Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: షేర్ మార్కెట్ లీలలు చెప్పే ఓ కథ

ఎమ్బీయస్: షేర్ మార్కెట్ లీలలు చెప్పే ఓ కథ

షేర్ మార్కెట్‌లో ధరలు దేనికి, ఎప్పుడు పెరుగుతాయో ఎవరికీ తెలియదు. రేస్ కోర్సులో ఏ గుఱ్ఱం ఎప్పుడు పరిగెడుతుందో తెలియనట్లే, ఏ షేరు ఆంబోతులా పరుగులు పెడుతుందో, ఏ షేరు ‘బేరు’మంటుందో తెలియక జుట్టు పీక్కుంటూ వుంటారు. కలకత్తాలో పని చేసే రోజుల్లో మా బ్రాంచికి దగ్గర్లనో స్టాక్ ఎక్స్‌ఛేంజి వుండేది. బయట బ్రోకర్లు అరిచే అరుపులు, కేకలు, వావాకారాలు, హాహాకారాలు, అన్నీ చూడడం వింతగా, ఒక తమాషా ప్రదర్శనలా వుండేది. మా బ్యాంకు గుజరాత్ బేస్‌డ్ బాంకు. షేర్ మార్కెట్ గురించి తెలియని గుజరాతీ దొరకడం చాలా కష్టం. ఎంతో ఎత్తుకెళ్లి, పాతాళానికి పడిపోయినా, మళ్లీ అదే రూటులో పైకి ఎగబాకుదామని చూసే గుజరాతీ మిత్రులు ఎందరో వున్నారు నాకు. నేనెప్పుడూ షేర్ల జోలికి పోలేదు. దానిలో మన ప్రజ్ఞ ఏమీ లేదని నా ఉద్దేశం. కంపెనీ పెర్‌ఫామెన్స్‌కి, దాని షేరు ధరకి సంబంధం లేకపోవడం కూడా నేను గమనించాను.

అది కొందరు మోతుబరులు మధ్యతరగతి జీవులను పావులుగా పెట్టి ఆడే క్రీడ. దానిలో తిమింగలాలు తప్పించుకుంటాయి, చిన్న చేపలు జీర్ణమైపోతాయి. నీకు లాభం వచ్చిందంటే దాని అర్థం యింకోడెవడో నష్టపోయాడనే! కొందరికి నడిమంత్రపు సిరి పట్టడం చూసి యితరులూ గోదాలోకి దిగుతారు. చివరకు మధ్యతరగతి వాళ్లు గుల్లయిపోతూ వుంటారు. సంపాదించినవాడు కూడా, తృప్తి పడి వూరుకోకుండా మళ్లీ షేర్లు కొని గొల్లుమంటూ వుంటాడు. షేర్ మార్కెట్‌పై అభినివేశం గుజరాతీల్లో, మార్వాడీల్లో ఎప్పణ్నుంచో వుంది కానీ తెలుగునాట దాని ఉధృతి 1990లలో బాగా కనబడింది. పల్లెటూళ్ల నుంచి కూడా షేర్లు కొనడం మొదలుపెట్టారు. ఆ వాతావరణంలో 1994 అక్టోబరు ‘‘ఇండియా టుడే’’లో తోలేటి జగన్మోహనరావు గారు ‘‘లక్ష్మీకటాక్షం’’ అనే కథ రాశారు. మనకున్న అతి తక్కువ మంది హాస్యరచయితలల్లో తోలేటి వారు ఒకరు. ఆయన సీరియస్ కథలూ రాశారు. ఈ కథ ఆద్యంతం చమత్కారంతో నిండి వుంటుంది. విపులంగా చెప్పడం కష్టం కాబట్టి కథాంశం మాత్రం చెప్పి వూరుకుంటాను.

నరసింహం అనే అతను తన కథ చెప్తున్నాడు. లక్ష్మీదేవి చపలచిత్తురాలు, పైగా ఆమె స్టాక్‌మార్కెట్ లక్ష్మి అవతారం మరీ చపలచిత్తురాలు అనే భావంతో యితను స్టాక్ మార్కెట్ సుడిగుండంలో దూకడానికి యిష్టపడకపోతే భార్య ఒత్తిడి చేసింది. ‘వ్యాపారం మనకు అచ్చిరాదు. మా తాత ధాన్యం వ్యాపారం చేసి పొలం అమ్మేశాడు, మా నాన్న బట్టల వ్యాపారం చేసి యిల్లమ్మేశాడు, మీ నాన్న ఆరు రీళ్ల సినిమా తీసి పదహారెకరాలమ్మేశాడు..’ అని చెప్పినా ఆవిడ వినకుండా రోజూ అంట్లతో బాటు యితన్నీ తోమేసింది. ‘పేరంటాళ్లు కూడా యివే విషయాలు మాట్లాడుతున్నారు. వాళ్ల ముందు నాకు తలకొట్టేసినట్లుంది’ అంటూ. ఆమె పోరు భరించలేక యితను ఓ రోజు డజను కంపెనీల అప్లికేషను ఫారాలు నింపి పంపించాడు. నాలుగు నెలల తర్వాత ఎనిమిది తిరిగివచ్చాయి. రెండు తిరిగి రాలేదు. రెండు కంపెనీల షేర్లు తగిలాయి. కానీ అమ్మబోయేసరికి పదిరూపాయల షేర్లు ఏడుకి, ఎనిమిదికి దిగిపోయాయి.

భార్య సలహాపై ఒక ఫ్రెండుని అడిగితే ‘ప్రైమరీ మార్కెట్ యింతే, సెకండరీ మార్కెట్లోకి దిగు’ అన్నాడు. కంపెనీ కొత్తగా పెట్టినపుడో, లేక కొన్నాళ్లకో పబ్లిక్ యిస్యూకి వెళ్లినపుడు డైరక్టుగా అప్లయి చేసి, వాళ్లు ఎలాట్ చేస్తే షేరు తీసుకోవడం ప్రైమరీ మార్కెట్. అలా కాకుండా అప్పటికే ఆ కంపెనీ షేరు వున్నవాడి దగ్గర అప్పటి మార్కెట్ రేటుకి కొని మన దగ్గర అట్టేపెట్టుకుని, కొన్నాళ్లకి మనలాటి యింకోడికి అమ్మడం సెకండరీ మార్కెట్. ఏదైనా మంచి షేర్లుంటే చెప్పు కొంటా అని అతన్నే అడిగితే అతను ఆరు కంపెనీల షేర్లు చెప్పాడు. నలభైవేలు పెట్టి అవి కొంటే ఆర్నెల్ల తర్వాత మూడు పైకి లేచాయి, మూడు కిందికి పోయాయి. లాభం లేదు, నష్టం లేదు. నలభైవేల మీద ఆర్నెల్లపాటు వడ్డీ పోయినట్లే.

ఓ స్నేహితుడు, బంగార్రాజు దగ్గరకు వెళ్లమని చెప్పాడు. అతను కాలేజీరోజుల్లో నరసింహానికి రూమ్మేటు. బక్కచిక్కి ముతక ఖాదీ పైజమా, లాల్చీ భుజానికి వేలాడే ఓ సంచీతో, పిల్లిగడ్డంతో ఎప్పుడూ విప్లవం కబుర్లు చెపుతూ యితను స్వీటు తిన్నప్పుడల్లా ‘బూర్జువా’ అని తిడుతూండేవాడు. బుర్ర తక్కువ్వాడివని ఎద్దేవా చేసేవాడు. అతను షేరుమార్కెట్‌లో బాగా సంపాదించాడని తెలిసి ట్రిక్కులు చెపుతాడేమోనని నరసింహం వెళ్లాడు. ఇప్పుడతను బాగా ఒళ్లు చేసి, చింతపండెట్టి తోవిన యిత్తడి గుండిగలా నిగనిగలాడుతూ, మెళ్లో బంగారు గొలుసుతో వున్నాడు. ‘దీనిలో దిగడానికి స్మార్ట్‌నెస్ వుండాలి. ఎంతో స్టడీ చేయాలి. బోనులో ఎలక దూరినట్లు దూరితే తోక కట్టయిపోతుంది.’ అని యీసడించాడు. బతిమాలితే రెండు గంటలపాటు లెక్చరిచ్చాడు.

సెన్సెక్స్ పడిపోతున్నపుడు కొనడం మొదలెట్టాలి. లేస్తున్నపుడు అమ్మడం మొదలెట్టాలి అనే సూత్రం నరసింహానికి అర్థమైంది కానీ ‘నువ్వు అనుభవజ్ఞుడివి కాబట్టి ఏది కొనాలో ఒక్క షేరు చెప్పు చాలు, మొత్తమంతా దానిమీదే పెట్టేస్తాను.’ అన్నాడు. ‘కోడిగుడ్లన్నీ ఒకే బుట్టలో పెట్టకూడదు, పది బుట్టల్లో సర్దాలి’ అని బంగార్రాజు నచ్చచెప్పబోయినా ‘కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలి’ అని నరసింహం పట్టుబట్టాడు. ‘సరే, ఫోన్ చేసి చెప్తాలే. మళ్లీ రాకు, షేరు కొన్నాక కలవకు’ అని విదిలించి పారేశాడు బంగార్రాజు. కొన్నాళ్లకు ఫోనే చేశాడు కూడా, ఓ షేరు చూశాను. ‘గుజరాత్ గోల్డ్. బుక్ వేల్యూ, ఈపియస్..’ అని చెప్పబోతూ వుంటే ‘అదేమీ అక్కరలేదు. నువ్వు చెప్పావ్. నాకంతే చాలు.’ అని యితను ఫోను ఠక్కున పెట్టేశాడు. కంపెనీ పేరు తెలిసింది కాబట్టి రేటు పడిపోతున్నపుడు కొనాలని యితను ఆగాడు. చివరకు దేశంలో మతకల్లోలాలు చెలరేగి, సెన్సెక్స్ దారుణంగా పడిపోయినపుడు ఓ బ్రోకర్ దగ్గరకు వెళ్లి ‘గుజరాత్ గోల్డ్ షేర్లు కావాల’న్నాడు.

బ్రోకర్ ఆ కంపెనీ పేరు ఎన్నడూ వినలేదు. కంప్యూటర్ మీద వెతగ్గా, వెతగ్గా దొరికింది. ఎనిమిది నెలల క్రితం ఓ రోజు 29కి ట్రేడయిందని చెప్తూండగానే అక్కడ కూర్చున్న ఓ కస్టమర్ యితని మీదకు దాదాపు ఉరికినంత పని చేసి, ‘ఓ 500 షేర్లు 25కి చేసి తీసుకోండి’ అని బతిమాలాడు. 24 దగ్గర డీల్ కుదిరింది. బయటకు వచ్చాక ‘నా పేరు ఎస్సెస్ బుట్టా. నా దగ్గర యింకో వెయ్యి షేర్లు వున్నాయి. అవీ తీసుకోండి బ్రోకర్ ఎదురుగా చెపితే కమిషన్ అడుగుతాడని చెప్పలేదు.’ అన్నాడు. ఓ 500 13 రూ.లకి, మరో 500, 11రూ.లకి ఒప్పందం కుదిరింది. ఇతను చెక్ యిచ్చాక బుట్టా కాఫీహోటల్‌కి తీసుకెళ్లి ‘మీరు షేర్ మార్కెట్‌కి కొత్తనుకుంటా. ఈ షేరు నెత్తిమీద రూపాయ పెట్టి పావలాకి కొనమంటే ఎవరూ కొనరు. అనుకోకుండా ప్రైమరీలో 1500 షేర్లు తగులుకున్నాయి. రెండేళ్ల నుంచి ఏ సన్యాసి దొరుకుతాడా అని చూస్తున్నాను. ఈ షేరు సర్టిఫికెట్లను తూకానికి వేయాల్సిందే. సారీ, మిమ్మల్ని ముంచేశాను. లేకపోతే నేను తేలడం ఎలా? కానీ ‘లోతు తెలీని చోట దిగకూడదు’ అనే అక్షరలక్షలు చేసే పాఠాన్ని 12 లక్షలకు కాకుండా 20 వేలకే మీరు నేర్చేసుకున్నారు.’ అని పకపకా నవ్వాడు.

ఇతనికి ఏమనాలో తోచలేదు. గంభీరంగా ‘నవ్విన నాప చేనే పండుతుంది.’ అన్నాడు. ‘నాప చేను ఎందుకు నవ్వుతుంది? నవ్వాకా ఎందుకు పండుతుంది?’ అని బుట్టా అడిగితే యింకా గంభీరంగా ‘కాలమే దానికి సమాధానం చెపుతుంది.’ అన్నాడు. కొద్దికాలం మనసు వికలమైనా బంగార్రాజు స్టాకోపదేశం గుర్తు తెచ్చుకుని రెట్టించిన ఉత్సాహంతో యింకో వెయ్యి గుజరాత్ గోల్డు షేర్లు ఆర్డరిచ్చినపుడు బ్రోకర్ ఆఫీసులో అందరూ చెవులు కొరుక్కున్నారు. దేశం నలుమూలల నుంచి షేర్లు వచ్చి పడుతున్నాయి. ఇతను కొనేస్తున్నాడు. ‘కొంపదీసి కంపెనీ టేకోవర్ చేస్తున్నారా?’ అని అడిగాడు బ్రోకర్. ఆఖరి వెయ్యి షేర్లు 5 రూ.ల రేటున కొన్నాడు. అప్పటికి అతని బ్యాంకు బేలన్సు అయిపోయింది. ఇతను కొనడం మానేశాక దాని ధర 3 రూ.లకు దిగి అక్కడే బబ్బుంది.

అయ్యో పెట్టుబడంతా ఎగిరిపోయింది అని భార్య లబలబలాడితే ‘ప్రస్తుతం శవాసనం వేసిన రేటు క్రమేపీ భుజంగాసనం వేస్తుంది, తర్వాత లేచి కూర్చుని వజ్రాసనం వేయగానే మనం అమ్మటం మొదలెట్టాలి. అది లేచి నిలబడి తాళాసనం వేసేలోగా మనం అమ్మేయాలి. లేకపోతే మళ్లీ శీర్షాసనం వేసేయగలదు. ఇదంతా బంగార్రాజు చెప్పాడు’ అని యితను ఊరడించాడు. సెన్సెక్స్ క్రమేపీ పుంజుకుంది కానీ యితని షేరు కదల్లేదు. రెండు వారాలు పోయాక షేరు కదిలి 30 అయింది. ఇతను అచ్చుతప్పు అనుకున్నాడు. తర్వాత 63, ఆపై 85 కూడా అయిపోయింది. కారణం ఏమిటాని చూస్తే గుజరాత్ గోల్డ్ కంపెనీలో స్విండ్లర్స్ అమెరికా అనే ఫార్చ్యూన్ 500 కంపెనీ మెజారిటీ వాటాలు తీసుకోబోతోందని, సంప్రదింపులు చివరి దశలో వున్నాయనీ వార్త లోపలి పేజీల్లో వచ్చింది. ఆ తర్వాత షేరు ధర చుక్కల్లోకి వెళ్లిపోతోందట.

ఇతను నిచ్చెనెక్కి అటక మీద దాచిన షేరు సర్టిఫికెట్ల పెట్టె దింపి, ఓ 500 షేర్లు బ్రోకర్ ఆఫీసుకి వెళ్లి అమ్మేసి వస్తూంటే, బుట్టా కనబడ్డాడు. ఇలా పెరుగుతుందని ఎలా తెలుసు? అని అడిగితే ‘నా బొంద, బంగార్రాజనే మా ఫ్రెండు చెప్తే కొన్నాను’ అని యితను నిజాయితీగా చెప్పేశాడు. బుట్టా ఎవరో చెపితే నిప్పన్ సిల్కులో షేర్లు కొని నష్టపోయాట్ట. కొత్త స్కూటర్ అమ్మేస్తానన్నాడు. ఇతను కొనుక్కుంటే హెల్మెట్ ఫ్రీగా యిస్తానన్నాడు. నరసింహం నెల రోజుల తర్వాత మొత్తం షేర్లన్నీ అమ్మేసి బయటకు వస్తూంటే బ్రోకర్ ఆఫీసులో అందరూ సెల్యూట్ కొట్టారు. కొందరు ఆటోగ్రాఫులు తీసుకున్నారు. ఈ భాగ్యానికి కారకుడు బంగార్రాజు కదా, థ్యాంక్స్ చెబుదామని అతనింటికి వెళ్లాడు. ఓసారి వెళితే ఊరెళ్లాడన్నారు. ఇంకోసారి దొరికాడు.

బంగార్రాజిల్లు డిప్రెషన్లో ట్రేడింగ్ రింగ్‌లా సందడి లేకుండా వుంది. అతను సెంట్రలు జైల్లో యావజ్జీవ ఖైదీలా వున్నాడు. ‘కితం సారి వచ్చినపుడు లేవు.’ అన్నాడు నరసింహం. ‘అవును, పొలం అమ్మడానికి వెళ్లాను.’ అన్నాడు బంగార్రాజు. ‘‘ఆ తర్వాత నేను ఊరెళ్లాను.’’ ‘‘ఏం? నువ్వూ పొలం అమ్మడానికే వెళ్లావా? నన్నని ప్రయోజనం లేదు. ముందే చెప్పాను స్టాక్ మార్కెట్‌లో ముందేం జరుగుతుందో ఎవరికీ తెలియదని. నేను మంచిదనుకున్న షేరు మంచి హృదయంతో నీకు చెప్పాను. నేనూ కొన్నాను. చివరకి యిలా జరిగింది...’ అంటూ మొదలెట్టాడు. జరిగిందేమిటంటే బంగార్రాజు నరసింహానికి ఫోన్లో గుజరాత్ కోల్డ్ షేరు కొనమని చెప్పాడు. అది యితనికి .. గోల్డ్‌గా వినబడింది. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి. మొత్తమంతా ఒకే దానిలో పెట్టాలి అని నరసింహం అన్నమాట బంగార్రాజు మెదడులో నాటుకుని పోవడంతో అతను ఉన్న డబ్బంతా పెట్టి గుజరాత్ కోల్డ్ షేర్లు 150 రేటు చొప్పున కొన్నాడు. అది యిప్పుడు 26కి పడిపోవడంతో దిబ్బయిపోయాడు.

తను కొన్నది గుజరాత్ కోల్డ్ కాదని గోల్డని, యిబ్బడిముబ్బడిగా లాభం వచ్చిందని నరసింహం చెప్పడంతో బంగార్రాజుకి వెర్రిగా కోపం వచ్చింది. ‘నేను చెప్పినది కాకుండా వేరేది కొన్నావంటే నీకు ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ సమాచారం నీకిచ్చింది గుజరాత్ గోల్డ్‌లో పనిచేసే మీ బామ్మర్ది. ఇలాటి వెధవపని చేసినందుకు అమెరికాలో అయితే నీకు ఏడేళ్లు, మీ బావమరిదికి పధ్నాలుగేళ్లు జైలుశిక్ష పడేది. నువ్వొక్క నక్కవి. కాలేజీ రోజుల్లోనే నీ చూపు నక్కచూపని కనిపెట్టాను.’ అంటూ రెచ్చిపోసాగాడు. ‘నాకు బామ్మర్దే లేడురా’ అని యితను మొత్తుకుంటే ‘అవున్రా బూర్జువాకి స్నేహం లేదు, బంధుత్వం లేదు, బంగార్రాజూ లేడు, బామ్మర్దీ లేడు. వాడికి డబ్బు తప్ప యింకేదీ కనిపించదు.’ అని విరుచుకుపడ్డాడు కాలేజీ రోజుల వాగ్ధాటి గుర్తు చేసుకుని.

అతని ఉగ్రస్వరూపం చూసి దడుచుకుని, నరసింహం యింటికి వస్తూ మార్కెట్లో ఆగితే బెల్లూ, బ్రేకూ లేని పాతసైకిలు తోసుకుంటూ బుట్టా కనబడ్డాడు. ‘గుజరాత్ గోల్డు షేరు పదో, పరకో ఎంతకో అంతకు తీసుకోండి’ అన్నాడు హడావుడిగా. అదేమిటి అన్నీ నాకు అమ్మేశారుగా అని ఆశ్చర్యపడ్డాడితను. జరిగిందేమిటంటే గుజరాత్ గోల్డు ధర పైకి లేవడం చూసి బుట్టా గారింట్లో యింటిల్లపాదీ మూడు రోజులు తిండి తినలేదుట. ‘తెలివితక్కువగా అమ్మేశారు’ అంటూ భార్య సతాయించడంతో బుట్టా 82 రూ.ల రేటున ఓ 500 తీసుకున్నాడు. 200 దాటుతుందని బ్రోకర్ హామీ యిచ్చాడు. అయితే యీలోపున స్విండ్లర్స్ వాళ్లు తమకు గుజరాత్ గోల్డ్‌లో వాటాలు తీసుకునే ఉద్దేశం లేదని ప్రకటన చేయడంతో దాని రేటు పడిపోయింది. ప్రస్తుతం 11 దగ్గర ఆగింది. ‘మళ్లీ బుట్టలో పడిపోయాను సార్. ఈ సైకిల్ ఎవరికైనా అమ్మేస్తాను, బేరం చూడండి. బెల్లు ఫ్రీ’ అంటూ జేబులోంచి బెల్లు తీసి టింగుటింగు మనిపించాడు.

అతన్ని తీసుకెళ్లి టిఫెన్ పెట్టించి ఓదారుస్తూంటే ‘మీ ఫ్రెండు బంగార్రాజు గారిని కలిసి గైడెన్సు తీసుకుంటానండి, అడ్రసు చెప్పండి’ అని అభ్యర్థించాడు. ‘ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి  బాగా లేదు, బాగుపడ్డాక చెప్తాను.’ అన్నాడితను క్లుప్తంగా. పైకి వచ్చినవాడిని లోకం మరీ పైకి లేపేస్తుంది. నరసింహానికి స్టాక్ మార్కెట్ మాంత్రికుడిగా పేరు వచ్చింది. ఓ రోజు సన్మానసభ ఏర్పాటు చేశారు. ‘రిఫార్మ్స్, డంకెల్, గాట్’ అంటూ ఏదో మాట్లాడారు. ఇతనికి ఏమీ అర్థం కాకపోయినా తన వంతు వచ్చినపుడు ‘ఏషియా పులి ఇండియా, లేచింది, గర్జిస్తోంది’ అన్నాడు. జనాలంతా చప్పట్లు కొట్టారు. సభ అయ్యాక బయటకు వస్తూంటే బంగార్రాజూ, అతని పక్కన బుట్టా నల్లజండాలు పట్టుకుని నిలబడ్డారు. బంగార్రాజు కాలేజీ రోజుల నాటి వేషధారణకి వచ్చేశాడు. బుట్టా కూడా డిటో. ఇద్దరూ జిత్తులమారి నక్క, మేకవన్నె పులి, పయోముఖ విషకుంభం, తేనెపూసిన కత్తి అని యితన్ని చూసి అరుస్తున్నారు. ఇతను గబగబా కారెక్కేశాడు.

ఇక్కడితో కథ అయిపోయింది. షేర్ మార్కెట్ అమీర్లను ఫకీర్లగా, గరీబులను జనాబులుగా చేయగలదనీ, దానిలో రాణించడానికి తెలివితేటలు అక్కరలేదని వ్యంగ్యంగా చెప్పిన యీ కథ నాకిష్టం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?