Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ఆంధ్రాయే కాదు, మణిపూర్ కూడా...

ఎమ్బీయస్‍: ఆంధ్రాయే కాదు, మణిపూర్ కూడా...

షర్మిల ఆంధ్రలో ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షురాలిగా అవతారం ఎత్తగానే జనాలు ‘మొన్నటిదాకా తెలంగాణయే నా కర్మభూమి, సర్వస్వం, నేను అక్కడిదాన్నే, ఆంధ్రలో నాకేమీ లేదు..’ అంటూ వచ్చి, అక్కడ అంబ పలక్క, మొత్తం పార్టీ కరారావుడు అయిపోయాక, హఠాత్తుగా యిప్పడు ఆంధ్ర ఎలా గుర్తుకొచ్చింది?’ అని ఆశ్చర్యపడ్డారు. అఫ్‌కోర్స్, వైసిపియేతర పక్షాలేవీ ఆవిణ్ని పన్నెత్తి మాట అనటం లేదనుకోండి. కానీ మనసులో మాత్రం అనుకునే ఉంటారు. నేననేది ఆవిడకు హఠాత్తుగా, గుర్తుకు వచ్చింది ఆంధ్రాయే కాదు, మణిపూరు కూడా అని. మణిపూరు సంఘటనలు జరిగి 8 నెలలయ్యాయి. ఇన్నాళ్లూ రిప్ వాన్ వింకిల్‌లా నిద్రపోయి, యిప్పుడు మేల్కొని హన్నన్నా, ఎంత పని జరిగింది అని నొచ్చుకుని, తన క్రైస్తవం కూడా గుర్తుకు తెచ్చుకుని, ఫీలై పోతోంది ఆవిడ.

2023 మేలో మణిపూర్ ఘర్షణలు ప్రారంభమయ్యాయి. అప్పటికి ఆవిడ ఒక పార్టీ నడుపుతోంది. దానికి కర్త, కర్మ, క్రియ అన్నీ ఆవిడే! అప్పుడు చప్పుడు చేయకుండా ఊరుకుంది. క్రైస్తవురాలైనా కాకపోయినా, రెండు జాతుల మధ్య ఆ విధమైన ఘర్షణ జరగడం బాధించి ఉండాలి కదా, కావాలంటే స్టేటుమెంటు ఒకటి యిచ్చి ఉండవచ్చు. జాతీయ రాజకీయాలు మనకెందుకని ఊరుకుని ఉంటే ఊరుకోవచ్చు. ఇప్పుడెందుకు దాని గురించి మాట్లాడడం? కాంగ్రెసులో చేరితే తప్ప క్రైస్తవురాలినని గుర్తుకు రాలేదా? మొయితీలను దశాబ్దాలుగా కాంగ్రెసు కూడా దువ్వింది. అధికారంలో కాంగ్రెసు ఉన్నా వారిని కట్టడి చేసి ఉండేదని చెప్పలేం. అయినా కాంగ్రెసుకు, మణిపూరులో శాంతిభద్రతలకు ముడి పెడుతూ దిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడేటప్పుడు మణిపూరు ఘటనల పట్ల ఒక క్రైస్తవురాలిగా బాధపడుతున్నానని అన్నది. తెలుగు మీడియాతో మాట్లాడేటప్పుడు ఆ మాట రాలేదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మళ్లీ ఆ సంగతి ఎత్తింది.

ఆంధ్రలో ప్రతిపక్ష పార్టీ ఐన కాంగ్రెసుకు షర్మిల యిప్పుడు నాయకురాలు. పైగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తానంటోంది. తెలంగాణలోనూ అదే మాట అంది. చివరికి ఏం చేసిందో చూద్దాం. తెలంగాణలో అయితే సొంత పార్టీ. కాంగ్రెసులో అనేక అంతస్తులుంటాయి. ఇలాటి నిర్ణయం హై కమాండే తీసుకుంటుంది. కానీ యీవిడింకా సొంత పార్టీ మోడ్‌లోనే ఉంది. కాంగ్రెసు వారు క్రమేపీ నేర్పిస్తారు లెండి. ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని నానారకాలుగా దుమ్మెత్తి పోయడం ఆమె హక్కు, బాధ్యత కూడా. ముఖ్యమంత్రి చెల్లెలు కాబట్టి వ్యక్తిగత విషయాలు కూడా జోడించి ఝాడిస్తుంది. అదీ సహజమే. రాజకీయంగా విమర్శించడానికి చెప్పేందుకు ఆవిడకు టిడిపి ఏమీ మిగల్చలేదు. టిడిపి చెప్పినదే ఆవిడా చెప్పాలి. ఆ భాగ్గానికి బాబు నుంచి స్క్రిప్టు తీసుకోవల్సిన పని లేదు. అది పబ్లిక్ డొమైన్‌లో ఎప్పణ్నుంచో ఉంది.

తక్కిన పార్టీల కంటె ఒక ఆకైనా ఎక్కువ చదవాలంటే, ఆవిడ కుటుంబ వ్యవహారాలు చర్చకు, తద్వారా రచ్చకు యీడవాలి. ఏం తప్పు లేదు. ఎవిరిథింగ్ యీజ్ ఫెయిర్ యిన్ లవ్ అండ్ వార్ అన్నారు. పైగా ఆమెకు యిది ఫైనల్ వార్, అంతిమ పోరాటం. తెలంగాణలో ప్రయత్నించి, విఫలమై వచ్చింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెసు ఉన్నంతకాలం ఆవిడకు అక్కడ చోటు లేదు. ఇక్కడ ఎలాగైనా, కనీసం ఓ గుప్పెడు సీట్లయినా గెలిచి, యితర కాంగ్రెసు నాయకులను సైలెన్స్ చేయాలి. లేకపోతే వాళ్లు పెదవి విరిచేసి, యీవిడ కుర్చీ కాలు విరిచేస్తారు. ఆంధ్రలో కూడా చుక్కెదురైతే ఆవిడ కర్ణాటక వెళ్లి ‘నాకిక్కడ ఆస్తులున్నాయి, నేనిక్కడి దాన్నే, యిక్కడి యువత కోసం పోరాడతాను’ అనే పల్లవి అందుకోవాలి. ఇదేదో జోక్ అనుకోవద్దు. ఆవిడకు అంత పట్టుదలా ఉంది.

రాజకీయాల్లో కావలసినది కలలు కనడం, వాటిని నెరవేర్చుకోవాలని గట్టిగా సంకల్పించుకోవడం. ఇది కలాం గారి స్లోగన్‌ మాత్రమే కాదని రేవంత్ నిరూపించాడు. వ్యక్తిత్వవికాసం పాఠాల్లో అతని కథను చేర్చే రోజు వచ్చింది. ముఖ్యమంత్రయ్యాక యీ స్థాయికి వస్తానని ఎప్పుడో అనుకున్నానని చెప్పుకునుంటే ‘సరేలే’ అనుకునేవాళ్లం. సాటి ఎమ్మెల్సీగా ఉండే రోజుల్లోనే ‘నేనెప్పటికైనా ముఖ్యమంత్రి ఔతా’ అనేవాడని ప్రొ. నాగేశ్వర్ చెప్పారు. ‘టిడిపిలో రెడ్డి ఎమ్మెల్సీగా ఉంటూ అట్టెట్టా అవుతావయ్యా’ అని అడిగారటాయన. ‘ఏమో సార్, ఎట్లయినా అవుతా’ అన్నాట్ట రేవంత్. చంద్రబాబు బాటలోనే అల్లుడి హోదా నుంచి సిఎం అవుదామనుకున్నాడా అంటే బాబుకి కూతుళ్లే లేరు. గట్టిగా నిర్ణయం చేసుకుంటే పరిస్థితులు కూడబలుక్కుని అది సాకారం అయ్యేట్లు చేస్తాయనే సామెతను రుజువు చేస్తూ రేవంత్ ముఖ్యమంత్రి అయిపోయారు, ఏ వారసత్వమూ లేకపోయినా!

రేవంత్ కథ షర్మిలకు స్ఫూర్తి నిచ్చినట్లుంది. అందుకే ఆంధ్ర కాంగ్రెసు అధ్యక్ష పదవి చేపట్టారు. అయితే రేవంత్ తన కల సాకారం చేసుకోవడానికి రాజకీయాల్లో నిరంతరం చురుగ్గా ఉంటూ, పార్టీలు మారుతూ, దాని కోసం పార్టీలో తక్కినవారితో రాజీ పడుతూ, ఎంతో కసరత్తు చేస్తూ దశాబ్దాల పాటు ఓపిక పట్టాడు. షర్మిల రాజకీయాల్లో చాలా ఏళ్లు విరామం తీసుకున్నారు. కార్యక్షేత్రాన్ని మార్చుకుంటూ వచ్చారు. రేవంత్‌ మాదిరి ఒక పెద్ద పార్టీలో చేరి, అవసరమైనప్పుడు ఒదుగుతూ అధిష్టానాన్ని మెప్పించడానికి శ్రమించలేదు. సొంతంగా పార్టీ పెట్టి నడపబోయారు. తన అన్నకు చేతనైంది తనకు చేతకాదా? అనుకున్నారు. పార్టీ పెట్టిన 8 ఏళ్లకు కానీ అన్నకు అధికారం రాలేదని తెలిసినా యీవిడకు రెండున్నరేళ్లకే పార్టీని గుంటలో పెట్టి గంట వాయించేశారు.

మాటిమాటికీ తండ్రి పేరు చెప్పుకుంటున్నా, తండ్రి నుంచి యీవిడకు ఓర్పు వారసత్వంగా రాలేదు. వైయస్ 1980లో తొలిసారి మంత్రి అయినా ముఖ్యమంత్రి కావడానికి 24 ఏళ్లు పట్టింది. మధ్యలో తివారీ కాంగ్రెసుకు వెళ్లినా, మొత్తానికి పార్టీని అంటిపెట్టుకునే ఉన్నాడు తప్ప సొంత పార్టీ పెట్టేయలేదు. జగన్ కూడా కాంగ్రెసు పార్టీ తనను ఏడిపించి బయటకు నెట్టేసేదాకా ఆగాడు. ఈవిడకు తొందర ఎక్కువగా ఉన్నట్లుంది. తెలంగాణలో పార్టీని కొనసాగించి ఉంటే యీసారి కాకపోయినా, వచ్చేసారికైనా కొన్ని సీట్లు గెలిచేది. పోయిపోయి కాంగ్రెసులో చేరి తెలంగాణలో వెలుగు దామనుకుంది. తన తండ్రిని ముద్దాయిగా చేసి కేసులు పెట్టిన పార్టీ అది! ఇది వరకు తను నోరారా పడతిట్టిన పార్టీ అది! సహచరులను ఎవర్నీ సంప్రదించకుండా వెళ్లి చేరి వాళ్లనూ పోగొట్టుకుంది. సోనియా ఓ పట్టాన ఏదీ తేల్చకుండా, యీమెను నిర్వీర్యం చేసి, పరువు పోగొట్టి, చివరకు తెలంగాణలో చోటు లేదు, ఆంధ్రకు వెళ్లి అక్కడేం ఉద్ధరిస్తావో ఉద్ధరించు చూదాం అని తరిమారు.

దాశరథి గారి గేయం ఒకటి ‘కళ్లెం ఉన్నది చేతిలో, గుఱ్ఱం పడె గోతిలో..’ అని ప్రారంభమౌతుంది.  అది షర్మిలకు వర్తిస్తుంది. కాంగ్రెసు గుఱ్ఱం కళ్లెం ఆవిడ చేతిలో ఉంది. కానీ గుఱ్ఱం మాత్రం అగడ్తలో పడి ఉంది. ‘నిన్నటిదాకా పార్టీలోనే లేని ఆమెను తీసుకుని వచ్చి రాష్ట్ర అధ్యక్షురాలంటే అలా ఎలా? సీనియర్లం మేముండగా...’ అని ప్రతిఘటించే ఉత్సాహం కూడా ఎవరికీ లేదు. అమ్మయ్య, ఎవరో ఒకరు బకరా దొరికారు, అదే చాలు అన్నట్లున్నారు. తక్కిన రాష్ట్రాల మాట ఎలా ఉన్నా ఆంధ్రా కాంగ్రెసు గుఱ్ఱం మాత్రం శల్యావశిష్టంగా ఉంది. దానికి తోడు యిప్పుడు గుఱ్ఱమెక్కిన రౌతు షర్మిల డాన్ క్విక్సోట్‌లా ఉంది. రాకుమారి ఆంధ్రను జగన్ బారి నుంచి రక్షించే ‘నైట్’గా ఊహించుకుంటూ క్విక్సోట్ గాలిమరలపైకి యుద్ధానికి వెళ్లినట్లు షర్మిల వెళుతోంది.

షర్మిలకు శారీరకంగా ఓపిక ఉండవచ్చు. పోరాడే ఉత్సాహం, శక్తి ఉండవచ్చు. కానీ యిప్పటిదాకా ఆమె సాధించినది ఏమీ లేదు. సుదీర్ఘ పాదయాత్ర రికార్డు తప్ప! చంద్రశేఖర్, రాహుల్ గాంధీ వంటి పాదయాత్రీకులు ఏం సాధించారో గతంలోనే రాశాను. షర్మిల పాదయాత్ర కారణంగానే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడని ఎవరైనా అంటే వారికో దణ్ణం. తెలంగాణలో సొంత పార్టీ పెట్టినపుడు, ఎదరంతా ముళ్లబాట, ఏమైనా సాధిస్తుందేమో చూడాలి అని రాశాను. చూశాం. ఇప్పుడు ఆంధ్రకు వచ్చి పడింది. ఇక్కడైనా ఏమైనా సాధిస్తుందేమో కొన్ని నెలల తర్వాత తెలుస్తుంది. తెలంగాణలో పార్టీ నడిపినంత కాలం స్వతంత్రంగా నడిపింది. కానీ ఆంధ్రకు కాంగ్రెసు ద్వారా వచ్చింది. కాంగ్రెసు పార్టీ ఆంధ్రకూ అన్యాయం చేసింది, వైయస్‌కు, ఆయన కుటుంబానికీ చేసింది. అబ్బే, ఏం చేయలేదు అని యీమె యిప్పుడు ఎలా కన్విన్స్ చేస్తుందో చూడాలి.

ఆంధ్రకు చేసిన అన్యాయం గురించి అందరికీ తెలుసు. వైయస్ విషయంలో అతని పేరు కేసుల్లో ముద్దాయిగా పెట్టినప్పుడే తెలిసిపోయింది. రోశయ్య, కిరణ్ వైయస్ పేరుకి ప్రాముఖ్యం రాకుండా జాగ్రత్తపడ్డారు, ఆ పేరు ఎత్తితే ఆ బెనిఫిట్ జగన్‌కు పోతుందన్న భయంతో! 2018 తెలంగాణ ఎన్నికలలో రాహుల్ వైయస్ చేసినవి కూడా బాబు ఖాతాలో పడేశారు. సాక్షాత్తు షర్మిల ‘మా నాన్న బతికి ఉంటే కాంగ్రెసుపై ఉమ్మేసేవాడు’ అంది. ఇప్పుడు రాహుల్‌ను ప్రధాని చేయడం మా నాన్న ఆశయం కాబట్టి, ఆ ఆశయసిద్ధికి కాంగ్రెసులో చేరానంటోంది. ఇప్పుడుండి వుంటే రాహుల్ ప్రధాని సంగతిలో వైయస్ ఎప్పుడో ప్లేటు ఫిరాయించేవాడు. బతికుండగానే ఇందిరకు వ్యతిరేకంగా తివారీ కాంగ్రెసులో చేరాడు. అలా తన మీద కేసు పెట్టారనగానే రాహుల్‌పై కుట్ర చేసేవాడు. రాజకీయాల్లో ఏం మాట్లాడినా చెల్లిపోతుందన్న ధైర్యం నాయకులకు. పార్టీలో చేరేటప్పుడు ఒకలా మాట్లాడతారు. వీడిపోతున్నపుడు మరోలా మాట్లాడతారు.  

షర్మిల వైసిపిపై చేసే రాజకీయ ఆరోపణల గురించి చర్చించడం అనవసరం. అవి టిడిపి కూటమి ఎప్పుడూ చేస్తున్నవే. వ్యక్తిగత ఆరోపణల గురించే ఒక మాట చెప్పుకోవాలి. వైయస్ కుటుంబాన్ని చీల్చడం జగన్‌తో ప్రారంభమైంది అంటోంది షర్మిల. ఈ మధ్య ఒక విశ్లేషకుడు వైయస్ కుటుంబం ఎప్పుడూ కలిసే ఉండేదని, జగన్ కారణంగానే విచ్ఛిత్తి జరుగుతోందని అంటున్నారు. వివేకా సంగతేమిటి? లక్ష్మణుడు లాటివాడని పేరు బడిన ఆయన్ని మంత్రి పదవి ఆశ చూపి వదినపై పోటీకి నిలబెట్టింది కాంగ్రెసు కాదా! జగన్‌ను నిందించే ముందు షర్మిల యీ విషయంలో కాంగ్రెసు సీనియారిటీని గుర్తించాలి. జగన్‌కు, ఆమెకు పడటం లేదు. ఇది నిజం. చాలా యిళ్లల్లో ఉండే గొడవలే యివి. ఆస్తి పంపకాలలో తేడా వచ్చిందంటున్నారు. న్యాయపరంగా వచ్చే వాటా కోసమైతే కోర్టు కెళ్లేది. రచ్చకెక్కి రాజకీయం చేసేది కాదు.

ఈడీ ఫ్రీజ్ చేసిన ఆస్తుల విలువ షర్మిల యిచ్చేయమందని, అవి చేతికి వచ్చాక పంచుకుందామని జగన్ అన్నాడని వైసిపి అనుకూల విశ్లేషకులు చెప్తున్నారు. షర్మిల వెంట చాలాకాలం నడిచి, కాంగ్రెసులో చేరడంతో ఆగ్రహించిన కొండా రాఘవరెడ్డి గారు అనిల్ ప్రభుత్వధనం దోచడానికి జగన్ సహకారం కోరితే అతను ఒప్పుకోలేదని, అందుకే షర్మిల యీ రగడ మొదలు పెట్టిందని అన్నారు. వాస్తవాలు దేవుడికి ఎరుక. కుటుంబీకులు కలహించడం అబ్బురమేమీ కాదు. కేంద్రమంత్రిగా చేసిన ప్రమోద్ మహాజన్‌ను అతని తమ్ముడు కాల్చి చంపలేదా? కేశినాని నాని, తమ్ముడు కొట్టుకోవటం లేదా? బావా బావమరిది ఐన బాబు, హరికృష్ణ దెబ్బలాడుకోలేదా? తోడల్లుళ్లు బాబు, దగ్గుబాటి కలహించుకోలేదా? స్టాలిన్, అళగిరి మాటేమిటి? వైయస్ వివేకా కూతురు సునీత తండ్రితో కొన్నేళ్లగా మాటలు మానేసింది కదా! ఎన్టీయార్ సంతానం సవతి తల్లి పట్ల ఎలా ప్రవర్తించారు?

చంద్రబాబు నాయుడు గారు జైలుకి జూనియర్ ఎన్టీయార్ మౌనంగా ఉన్నాడంటూ అతనిపై టిడిపి అభిమానులు విరుచుకు పడ్డారు కానీ రోహిత్ జైలుకి వెళ్లి పరామర్శించినట్లు వార్తలు చూడలేదు. ఎందుకిలా అంటే ఏదో కారణం ఉండవచ్చు. ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో వాళ్లలో వాళ్లకే తెలియాలి. అన్ని కుటుంబాలలో యిలాటివి సహజం. షర్మిల రోడ్డెక్కింది కాబట్టి సరాదాగా వింటున్నారు, పదేపదే అదే చెపితే సరేలే అంటారు. పోనుపోను షర్మిల స్టీమ్ అయిపోయి, మీడియా ఎటెన్షన్ కోసం ‘మా వదినగారు సరిగ్గా పలకరించలేదు. పెట్టిన జాకట్టు గుడ్డకు జరీ అంచు లేదు..’ యిలాటివి చెప్తుందేమో. అవన్నీ శ్రోతలు వేడుకగా వింటారు తప్ప, ఓటు నిర్ణయించడానికి పరిగణనలోకి తీసుకోరు.

ఎందుకొచ్చిన తలనొప్పి, జగన్ షర్మిలకు ఒక రాజ్యసభ సీటు యిచ్చేసి ఉంటే సరిపోయేది కదా, గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నాడు అంటారు కొందరు. ఒకటి మాత్రం నిజం. షర్మిల వెరీ యాంబిషియస్.  అది వాళ్ల కుటుంబంలోనే ఉంది. వైయస్సూ మహా ఆశపోతు. 1980-83 మధ్య చిన్న మంత్రి పదవి చేశాడంతే. ఆ తర్వాతి నుంచి ముఖ్యమంత్రి పదవికి పాకులాడేవాడు. మామూలు మంత్రి పదవి యిస్తానంటే ఒప్పుకునేవాడు కాదు. ఎవరు ముఖ్యమంత్రి ఐనా గొడవ పెట్టేసేవాడు, కుట్రలు పన్నేవాడు. నిత్య అసమ్మతివాది. చివరకు 2004కి అయ్యాడు. జగనూ అంతే తండ్రి పోగానే యెకాయెకీ ముఖ్యమంత్రి అయిపోదామనుకున్నాడు. కేంద్రంలో ఏదో మంత్రి పదవి యిస్తాంలే, సర్దుకో అంటే ఊరుకోలేదు.

ఇప్పుడు షర్మిలా అంతే. చూస్తున్నాం కదా, తెలంగాణలో ఎంత పెద్ద మాటలు మాట్లాడిందో, యిప్పుడు ఆంధ్రలో మొదలెట్టింది. ఇలాటామె రాజ్యసభ సభ్యత్వంతో ఊరుకునేది అంటే నమ్మడం కష్టం. దిల్లీలో ఉన్నంతకాలం కేంద్రంతో లాబీయింగు చేసేది. మా అన్నను జైలుకి పంపండి, నేను ముఖ్యమంత్రినౌతా అనేది. ఆంధ్రకు వస్తే ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా మారి, అసమ్మతివాదులకు స్థావరంగా మారేది. ఈ తలకాయ నొప్పికి తోడు, బయట ప్రతిపక్షాలు కుటుంబ పాలన అంటూ యాగీ చేసేవి. ఎందుకొచ్చిన గొడవ, ఆదిలోనే తుంచేస్తే పోయె కదా అనుకుని జగన్ అనుకుని ఉండవచ్చు. షర్మిలకు రాజకీయంగా ఆశలు ఉంటే, అనిల్‌కు ఆర్థికపరంగా ఆశలున్నాయంటున్నారు. పైగా అతను ఉధృతంగా క్రైస్తవమత ప్రచారం మొదలుపెడితే జగన్‌ హిందూ ఓట్లకు గండి పడుతుంది.

సరే, షర్మిల ధైర్యం చేసి రంగంలోకి దిగి చెడుగుడు ఆడేస్తోంది. ఆమె కున్న ఎడ్వాంటేజిలు ఏమున్నాయి? వైయస్ వారసత్వం కార్డు అందామా, తెలంగాణలో ఉపయోగ పడలేదని తేలిపోయింది కదా! జగన్‌కు 2014లో ఉపయోగ పడలేదు కదా! పదవి పోయిన తర్వాత కెసియార్‌కే యిప్పుడు ఏ పాటి బేస్ మిగులుతుందో అనుమానం. 15 ఏళ్ల క్రితం పోయినాయనకు యింకా ఏముంటుంది? ఆయన తర్వాత వచ్చిన కిరణ్, రోశయ్య ఆ పేరు మాపేయడానికి చూశారు. సాక్షి పేపరు పెట్టి, మాస్ట్ మీద వైయస్ ఫోటో పెట్టి, ప్రతిపక్షంలో ఉండగా విగ్రహాలు పెట్టి, ప్రభుత్వంలోకి వచ్చి అనేక పథకాలకు వైయస్ పేరు పెట్టి జగన్ దాన్ని సజీవంగా ఉంచడానికి చూశాడు కానీ లేకపోతే జనం ఎప్పుడో మర్చిపోయేవారు.

వైయస్ పోయాక ఆయన చేత లబ్ధి పొందినవారిలో ఎవరైనా జగన్ వెంట వచ్చారా? వివేకానంద రెడ్డే రాలేదు. కెవిపి అయితే మరీ ఘోరం. నిజంగా వైయస్ ‘ఆత్మ’ అయి వుంటే వైయస్‌ను ముద్దాయిగా చేర్చగానే పార్టీలోంచి బయటకు వచ్చేయాల్సింది. రాలేదు, వస్తే తనపై కూడా కేసు పెడతారన్న భయం. కాంగ్రెసులోనే ఉంటూ, పదవులు అనుభవిస్తూ, వాళ్లకు కీలక సమాచారం అందిస్తూ, యిప్పుడు సోనియా ఒప్పుకుంది కాబట్టి షర్మిల పక్కన నిలబడి మా వైయస్ కూతురు అంటున్నాడు. అప్పుడు జగన్ పక్కన నిలబడలేదే, అతను వైయస్ కొడుకు కాదా? ఇక పార్టీ ఎడ్వాంటేజి అంటారా, ప్రత్యేక హోదా కోసం జగన్ ఏమీ చేయలేదు అని షర్మిల అంటే, దాన్ని విభజన బిల్లులో పెట్టనిది కాంగ్రెస్సే కదా అనే విషయం జనాలకు గుర్తు చేసినట్లవుతుంది.

ఆంధ్ర కాంగ్రెసు నీరసించి ఉంది. వైసిపి నుంచి బయటకు వచ్చేవారికి అది కూడా ఓ మార్గంగా తప్ప యింకెందుకూ పనికి రాదు. విన్నింగ్ ఛాన్సెస్ లేని పార్టీకి ఆళ్ల రామకృష్ణా రెడ్డిలా ఎంతమంది వస్తారు? జనసేనలోకి వెళితే టిడిపి నిధులైనా వస్తాయన్న ఆశ ఉంది. బిజెపిలోకి వెళితే నిధులకు కొరతే లేదు. కాంగ్రెసు పార్టీకి నిధులెక్కడున్నాయి? అది పాలించే రాష్ట్రాల లిస్టులో తెలంగాణ ఒకటి చేరినప్పుడే రెండు జారిపోయాయి. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలలో సగం సీట్లయినా గెలవకపోతే ఆబోరు దక్కని పరిస్థితి. ఆంధ్రలో ఓవరాల్‌గా పబ్లిసిటీ ఖర్చు భరించవచ్చు తప్ప కాండిడేటు ఖర్చులు భరించే స్థితి ఉందాన్న అనుమానం. ఆంధ్రలో కాంగ్రెసు అభ్యర్థికి అంటే ఏ ఇండిస్ట్రియలిస్టూ డబ్బివ్వడు. ఇస్తే మర్నాడే ఐటీ, ఈడీ వచ్చి తలుపు తడతాయన్న భయం. ఇండియా కూటమిలోని బీటలు చూస్తూంటే కేంద్రంలో కాంగ్రెసుకు గెలిచే అవకాశాలు మరింత సన్నగిల్లాయని తోస్తోంది. ఇలాటప్పుడు రాష్ట్ర జనాలు కాంగ్రెసుకు ఓటేస్తారా?

షర్మిల చేస్తున్న పోరాటం వలన ఆమె వ్యక్తిగతమైన పగ చల్లారవచ్చేమో కానీ రాజకీయంగా ఏ ప్రయోజనం సాధిస్తుంది? ప్రజల్లో జగన్ పట్ల వ్యతిరేకత పెంచగలిగితే ఆ లాభం టిడిపి కూటమికి పోతుంది. ఎన్నికలలో టిడిపి నెగ్గితే వైసిపి ప్రధాన ప్రతిపక్షమౌతుంది, కాంగ్రెసు కాదు. అలా కాక వైసిపి నెగ్గితే యీమె హతాశురాలవుతుంది. ప్రస్తుతానికి తెలుగు మీడియా షర్మిలకు హైప్ యిస్తోంది. తెలంగాణలో ఆంధ్రజ్యోతి ఆమెను భుజాన వేసుకుని మోసింది. ఆంధ్రకు వచ్చాక, ఈనాడు కూడా మరో భుజం కాస్తూ, ఆమె ఉపన్యాసాలను మొదటి పేజీలో వేస్తోంది. ఈ భోగం ఎంతకాలమో తెలియదు. 2009లో చిరంజీవి విషయంలో జరిగింది చూశాం. షర్మిల ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీలుస్తుంది అనుకుంటే  చాలు, మీడియా ఆమెను దింపేయడం మొదలుపెడతారు.

అందుకనే వైసిపి వారు ఆమెకు ప్రాధాన్యత యిస్తూ, ఆమెను ఒక ఫోర్స్‌గా ప్రొజెక్టు చేస్తూ వైసిపి వ్యతిరేక ఓటు అటువైపు మళ్లేందుకు ప్రయత్నిస్తున్నా రనిపిస్తోంది, ఆమె మాటలకు వాళ్లు స్పందించే విధానం చూస్తూ ఉంటే! ఆమె జగన్ రెడ్డి అనడంలో తప్పేమీ ఉందని విమర్శించాలి? లోకేశ్ తన ఉపన్యాసాల్లో ‘చంద్రబాబు నాయుడు గారు..’ అంటాడు కదా! బంధుత్వం చెప్పి తీరాలని లేదు. రెడ్డి అనే పదానికి అభ్యంతరమైతే జగన్ పేరులో అది ఉంది కదా. ఇంగ్లీషు మీడియా జగన్ రెడ్డి అంటుంది. కులసూచకం పెట్టుకున్నవారిని అలా సంబోధించడంలో తప్పు లేదు. పెట్టుకోనివారికి మనం తగిలించకూడదు. లోకేశ్ నాయుడు, పవన్ నాయుడు, రోజా రెడ్డి, కిలారు రాజేష్ చౌదరి, అనిల్ శాస్త్రి ... యిలా అనడం తప్పు. ఇక వైయస్ అని షర్మిల అని పెట్టుకోకూడదని మీరెవరు అనడానికి? హరికృష్ణ కూతురు ‘నందమూరి’ సుహాసిని, బాలకృష్ణ కూతురు ‘నారా’ బ్రాహ్మణి! ఎవరి ప్రొజెక్షన్ వాళ్లది. అయినా మొన్నటిదాకా సాక్షి పేపరు కూడా వైయస్ షర్మిల అంటూనే ఉందిగా! హఠాత్తుగా అత్తవారి యింటిపేరు వెలుగులోకి తెచ్చారెందుకు?  

ఇక మణిపూరు విషయానికి వస్తే, జగన్ స్పందించలేదని షర్మిల ఆరోపణ. అతను బిజెపి విధానాలకు వ్యతిరేకంగా దేని మీద స్పందించాడని? రైతు బిల్లులపై స్పందించాడా? మతమార్పిడి బిల్లులపై స్పందించాడా? పౌరసత్వ చట్టంపై స్పందించాడా? అతనికైతే కేసుల భయం. మరి యీవిడ స్పందించిందా? క్రైస్తవ సంఘాలేమైనా నిరసన జరిపాయా? ఎవాంజలిస్టు అనిల్ తెలిపాడా? మణిపూర్ జాతుల మధ్య సమస్య (మత ఘర్షణ దానిలో భాగమంతే) ఇది తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఫ్యాక్టర్ కాదు. జాతీయ సమస్యలు లేవనెత్తి షర్మిల ఏ ప్రయోజనం సాధిద్దామనుకుంది? జగన్ క్రైస్తవుడు కాకుండా ఉంటే, ఆమె దీని సంగతి ఎత్తేదే కాదు. షర్మిల రంగప్రవేశం చేస్తుందనగానే ఆమె జగన్ క్రైస్తవ ఓటు బ్యాంకుకి గండి కొడుతుందని ప్రతిపక్షాలు సంబరపడ్డాయి. ఆ సంబరానికి షర్మిల యీ స్టేటుమెంటుతో కొబ్బరికాయ కొట్టిందన్నమాట.

జగన్‌కు ఉన్న రకరకాల ఓటు బ్యాంకులలో మైనారిటీలది ఒక ప్రముఖ భాగం. గతంలో బిజెపితో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నపుడు కూడా మైనారిటీలు బాబుకి ఓటేశారు. ఇప్పుడు జగన్ బిజెపితో పరోక్షంగా పొత్తు పెట్టుకున్నా వేస్తున్నారు. ఆ సాలిడ్ బ్లాక్‌ను చీల్చడమే బాబు లక్ష్యం. దానికి షర్మిల దోహదపడితే అంతకన్న కావాల్సింది ఏముంది? తనకూ, కాంగ్రెసు పార్టీకి ఓట్లు రాలే మార్గం వేరేదీ లేదు కాబట్టి, కనీసం వీళ్లలో కొందరైనా కొన్ని విదిలిస్తారని షర్మిల ప్రయత్నిస్తోంది కాబోలు. షర్మిల స్టేటుమెంటు రాగానే ‘జగన్ క్రైస్తవ వ్యతిరేకి’ అని ‘‘ఈనాడు’’ హెడ్‌లైన్ యిచ్చేసింది. జగన్ క్రైస్తవుడిగా ప్రవర్తించటం లేదని షర్మిల చేసిన ప్రచారం నమ్మితే క్రైస్తవ ఓట్లు కొన్ని పోతాయేమో కానీ ఆ మేరకు హిందూ ఓట్లు వచ్చి చేరతాయని ప్రతిపక్షాలు గుర్తించాలి. జగన్ గుళ్లకూ, స్వామీజీలకు మొక్కినా క్రైస్తవులను ఫేవర్ చేస్తున్నాడనే ఫీలింగు కొందరిలో ఉంది. వాళ్లకేమీ చేయటం లేదు అంటే హమ్మయ్య అనుకుంటారు. అసలే యివి ప్రతి పార్టీ ‘సాఫ్ట్ హిందూత్వ’ను ఆశ్రయిస్తున్న రోజులు!

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2024)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?