Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ : శత్రువుల ఆస్తుల స్వాధీనం

1968 నాటి ఎనిమీ ప్రాపర్టీ చట్టంలో ఎన్‌డిఏ తెద్దామనుకున్న మార్పులు యింకా పార్లమెంటులో పెండింగులోనే వున్నాయి. అయితే తననుకున్నది చేయడానికి ప్రభుత్వం ఆర్డినెన్సుల మార్గం పట్టి, పదేపదే ఆర్డినెన్సులు జారీ చేయించడం వార్తల కెక్కింది. శత్రువుల ఆస్తులు స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి వుందంటూనే ఏది శత్రువు ఆస్తి అనేది కోర్టులు నిర్ణయించలేవని, యీ సున్నితమైన అంశాన్ని పార్లమెంటులో అన్ని పార్టీలు చర్చించి తేల్చాలని సుప్రీంకోర్టు చెప్పింది. 

1962 నాటి చైనా దాడి తర్వాత భారతదేశంలో వున్న చైనీయుల 149 ఆస్తులను గుర్తించి డిఫెన్సు ఆఫ్‌ ఇండియా రూల్సు, 1962 ప్రకారం వాటి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం నియమించిన కస్టోడియన్‌ (సంరక్షకుడు)కు అప్పగించారు. తర్వాత 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చాక 1947 దేశవిభజన తర్వాత పాకిస్తాన్‌ వెళ్లిపోయినవారి ఆస్తులతో సహా భారత్‌లో పాకిస్తానీ జాతీయుల ఆస్తులను, వాటి సంబంధిత వ్యవహారాలను కూడా అదే కస్టోడియన్‌కు అప్పగించారు. 1968లో ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్‌ చేసి కస్టోడియన్‌ ఆఫ్‌ ఎనిమీ ప్రాపర్టీ (సిఇపి) అనే వ్యవస్థ ఏర్పరచారు. శత్రువులకు (అనగా దేశంతో శత్రుత్వం వున్న పౌరులకు, ఆయా దేశాలకు తరలి వెళ్లిన భారత పౌరులకు) చెందిన స్థిర, చరాస్తులను గుర్తించి, స్వాధీనం చేసుకుని, వారి తరఫున అజమాయిషీ చేస్తూ, అద్దెలకిచ్చి ఆ ఆ ఆదాయాన్ని వారసులకు యిస్తూ, మధ్యలో తను కమిషన్‌ తీసుకునే హక్కు ఆ కార్యాలయానికి అప్పగించారు. దాని హెడాఫీసు బొంబాయిలో, బ్రాంచ్‌ ఆఫీసు కలకత్తాలో వున్నాయి. 1971లో పాకిస్తాన్‌లో మళ్లీ యుద్ధం వచ్చినపుడు, బంగ్లాదేశ్‌ ఏర్పడి అక్కడకి కొందరు భారతపౌరులు తరలి వెళ్లిపోయినపుడు యీ చట్టం ప్రయోగించడం జరిగింది. 

1965 యుద్ధం తర్వాత భారత్‌, పాకిస్తాన్‌లో మధ్య 1966 జనవరిలో తాష్కెంట్‌లో ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం భారత్‌, పాకిస్తాన్‌లు తమ తమ దేశాల్లో స్వాధీనం చేసుకున్న శత్రువుల ఆస్తులను ఎదుటి దేశానికి అప్పగించే విషయాన్ని తమ మధ్య చర్చించాలి. అయితే పాకిస్తాన్‌ ఆ క్లాజ్‌ను పట్టించుకోలేదు. తన దేశంలో  (అంటే తర్వాత బంగ్లాదేశ్‌గా ఏర్పడిన తూర్పు పాకిస్తాన్‌తో సహా) వున్న శత్రువుల ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని తనకు చిత్తం వచ్చిన విధంగా అమ్మేసింది. కానీ మన దగ్గర చేసిన చట్టం ప్రకారం శత్రువుల ఆస్తిగా గుర్తించిన ఆస్తిలో మూడో వంతు కంటె తక్కువ భాగాన్ని అమ్మడానికి కాని, తాకట్టు పెట్టడానికి కాని, డెవలప్‌మెంట్‌కై యివ్వడానికి వారసుడికి హక్కు ఉంది. ఆస్తిపై వచ్చే ఆదాయంలో వారసుడికి హక్కు వుంది. అవి అన్యాక్రాంతం కాకుండా చూడవలసిన బాధ్యత కస్టోడియన్‌ది. ప్రస్తుతం మనదేశపు సిఇపి వద్ద 16,547 స్థిర, చర ఆస్తులున్నాయి. స్థిరాస్తుల విలువ రూ.1.04 లక్షల కోట్లు. చరాస్తుల విలువ రూ. 2634 కోట్లు. దేశం విడిచి వెళ్లిపోయినవారి రక్తబంధువులు కొందరు యీ దేశంలోనే వుంటూ ఆ ఆస్తులు తమకు యివ్వాలని న్యాయపోరాటాలు చేస్తున్నారు. 

అలాటి కేసులు 550 కోర్టుల్లో పెండింగులో వున్నాయి. సిఇపి ఏర్పడిన కొత్తల్లో కోర్టులు ఏదైనా ఎనిమీ ప్రాపర్టీ సిఇపి చేతిలోకి వెళ్లడాన్ని ప్రశ్నించేవి కావు. అలాగే ఆ ఆస్తిపై సిఇపి అధికారాలను ప్రశ్నించేవి కావు. పోనుపోను కోర్టులు స్వతంత్రంగా ఆలోచించడం మొదలుపెట్టాయి. యూనియన్‌ ఆఫ్‌ ఇండియా వెర్సస్‌ రాజా ఎంఎఎమ్‌ ఖాన్‌ కేసులో ఖాన్‌ తన తండ్రి పాకిస్తాన్‌ తరలివెళ్లి చనిపోయాడని, తాను ఇండియాలోనే వుండిపోయి భారతీయ పౌరుడిగా కొనసాగుతున్నానని, తన తండ్రి మరణం తర్వాత సదరు ఆస్తిని ఎనిమీ ప్రాపర్టీగా పరిగణించడానికి వీల్లేదని, దాన్ని తనకు దఖలు పర్చాలని వాదించాడు. దీనిపై 2005లో తీర్పు యిస్తూ సుప్రీం కోర్టు అతని వాదనను ఆమోదించింది. కస్టోడియన్‌ ఆ ఆస్తుల సంరక్షకుడే తప్ప సొంతదారు కాదని, ఆస్తులపై హక్కు వారసులకే వుంటుందని, వారు భారతీయులైతే వారికి అప్పగించాల్సిందేనని, కాకపోతే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లేనని అంది. దీనితో అలాటి వారసులకు ధైర్యం వచ్చి మరిన్ని కేసులు వేశారు.

దాంతో యుపిఏ ప్రభుత్వం 2010లో ఒక ఆర్డినెన్సు జారీ చేసింది. దాని ప్రకారం ఆ ఆస్తులపై వచ్చే ఆదాయంలో కేంద్రం వారసులకు వాటా యివ్వనక్కరలేదు. ఆ తర్వాత లోకసభలో 2010 జులైలో లోకసభలో బిల్లు ప్రవేశపెట్టింది. సమాజ్‌వాదీ, ఆర్‌జెడి పార్టీలు 'అది మైనారిటీలకు వ్యతిరేకంగా వుందని' వాదించడం వలన, యితరత్రా అభ్యంతరాల వలన ఆ బిల్లు పాస్‌ కాలేదు. అప్పుడు దాన్ని విత్‌డ్రా చేసి 2010 నవంబరులో మరో బిల్లు ప్రవేశపెట్టింది. దానిలో వారసుల హక్కు పట్ల ప్రభుత్వం సంతృప్తి చెందేవరకు కస్టోడియన్‌ వద్దనే ఆస్తి వుంటుందని మార్చారు. అంతేకాదు, 2010 జులై 2 కు ముందు కోర్టు తీర్పుల కారణంగా కస్టోడియన్‌ నుంచి ఆస్తి హక్కు వారసులకు  వెళ్లిపోయి వుంటే అప్పుడు అది వారసులకే చెందుతుందని, ఆ తేదీ తర్వాత కూడా కస్టోడియన్‌ అధీనంలో వుండిపోయిన ఆస్తులు కస్టోడియన్‌ వద్దనే వుండిపోతాయని మార్చారు. ఆ బిల్లును దాన్ని స్టాండింగ్‌ కమిటీకి నివేదించారు. 2014 లోపున ఆ బిల్లు పాస్‌ కాలేదు. పార్లమెంటు వ్యవధి ముగిసిపోయింది. 

 ఇప్పుడు ఎన్‌డిఏ సర్కారు 1968 నాటి ఎనిమీ ప్రాపర్టీ చట్టంతో బాటు 1971 నాటి పబ్లిక్‌ ప్రిమైసెస్‌ (ఎవిక్షన్‌ ఆఫ్‌ అనాథరైజ్‌డ్‌ ఆక్యుపెంట్స్‌) చట్టాన్ని కూడా మార్చి ఎనిమీ ప్రాపర్టీ (ఎమెండ్‌మెంట్‌ అండ్‌ వాలిడేషన్‌) బిల్లు, 2016 తయారు చేసింది. దాని ప్రకారం శత్రువుల ఆస్తికి సంబంధించిన సమస్త హక్కులు సిఇపి చేతికి వస్తాయి. అంటే కస్టోడియన్‌ హఠాత్తుగా ఓనరు అయిపోతాడన్నమాట. లక్ష కోట్ల రూ.ల ఆస్తులు ప్రభుత్వానికి అప్పనంగా వచ్చి పడతాయన్నమాట. ఆ ఆస్తులకు సంబంధించి శత్రువు (దేశం విడిచి వెళ్లిన పౌరుడు) తన వారసులకో, మరొకరికో చేసిన బదిలీలన్నీ పరిగణింపబడవు. ఇది 1968 నుంచి రెట్రాస్పెక్టివ్‌ ఎఫెక్ట్‌తో (వెనుక తేదీతో) అమలులోకి వస్తుంది. అంటే 1968 తర్వాత చేసిన బదిలీలేవీ చెల్లవు. వారసులు భారతీయ పౌరులైనా కాకపోయినా వాళ్లకు చిల్లిగవ్వ దక్కదు. అంతే కాదు దేశంలోని ఏ కోర్టూ వారి వారసత్వపు హక్కులపై యికపై విచారణ చేపట్టకూడదు. అంతేకాదు, ఇప్పటిదాకా యిచ్చిన తీర్పులన్నీ చెల్లకుండా పోతాయి. అంటే వ్యక్తుల హక్కులు హరించడంతో బాటు, యీ బిల్లు కోర్టుల హక్కులు కూడా హరిస్తోందన్నమాట. దీన్ని 2016 జనవరిలో ఆర్డినెన్సు రూపంలో జారీ చేశారు. తర్వాత బిల్లుగా మార్చి 2016 మార్చి 9 న లోకసభలో పాస్‌ చేయించారు. 

బిజెపికి మెజారిటీ వుంది కాబట్టి పాస్‌ అయిపోయింది కానీ మెజారిటీ లేని రాజ్యసభకు వెళ్లేసరికి దాని సభ్యులు బిల్లును సెలక్టు కమిటీకి నివేదించాలన్నారు. సెలక్టు కమిటీ అనేక అభ్యంతరాలు తెలిపింది. కమిటీలో సభ్యులుగా వున్న కాంగ్రెసు, జెడి-యు, సిపిఐ, సమాజ్‌వాదీ యిత్యాది పార్టీలకు చెందిన ఆరుగురు సభ్యులు కొత్త బిల్లు మౌలిక రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా వుందని అభిప్రాయపడ్డారు. తమ అసమ్మతిని డిసెంట్‌ నోట్‌ ద్వారా తెలియపరిచారు. అయితే బిల్లు చట్టంగా మారేలోపునే దాన్ని అమలు చేయాలనే పట్టుదలతో వున్న ప్రభుత్వం 2016 ఏప్రిల్‌ 2 న రెండోసారి ఆర్డినెన్సు జారీ చేసింది. కమిటీ తన రిపోర్టును 2016 మేలో నివేదించింది. అదే నెలలో ఆర్డినెన్సును మూడోసారి జారీ చేశారు. బిల్లులో మార్పులు చేయడం యిష్టం లేని కేంద్రం నాల్గోసారి 2016 ఆగస్టులో, ఐదో సారి డిసెంబరులో ఆర్డినెన్సు జారీ చేసింది. ఇన్నిసార్లు ఆర్డినెన్సు జారీ చేయడం తగదంటూ వేసిన పిటిషన్‌పై ముగ్గురు సభ్యులున్న సుప్రీం కోర్టు ఫిబ్రవరి 6 న తీర్పు యిస్తూ ''దీన్ని దేశభద్రతకే ముప్పు కలిగించే వ్యవహారంగా కేంద్రం భావిస్తూ వున్నప్పుడు పార్లమెంటులో దీనిపై విస్తృత చర్చ జరపాలి.'' అంది. 

శత్రువుల ఆస్తి విషయంలో మనమెందుకు బుర్ర బద్దలు కొట్టుకోవడం అని పైకి అనిపించినా లోతుకి వెళితే సందేహాలు పెరుగుతాయి. మొదట్లో శత్రువుల ఆస్తిగా గుర్తించిన ఆస్తులు చాలా తక్కువ. అయితే పోనుపోను అది 15 వేలకు పెరిగింది. కొత్తగా యుద్ధాలేవీ జరగనప్పుడు అన్ని రెట్లు ఎలా పెరిగిందనేది సెలక్టు కమిటీ సభ్యులు వేసిన ప్రశ్న. ఏ కారణంగానైనా ప్రభుత్వంలో వున్న వారికి నచ్చనివారి ఆస్తులకు ఎనిమీ ప్రాపర్టీగా ముద్ర కొట్టేస్తున్నారా? అన్న సందేహం తప్పక వస్తుంది. ఏటేటా వాటి సంఖ్య ఎలా పెరిగిందో ''క్వింట్‌'' పత్రికలో ఒక వ్యాసకర్త వివరించారు. 1980లో ప్రభుత్వం వద్ద 389 ఎనిమీ ప్రాపర్టీలున్నాయి. 2011 నాటికి ప్రాపర్టీ సంఖ్య 2111కి చేరింది. 2014 వచ్చేసరికి ఎన్‌డిఏ ప్రభుత్వం వచ్చింది. ఆస్తుల సంఖ్య 12090కి పెరిగింది. 2016 వచ్చేసరికి అది 16 వేలైంది. ఈ మధ్య కాలంలో మన దేశం ఏ దేశంతోనూ యుద్ధం చేయలేదు. అలాటప్పుడు యీ ఆస్తుల సంఖ్య ఎలా పెరిగిందో ప్రభుత్వమే చెప్పాలి. ''క్వింట్‌'' పత్రిక 2016లో రాష్ట్రాల వారీ ఎనిమీ ప్రాపర్టీల గణాంకాలు సేకరించింది. యుపిలో 2011లో 622 వుంటే 2016 వచ్చేసరికి అది 8270 అయింది. బెంగాల్‌లో అదే పీరియడ్‌లో 232 నుంచి 4473కి పెరిగింది. 

2005 నాటి తీర్పులో సుప్రీంకోర్టు ఒక పరిశీలన చేసింది. ఎనిమీ ప్రాపర్టీగా ముద్రకొట్టిన ఆస్తులను ప్రభుత్వాధికారులు తమ క్వార్టర్స్‌గా వాడుకుంటున్నారు. కొన్నిట్లో ప్రభుత్వాఫీసులు పెట్టారు. ఇప్పుడు వాటిని అసలైన వారసులకు యివ్వాలంటే వాళ్లకు యిబ్బందిగా వుంటుంది. 2010 వరకు వారసులకు ప్రభుత్వం అద్దె చెల్లించవలసి వచ్చేది. 2010 ఆర్డినెన్సు తర్వాత ఆ బెడద తప్పించేసుకుంది. ఇప్పుడీ కొత్త చట్టం ప్రకారం వారసులకు తిరుక్షవరం చేసి, మొత్తం తనే వుంచేసుకోవచ్చు. పాకిస్తాన్‌ను ఆదర్శంగా తీసుకుని వాటిని అమ్మేసి ఆ లక్షకోట్ల రూ.లతో ఖజానా నింపుకోవచ్చు. వారసులు లబోదిబోమన్నా లాభంలేదు. వాళ్లు కోర్టుకి వెళ్లకుండా కూడా కట్టుదిట్టం చేస్తోందీ చట్టం. 
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 
mbsprasad@gmail.com