Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: నవరస సత్యనారాయణ నిష్క్రమణ

ఎమ్బీయస్‍: నవరస సత్యనారాయణ నిష్క్రమణ

ఐదు వారాల క్రితం కథానాయకుడు కృష్ణ నిష్క్రమించారు. ఇవాళ ప్రతి-నాయకుడు సత్యనారాయణ నిష్క్రమించారు. సత్యనారాయణ నాయకుడిగా ప్రారంభమై, ప్రతినాయకుడి వన్నెకెక్కి, ప్రతి పాత్రలోనూ నాయకుడై వెలిగారు. ఎస్వీ రంగారావుకున్నంత హేల, యీజ్ లేకపోయినా ఆయనకు వారసుడిగా, ఓ మేరకు ప్రత్యామ్నాయంగా స్థిరపడ్డారు. ఆయన కూడా చేయనన్ని వెరైటీ పాత్రలు చేశారు. ఏ తరహా సినిమాలోనైనా యిమిడిపోయారు. హీరోగా ప్రారంభమై, విలన్‌గా మారి, కారెక్టరు యాక్టర్‌గా తర్జుమా కావడంలో ప్రాణ్‌తో పోల్చవచ్చు. కానీ సత్యనారాయణలో గొప్పతనం ఏమిటంటే కారెక్టరు యాక్టర్‌గా స్థిరపడ్డాక కూడా విలన్‌గా కొనసాగారు. కరుణరసం చిందించాక కూడా క్రూరపాత్రలు వేశారు. మదన్ పురి లాటి వాళ్లు కారెక్టర్‌ వేషాల్లోకి దిగాక విలన్ వేషాలు వదిలేశారు.

తెలుగులో నా అభిమాన విలన్ ఆర్‌. నాగేశ్వరరావు. వేసినవి తక్కువ పాత్రలే. కానీ నటనలో యీజ్, స్టయిల్‌లో ఎస్వీయార్‌తో పోల్చవచ్చు. ఆ తర్వాత స్టయిలిష్ విలనీ అంటే గుమ్మడిలో చూశాను. రాజనాలది మాస్ విలనీ. కానీ గ్లేమరస్ విలనీ. ఒక నిండుతనం ఉండేది. స్క్రీన్ ప్రెజన్స్ ఉండేది. ఓవరాక్టింగ్ అనిపించేది కాదు. సత్యనారాయణ చాలాకాలం పాటు క్రూడ్ విలన్‌గానే వేశారు. గుర్తింపు కోసం ఓవరాక్షన్ చేస్తున్నాడు అనిపించేది. కానీ ఆయనలో గొప్పేమిటంటే పోనుపోను డోసు తగ్గించి, మంచి నటన కనబర్చారు.

చాలామంది నటుల్లో తొలి రోజుల్లో ఆత్మవిశ్వాసంతో అండర్‌యాక్ట్ చేసి మెప్పిస్తారు. వయసు వస్తున్న కొద్దీ కాన్ఫిడెన్స్ తగ్గి, వాయిస్‌లోనూ, నటనలోనూ లౌడ్‌నెస్ పెంచుతారు. డైలాగులు అరిచిఅరిచి చెప్తారు. నాగేశ్వరరావు కూడా అలాగే చెడ్డారు. అయితే ‘‘సీతారామయ్య గారి మనవరాలు’’ వచ్చి ఆ చెడ్డపేరు తుడిచివేసింది. ఎన్టీయార్‌కు ఆ భాగ్యం దక్కలేదు. చివరి అంకంలో పౌరాణిక సినిమాల్లో తప్ప సాంఘిక సినిమాల్లో బీభత్సమైన ఓవరాక్టింగ్ చేసేశారు. గొంతు చించుకుని డైలాగులు చెప్పారు. దీనికి రివర్స్ బ్రహ్మానందం. తొలి రోజుల్లో లౌడ్ కామెడీ. ఒక్కోసారి చీప్‌గా కూడా అనిపించేది. అలాటిది తర్వాతి రోజుల్లో ఎంత సటిల్ కామెడీ పండించారో చెప్పనక్కరలేదు. జస్ట్ కనుబొమ్మలు ఎగరేసి చూసినా, భావం బోధపడి ప్రేక్షకులు నవ్వుతున్నారు.

సత్యనారాయణ విలన్‌గా ఎంత పేట్రేగిపోయారంటే ఓసారి ఓ సినిమాలో కాంతారావుని కొరడాతో చితక బాదుతూంటే, బాల్కనీలో మా పక్కనే ఉన్న ఒకతను సీట్లోంచి లేచి ‘‘ఒరే సత్తిగా, నీ పనుందిరా ఆఖర్న..’’ అని కేకలు వేశాడు. అలాటి వాడికి ఎన్టీయార్ ‘‘ఉమ్మడి కుటుంబం’’లో మెతకవాడి పాత్ర యిచ్చి, ఆయన నటనలో మరో పార్శ్వాన్ని వెలికి తీశారు. అదే ఏడాది ‘‘కృష్ణావతారం’’లో రంగారావు గారు వేయాల్సిన దుర్యోధనుడి పాత్రను యిప్పించి, రంగారావుకి ప్రత్యామ్నాయంగా నిలిపారు. ‘‘శారద’’లో హీరోయిన్ అన్నగా కరుణరసం ఒలికించే పాత్రను సత్యనారాయణకు యిచ్చి సాహసం చేసినది దర్శకుడు విశ్వనాథ్. ‘‘తాత-మనుమడు’’లో దుష్టత్వం ప్రదర్శించే పాత్ర యిచ్చిన దాసరి ‘‘సంసారం-సాగరం’’లో పూర్తి విషాద పాత్ర యిచ్చి సత్యనారాయణ నటవైవిధ్యాన్ని చాటారు.

నాగేశ్ దర్శకత్వంలో వచ్చిన ‘‘మొరటోడు’’ సినిమాలో హీరో ఆయనే, కాస్త అతిగా అనిపించి సినిమా ఆడలేదు. ‘‘తాయారమ్మ-బంగారయ్య’’లో సగం టైటిల్ ఆయనదే కదా! అది హిట్ అయింది.  ప్రధానపాత్ర ఆయనకి యిచ్చినా ఏమీ ఫర్వాలేదు అనే స్థాయికి ఆయన చేరుకున్నాడు. రాజు నుంచి బంటు దాకా, బ్రాహ్మణుడి నుంచి రాక్షసుడి దాకా అన్ని పాత్రలూ వేయగల సమర్థుడు. తనను తాను నిరంతరం మెరుగులు దిద్దుకుంటూ, మార్చుకుంటూ ప్రయాణం సాగించారాయన. విలన్‌ను చేసి, వేషాలిచ్చి నిలబెట్టినది విఠలాచార్య అయితే, తనకు దీటుగా వేషాలిచ్చి ప్రోత్సహించినది ఎన్టీయార్. అలా అని సత్యనారాయణ ఎన్టీయార్ కాంప్‌లోనే ఉండిపోలేదు. ‘‘కర్ణ’’ ‘‘కురుక్షేత్రం’’ పోటాపోటీగా విడుదలైనప్పుడు రెండిటిలోనూ నటించిన నటుడు సత్యనారాయణ ఒకరే.

ఎన్టీయార్‌ రాజకీయాల్లోకి వచ్చాక, కృష్ణ కాంగ్రెసులో చేరి ‘‘నా పిలుపే ప్రభంజనం’’ (1986) సినిమా తీసి ఎన్టీయార్‌ను ప్యారడీ చేసిన పాత్ర సత్యనారాయణకు యిస్తే ఆయన నిరభ్యంతరంగా వేసేశారు.  అలా అయినా ఎన్టీయార్‌తో సాన్నిహిత్యం చెడలేదు. ‘‘కోడలు దిద్దిన కాపురం’’లో సత్యసాయిబాబాను అనుకరించే పాత్ర వేసినప్పుడూ బాబా భక్తులేమను కుంటారేమోనని దడవలేదు. 60 ఏళ్ల కెరియర్‌లో సత్యనారాయణ ఏ ఆర్టిస్టుతోనూ, ఏ నిర్మాత తోను, ఏ డైరక్టరుతోను గొడవ పడలేదంటే, అహంభావం ప్రదర్శించలేదంటే ఆయనది గొప్ప వ్యక్తిత్వమే అని చెప్పుకోవాలి. అనేక తరాల వాళ్లతో కలిసి నటించి, అందరితో కలిసిపోయారు. నిర్మాతగా కూడా మారి హిట్ సినిమాలు తీశారు.

హిందీలో ప్రాణ్‌ వేసిన పాత్రలు రీమేక్‌లలో సత్యనారాయణ వేశారు. ప్రాణ్ కూడా వివాదరహితుడే. చాలా దీర్ఘమైన కెరియర్. రొటీన్ విలన్ పాత్రలు వచ్చినపుడు వాటిలో వెరైటీ తెప్పించడానికి చాలా శ్రమించాడాయన. సత్యనారాయణకు అంత తీరిక లేకపోయింది. రొటీన్ పాత్రలు చాలా వచ్చాయి. దక్షిణాది ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఓవరాక్షన్ చేయడం వలన విలన్‌గా ప్రాణ్ కంటె తక్కువ మార్కులే పడతాయి. కానీ ప్రాణ్ కంటె సత్యనారాయణ కామెడీ బాగుంటుంది. ప్రాణ్ కంటె ఎక్కువ జానపదాలు వేయగలిగాడీయన. ప్రాణ్ పౌరాణిక సినిమాల జోలికి వెళ్లలేదు. సత్యనారాయణ ఎన్నో పౌరాణిక పాత్రలలో అదరగొట్టేశారు. కృష్ణుడి పాత్రకు ఎన్టీయార్ పేరుపడ్డట్టు, యముడి పాత్రకు సత్యనారాయణ పేరుబడ్డారు.

సత్యనారాయణ రాజకీయాల్లోకి కూడా వెళ్లారు. మచిలీపట్నం నుంచి టిడిపి తరఫున 1996లో ఎంపీగా ఎన్నికయ్యారు కానీ నియోజకవర్గానికి పెద్దగా ఏమీ చేసినట్లు లేదు. 1998లో కాంగ్రెసు అభ్యర్థి కావూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. ఆ నటరాజాంశుడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ...

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?