తిరుపతిలో తమ ఆత్మాభిమానం దెబ్బతీసేలా టీడీపీ ప్రవర్తించిందని యాదవ సామాజిక వర్గం రగిలిపోతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి తిరుపతిలో ఆ పార్టీ జెండా మోస్తున్న తమను కనీసం మనుషులుగా కూడా గుర్తించరా? అని యాదవులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ఎంపికపై టీడీపీ ఐవీఆర్ఎస్ విధానంలో అభిప్రాయ సేకరణ చేపట్టింది.
ఈ క్రమంలో తిరుపతికి సంబంధించి నలుగురి పేర్లను చెప్పి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఆ నలుగురు బలిజ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. దీంతో టీడీపీ వైఖరిపై యాదవులు హర్ట్ అయ్యారు. యాదవులంతా తిరుపతిలోని ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. కనీసం ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు పరిశీలనకు కూడా తాము నోచుకోలేదా? అని వారు ఆవేదనతో ప్రశ్నించారు. దశాబ్దాలుగా టీడీపీ జెండా మోస్తున్నప్పటికీ, అవమానాలు మిగిలాయని వారు వాపోయారు.
ఆత్మాభిమానాన్ని చంపుకుని టీడీపీకి ఎందుకు మద్దతు ఇవ్వాలనే ప్రశ్న యాదవుల నుంచి ఉత్పన్నం కావడం చర్చనీయాంశమైంది. తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నరసింహయాదవ్ ఉన్నారని, ఆయన కూడా తిరుపతి టికెట్ ఆశిస్తున్న సంగతి తెలిసి కూడా, అభిప్రాయ సేకరణలో పేరు చేర్చకపోవడం ఎలా అర్థం చేసుకోవాలని యాదవులు నిలదీశారు. తిరుపతిలో ఎప్పుడూ బలిజ సామాజిక వర్గానికే టికెట్ ఇస్తున్నారని, ఇక తామెందుకని వారంతా ప్రశ్నించడం హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్నికల సమయంలో తిరుపతి యాదవుల్లో ఆగ్రహాన్ని చూస్తే, రానున్న ఎన్నికల్లో టీడీపీకి దబిడి దబిడే అనే చర్చకు తెరలేచింది. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో యాదవుల ఓట్లు 12 శాతం ఉన్నాయి. ఇంత వరకూ మెజార్టీ ఓట్లు టీడీపీ వైపే ఉన్నాయి.
టీడీపీ తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడంతో తమ సామాజిక వర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ పార్టీ బీసీవై వైపు వారు చూస్తున్నారు. తమకే ఒక పార్టీ ఉన్నప్పుడు ఇతర పార్టీల పల్లకీ మోయాల్సిన అవసరం ఏముందనే ఆలోచన వారిలో పుట్టింది.