవ్యతిరేకత ఏ మేరకు బిజెపికి కలిసివస్తుందో చూడాలి.
తెలుగు రాష్ట్రాలలో టిడిపి, బిజెపికి మిత్రపక్షమే. తెరాస కేంద్రనాయకత్వంతో సఖ్యత పాటిస్తోంది. ఇక తమిళనాడులో జయలలిత మరణం తర్వాత బిజెపి 2017లో ఎడిఎంకెతో చాలా ఆటలే ఆడింది. శశికళను విడగొట్టి ఎడిఎంకెను తన అదుపులోకి తెచ్చుకుందామని ప్రయత్నించింది. ఎంత చేసినా శశికళ వైపు కొంతమంది ఎమ్మెల్యేలు మిగిలి వున్నారు. చివరకు పళనిస్వామి, పన్నీరుసెల్వంలను కలిపింది. అయినా ఎన్నికలంటూ వస్తే స్టాలిన్ ధాటికి వీరెవరూ ఆగరని అంచనా వేసింది. మోదీ అర్జంటుగా కరుణానిధిని పలకరించి వచ్చారు. 2జి స్కాములో తీర్పు టైమింగ్ డిఎంకెకు అద్భుతంగా కుదిరింది. ఆర్కె నగర్ ఉపయెన్నిక రోజునే రాజా, కనిమొళి నిర్దోషులని తీర్పు వచ్చింది. బిజెపి-డిఎంకెల మధ్య మారుతున్న సమీకరణానికి యిది ఉదాహరణ అయితే బిజెపికి తమిళనాడులో ప్రతిపక్షమే ఉండదు.
ఎలా చూసినా 2018, 2019 ఎన్నికలలో ప్రతిపక్షాలు బిజెపికి గట్టిపోటీ యివ్వగలవని తోచదు. బిజెపికి యిప్పుడున్న సీట్లు తగ్గితే దాని ఆర్థిక విధానాలే ప్రతిపక్షంగా పనిచేశాయి అనుకోవాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]