సొంతంగా ఏనాడూ ఎన్నికల్లో గెలవకపోవడం, గెలవలేకపోవడం.. ఇదే జనసేనతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ వెంపర్లాడటానికి ప్రధాన కారణం! మరి జనసేనతో పొత్తు పెట్టుకుంటే అధికారం సంగతలా ఉంటే.. తెలుగుదేశం పార్టీని ఈ పొత్తు ఎన్నికల ముందే ముంచేస్తుందా? అనేది ఇప్పుడు పరిశీలకుల్లో కూడా తలెత్తుతున్న అనుమానం! అందుకు కారణాలు లేకపోలేదు.
1) ఆలస్యం అయిపోతూ ఉండటం!
తెలుగుదేశం, జనసేనలు చాన్నాళ్లుగానే మిత్రపక్షాలు. అయితే ఎన్నికలకు ఇంకో రెండు నెలల సమయం కూడా లేని ఈ తరుణంలో కూడా ఇప్పటి వరకూ ఎవరికి ఏ సీటో క్లారిటీ లేకపోవడం ఈ పొత్తు వల్ల జరుగుతున్నదే! జనసేనతో పొత్తు ఊసు లేకపోతే ఈ పాటికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా అంటూ ఒకటి విడుదల చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇది ఆలస్యం అవుతున్న కొద్దీ తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి పెరగడం తప్ప మరోటి ఉండదు!
2) పవన్ ప్లేటు ఫిరాయిస్తే?
జనసేనపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అతిగా ఆధారపడింది. మరి ఎన్నికల నాటికి పవన్ కల్యాణ్ ప్లేటు ఫిరాయించడని నమ్మకాలు ఏమీ లేవు! ఆఖరి నిమిషంలో ఒంటరి పోరు, అనో బీజేపీతోనే పొత్తు అని పవన్ ప్లేటు ఫిరాయిస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆత్మవిశ్వాసం దారుణంగా దెబ్బతింటుంది. పవన్ కు ఎలాగూ స్థిమితం ఉండదు. కమలం పార్టీ నేతలు గట్టిగా అనుకుని.. పవన్ ను పక్కకు లాగితే అప్పుడు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో కల్లోలం మొదలుకావడం ఖాయం!
3) తక్కువ ఇచ్చినా నష్టమే, ఎక్కువ కేటాయించినా నష్టమే!
జనసేనకు టీడీపీ కేటాయించే సీట్లు ఎన్ని? జనసేనకు తగినన్ని సీట్లు ఇవ్వకపోతే కాపుల ఓట్లు తెలుగుదేశం పార్టీకి బదిలీ కావు అని ఆ కులపెద్దలు బాహాటంగానే చెబుతున్నారు. ఇది వాస్తవం కూడా! ఇప్పటికే పవన్ కు సీఎం సీటు లేదని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎం కూడా అప్పటికి నిర్ణయం అంటోంది. రేపు ముప్పై లోపు సీట్లు ఇస్తే జనసేన పాత్రను టీడీపీ తగ్గించినట్టుగా అవుతుంది. దీంతో ఉత్సాహం కన్నా, నిస్తేజం ఎక్కువ కావొచ్చు. అది తెలుగుదేశం పార్టీకి రెండు రకాలుగానూ నష్టం! పవన్ కు కొద్దోగొప్పో సీట్లను ఇస్తే ఓట్ల బదిలీ జరగకపోవచ్చు, ఎక్కువ సీట్లు కేటాయిస్తే మొదటికే మోసం రావొచ్చు!
4) కార్యక్షేత్రంలో జనసేన బలమెంత?
ఇప్పటికూ జనసేనకు ఒక రూపం లేదు. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తప్ప మరో పేరు లేదు! ఎన్నికల్లో గెలవడానికి కేవలం కులస్తుల ఓట్లు ఉన్నాయనుకోవడం, అభిమానులు వేస్తారనుకుంటే అంతే సంగతులు! పార్టీకి నిర్మాణమే లేని జనసేనకు 30 సీట్ల వరకూ కేటాయించినా.. ఓటర్ ను బూత్ వరకూ తీసుకెళ్లే నిర్మాణం లేని పార్టీ ఏదీ గెలిచినట్టుగా చరిత్రలో లేదు! కార్యక్షేత్రంలో జనసేన సత్తా ఏమిటో 2019లోనే తెలిసింది. అప్పటి జనసేన ఓట్లు, అప్పటి తెలుగుదేశం ఓట్లు కలిపి కూడుకుని.. అదే రాజకీయం అనుకుంటే అంతే సంగతులు!
5) ఎన్నికల నాటికి కొట్టుకోవడమే!
ఒకటీ రెండు సీట్ల విషయంలోనే పవన్ స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. జగన్ ను దించడమే తన లక్ష్యమంటూ నిన్న కూడా పవన్ ప్రకటించాడు కాబట్టి.. టీడీపీ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటోంది. మరి పవన్ కు ఉన్నంత కసి సామాన్య ప్రజలకు ఏమీ లేదు. తెలుగుదేశం నేతలు కూడా తమకు సీటు దక్కని పక్షంలో తమ సీట్లను జనసేనకు కేటాయించిన పక్షంలో పవన్ ప్రతినకు అనుగుణంగా పని చేస్తారనేమీ లేదు!
6) టీడీపీతో పొత్తుతో తగ్గిన పవన్ గ్రాఫ్!
ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే తీసుకున్నా.. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ముందు జనసేన పరిస్థితి వేరే, టీడీపీతో పొత్తు అని రాజమండ్రి సెంట్రల్ జైల్ ముందు ప్రకటించిన తర్వాత పరిస్థితి వేరే! అప్పటి వరకూ జనసేనతో తమకు రాజకీయ అవకాశం లభిస్తుందనుకున్న వాళ్లు చాలా మంది నిస్పృహకు గురయ్యారు.
వీరాభిమానులు తప్ప.. అప్పటి వరకూ ఇరు పార్టీలకూ జనసేనను ప్రత్యామ్నాయంగా చూసిన వారు, తెలుగుదేశం పొడ గిట్టని వారు జనసేనకు దూరంగా జరిగారు. ఇది క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే అర్థమయ్యే విషయం. సొంతంగా జనసేన బలానికి, తెలుగుదేశం పార్టీతో కలిసినప్పుడు ఆ పార్టీ బలానికీ చాలా వ్యత్యాసం ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ కూడా తెలిసే ఉండాలి!
దీర్ఘకాలంలో అయితే జనసేనతో పొత్తు అనేది తెలుగుదేశం పార్టీ తన తోకకు పెట్టుకున్న నిప్పు! అది వేరే కథ! కేవలం ఒంటరిగా పోటీ చేస్తే ఓటమే అనే భయంతో పొత్తు పెట్టుకోవడమే తప్ప, జనసేనతో పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీకి గట్టిగా ఒరిగే ప్రయోజనాలు ఏమీ కనపడటం లేదు. రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ టు అవుతుందనే లెక్కనే టీడీపీ నమ్ముకుంది! అలాంటి ఈక్వెషన్లు రాజకీయాల్లో ఏనాటికీ నిజం కావు అనేది చరిత్ర చెప్పే మాట!