cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: తారాపథంలో కడదాకా ముళ్లే

ఎమ్బీయస్‌: తారాపథంలో కడదాకా ముళ్లే

అసమానమైన సౌందర్యానికి, ఏ పాత్రలోనైనా యిమిడిపోగల అభినయకౌశలాన్ని రంగరిస్తే శ్రీదేవి అవుతుంది. 54 ఏళ్లున్నా గ్లామరస్‌గా కనబడుతూ, అందరిలో అసూయ రగిలిస్తూ వచ్చిన ఆమె జీవితం జాలిపడే రీతిలో ముగిసింది. విషాదానికి వివాదం తోడైంది. ఆమె జీవితంలోని ప్రతి ఘట్టాన్ని భూతద్దం వేసి పరిశీలించి, మూడు రోజుల పాటు టీవీల్లో చీల్చి చెండాడేశారు. తీర్మానాలు చేశారు, తీర్పులు యిచ్చారు. ఒక పక్క ఆమెలోని నటికి దేశం ఘన నివాళులు అర్పించింది. నటిగా, వ్యక్తిగా ఆమె గురించి ఒక్కరూ వ్యతిరేకంగా మాట్లాడలేదు.

మరో పక్క ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో వ్యతిరేక వ్యాఖ్యలు వచ్చాయి. వ్యాఖ్యానించినవారు ఆమెకు వ్యక్తిగతంగా తెలిసినవారు కాదు. అయినా ఊహించారు. వారి ఊహలు సరైనవో, కావో నిర్ధారించడం కానీ, తిరస్కరించడం కానీ జరగలేదు. అందువలన శ్రీదేవి అనగానే ఆమె అకాలమరణం గుర్తుకు రావడమే కాదు, అసహజమరణం సంభవించిన తీరు కూడా గుర్తుకు వచ్చి మనసు కలత చెందుతుంది. సినీరంగంలో సీనియర్ల జీవితాలు చూసి కూడా అదే బాట పట్టిందేనన్న బాధ కలుగుతుంది. ఇప్పటికైనా ఆ బాట అనుసరణీయం కాదని తారామణులు గుర్తిస్తారో లేదోనన్న దిగులు కలుగుతుంది.

జర్నలిజమా? గాసిపిజమా? - శ్రీదేవి మరణవార్తలన్నీ పుకార్లతోనే నడిచాయి. ఎవరికీ ఏమీ తెలియదు కానీ గంటల తరబడి టీవీల్లో ఊదర గొట్టేశారు. దుబాయిలో ఆసుపత్రి బయట మరణించిన వారి విషయంలో అనుమానాలన్నీ నివృత్తి చేసుకుంటే తప్ప దేహాన్ని అప్పగించరట. దానికి టైము పడుతుంది. ఆ విషయం తెలియకుండానే మన మీడియా వాళ్లు మరణవార్తతో బాటు యివాళ భౌతికకాయం వచ్చేస్తోంది అని చెప్పేశారు. ఎప్పుడైతే ఆలస్యమైందో, వారికి అనుమానాలు వచ్చేశాయి, బోనీని నిర్బంధంలోకి తీసుకున్నారని (ఓ ఛానెల్‌ 'బోను' కపూర్‌ అంది) మొదలెట్టారు.

సాధారణంగా ఎంత టైము పడుతుంది అని కాన్సలేటు వాళ్లనైనా అడిగి తెలుసుకోవద్దా? జర్నలిజం యింతగా పెరిగిన యీ రోజుల్లో కూడా దుబాయికి సంబంధించిన ఏ వార్తనూ ఎవరూ ధృవీకరించక పోవడం వింతగా తోస్తుంది. వెళ్లడానికి అనుమతి దొరకని చోట్లకు కూడా రహస్యంగా చొరబడి, స్టింగ్‌ ఆపరేషన్స్‌ చేయగలుగుతున్నారే, ఆ రోజు ఆ హోటల్లో ఏం జరిగిందో, ఎప్పుడు ఎవరు వచ్చారో, వెళ్లారో ఒక్క రిపోర్టరు కూడా రిపోర్టు చేయలేదు. దుబాయిలో భారతీయ జనాభా ఎక్కువ కదా, హోటల్‌ స్టాఫ్‌లో యిండియన్‌ ఎవరో ఉండే వుంటారు.

వారితో మాట్లాడి రహస్యంగా సమాచారం సేకరించిన మొనగాడు లేకపోయాడు. సేకరించకపోతే పోయారు, అదిగో పులి అంటే యిదిగో తోక అనే పద్ధతిలో ఏదో ఒక పుకారు రాగానే యిక గ్రాఫిక్స్‌లో భీకరంగా వీడియోలు తయారుచేసేసి చూపించడమొకటి! ప్రభుత్వ అనుమతి లేకుండా దుబాయిలో విషయసేకరణ చేస్తూ పట్టుబడితే ఘోరశిక్ష అనే భయం ఉందంటారా, మరి అలాటి రిస్కు తీసుకున్నవారే యిన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టు లవుతారు. అది చేతకాకపోతే దొరికిన సమాచారాన్నే చర్చించాలి. ఊహించేయకూడదు. ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించి మనపై విసరకూడదు. 

బోనీ మౌనం అసహజమా? -జరిగినదేమిటి అని కచ్చితంగా చెప్పగలిగినది బోనీ కపూర్‌ ఒక్కడే. కానీ అతను మౌనవ్రతం పట్టాడు. అది అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా అసహజ మరణం జరిగినప్పుడు కారణాలు బయటకు రాకుండా చూస్తారు. కుర్రాడు పరీక్షలో ఫెయిలయితే తండ్రి చితకబాదాడు, వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి బయటకు చెప్పుకుంటాడా? వెధవది పరీక్ష పోతే అంతలా కొట్టాలిటండీ అని అందరూ గడ్డి పెట్టరూ? కుర్రాడు యింత చేస్తాడని అతనికి మాత్రమేం తెలుసు? భార్య సినిమాకు తీసుకెళ్లమంది, భర్త నీ మొహానికి సినిమానా అని తిట్టాడు. మాటామాటా పెరిగి ఆమె అర్ధరాత్రి ఒక్కత్తీ యిల్లు విడిచి వెళ్లింది, అత్యాచారానికి గురయ్యింది. 

పోలీసులు ఆమెను రక్షించి, విచారణ చేస్తే భర్త ఏం చెప్తాడు? ఆఫ్టరాల్‌ సినిమాకు తీసుకెళ్లలేవా అని అడిగితే అతని దగ్గర సమాధానం ఏముంటుంది? ఇలా జరుగుతుంద నుకోలేదండీ అని నీళ్లు నములుతాడు. ఇలాటి కేసుల్లో పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తారు. కావాలని చేసింది కాదని నమ్మితే, కేసు ఫైల్‌ చేయకుండా మూసేస్తూ ఉంటారు. పోలీసుల దృక్కోణం వేరు, నేరం జరిగిందా లేదా అని చూస్తారంతే. మొగుడూ పెళ్లాం ఎందుకు కొట్టుకున్నారు? మనస్తాపం ఎవరికి ఎందుకు కలిగింది? అది సహేతుకమా, కాదా? అవన్నీ వాళ్ల పరిధిలోకి రావు.

కానీ యిరుగుపొరుగు వాళ్లకు ఆ ఆరాలు కావాలి. దాన్ని బట్టి ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో తీర్పులు యిస్తూ ఉంటారు. వాళ్ల చేత తీర్పులు యిప్పించుకునేటంత ఓపిక బాధితులకు ఉండదు. జరిగిన నష్టం ఎలాగూ జరిగింది, పైగా వీళ్ల కామెంట్లు భరించడం కూడానా? అనుకుంటారు. అందువలన తనపై స్వదేశంలో యిన్ని ఆరోపణలు వస్తున్నా బోనీ నోరు విప్పలేదు. తిరిగి వచ్చాక శ్రీదేవి అంతిమసంస్కారం అయ్యాక 'మా ప్రైవసీని మన్నించండి, మా బాధ మమ్మల్ని పడనివ్వండి' అని స్టేటుమెంటు యిచ్చి ఊరుకున్నాడు.

గుండెపోటు, ఆల్కహాల్‌ థియరీకి ఆథర్లెవరు? - ఈ తెలివి బోనీ కపూర్‌ తమ్ముడు సంజయ్‌ కపూర్‌కు లేకపోయింది. శ్రీదేవి మరణించిందని తెలియగానే దుబాయి చేరాడు. ఎలా పోయిందో అతనికి తెలుసో, లేక బాత్‌టబ్‌లో మునిగిపోయిందంటే అనుమానాలు వస్తాయనుకున్నాడో, గుండెపోటుతో మరణించిందని అక్కడి పత్రికల వాళ్లకు చెప్పాడు. హృద్రోగ చరిత్ర లేదనే మాటా చేర్చాడు. 50 పైబడినవారికి గుండెపోటంటే ఎవరూ అనుమానించరని ధైర్యమేమో. డెత్‌ సర్టిఫికెట్టు చూపించమని ఎవరూ అడగరు కదా. ఇండియాలో అయితే మేనేజ్‌ చేసేసి ఉండేవారేమో.

కానీ అది దుబాయి కావడంతో అంతా పద్ధతి ప్రకారం చేస్తామనడంతో యిది శుద్ధఅబద్ధమని తేలింది. ఆ తర్వాత నాలిక కరుచుకుని, నోరు విప్పడం మానేశాడు. శ్రీదేవి గుండెపోటుతో పోయిందనగానే మనవాళ్లు చర్చలు ఆరంభించేశారు. అందాన్ని కాపాడుకోవాలనే ఆరాటంతో విపరీతంగా డైటింగ్‌ చేసేసిందని, సర్జరీల మీద సర్జరీలు చేయించేసుకుందని, అలా చేస్తే అనర్థమని, వయసు దాచుకోవడానికి మరీ అంత చేటుగా చేయవలసిన పని లేదని వ్యాఖ్యలు చేసి, పరిమితి దాటిన డైటింగ్‌లో రిస్కుల గురించి హృద్రోగ నిపుణుల చేత చెప్పించారు. తీరా చూస్తే ఆ గుండెపోటు కహానీయే అబద్ధం. 

తర్వాత ఆల్కహాల్‌ సేవించింది అనే కథనం. దాన్ని ఏ ప్రభుత్వ రిపోర్టూ ధృవీకరించలేదు. మనవాళ్లు ఫోరెన్సిక్‌ రిపోర్టులో ఉందన్నారు కానీ ఎక్కడా చూపించలేదు. చూశామని చెప్పినవాళ్లనూ చూపలేదు. 'రిపోర్టెడ్‌లీ' అనే పదం కింద అన్నీ కొట్టుకుపోయాయి. ఖలీజ్‌ టైమ్స్‌ కూడా 'సోర్సెస్‌ టోల్డ్‌...' అనే మాట కింద సరిపెట్టింది. మొదట్లో చూపిన 'టు హూమ్‌ ఇట్‌ మే కన్‌సర్‌న్‌' కాగితంపై  'యాక్సిడెంటల్‌ డ్రౌనింగ్‌ (అచ్చుతప్పుతో సహా)' అని రాసి ప్రివెంటివ్‌ మెడికల్‌ డైరక్టరు తరఫున ఎవరో ఫర్‌ సంతకం పెట్టాడు. (ఆయనే డెత్‌ సర్టిఫికెట్టు మీదా పెట్టాడు) రౌండు సీలుంది కానీ అది లెటర్‌హెడ్‌పై లేదు, డెత్‌ సర్టిఫికెట్‌ ఉన్నంత పక్కాగా లేదు.

దానిలో డెత్‌ బై డ్రౌనింగ్‌ అని సరిపెట్టకుండా యాక్సిడెంటల్‌ అని చేర్చడం దేనికని మనవాళ్లు బాగానే అడిగారు కానీ అటునుంచి సమాధానం చెప్పినవారు లేకపోయారు. అసలది ఏ సర్టిఫికెట్టో అర్థం కాని పరిస్థితి. ఆ తర్వాత ఆటోప్సీ రిపోర్టులో 'లాస్ట్‌ కాన్షస్‌నెస్‌ అండ్‌ డ్రౌన్‌డ్‌' అని ఉందన్నారు తప్ప రక్తంలో ఆల్కహాల్‌ ఉందని ఎక్కడా రికార్డు కాలేదు. కానీ 'ట' వార్తల బట్టి ఆవిడ అంత తాగింది, యింత తాగింది అని పాట మొదలుపెట్టారు. దానికి తోడు అమర్‌ సింగ్‌ (ఎక్కడ వివాదం ఉన్నా యితను అక్కడ ఉండి తీరతాడు) శ్రీదేవి వైన్‌ మితంగా తీసుకుంటుందని, విస్కీ తాగదని సర్టిఫికెట్టు ఒకటి. ఆమె స్పృహ ఎలా తప్పింది, మధ్యలో నిద్ర లేవడం వలన నిద్రమత్తులో ఉందా, నిద్రమాత్రలు వేసుకుందా, అన్నం సరిగ్గా తినక నీరసంతో కళ్లు తిరిగాయా? ఏమీ తెలియదు. సరిగ్గా తెలియకుండా తాగిందని ఎలా అనగలరు?

మరణసమయం ఎక్కడా రాయరా? - ఫిబ్రవరి 26 నాటి డెత్‌ సర్టిఫికెట్టు సవ్యంగానే ఉంది కానీ దానిలో కాజ్‌ ఆఫ్‌ డెత్‌ అనే కాలమే లేదు. టైమ్‌ ఆఫ్‌ డెత్‌ కూడా లేదు. ఎంబామింగ్‌ సర్టిఫికెట్టులో డేట్‌ ఆఫ్‌ డెత్‌ వద్ద 24 02 2018 అని వేసి పక్కన 00:00 అని వేశారు. దాని భావమేమిటో తెలియదు. ఎన్ని గంటలకు పోయిందో వీటిలో తెలియరాలేదు. 9 గంటలకే పోయిందని ఒక వార్త, అబ్బే 11 అని మరో వార్త. పోలీసు యిన్వెస్టిగేషన్‌లో మరణించిన సమయం చాలా ముఖ్యం. ఆ సమయానికి ఎవరున్నారు? అంతకు ముందు ఎవరు వచ్చి వెళ్లారు? హత్య అయి వుంటే అవకాశం, అవసరం ఎవరికి ఉన్నాయి? ఇలాటివి క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

ఇక్కడ బోనీ రాక గురించే అనేక సందేహాలున్నాయి. మొదటి కథనం ప్రకారం - భార్యను ఆశ్చర్యపరడానికి బోనీ ఇండియా నుంచి 24 సాయంత్రం 5.30కు హోటల్‌కు వచ్చాడు. నిద్రపోతున్న భార్యను లేపి, కాస్సేపు ముచ్చటలాడి, డిన్నర్‌కు వెళదామన్నాడు. ఆమె తెమిలి వస్తానని బాత్‌రూమ్‌కు వెళ్లింది. పదిహేను నిమిషాలైనా రాకపోయేసరికి, పిలిచాడు. పలక్కపోయేసరికి అనుమానం వచ్చి తలుపులు బద్దలుకొట్టి లోపలకి వెళ్లాడు. బాత్‌టబ్‌లో పడి వుండడం చూసి ఒక స్నేహితుడికి ఫోన్‌ చేశాడు.

అతని సలహాపై 9 గంటలకు పోలీసులకు ఫోన్‌ చేశాడు. వాళ్లు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పోయిందన్నారు. ఈ కథలో చాలా చిల్లులున్నాయి. ఇన్నేళ్ల కాపురం తర్వాత భార్యను ఆశ్చర్యపరచడానికి చెప్పకుండా రావడమేమిటి? బాత్‌టబ్‌లో అపస్మారక పరిస్థితిలో ఉండగా హోటల్‌ వాళ్లు వైద్యుణ్ని పిలిపించరా? ఆ తర్వాత పోలీసులను పిలిపించడంలో జాప్యం దేనికి? ప్రశ్నలు వేసేవాళ్లే తప్ప సమాధానాలు యిచ్చేవారు లేరు. ఇంతకీ యీ కథనానికి ఆధారం ఏమిటి? 'ఫ్యామిలీ సోర్సెస్‌' అంటుంది ఖలీజ్‌ టైమ్స్‌. ఫలానా అని ఎవరి పేరూ చెప్పలేదు. ఎవరా కుటుంబసభ్యులు? పెళ్లీ వేడుకలూ అయిపోయాక కూడా అక్కడే ఉండిపోయారా? ఉన్నా వాళ్లెవరూ శ్రీదేవికి ఆత్మీయులు కారు. బోనీ, అతని మొదటి భార్య బంధువులే! ఆమె తాగిందనీ చెప్పగలరు, మరోటీ చెప్పగలరు. 

హత్యా కాదు, ఆత్మహత్యా కాదు - మరో కథనం ప్రకారం శ్రీదేవి మరణాన్ని హోటల్‌ సిబ్బందే గమనించి, బోనీకి చెప్పడంతో అతను హుటాహుటిన దుబాయి వెళ్లాడు. ఇది నమ్మశక్యంగా ఉంది. అపస్మారక స్థితిలో ఉండగా చూసినా, వాళ్లు అతని కోసం ఆగకుండా ఆసుపత్రికి తరలించేవారు. బోనీ రాకకు ముందే శ్రీదేవి పోయి ఉండడం చేతనే మరణసమయాన్ని ఎక్కడా చెప్పుకోవటం లేదు. చనిపోయే సమయంలో బోనీ అక్కడ లేడు కాబట్టి అతను హంతకుడు కావడానికి వీల్లేదు. స్వయంగా హత్య చేయకపోయినా ఎవరైనా కిరాయి హంతకుడి చేత చంపించే అవకాశం ఉండవచ్చనే కోణంలో పోలీసులు పరిశోధించి ఉంటారు.

బోనీని దేశం విడిచి వెళ్లవద్దని చెప్పి, మూడున్నర గంటల పాటు క్షుణ్ణంగా ప్రశ్నించి, హోటల్‌ సిబ్బందితో కూడా క్రాస్‌ చెక్‌ చేసుకుని, హత్య కాదనే నిర్ధారణకు వచ్చారు. బోనీ హంతకుడు కావడానికి అవకాశాలున్నాయా? ఇంకా గ్లామరు ఉన్న శ్రీదేవిని ఎందుకు చంపుకుంటాడు? ఆమె ఆస్తుల కోసమా అంటే బహుశా అవి కూతుళ్ల పేర ఉంటాయి. ఇన్సూరెన్సు కోసమా అంటే అదీ కూతుళ్ల పేరే ఉండి ఉండవచ్చు.

పైగా బోనీకి నేరచరిత్ర ఏమీ లేదు కదా. ఉత్తినే అనుమానిస్తే ఎలా? పార్టీలో బోనీ మొదటి భార్య మోనా బంధువులు పట్టించుకోకుండా అవమానించారనే రిపోర్టులు వచ్చాయని చటుక్కున వాళ్లను అనుమానించడానికి లేదు. శ్రీదేవిపై వారికి కోపం ఉండవచ్చు కానీ పగ ఉండదు కదా. పైగా చంపితే వాళ్లకేం లాభం? పరాయి దేశంలో, అంత సెక్యూరిటీ ఉన్న హోటల్లో హత్య చేసి తప్పించుకుంటామనే ధైర్యం ఉంటుందా? పట్టుబడితే ఆ దేశంలో శిక్షలు ఊహాతీతంగా ఉంటాయి. ఓ పక్క డెత్‌ సర్టిఫికెట్టు తయారవుతూండగానే యీ విచారణ సాగింది కాబట్టి ప్రాసిక్యూషన్‌ ఒక రోజు లోపునే తేల్చేయగలిగింది. 

హత్య కాకపోతే ఆత్మహత్య కావడానికి అవకాశం ఉందా? కూతుళ్లే సర్వస్వమనుకునే తల్లి, పెద్ద కూతురి సినిమా రిలీజు కాబోతున్న తరుణంలో తనను తాను చంపుకుంటుందా? భర్త ఫోకస్‌ సవతి కొడుకు మీదే ఉన్నపుడు తనైనా తన కూతుళ్ల కోసం సకల జాగ్రత్తలు తీసుకుందామనుకుంటుంది తప్ప వాళ్లను తల్లిలేని పిల్లల్ని చేయదు కదా! అందువలన ప్రమాదవశాత్తూ మరణించిందనే మనం నమ్మవచ్చు. అయితే ఆ ప్రమాదానికి దారి తీసిన సంఘటనల ద్వారా ఆమె జీవితంలో విషాదం బయటకు తెలిసింది. ఫిబ్రవరి 20 వ తారీకున ఆడపడుచు కొడుకు పెళ్లికి దుబాయి వచ్చింది. ఆ ఫంక్షన్‌లో మొదటి భార్య బంధువులు ఆమెను నిర్లక్ష్యం చేశారనేది వినికిడే తప్ప ఆధారం లేదు.

కొందరు కాస్త ముందుకు వెళ్లి అవమానించారు అని కూడా అంటారు. ఏం జరిగిందో కానీ ఆమెకు మనస్తాపం కలిగింది. భర్త, రెండో కూతురు ఇండియా వెళ్లిపోగా తను ఒక్కత్తీ ఆ హోటల్లో ఉంది అంటున్నారు. అదీ వింతగానే ఉంది. ఈ సెలబ్రిటీలు ఏదీ స్వయంగా చేసుకోరు. ప్రతిదానికీ సహాయకులపై ఆధారపడతారు. పరదేశంలో ఎవరూ తోడు లేకుండా ఒక్కత్తీ ఉందా!? ఎందుకుంది అంటే పెద్ద కూతురికై షాపింగు కోసం అంటున్నారు. చెల్లెలితో గడపడానికి అని కూడా అన్నారు కానీ ఆమె వచ్చి వెళ్లిపోయిందట. భర్త మీద కోపం వచ్చి తిరిగి వెళ్లలేదు అంటే షాపింగులో తోడు కోసమేనా చిన్న కూతుర్ని తనతో ఉంచుకోలేదేం? హోటల్లో ఉన్నన్ని రోజులూ గది బయటకు రాలేదని కూడా వార్తలు వచ్చాయి. అంటే షాపింగు మాట అబద్ధమన్నమాట.

భార్యాభర్తల పేచీలకు కారణం? - కారణాలు ఏమైనా ఆమె భర్తపై అలిగింది. భర్త చూస్తే 22న లఖనవ్‌ వెళ్లాడు, 23 న ఒక బర్త్‌డే పార్టీలో పాలుపంచుకున్నాడు. అవి అలా సాగుతూండగానే యీమె ఏదో విషయమై భర్తతో ఫోన్‌పై వాదోపవాదాలు సాగించింది. అందుకే కాల్‌ డేటా పరిశీలించారన్న వార్త వచ్చింది. వీటి కారణంగా ఆమె డిప్రెషన్‌కు గురై, తిండి మానేయడమో, మద్యం సేవించడమో, నిద్రమాత్రలు వేసుకోవడమో జరిగి ఉండవచ్చు. దానితో కళ్లు తిరిగి బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ జారిపడి ప్రాణాలు పోగొట్టుకుని ఉండవచ్చు. ఇదే జరిగినా, బోనీ యీ విషయాన్ని బహిరంగంగా చెప్పుకోలేడు కదా.

పేచీలు, అలకలు దేని గురించి అని అందరూ అడుగుతారు కదా! పైగా శ్రీదేవి డబ్బును తన కొడుకు కెరియర్‌కై వెచ్చించడానికి ప్రయత్నిస్తున్నాడన్న సందేహాలు ముప్పిరిగొంటున్నపుడు అతను చెప్పినది జనం నమ్ముతారా? అతను చెప్పినది ఔనో కాదో నిర్ధారించడానికి శ్రీదేవి జీవించి లేదు. అందువలన జనం ఏమనుకుంటే అదే అనుకోనీ అనే భావంతో బోనీ మౌనాన్ని ఆశ్రయించాడు. ఆ భార్యాభర్తల మధ్య గొడవ దేనికై ఉంటుంది అనే విషయాన్ని కామన్‌సెన్స్‌తో ఆలోచించినప్పుడు డబ్బు గురించిన గొడవే అయి ఉంటుంది అనిపిస్తుంది. బోనీ, శ్రీదేవీ యిద్దరూ తలారా అప్పుల్లో మునిగి ఉన్నారనే వాదనను నేను నమ్మను. శ్రీదేవి తండ్రి స్నేహితులను నమ్మి మోసపోయినా, తల్లి వివాదాస్పదమైన ఆస్తులను కొని నష్టపరిచిందన్నా కొన్ని ఆస్తుల విషయాల్లోనే అవి నిజాలై ఉంటాయి.

లా ఆఫ్‌ ఏవరేజి ప్రకారం చూసినా నూటికి నూరు శాతం ఆస్తులూ పోయి ఉంటాయని అనుకోవడానికి లేదు. శ్రీదేవికి చెన్నయిలో, ముంబయిలో ఆస్తులు ఎప్పుడో కొన్నవి ఉన్నాయి. వాటి వెనక్కాల అప్పులుండవచ్చు కానీ యిప్పటి మార్కెట్‌ విలువతో ఆస్తులమ్మితే అప్పులు పోగా యింకా మిగలవచ్చు. శ్రీదేవి వద్ద క్యాష్‌ లేని పరిస్థితి ఉంటే కారెక్టరు పాత్రలకు సిద్ధపడి, ఆమె మళ్లీ సినిమాలలోకి ఉధృతంగా వచ్చేసి ఉండేది. ఆమెకు డిమాండు తగ్గిందనుకోవడానికి లేదు. బాహుబలిలో శివగామి పాత్రకు ఆమెను తీసుకుందామనుకున్నారని అందరికీ తెలుసు. సినిమాలు రాకపోతే టీవీ షోలు, ఎండార్స్‌మెంట్లు మొదలెట్టేది. దేశమంతా డిమాండు ఉన్న ఆమె నగల షాపులకు, బట్టల షాపులకు ఓపెనింగుకు వెళ్లినా లక్షలార్జించేది. 

ఇక బోనీ తీసిన సినిమాలు కూడా అన్నీ ఫెయిలవలేదు. శ్రీదేవిని పెళ్లి చేసుకునే పాటికి అప్పుల్లో మునిగి ఉన్నా, తర్వాత తీసిన సినిమాల్లో కొన్ని హిట్టయ్యాయి. పెద్దగా ఆస్తులుండకపోతే ఉండకపోవచ్చు కానీ మరీ అంత దుస్థితీ ఉండదు. గొడవంతా పెద్ద భార్య పిల్లల్ని పైకి తీసుకురావడంపై వచ్చి ఉండవచ్చు. వివాహితుణ్ని పెళ్లి చేసుకున్న వాళ్లందరూ తన భర్త మొదటి భార్య, ఆమె కుటుంబాన్ని పూర్తిగా విస్మరించాలని డిమాండ్‌ చేస్తారు. అప్పటి మోజులో అతను సరేననవచ్చు. కానీ క్రమేపీ అతనిలో తండ్రి మేల్కొంటాడు. వాళ్లకేదో చేయాలనుకుంటాడు. అక్కడే వస్తుంది పేచీ. మొదటి భార్య జీవించి ఉన్న మగాణ్ని పెళ్లాడిన మహిళకు సమాజం విలువ యివ్వదు. అది తెలిసి కూడా అగ్రశ్రేణి సినిమాతారలు ఆ పొరపాటు చేస్తూనే ఉన్నారు.

సావిత్రిని పెళ్లాడిన తర్వాత కూడా జెమినీ గణేశన్‌ తన కులస్తురాలైన మొదటి భార్యను, తన తరఫు బంధువులందరూ ఆమోదించిన ఆ కుటుంబాన్నీ విడిచి పెట్టలేదు. హేమమాలినిని పెళ్లాడిన తర్వాత ధర్మేంద్ర కూడా అంతే! హేమమాలిని జీవితచరిత్ర చూస్తే తెలుస్తుంది - హేమమాలినికి ఇన్‌కమ్‌టాక్స్‌ గొడవలు వచ్చినపుడు ధర్మేంద్ర ఏమీ పట్టించుకోలేదని. ఇప్పుడు కూడా తనూ, కొడుకులూ కలిసి పోజులు యిచ్చేటప్పుడు రెండో భార్యను, కూతుళ్లను దగ్గరకి రానీయడు. శ్రీదేవి బోనీని చేసుకోబోయేముందు హేమమాలిని సంప్రదిస్తే ఆమె తన జీవితం గురించి చెప్పి హెచ్చరించిందట. అందువలన మొదటి భార్యకు విడాకులు యిచ్చాకనే చేసుకుంటానంది. మొదటి కుటుంబానికి తన ఆస్తిపాస్తులు ఖర్చు పెట్టకూడదని కచ్చితంగా ఒప్పందం చేసుకున్నాకే పెళ్లి చేసుకుందట. ఇప్పుడతను ఉల్లంఘిస్తే కోర్టుకి వెళ్లగలదా?

పాఠాలు నేర్చుకోని స్టార్లు - నిజానికి సినిమాతారల డబ్బే వారి పాలిట శాపంగా మారుతుంది. సంపాదించిన దానిపై సక్రమంగా టాక్స్‌ కట్టేయడానికి వారికి మనసొప్పదు. నల్లధనంతో తల్లితండ్రుల పేర, అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల పేర, వారి పిల్లల పేర ఆస్తులు కొంటారు. ఇలాటి ఆదాయం మరిగాక ఆమె ఎవరినైనా పెళ్లి చేసుకుని వెళ్లిపోవాలనుకుంటే వాళ్లకు బాధగా ఉంటుంది. పెళ్లి చెడగొడదామని చూస్తారు. ఎలాగోలా పెళ్లి కుదిరితే బినామీ ఆస్తులను వదలుకోమని బేరం పెడతారు. అప్పటిదాకా సంపాదించినది వదులుకుని పెళ్లి చేసుకుంటే, చాలా సందర్భాల్లో భర్తకు వీరి సంపాదనపై ఆశ పుడుతుంది. వీరి పలుకుబడిని తమ వ్యాపారాలకు ఉపయోగిద్దామని చూస్తూంటాడు. ఇలా అనేకమంది తారల వివాహాలు దెబ్బ తిన్నాయి. పేర్లు విడిగా చెప్పనక్కరలేదు.

శ్రీదేవి విషయంలో తల్లి, తండ్రి అలాటి యిబ్బందులు పెట్టలేదు. భర్తా పెట్టలేదు. అయితే పెద్ద భార్య కుటుంబం కారణంగా కలతలు వచ్చి ఉంటాయి. తల్లిని పోగొట్టుకున్న అర్జున్‌ కపూర్‌ సోలో హీరోగా ఎస్టాబ్లిష్‌ కాలేదు. అది బోనీలో అపరాధభావన పెంచి ఉంటుంది. అతని కోసం ఏదైనా చేయాలని తాపత్రయ పడడం సహజం. అర్జున్‌కు శ్రీదేవిపై గౌరవం లేదు. తల్లి పోయిన తర్వాత ఆమె స్థానంలో వచ్చిన సవతితల్లిని ఆమోదించడమే కష్టం. తల్లి జీవించి ఉండగా వచ్చిన సవతితల్లిని ఆమోదించడం అసాధ్యం. ఎవరు ఎవరి వెంటపడ్డారన్న దానిలో బయటివారికి ఏ అభిప్రాయమైనా ఉండవచ్చు కానీ మొదటి భార్య పిల్లల్ని, బంధువులను అడిగితే 'ఆ వగలాడి మా వాణ్ని వలలో వేసుకుంది' అనే అంటారు. సినిమాతార విషయంలో అయితే మరీ ధాటిగా అంటారు. తనంటే పడని సవతి కొడుకుకి ఏదైనా చేయాలని భర్త తపిస్తూంటే చూసి ఊరుకోవడం శ్రీదేవి వలన కాకపోయి ఉండవచ్చు. 

ఇదంతా మన ఊహే. కానీ కామన్‌సెన్స్‌పై ఆధారపడిన ఊహ. కాదని బోనీ సాధికారికంగా ఖండించేవరకు మనం యీ దిశలోనే ఆలోచిస్తాం. ఏది ఏమైనా శ్రీదేవి తన కూతుళ్లకు సరైన సమయంలో అందుబాటులో లేకుండా వెళ్లిపోయింది. తన తల్లి తనకు సాయపడినట్లుగా, తను తన కూతుళ్లకు అండగా నిలవాలని అనుకున్న ఆమె కోరిక తీరలేదు. నాలుగేళ్ల వయసు నుంచి 30 ఏళ్ల పాటు అహోరాత్రాలు కష్టపడి సంపాదించినది కూతుళ్లకు సవ్యంగా అందించకుండా వెళ్లిపోయింది. బోనీ ఎంత న్యాయంగా వ్యవహరిస్తాడో కాలమే చెప్పాలి. శ్రీదేవి అంత్యక్రియల వద్ద చూస్తే అంతా బోనీ కుటుంబమే, అతని తరఫు బంధుమిత్రులే కనబడ్డారు. శ్రీదేవి కుటుంబీకులు ఎవరైనా ఉన్నారో లేదో, ఉన్నా వారికి గుర్తింపు యిచ్చారో లేదో తెలియదు.

బోనీది ముంబయిలో పాతుకుపోయిన కుటుంబం. అమర్‌ సింగ్‌ వంటి రాజకీయ నాయకులతో కూడా స్నేహబంధం ఉన్నట్లు తేటతెల్లమైంది. శ్రీదేవి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగడంతోనే తెలిసింది, అతనికి ఉన్న పట్టు. సినిమా తారలకు అరుదుగా లభించే గౌరవమది. శ్రీదేవి తన వీలునామాలో ఆస్తంతా కూతుళ్ల పేరే రాసినా, అతనే వాళ్లకు సహజమైన సంరక్షకుడిగా ఉంటూ వాటిని అజమాయిషీ చేస్తాడు. తేనెటీగలు ఏడాదంతా కష్టపడి తేనె కూడబెడతాయి. ఏదో ఒక రోజు మనిషి వచ్చి వాటిని చెదరగొట్టి తేనె పిండుకుంటాడు. వివాహితులను పెళ్లాడడానికి సిద్ధపడుతున్న తారామణులందరూ శ్రీదేవి ఉదంతం నుంచి నేర్చుకోవలసినది ఎంతైనా ఉంది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com