నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బహిరంగంగా తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన ఆయన గోడు వింటే… అయ్యో వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇంత దయనీయంగా వుందా? అనే జాలి చూపకుండా ఉండలేరు. ఎమ్మెల్యే కోటంరెడ్డి గోడు వైసీపీకి ప్రమాద సంకేతం కూడా. సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందని, ఇక ఉద్యమించడం తప్ప మరో మార్గం లేదని హెచ్చరించడం… వైసీపీ సర్కార్ తలదించుకోవాల్సిన దుస్థితి. ఎందుకంటే ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యేనో ఈ హెచ్చరిక చేసి వుంటే అర్థం చేసుకోవచ్చు.
నెల్లూరు జిల్లా అధికారుల సమీక్ష సమావేశం వైసీపీ ప్రజాప్రతినిధుల్లో గూడు కట్టుకున్న ఆవేదనను ప్రతిబింబించింది. ఇందుకు సాక్షిగా వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిలిచారు. ఈ సమావేశంలో కోటంరెడ్డి తనకు జరిగిన అవమానాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు. ఆర్థికశాఖ కార్యదర్శి రావత్ తనతో వ్యవహరించిన తీరు గురించి లోకానికి చాటి చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. కానీ ఇది ముమ్మాటికీ వైసీపీ సర్కార్‌కు మచ్చే.
సీఎం అనుమతి ఇచ్చినా, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో ఎలాంటి పనులు జరగడం లేదని ఆయన వాపోయారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి మంత్రి బొత్స సత్యనారాయణ గత ఏడాది డిసెంబర్‌లో హామీ ఇచ్చారని, మళ్లీ డిసెంబర్ వచ్చిందని గుర్తు చేస్తూ, ఇప్పటి వరకూ అతీగతీ లేదని వాపోయారు.
ఇది కేవలం కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆవేదన మాత్రమే కాదు. అభివృద్ధి పనుల విషయంలో రాష్ట్రమంతా ఇంచుమించు ఇదే దుస్థితి. ఇద్దరుముగ్గురు పెద్ద నాయకుల నియోజకవర్గాల్లో మినహాయిస్తే… కనీసం రోడ్లు వేసుకోలేని దయనీయ స్థితి ఎమ్మెల్యేలది. ఆర్థికశాఖ కార్యదర్శి రావత్ వ్యవహారశైలిపై అనేక ఆరోపణలున్నాయి. కోటంరెడ్డి ఆవేదనతో అది బహిర్గతమైంది.
40 వేల ఎకరాలకు నీరందించే కనుపూరు కెనాల్ డీప్ కట్ నిర్మాణ ఆర్థిక అనుమతుల విషయమై రావత్‌ను కలిసేందుకు వెళ్లగా తనను అవమానించిన వైనాన్ని కోటంరెడ్డి చెప్పిన తీరు ప్రతి ప్రజాప్రతినిధికి ఆవేదన కలిగిస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేనే కూచోమని చెప్పలేదంటే, ఇక ప్రతిపక్ష పార్టీల నేతలను రావత్ లెక్క చేస్తారా? ఇలాంటి లెక్కలేనితనం ప్రభుత్వ పెద్ద ఇచ్చిన చనువు వల్లే వచ్చిందని ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల వద్ద చెబుతున్నారు.
సీఎం సంతకం పెట్టిన జీవోలకు ఆర్థిక అనుమతి ఇవ్వట్లేదంటే అధికారుల తీరును అర్థం చేసుకోవచ్చని ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆవేదనతో చెప్పారు. సీఎం గారూ… మీ సంతకానికి విలువ లేదని చెప్పడమే కోటంరెడ్డి అసలు ఉద్దేశమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోటంరెడ్డి పైకి రావత్‌ను హెచ్చరించినట్టుగా మాట్లాడినా… అతని టార్గెట్ సీఎం జగనే అని నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు అంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నమ్ముకుని ఎమ్మెల్యేలు, మంత్రులను సైతం జగన్ పక్కన పెట్టారనే వార్తలొస్తున్న నేపథ్యంలో కోటంరెడ్డి సీరియస్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం వుంది.