వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ షర్మిల స్టేట్ మెంట్ అంటూ అప్పట్లో కొంత హడావుడి జరిగింది. ప్రత్యేకించి తెలుగుదేశం అనుకూల మీడియా దాన్ని బాగా హైలెట్ చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ఎవరు చేయించారో షర్మిల వెళ్లి సీబీఐకి చెప్పిందంటూ అప్పట్లో పచ్చపత్రికలు పతాక శీర్షికల్లో అచ్చేశాయి!
అయితే ఆ తర్వాత ఆ రోజు సీబీఐకి తను ఇచ్చిన స్టేట్ మెంట్ గురించి షర్మిలే రకరకాలుగా మాట్లాడారు. వైఎస్ వివేకను ఎవరు హత్య చేసి ఉంటారో తనకెలా తెలుస్తుందంటూ కూడా ఒక సారి ఆమె మీడియా ముఖంగా ప్రశ్నించారు! ఒకవేళ ఆయనను ఎవరు హత్య చేసి ఉంటారో తనకు తెలిసి ఉంటే, హత్య జరిగిన వెంటనే తను వారిని జైలుకు పంపించడానికి పని చేసేదాన్ని అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు! ఏతావాతా పచ్చమీడియా పతాక శీర్షికలకు వ్యతిరేకంగానే షర్మిల మాట్లాడారు!
మరి అప్పుడు సీబీఐకి షర్మిల ఏం స్టేట్ మెంట్ ఇచ్చిందనేది సీబీఐకే తెలియాలి. అయితే ఆమెను ఆ హత్య కేసులో విచారణకు సీబీఐ పిలవనే లేదని, ఢిల్లీకి వెళ్లిన తనను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆమె అలాంటి హడావుడి చేసిందని ఆమె వెంట అప్పట్లో నిలిచిన కొండా రాఘవరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.
కేసీఆర్ పై ఫిర్యాదులు చేయడానికి అంటూ అప్పుడు షర్మిల ఢిల్లీకి పయనం అయ్యిందని, పార్టీలో పని చేస్తున్నందుకు తనకు షర్మిల టికెట్ లు బుక్ చేసిందని కొండా రాఘవరెడ్డి అన్నారు. అయితే ఢిల్లీకి వెళ్లిన తమకు ఎవ్వరూ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని, కేసీఆర్ పై ఫిర్యాదులు తీసుకోవడానికి కానీ, ఎవరినైనా కలవడానికి అయినా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో.. సీబీఐకి షర్మిల తమ వారి చేత మెసేజ్ పెట్టించిందని, వివేక హత్య కేసు గురించి మాట్లాడటానికి అంటూ మెసేజ్ చేయించిందని, కేసీఆర్ పై ఫిర్యాదుకు అంటే అపాయింట్ మెంట్ ఇవ్వలేదని, అందుకే వివేక హత్య కేసు గురించి అంటూ మెసేజ్ పెట్టించి, వెళ్లి వారిని కలిసిందని కొండా రాఘవరెడ్డి అంటున్నారు.
కేసీఆర్ పై కంప్లైంట్ అంటూ తమను తీసుకొచ్చి ఆమె అలా చేయడం ఆశ్చర్యం కలిగించిందని, అలా కేవలం మీడియా అటెన్షన్ కోసం షర్మిల అలాంటి చేష్టలకు పాల్పడ్డారంటూ షర్మిల వెంట నడిచి, ఆమె కాంగ్రెస్ వైపు వెళ్లాకా ఆమెకు దూరం జరిగిన కొండా రాఘవ రెడ్డి వ్యాఖ్యానించారు.